Shantanu Narayan
-
మూడో భారీ ఎకానమీ దిశగా భారత్!
న్యూయార్క్: భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆరి్థక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికన్ దిగ్గజ సంస్థల సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన మూడో విడత కాలంలో (2024–29) భారత్‌ను భారీ ఎకానమీల్లో మూడో స్థానానికి చేర్చేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ అయిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక, సాంకేతికత ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు. యావత్ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని ఆయన పేర్కొన్నారు. మేధోహక్కుల పరిరక్షణకు, టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘సెమీకండక్టర్ల తయారీకి గ్లోబల్ హబ్’గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ‘టెక్ సీఈవోలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. ఆయా విభాగాల్లో భారత పురోగతిని వివరించాను’ అని ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్, యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన విధానాలతో భారత్, అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని సీఈవోలు కితాబిచ్చారు. ఎన్విడియా, గూగుల్ మరింత ఫోకస్ భారత్‌పై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు గూగుల్, ఎన్విడియా తదితర టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టనున్నట్లు మోదీతో భేటీ అనంతరం సీఈవోలు తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్ ద్వారా భారత్‌లో పరివర్తన తేవడంపై ప్రధాని దృష్టి పెట్టారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం వంటి విభాగాల్లో వినూత్న సొల్యూషన్స్ రూపొందించాలని ఆయన సూచించారు. భారత్‌లో ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరింతగా కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమకు ఇప్పటికే వివిధ విభాగాల్లో భాగస్వామ్యం ఉందని, అధునాతన టెక్నాలజీ లను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. -
189 బిలియన్ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన
హైదరాబాద్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు శంతను నారాయణ్. సంకల్పం, కృషి, పట్టుదల ప్రతిభతో తన కలను సాకారం చేసుకున్న గొప్ప వ్యక్తి. 189 బిలియన్ డాలర్ల టెక్ దిగ్గజం అడోబ్‌కు సీఈవోగా రోజుకు రూ. 70 లక్షలు సంపాదిస్తున్న నాన్-ఐఐటియన్. భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్తగా, ప్రపంచాన్నేలుతున్న శంతను నారాయణ్ బర్త్‌డే సందర్భంగా సక్సెస్ స్టోరీ.. కార్పొరేట్ ప్రపంచంలో విజయం సాధించాలంటే ఐఐటీ లేదా ఐఐఎంలో చేరడం తప్పనిసరి. కానీ ఐఐటీ చదవ కుండానే ప్రపంచంలోని అతిపెద్ద, దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్‌కు ఛైర్మన్, ప్రెసిడెంట్, సీఈవోగా ప్రతిభను చాటు కుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్స్లో ఒకరిగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. శంతను నారాయణ్ 1962, మే 27 హైదరాబాద్‌లో జన్మించారు. ఫ్యామిలీలో ఆయన రెండో కుమారుడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్) పూర్తి చేశారు. ఆ తర్వాత 1986లో ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ , కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొదారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ సమయంలో ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగానికి బదులు 1986లో MeasureX Automobiles System అనే స్టార్టప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి సంవత్సరం, 1989లో యాపిల్‌లో చేరారు. అక్కడ ఆరేళ్ల పాటు పలు పోర్ట్‌ఫోలియోల్లో పనిచేశారు. ఇక్కడ పరిచయమైన గురుశరణ్ సింగ్ సంధు తన గురువుగా చెప్తుంటారు.. సవాళ్లను ఎదుర్కొనే మార్గాన్ని ఆయన నుంచే తాను నేర్చుకున్నానంటారు శంతను. యాపిల్‌ను వీడిన తరువాత సిలికాన్ గ్రాఫిక్స్‌లో డైరెక్టర్‌గా చేరిన కొన్నాళ్ల తరువాత అడోబ్ సిస్టమ్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గాచేరారు. ఇక అప్పటినుంచి ఆయన కరియర్ మరింత దూసుకుపోయింది. 2005లో సీవోవో, 2007లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి సంస్థను విజయవంతంగా గట్టెక్కించారు. ఒక విధంగా చెప్పాలంటే శంతను నారాయణ్ హయాంలోనే అడోబ్ సిస్టమ్స్ ప్రపంచంలోనే టాప్ సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. కుటుంబ నేపథ్యం తల్లి ప్రొఫెసర్. అమెరికన్ సాహిత్యాన్ని బోధించేవారు. తండ్రి వ్యాపారవేత్త. శంతను బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీలో ఉన్నప్పుడు రేణితో పరిచయం పెళ్లికి దారితీసింది. ఆమె క్లినికల్ సైకాలజీలో డాక్టరేట్ సాధించారు. ఈ దంపతులకు శ్రవణ్ , అర్జున్ నారాయణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శంతనుకి క్రికెట్, సెయిలింగ్ అంటే చాలా ఆసక్తి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆసియా రెగట్టా పోటీలో సెయిలింగ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం. అంతేకాదు శంతనుకి చిన్నతనంలో జర్నలిజం పట్ల మక్కువ ఉండేదట. తను బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండకపోతే, అతను ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడిగా ఉండేవాడినని స్వయంగా ఆయనే చెప్పారు. అడోబ్‌తో పాటు, శాంతను డెల్ ఇంక్, ఫైజర్ ఇంక్ , హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కాలిఫోర్నియాలో డైరెక్టర్ల బోర్డు సభ్యుడు. అంతేకాదు, శంతను అడోబ్ ఫౌండేషన్ అధ్యక్షుడు కూడా. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన శంతను 2022లో దాదాపు 256 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు ♦2009లో, శంతను నారాయణ్ ప్రతిష్టాత్మకమైన అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ బిజినెస్ అండ్ ఫిలాంత్రోపిక్ లీడర్షిప్ అవార్డును పొందారు. అదే సంవత్సరంలో, 'ది టాప్ గన్ సీఈవో జాబితాలో స్థానం సంపాదించారు. ♦ 2011లో ఓహియోస్ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ♦ 2011లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహా మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ♦ శంతను నారాయణ్ ఫైజర్ కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ♦ US-India స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్‌కి వైస్-ఛైర్మన్‌గా ఉన్నారు. ♦ ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో 12వ స్థానం ♦ ది ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా' గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డుతో సత్కరించింది. ♦ 2019 లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం విశేషం. -
క్రికెట్ రంగంలోకి ప్రముఖ వ్యాపారవేత్తలు
న్యూయార్క్ : కార్పొరేట్ రంగంలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌లు తమదైన ముద్ర వేశారు. తాజాగా వీరిద్దరూ క్రికెట్ రంగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అమెరికా క్రికెట్ ఎంటర్పప్రైజస్(ఏసీఈ) మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ(ఎంఎల్సీ) పేరుతో లీగ్ నిర్వహించనుంది. ఈ లీగ్‌లో ఇప్పటికే కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ పెట్టుబడులు పెట్టినట్టు స్వయంగా వెల్లడించారు. తాజాగా భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల, శంతను నారాయణ్‌లు ఈ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా ఎంఎల్సీ లీగ్‌లో పెట్టుబడులు పెట్టనన్నుట్లు తెలిసింది. అమెరికాలో క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకే ఈ లీగ్‌ను ప్లాన్ చేసినట్లు ఏసీఈ కో ఫౌండర్ విజయ్ శ్రీనివాసన్ వెల్లడించారు. (చదవండి : టీమిండియాతో మ్యాచ్ : ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ) -
‘నాసా’లో భారతీయులు అతి తక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలు కంపెనీల బాస్‌లు భారతీయులే కాకుండా అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)లో 58 శాతం మంది భారతీయులే ఉన్నారంటూ డాక్టర్ కాశ్ సిరినంద పేరిట వచ్చిన ఓ ట్వీట్ ఇప్పుడు అటు ట్విటర్లో, ఇటు ఫేస్బుక్లో చక్కర్లు కొడుతోంది. ఎంత దేశభక్తి ఉంటే మాత్రం ఇంత అబద్ధాలు ప్రచారం చేయడం ఎంత తప్పు! నాసాలో 58 శాతం మంది భారతీయులు పనిచేస్తున్నారని చెప్పడం శుద్ధ అబద్ధం. నాసాకు చెందిన ‘డేటా అండ్ అనలిటిక్స్ యూనిట్’ వివరాల ప్రకారం. నాసాలో దాదాపు 17వేల మంది పనిచేస్తుండగా, వారిలో 72 శాతం మంది శ్వేతజాతీయులు (తూర్పు యూరప్‌కు చెందిన తెల్లవాళ్లు సహా) కాగా, 12 శాతం మంది ఆఫ్రికన్ అమెరికన్లు, ఏడు శాతం ఆసియన్ అమెరికన్లు, 8 శాతం హిస్పానిక్ లేదా లాటినోలు, ఒక శాతం అమెరికన్ ఇండియన్లు ఉన్నారు. ఒక శాతం అమెరికన్ ఇండియన్లను కలుపుకుంటే ఆసియన్ అమెరికన్లు కేవలం 8 శాతం మందే నాసాలో పనిచేస్తున్నారు. ఆసియన్ అమెరికన్లతో భారతీయులతోపాటు ఇతర ఆసియన్లు కూడా వస్తారు. ఈ లెక్కన భారతీయుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. ‘నాసా మోడల్ ఈక్వెల్ ఎంప్లాయిమెంట్ అపార్చునిటీ ఏజెన్సీ ప్లాన్ అండ్ అకంప్లీష్మెంట్ రిపోర్ట్’ ప్రకారం 1996లో ఆసియన్ అమెరికన్లు 4.5 శాతం ఉండగా, వారి సంఖ్య 2016 నాటికి 7.4 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 58 శాతానికి చేరుకోవడానికి ఎన్ని ఏళ్లు కావాలో! ఎన్ని యుగాలైన అది అసాధ్యం కూడా. అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడం నాసా ఉద్యోగ నియామకాల విధానం. ఇక చాలా కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. వారంతా భారతీయ సంతతికి చెందిన వారేగానీ అందరు భారతీయ పౌరులు కాదు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అమెరికా పౌరుడు. నోకియా సీఈవో రాజీవ్ సూరీ సింగపూర్ సిటిజన్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అమెరికా పౌరులే. ఇక అమెజాన్స్ బీవోడీని భారతీయుడిగా పేర్కొన్నారు. బీవోడీ హోదా అనేది అమెజాన్ కంపెనీలోనే లేదు. బీవోడీ అంటే ‘బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్’ అనుకుంటే అందులో ఒక డైరెక్టర్‌గా భారతీయుడు ఉండడం పెద్ద విశేషం. కాదు. అమెజాన్ సీఈవో మాత్రం జెఫ్ బెజోస్. ఇక మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్‌పాల్ సింగ్ బాంగా జాతీయత తెలియడం లేదు. -
భారతీయ అమెరికన్లకు గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు
న్యూయార్క్: ఇద్దరు భారతీయ అమెరికన్లకు ఈ ఏడాదికిగాను గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు వరించింది. అడోబ్ అధిపతి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దేశం ముందంజ వేయడానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం దక్కింది. ఈ నెల 4న అవార్డును వారికి అందజేయనున్నారు. బ్రిటన్‌లో జన్మించిన మూర్తిని 2014లో అమెరికా సర్జన్ జనరల్‌గా ఒబామా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మూర్తిని ఆ పదవి నుంచి తొలగించారు. నారాయణ్ హైదరాబాద్‌లో జన్మించారు. నారాయణ్ యూఎస్– ఇండియా బిజినెస్ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు.