ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. శ్రామికశక్తి అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలను పెంపొందించడం అనేది ఒక సంస్థ చేయగలిగే అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నాదెళ్ల భారత్‌లో అడుగుపెట్టారు.
కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం సాంకేతికత వృద్ధిని సమానంగా పంపిణీ చేయగలదని అన్నారు. శక్తివంతమైన సాధారణ ప్రయోజన సాంకేతికతగా ఏఐని పేర్కొన్న ఆయన.. ఏఐ నిబంధనల విషయంలో ఏకాభిప్రాయం బహుపాక్షిక స్థాయిలలో కూడా చాలా అవసరమని నాదెళ్ల తెలిపారు.
జీడీపీ వృద్ధిలో ఏఐ..
సాంకేతికత వేగంగా విస్తరించడం వల్ల ఆర్థిక వృద్ధిలో సమాన పంపిణీకి సహాయపడుతుందని సత్య నాదెళ్ల అన్నారు. జీడీపీ వృద్ధిని పెంచడంలో ఏఐ సహాయపడుతుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యధిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో ఏఐ జీడీపీ 500 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న మినిస్ట్రీ ఆఫ్ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు.
పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ కూడా గ్రిడ్ స్థిరత్వంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను తాను కలిశానని, ఎయిర్ ఇండియా ఏఐ వినియోగాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఐటీసీ, అరవింద్, లాభాపేక్ష లేని ఇతర భారతీయ సంస్థలు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలు అనేక సంస్థాగత కార్యక్రమాల కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నాయని నాదెళ్ల వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment