
ఎలాన్ మస్క్ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్. ఆయన కెమికల్ ఇంజినీర్. ఎలాన్‌కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.
పన్నెండేళ్లకే తొలి బిజినెస్
ఎలాన్‌కి చిన్నప్పట్నుంచీ సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్‌ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్ సాఫ్ట్‌వేర్‌ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్. ప్రాణాంతక హైడ్రోజన్ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్’.
ఫీజు కోసం క్లీనింగ్ పని
కాలేజ్‌లో ఎలాన్ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్. స్టాన్‌ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్.
ఒక కంపెనీతో ఆగిపోలేదు!
ఎలాన్ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్‌లైన్ సిటీ గైడ్ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది జిప్2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్ కంపెనీ జిప్2ను 307 మిలియన్ డాలర్‌లకు కొనేసింది. ఎలాన్ తన ఇంకో కంపెనీ ఎక్స్.కామ్‌ను 2000లో కాన్‌ఫినిటీ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్’ అనే ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.
పేపాల్‌ను 2002లో ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్‌ఎక్స్ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్ ఏఐ, ‘ది బోరింగ్ కంపెనీ’, ఎక్స్ కార్పొరేషన్, ‘థడ్’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్ నెలకొల్పినవే.
ఐరన్ మ్యాన్ 2లో చిన్న పాత్ర
ఎలాన్ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్ డాలర్లు. ఇంకో 567 బిలియన్ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతారు ఎలాన్. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో ‘టోనీ స్టార్క్’ పాత్రకు ఎలాన్ మస్క్ ఇన్‌స్పిరేషన్! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ లో మస్క్ చిన్న పాత్ర వేశారు కూడా.
తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!
ఎలాన్ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్‌డౌన్ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్‌డౌన్’’ అని లాక్ డౌన్ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్.
కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్ మస్క్. వెళ్లిపో’’ అని ట్వీట్ చేశారు. అందుకు మస్క్ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్ రిసీవ్డ్’ అని రిప్లయ్ ట్వీట్ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి.
-సాక్షి, స్పెషల్ డెస్క్