‘నాసా’లో భారతీయులు అతి తక్కువ! | Indians Are Very Few In NASA | Sakshi
Sakshi News home page

‘నాసా’లో భారతీయులు అతి తక్కువ!

Published Tue, Jun 18 2019 2:18 PM | Last Updated on Tue, Jun 18 2019 4:09 PM

Indians Are Very Few In NASA - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలు కంపెనీల బాస్‌లు భారతీయులే కాకుండా అమెరికాలోని నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)లో 58 శాతం మంది భారతీయులే ఉన్నారంటూ డాక్టర్‌ కాశ్‌ సిరినంద పేరిట వచ్చిన ఓ ట్వీట్‌ ఇప్పుడు అటు ట్విటర్‌లో, ఇటు ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతోంది. ఎంత దేశభక్తి ఉంటే మాత్రం ఇంత అబద్ధాలు ప్రచారం చేయడం ఎంత తప్పు!

నాసాలో 58 శాతం మంది భారతీయులు పనిచేస్తున్నారని చెప్పడం శుద్ధ అబద్ధం. నాసాకు చెందిన ‘డేటా అండ్‌ అనలిటిక్స్‌ యూనిట్‌’ వివరాల ప్రకారం. నాసాలో దాదాపు 17వేల మంది పనిచేస్తుండగా, వారిలో 72 శాతం మంది శ్వేతజాతీయులు (తూర్పు యూరప్‌కు చెందిన తెల్లవాళ్లు సహా) కాగా, 12 శాతం మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు, ఏడు శాతం ఆసియన్‌ అమెరికన్లు, 8 శాతం హిస్పానిక్‌ లేదా లాటినోలు, ఒక శాతం అమెరికన్‌ ఇండియన్లు ఉన్నారు. ఒక శాతం అమెరికన్‌ ఇండియన్లను కలుపుకుంటే ఆసియన్‌ అమెరికన్లు కేవలం 8 శాతం మందే నాసాలో పనిచేస్తున్నారు. ఆసియన్‌ అమెరికన్లతో భారతీయులతోపాటు ఇతర ఆసియన్లు కూడా వస్తారు. ఈ లెక్కన భారతీయుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది.


‘నాసా మోడల్‌ ఈక్వెల్‌ ఎంప్లాయిమెంట్‌ అపార్చునిటీ ఏజెన్సీ ప్లాన్‌ అండ్‌ అకంప్లీష్‌మెంట్‌ రిపోర్ట్‌’ ప్రకారం 1996లో ఆసియన్‌ అమెరికన్లు 4.5 శాతం ఉండగా, వారి సంఖ్య 2016 నాటికి 7.4 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 58 శాతానికి చేరుకోవడానికి ఎన్ని ఏళ్లు కావాలో! ఎన్ని యుగాలైన అది అసాధ్యం కూడా. అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడం నాసా ఉద్యోగ నియామకాల విధానం. ఇక చాలా కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. వారంతా భారతీయ సంతతికి చెందిన వారేగానీ అందరు భారతీయ పౌరులు కాదు.

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అమెరికా పౌరుడు. నోకియా సీఈవో రాజీవ్‌ సూరీ సింగపూర్‌ సిటిజన్, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అమెరికా పౌరులే. ఇక అమెజాన్స్‌ బీవోడీని భారతీయుడిగా పేర్కొన్నారు. బీవోడీ హోదా అనేది అమెజాన్‌ కంపెనీలోనే లేదు. బీవోడీ అంటే ‘బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’ అనుకుంటే అందులో ఒక డైరెక్టర్‌గా భారతీయుడు ఉండడం పెద్ద విశేషం. కాదు. అమెజాన్‌ సీఈవో మాత్రం జెఫ్‌ బెజోస్‌. ఇక మాస్టర్‌ కార్డ్‌ సీఈవో అజయ్‌పాల్‌ సింగ్‌ బాంగా జాతీయత తెలియడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement