Microsoft CEO
-
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
Microsoft: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. శ్రామికశక్తి అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలను పెంపొందించడం అనేది ఒక సంస్థ చేయగలిగే అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నాదెళ్ల భారత్‌లో అడుగుపెట్టారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం సాంకేతికత వృద్ధిని సమానంగా పంపిణీ చేయగలదని అన్నారు. శక్తివంతమైన సాధారణ ప్రయోజన సాంకేతికతగా ఏఐని పేర్కొన్న ఆయన.. ఏఐ నిబంధనల విషయంలో ఏకాభిప్రాయం బహుపాక్షిక స్థాయిలలో కూడా చాలా అవసరమని నాదెళ్ల తెలిపారు. జీడీపీ వృద్ధిలో ఏఐ.. సాంకేతికత వేగంగా విస్తరించడం వల్ల ఆర్థిక వృద్ధిలో సమాన పంపిణీకి సహాయపడుతుందని సత్య నాదెళ్ల అన్నారు. జీడీపీ వృద్ధిని పెంచడంలో ఏఐ సహాయపడుతుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యధిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో ఏఐ జీడీపీ 500 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న మినిస్ట్రీ ఆఫ్ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ కూడా గ్రిడ్ స్థిరత్వంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను తాను కలిశానని, ఎయిర్ ఇండియా ఏఐ వినియోగాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఐటీసీ, అరవింద్, లాభాపేక్ష లేని ఇతర భారతీయ సంస్థలు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలు అనేక సంస్థాగత కార్యక్రమాల కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నాయని నాదెళ్ల వివరించారు. -
డీప్‌ఫేక్ ఆందోళనకరం
వాషింగ్టన్: ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దురి్వనియోగం చేస్తూ కృత్రిమ మేథ(ఏఐ)తో సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోల ధోరణి అత్యంత భయంకరమైనదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ నకిలీ అసభ్య ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రముఖుల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల సృష్టి, వ్యాప్తికి అడ్డుకట్ట పడాల్సిందే. ప్రభుత్వాల, సోషల్‌మీడియా సంస్థల తక్షణ స్పందన అవసరం. సురక్షితమైన, వాస్తవిక సమాచారం మాత్రమే ఆన్లైన్లో లభించేలా సాంకేతికతను, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు నిబంధనలను సవరించి కట్టుదిట్టంచేయాలి. ఇది మనందరి బాధ్యత’’ అని అన్నారు. -
పనిచేయకుండా రూ.830 కోట్ల సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
'కష్టే ఫలి' అన్నారు పెద్దలు.. కష్టపడకుండానే ఫలితం వచ్చేస్తే..! ఈ మాటలు వినటానికి వింపుగా ఉంటాయి, కానీ కొందరి జీవితంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ 'స్టీవ్ బాల్మెర్' (Steve Ballmer). ఇంతకీ ఈయన కష్టపడకుండా ఎలా సంపాదించాడు, దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్‌లో అతిపెద్ద వాటాదారు అయిన బాల్మెర్ కంపెనీలో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది దాదాపు 333.2 మిలియన్ షేర్లకు సమానమని సీఎన్ఎన్ నివేదించింది. ఈ వాటా విలువ ఇప్పుడు ఏకంగా 130 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఈ ఏడాది మాత్రమే ఆయన సంపద 44 బిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధర ఏకంగా 56 శాతం పెరగడంతో బార్మర్ సంపాదన కూడా పెరిగింది. మొత్తానికి స్టీవ్ బాల్మెర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి వార్షిక డివిడెండ్ చెల్లింపులలో 1 బిలియన్లను అందుకోబోతున్నారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ. 830 కోట్లకంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి? 1980లో 30వ ఉద్యోగిగా చేరిన స్టీవ్ బాల్మెర్ అతి తక్కువ కాలంలోనే గణనీయమైన వాటాను సంపాదించాడు. అంతే కాకుండా 2000లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికై 2014లో పదవీవిరమణ చేశాడు. వాటా యాజమాన్యం కారణంగా, స్టీవ్ బాల్మెర్ ప్రపంచ ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానంలో చేరటానికి అవకాశం ఉందని తెలుస్తోంది. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
ఇంద్రభవనం లాంటి సత్య నాదెళ్ల ఇల్లు.. చూసారా?
మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి అగ్రరాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పగ్గాలు చేతపట్టుకుని భారతదేశానికి గొప్ప కీర్తి తెచ్చారు. గతంలో సత్య నాదెళ్ల జాబ్, ఆస్తులను గురించి కొన్ని కథనాల ద్వారా తెలుసుకున్నాం.. అయితే ఇప్పుడు బెల్లేవ్‌లోని సత్య నాదెళ్ల ఇంటి గురించి తెలుసుకుందాం. 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరీక్షలో ఉత్తీర్ణులయ్యే ప్రయత్నంలో విఫలమై ఆ తరువాత 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్.. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA చేశారు. (ఇదీ చదవండి: బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లు కొనొచ్చా? ఆనంద్ మహీంద్రా సమాధానం ఏంటంటే..?) మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ళ బెల్లేవ్‌లో ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటి విలువ దాదాపు 7.5 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో రెండు అంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్, పెద్ద అవుట్డోర్ డెక్, హాట్ టబ్‌తో సహా అనేక సౌకర్యాలు మాత్రమే కాకుండా వైన్ సెల్లార్ కూడా ఉంది. ఆధునికమైన, అధునాతన సదుపాయాలు కలిగిన ఈ విలాసవంతమైన ఇంట్లో పెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యాలు, అద్భుతమైన బెడ్రూమ్లు, పెరట్లో కొలను, గేమ్ రూమ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. మొత్తానికి సత్యనాదెళ్ళ ఇల్లు భూలక స్వర్గాన్ని తలపిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. -
ఇది కదా సక్సెస్ అంటే! క్రికెట్ నుంచి సీఈఓ దాకా
ప్రపంచంలోని అగ్రగామీ దేశాల్లోని కంపెనీలలో భారత సంతతికి చెందిన ఎందోరో ఉన్నతమైన పదవులను అధిరోహించారు. అలాంటి వారిలో ఒకరు మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'. భారతదేశంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈయన గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. చిన్నపాటి నుంచే తన తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ, మద్దతు వంటివి సత్య నాదెళ్లలో ఆత్మవిశ్వాసం పెంచాయని, లింక్డ్ఇన్ సీఓఓ ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించే ది పాత్ అనే వీడియో సిరీస్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెల్లడించారు. పాఠశాల వయసులో చదువంటే బోరింగ్ అని, ఎప్పుడూ ద్యాసంతా క్రికెట్ మీదే ఉండేదని చెప్పుకొచ్చారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి సంస్కృతం ప్రొఫెసర్‌గా పనిచేశారని, ఈ రోజుకి కూడా తల్లిదండ్రులు నా వెనుక ఉండి భరోసా ఇస్తున్నారని గొప్పగా చెప్పారు. సత్య నాదెళ్ల ఇండియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆ తరువాత సన్ మైక్రోసిస్టమ్స్‌లో ఉద్యోగం ప్రారభించి బింగ్, ఎమ్ఎస్ ఆఫీస్, ఎక్స్‌బాక్స్ లైవ్, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సుమారు ముప్పై సంవత్సరాలు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ సీఈఓ పదవిని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా భారతదేశంలో పద్మ భూషణ్ అవార్డు కూడా దక్కించుకున్నారు. (ఇదీ చదవండి: పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కార్ల ప్రపంచం.. ఓ లుక్కేసుకోండి!) క్రికెట్ మీద ద్యాస ఉన్నప్పటికీ ప్రపంచంలోనే దిగ్గజ సంస్థకు సీఈఓగా ఎదిగేలా కృషి చేసారు సత్య నాదెళ్ల. భారతదేశంలో మధ్య తరగతి కుటుంబంలో పెరగడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. మొదటి సరి తాను కంప్యూటర్ ఉపయోగించిన సందర్భం ఇప్పటికీ మర్చిపోలేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. -
అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త వెర్షన్ విండోస్ 11ను ఆవిష్కరించింది. మరింత సరళతరమైన డిజైన్‌తో రూపొందించిన ఈ ఓఎస్.. ఈ ఏడాది ఆఖరు నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసారి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. విండోస్‌కి సంబంధించి ఇది కొత్త శకమని, రాబోయే దశాబ్దం .. అంతకు మించిన కాలానికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించినట్లు వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా భారత్: అంబానీ
సాక్షి, ముంబై: భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశం ఎంతో దూరంలో లేదని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ముచ్చటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ముంబైలో జరిగిన ఫ్యూచర్ డీకోడ్ సీఈఓ 2020 సమ్మిట్‌లో సత్య నాదెళ్లతో సంభాషించిన అంబానీ డిజిటల్ సేవల్లో భారత్ అగ్రగామిగా నిలవనుందని చెప్పారు. 2014 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా పిలుపుతో దేశంలో డిజిటల్ విప్లవానికి పునాది పడిందని తెలిపారు. ముఖ్యంగా జియో ఆవిష్కారం అనంతరం భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు. రిలయన్స్ జియో ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించగలగడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. జియోకు ముందు దేశంలో డేటా వేగం 256 కేబీపీఎస్ అయితే, జియో తరువాత ఇది 21 ఎంబీపీస్‌గా ఉండడం విశేషమన్నారు. 380 మిలియన్ల మంది జియో 4జీ టెక్నాలజీకి వలస వచ్చారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో భారతదేశం "ప్రీమియర్ డిజిటల్ సొసైటీ" గా అవతరించే దశలో ఉందన్నారు. అలాగే ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ నిలవనుందని అంబానీ పేర్కొన్నారు. ఇందులో తనకెలాంటి సందేహం లేదనీ, అయితే ఇది రానున్న ఐదేళ్లలోనా, పదేళ్లలో జరుగుతుందా అనేదే చర్చ అన్నారు. రిలయన్స్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఈ దశాబ్దాన్ని నిర్వచించనుందన్నారు. ఇది చాలా కీలమని ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత దేశ పర్యటన గురించి ప్రస్తావించిన అంబానీ, అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సందర్శనల కంటే భారతదేశం చాలా భిన్నంగా ఉందని, మొబైల్ కనెక్టివిటీ ఒక కీలకమైన మార్పు అని తెలిపారు. తరువాత తరం మీరు(సత్య నాదెళ్ల) నేను( ముకేశ్ అంబానీ) చూసిన భారత్ కంటే విభిన్నమైన దేశాన్ని చూడబోతోందన్నారు.(చదవండి: భారత సీఈవోలకు సత్య నాదెళ్ల సలహా) మైక్రోసాప్ట్, భాగస్వామ్యాన్ని ప్రకటించిన ముకేశ్ అంబానీ రానున్న దశాబ్దాన్ని ఈ డీల్ నిర్వచించనుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని ప్రతి వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ లేదా బిల్ గేట్స్ అయ్యే అవకాశం ఉందని అంబానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవలను అంబానీ ప్రశంసించారు. -
భారత సీఈవోలకు సత్య నాదెళ్ల సలహా
సాక్షి,ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల సోమవారం భారత్ చేరుకున్నారు. రానున్న డిజిటల్ యుగంల దూసుకుపోయేందుకు దేశంలోని వ్యాపారవేత్తలు తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతిలో మిళితమై ఉన్న ఈ సామర్ధ్యాలను భారత సీఈవోలు అలవర్చుకోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ చిన్న పెద్ద అన్ని రంగాల్లోనూ కీలక పాత్రపోషించనుందని, ఈ నేపథ్యంలో భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు 72 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ పరిశ్రమకు వెలువల ఉన్నాయని నాదెళ్ల తెలిపారు. సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను క్లౌడ్‌కు మార్చడం, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రతపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. వచ్చే దశాబ్దంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి టెక్నాలజీలో తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను నిర్మించుకోవాలని నాదెళ్ల కంపెనీలను కోరారు. ఇది మరింత సమగ్ర వృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ముంబైలో ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య శిక్షణలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దేశంలోని యువతకు అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని, అలాగే త్వరగా నేర్చుకునే తత్వం వారి సొంతమని, అయితే దానిపై వారికి శిక్షణ అవసరమని ఆయన అన్నారు. 2020 నాటికి ఎగైల్ టెక్నాలజీలను పూర్తిగా స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ డెవలపర్లలో 59 శాతం మంది ప్రస్తుతం ఎగైల్‌పైనే పనిచేస్తున్నారని టీసీఎస్ సీఎండీ తెలిపారు. (చదవండి : ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా భారత్ - అంబానీ) భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశముందని రిలయన్స్ అధినేత ముకేశ అంబానీ పేర్కొన్నారు. జియో ఆవిష్కారం అనంతరం భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు. తద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సీఈవోతో రిలయన్స్ అధినేత -
సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్ డాలర్లే అయినప్పటికీ, ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్ ఆప్షన్స్ కింద లభించింది. 2017–18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. దీనికి సత్య నాదెళ్ల సారథ్యం, కస్టమర్ల విశ్వాసం చూరగొనడానికి ఆయన చేసిన కృషి, కంపెనీలో ప్రవేశపెట్టిన కొత్త మార్పులు, కొంగొత్త టెక్నాలజీలు.. మార్కెట్లలోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు తోడ్పడ్డాయి‘ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. హైదరాబాదీ అయిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ
-
సత్య నాదెళ్ల కీలక నిర్ణయం
వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన నిర్ణయం తీసుకున్నారు. 36 బిలియన్ డాలర్ల విలువైన 3,28,000 షేర్లను సత్య నాదెళ్ల విక్రయించారు. సత్య నాదెళ్ల చేపట్టిన స్టాక్ సేల్‌లో ఇదే అతిపెద్దది. వ్యక్తిగత ఆర్థిక కారణాలతో ఈ షేర్లను విక్రయించినట్టు తెలిసింది. వచ్చే ఏడాదిలో కూడా నాదెళ్ల నిర్మాణాత్మక ప్రణాళిక ద్వారా వాటాలను విక్రయించడం కొనసాగిస్తారని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ కింద ప్రస్తుతం కొన్ని మైక్రోసాఫ్ట్ షేర్లను విక్రయించారని పేర్కొంది. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన తర్వాత కంపెనీ స్టాక్‌ను విక్రయించడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం 8.3 మిలియన్ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను నాదెళ్ల విక్రయించారు. 2014లో సత్య నాదెళ్ల సీఈవో అయ్యారు. తాజాగా విక్రయించిన షేరు వ్యక్తిగత ఆర్థిక కారణాలతో విక్రయించినట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కంపెనీని గెలుపు బాటలో నడిపించడానికి నాదెళ్ల ఎల్లప్పుడు కృషి చేస్తూ ఉంటారని తెలిపింది. -
సత్య నాదెళ్లకు ట్రంప్ అంటే భయం లేదు!
వాషింగ్టన్ : టెక్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను భయపెట్టలేరట. ఆయనకు ట్రంప్ అంటే భయం లేదని తెలుస్తోంది. ఎందుకంటే జాబ్ క్రియేటర్‌గా ఎక్కువ అవకాశాలు ఆ టెక్ దిగ్గజం అమెరికన్లకే కల్పించిందట. ఈ విషయంలో ఆయన చాలా విశ్వసనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తమ ప్రధానమైన ఉపాధి అవకాశాలు ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయని డిజిటల్ లైఫ్ డిజైన్ టెక్ కాన్ఫరెన్స్ సందర్భంగా సత్య నాదెళ్ల చెప్పారు. అమెరికాలో ఎక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలను తాము విపరీతంగా సృష్టించామని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.13,00 మంది ఉద్యోగులుండగా.. వారిలో 64,000 మందికి పైగా అమెరికాలోని వారేనని తెలిపారు. వారిలో ఎక్కువగా వాషింగ్టన్ వారున్నారన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ రోడ్‌మ్యాప్ ఏమీ మారవరని నాదెళ్ల చెప్పారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఆ దేశానికి ఎంతో బాధ్యతయుతంగా పనిచేస్తుందన్నారు. నవంబర్ 8న ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగానే , టెక్ కంపెనీలన్నీ అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాయని సీఎన్ఎన్ రిపోర్టుచేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లాంటివి కూడా అదనంగా ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి.. గత నెల ట్రంప్‌తో భేటీ అయిన 12 టెక్ దిగ్గజ సీఈవోల్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఈ మీటింగ్‌లో అమెరికాలో ఉద్యోగాలు ఎక్కువగా కల్పించాలని, పెట్టుబడులు పెంచాలని టెక్ సీఈవోలకు ట్రంప్ హితబోధించారు. ట్రంప్ ప్రధాన ఎన్నికల సూత్రం అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే. టెక్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగాలు ఇతర దేశాల వారికి కల్పిస్తున్నాయని ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. తాను అధ్యక్ష పీఠం ఎక్కగానే అమెరికన్ ఉద్యోగాలన్నీ అమెరికాకే దక్కుతాయని వాగ్దానం చేశారు. ఈ మేరకు హెచ్1-బీ వీసాను మార్పులు చేయనున్నట్టు ప్రతిపాదనలు వస్తున్నాయి. -
సత్య నాదెళ్ల.. ఆసక్తికర నిజాలు
సత్య నాదెళ్ల.. ఈ పేరు వింటనే ఒక రకమైన వైబ్రేషన్.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో వరకు వెళ్లిన ఆయన ప్రస్థానం గురించి ప్రస్తావించడం నిజంగా ఒక గొప్ప అవకాశం. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కు సీఈవోగా పనిచేస్తున్న తొలి అమెరికాయేతరుడిగా గుర్తింపు పొందిన నాదెళ్ల నేడు(ఆగస్టు 19)న 49 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలను ఒకసారి స్పృషిస్తే.. సత్యనాదెళ్ల ఆగస్టు 19, 1967లో హైదరాబాద్ లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థిగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోసం మనిపాల్ యూనివర్సిటీలో చేరారు. గ్రాడ్యుయేషన్ పూర్తవగానే 1988లో అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు. తన బాల్య స్నేహితురాలు.. స్కూల్ మేట్ అనుపమను వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది (1992)లోనే మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరారు. అంతకుముందు సన్ మైక్రో సిస్టం(ప్రస్తుతం ఇది ఒరాకిల్ కార్పొరేషన్ ది)లో పనిచేశారు. మైక్రోసాఫ్ట్ లో బింగ్ విభాగానికి చాలాకాలం సేవలు అందించారు. సరిగా గుర్తింపే లేని ఈ బ్రౌజర్ కు నాదెళ్ల ఆధ్వర్యంలోనే జనాల్లోకి దూసుకెళ్లింది. డేటాబేస్, విండోస్ సర్వర్, డెవలపర్ టూల్స్, క్లౌడ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ తీసుకురావడంలో నాదెళ్లదే కీలక భూమిక. ఇక క్లౌడ్ వర్షన్ ఆఫీస్ 365 తీసుకొచ్చింది కూడా నాదెళ్లనే. అత్యంత వేగంగా పనిచేసే ప్రొడక్ట్. తనకి మార్గదర్శకుడు బిల్ గేట్స్ అనే నాదెళ్ల సత్యం చెప్తుంటారు. మిగితా భారతీయుల్లాగే నాదెళ్లకు క్రికెట్ అంటే పిచ్చి. కవితలను బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం ఆయన తాను రాస్తున్న పుస్తకం 'హిట్ రిఫ్రెష్' పై పనిచేస్తున్నారు. ఈ పుస్తకంలో మూడు విభాగాలు ఉండనున్నాయి. -
మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకే..
