టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. ఫోర్బ్స్ (Forbes) తాజా బిలియనీర్ ర్యాంకింగ్‌ల ప్రకారం.. 420 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో 2025 సంవత్సరాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ప్రారంభించారు. ప్రధానంగా స్పేస్‌ఎక్స్ (SpaceX) విలువ 350 బిలియన్ డాలర్లకు పెరగడంతో గడిచిన డిసెంబర్ 1 నుండి మస్క్ నెట్‌వర్త్ 91 బిలియన్ డాలర్లు పెరిగింది.
గణనీయ పెరుగుదల
ఫోర్బ్స్ ర్యాంకింగ్ మొదటి 10 మంది సంపన్న వ్యక్తుల నెట్‌వర్త్‌లో గణనీయమైన పెరుగుదలను చూపుతోంది. వారి మొత్తం సంపద డిసెంబర్‌లో 1.8 ట్రిలియన్ డాలర్ల నుండి 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 సంపన్న వ్యక్తులు.. పెరిగిన వారి సంపద గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
ఎలాన్ మస్క్
421.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ఫోర్బ్స్ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. 2002లో స్పేస్‌ఎక్స్‌ని స్థాపించి దాని సీఈవోగా (CEO) కొనసాగుతున్న మస్క్.. టెస్లాకు అధిపతిగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (X), ఏఐ (AI) కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’ (xAI), టన్నెలింగ్ సంస్థ బోరింగ్ కోలో వాటాలను కలిగి ఉన్నారు. టెస్లాలో ఆయనకు 13% వాటా ఉంది.
జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos) 233.5 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. బెజోస్ 1994లో అమెజాన్‌ను ఆన్‌లైన్ పుస్తక దుకాణంగా స్థాపించారు. తరువాత క్లౌడ్ కంప్యూటింగ్, వినోదం, మరిన్నింటికి విస్తరించారు. ఆయన ప్రైవేట్ స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ను కూడా స్థాపించారు. గత డిసెంబర్ లో అమెజాన్ స్టాక్ 5% పెరిగింది. దీంతో ఆయన సంపదకు దాదాపు 10 బిలియన్ డాలర్లు తోడయ్యాయి.
లారీ ఎల్లిసన్
ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) 209.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు. 1977లో కంపెనీని స్థాపించిన ఆయన 2014 వరకు సీఈవోగా నాయకత్వం వహించారు. ఇప్పుడు ఛైర్మన్, సీటీవో (CTO)గా పనిచేస్తున్నారు. ఒరాకిల్ స్టాక్ డిసెంబర్ లో 9% పైగా పడిపోయింది. ఆయన సంపద నుండి సుమారు 17 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ఆయన రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయారు.
మార్క్ జుకర్‌బర్గ్
మెటా వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫోర్బ్స్ ప్రకారం 202.5 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. కంపెనీలో ఆయనకు దాదాపు 13% వాటా ఉంది. మెటా షేర్లు 1.9% పెరగడంతో గత డిసెంబర్ లో ఆయన నెట్‌వర్త్ 3.8 బిలియన్ డాలర్లు పెరిగింది.
బెర్నార్డ్ ఆర్నాల్ట్
లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ (LVMH) సీఈవో, ఛైర్మన్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ( Bernard Arnault) నికర విలువ $168.8 బిలియన్ డాలర్లు. ఎల్‌వీఎంహెచ్ పోర్ట్‌ఫోలియోలో క్రిస్టియన్ డియోర్ కోచర్, గివెన్‌చీ, ఫెండి, సెలిన్, కెంజో, టిఫనీ, బల్గారీ, లోవే, ట్యాగ్ హ్యూయర్, మార్క్ జాకబ్స్, సెఫోరా వంటివి ఉన్నాయి. గత నెలలో ఎల్‌వీఎంహెచ్ షేర్లలో 7% పెరుగుదలతో ఆర్నాల్డ్ నెట్‌వర్త్ 8.5 బిలియన్ డాలర్లు పెరిగింది. లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచారు.
లారీ పేజ్
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ స్టాక్ ధర 11% పెరగడంతో లారీ పేజ్ (Larry Page) సంపద కూడా 14 బిలియన్ డార్లు పెరిగి 156 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజా లిస్ట్‌లో ఈయనది ఆరో స్థానం. పేజ్ 1998లో సెర్గీ బ్రిన్‌తో కలిసి గూగుల్ (Google)ని స్థాపించారు. 2001 వరకు, మళ్లీ 2011 నుండి 2015 మధ్య దానికి సీఈవోగా పనిచేశారు ఇప్పుడాయన ఆల్ఫాబెట్‌లో బోర్డు సభ్యుడుగా ఉంటూ నియంత్రణ వాటాను కలిగి ఉన్నారు.
సెర్గీ బ్రిన్
ఆల్ఫాబెట్ స్టాక్ ధర పెరుగుదల కారణంగా లారీ పేజ్ లాగే గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ (Sergey Brin) నెట్‌వర్త్ కూడా గత నెలలో 14.7 బిలియన్ డాలర్లు పెరిగి 149 బిలియన్ డాలర్లకు చేరింది.ఈ పెరుగుదల ఆయన్ని ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 8వ ర్యాంక్ నుండి 7వ స్థానానికి నెలబెట్టింది.
వారెన్ బఫెట్
డిసెంబర్‌లో బెర్క్‌షైర్ హాత్వే స్టాక్ ధర 6% పడిపోవడంతో వారెన్ బఫెట్ (Warren Buffett) సంపద నుండి 8.9 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడాయన నెట్‌వర్త్ 141.7 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ లిస్ట్‌లో ఆయన ర్యాంక్ 6 నుండి ర్యాంక్ 8కి పడిపోయింది. వారెన్ బఫ్ఫెట్ బీమా సంస్థ గీకో, బ్యాటరీ కంపెనీ డ్యూరాసెల్, ఫాస్ట్ ఫుడ్ చైన్ డైరీ క్వీన్ వంటి ప్రధాన వ్యాపారాలను కలిగి ఉన్నారు.
స్టీవ్ బామర్
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ (Steve Ballmer) 124.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. హార్వర్డ్‌లో బిల్ గేట్స్ మాజీ క్లాస్‌మేట్ అయిన స్టీవ్ బామర్ 2000 నుండి 2014 వరకు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, బామర్ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్‌ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. డిసెంబరులో బామర్ సంపద సుమారు 500 మిలియన్ డాలర్లు తగ్గింది.
జెన్సన్ హువాంగ్
ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) 117.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 10వ స్థానంలో ఉన్నారు. ఏఐ రంగంలో కంపెనీ చిప్‌లు ప్రజాదరణ పొందడంతో ఆయన సంపద పెరిగింది. డిసెంబరులో ఎన్విడియా షేర్లలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, హువాంగ్ టాప్ 10 సంపన్నులలో స్థానాన్ని పొందారు.
Comments
Please login to add a commentAdd a comment