టీ-హబ్‌కు వచ్చానన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భేటీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని మీలో నిర్మించుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆశయాన్ని సడలనివ్వవద్దు మీ విజయాల్లో భాగమవుతాం.. టీ-హబ్‌తో కలసి పనిచేస్తాం స్టార్టప్‌లకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తాం మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం వైట్‌స్పేస్ టెక్నాలజీ దీనిపై స్థానిక పారిశ్రామికవేత్తలకు సహకరిస్తామని వెల్లడి మంత్రి కేటీఆర్‌తో కలసి టీ-హబ్‌ను సందర్శించిన సత్య నాదెళ్ల స్టార్టప్‌లకు టీ-హబ్ అద్భుత అవకాశం.. ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సహకారంతో పలు కార్యక్రమాలు: కేటీఆర్ తరగతి గదుల డిజిటైజేషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక (స్టార్టప్) పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌తో కలసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ‘మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకే హైదరాబాద్‌కు వచ్చా, మీ విజయాల్లో భాగ మవుతా’నని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పేర్కొన్నారు. స్టార్టప్‌లను ఆశయమే ముందుకు నడిపిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని సడలనివ్వవద్దని సూచించారు. టీ-హబ్ ఒక అద్భుత అవకాశమని.. ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలను కల్పించడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. ఇందుకోసం స్థానిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో టీ-హబ్‌ను సత్య నాదెళ్ల సందర్శించారు. మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టీ-హబ్ సీఈవో జే కృష్ణన్, టీ-హబ్ వ్యవస్థాపకుడు కొల్లిపర శ్రీనివాస్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల టీ-హబ్ మొత్తం కలియదిరిగారు. ఇక్కడి వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. టీ-హబ్‌కు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ‘‘స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ టీ-హబ్‌తో కలసి పనిచేస్తుంది. మీ విజయాల్లో భాగమయ్యేందుకు ఇక్కడికి వచ్చాను. అన్నింటికీ మించి మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకు వచ్చాను. స్టార్టప్‌లు మూడు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. మిమ్మల్ని ముందుకు నడిపేది ఆశయమే.. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆశయాన్ని సడలనివ్వవద్దు. మీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని మీలో నిర్మించుకోండి. పట్టుదలతో లక్ష్యం దిశగా వెళ్లే సంస్కృతిని సంస్థలో నెలకొల్పండి. దీనిని సంస్థలో ఎంత సజీవంగా ఉంచుకోగలుగుతారో... వ్యాపారంలో అంత స్థిరత్వాన్ని ప్రతిఫలంగా పొందగలుగుతారు..’’ అని సత్య నాదెళ్ల సూచించారు. పారిశ్రామికవేత్తలకు టీ-హబ్ అద్భుత అవకాశమని కొనియాడారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలను కల్పించడం ప్రశంసనీయమన్నారు. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో అవకాశాల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ కెన్యాలో తక్కువ ధరతో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ‘వైట్‌స్పేస్ టెక్నాలజీ’ని వినియోగించింది. దీని గురించి సత్యనాదెళ్ల వివరించారు. మారుమూల/చిట్టచివరి గమ్యంతో అనుసంధానం (కనెక్టివిటీ) కోసం ఈ పరిజ్ఞానం ఎంతో ప్రయోజనకరమని ఆయన చెప్పారు. తన దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో అనుసంధానం ఒకటని పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ అవసరాలకు తగినట్లుగా మారుమూల ప్రాంతాలతో అనుసంధానమయ్యేలా ఈ సేవలను తక్కువ ధరకు అందించగల పారిశ్రామికవేత్తలు మనకు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ‘మన హైదరాబాదీ సత్య నాదెళ్ల...’ అంటూ మంత్రి కేటీఆర్ అక్కడున్న పారిశ్రామికవేత్తలతో పేర్కొనబోతుండగా... సత్య నాదెళ్ల జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘నేను ఇక్కడ పెరిగిన సమయంలో ఏ టీ-హబ్ లేదు.. టీ అక్షరానికి దగ్గరగా ట్యాంక్‌బండ్ మాత్రమే ఉండేది..’’ అని నవ్వుతూ పేర్కొన్నారు. వైఫల్యాలపైనే విజయాల నిర్మాణం ఔత్సాహికులతో మాట్లాడిన సందర్భంగా పలు ప్రశ్నలకు సత్య నాదెళ్ల సమాధానాలిచ్చారు. వైఫల్యాలను మీరెలా తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘‘ వైఫల్యం గురించి పట్టించుకోవద్దు. దాని నుంచి నేర్చుకునే పాఠాలే ముఖ్యమైనవి. ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. మళ్లీ ఓటమి పాలు కాకుండా జాగ్రత్తపడాలి. ప్రపంచంలో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారే. నేనూ అలాంటి అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకున్నాను. గత వైఫల్యాల నుంచి నేర్చుకున్నదానిపైనే నా విజయాలు నిర్మితమయ్యాయి..’’ అని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేస్తాం: కేటీఆర్ సత్య నాదెళ్లతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అద్భుతమైన అనుభవమని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌తో సహకారం విషయంలో వివిధ అంశాల్లో పరిశీలన జరిపామని... వారితో కలసి ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. స్టార్టప్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేయాలని భావిస్తున్నామని... సత్య నాదెళ్ల సైతం ఈ విషయంలో ఆసక్తితో ఉన్నారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ‘వైట్‌స్పేస్ టెక్నాలజీ’పై పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని.. మారుమూల ప్రాంతాలకు ఐటీ సేవల అనుసంధానం సమస్యను దానితో అధిగమించాలని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సహకారంతో స్థానిక పారిశ్రామికవేత్తలే ఈ సేవలను అందించాలని సత్య నాదెళ్ల కోరుకుంటున్నారని చెప్పారు. క్లౌడ్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఎన్నో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సుస్థిరంగా నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని కేటీఆర్ చెప్పారు. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాల గదులను డిజిటలైజ్ చేసేందుకు సహకారం అందించాలని మైక్రోసాఫ్ట్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, నాస్కాం చైర్మన్ బీవీ మోహన్‌రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ సీఈవో జీవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టి-హబ్‌కు చేరుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఉదయం తొలుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో గంటా 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టి-హబ్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఇతర ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు ఘన స్వాగతం పలికారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి, రాష్ట్రం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులను పెంచే లక్ష్యంతో టి-హబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. హబ్ విశేషాలను మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు వివరించారు. ఆ వివరాలను ఆయన ఆసక్తిగా విని తెలుసుకున్నారు. -
నేడు హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల
-
టీ హబ్‌కు సత్యనాదెళ్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన టీహబ్‌కు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల రానున్నారు. టీ హబ్‌కు సలహాదారుగా ఉండమని ఇప్పటికే సత్యనాదెళ్లను తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఐఐఐటీలోని టీహబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనుద్దేశించి ఆయన ప్రసగించనున్నారు. ఈ పర్యటనలో ఆయన 3 నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్ లోనే గడపనున్నారు. ఈ నెల 28న టీ హబ్‌ను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నాన్నారని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి జయేశ్ రాజన్ తెలిపారు. -
ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా..
సత్యనాదెళ్ల(47): 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ సీఈవో స్థాయికి వ చ్చారు. రాజీవ్ సూరి (47): 1995లో నోకియాలో ప్రస్థానాన్ని ప్రారంభించిన సూరి.. 2014, మే నెలలో కంపెనీ హెడ్‌గా నియమితులయ్యారు. సంజయ్ మెహ్రోత్రా (56): శాన్డిస్క్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన కంపెనీ ప్రెసిడెంట్, సీఈవోగా 2011 జనవరిలో భాద్యతలు చేపట్టారు. శంతను నారాయణ్ (52): 1998 నుంచి అడోబ్ సిస్టమ్స్‌లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శంతను... 2007 నాటికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. ఇంద్రనూయి (59): ఈమె 2006 నుంచి పెప్సికో చైర్పర్సన్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 1994లో పెప్సికోలో చేరిన ఈమె 2001లో కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. లక్ష్మీ మిట్టల్ (64): ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ అయిన అర్సెలర్ మిట్టల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. ఇవాన్ మెనెంజిస్ (56): మల్టీ నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ కంపెనీ డియాజియో సీఈవోగా ఉన్నారు. 1997లో డియాజియోలో కెరీర్ ప్రారం భించి.. 2013 జూలైలో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. రాకేశ్ కపూర్ (57): డెటాల్ వంటి ఉత్పత్తుల్ని తయారు చేసే మల్టీ నేషనల్ కన్సూమర్ గూడ్స్ తయారీ కంపెనీ, రెకిట్ బెన్కిసర్ సీఈవోగా ఉన్నారు. ఈయన నెస్లే, పెప్సికో వంటి పలు కంపెనీల్లో పనిచేశారు. అజయ్ బంగా (55): ప్రస్తుతం మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2010 జూలై నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. పియూష్ గుప్తా (55): డీబీఎస్ గ్రూప్ సీఈవోగా ఉన్నారు. మేనేజ్మెంట్ ట్రైనీగాఈయన కెరీర్ సిటీ బ్యాంక్ ఇండియాలో ప్రారంభమైంది. సంజయ్ ఝా (52): ప్రస్తుతం ఈయన గ్లోబల్ ఫౌండరీస్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతంలో మోటరోలా సీఈవోగా కూడా పనిచేశారు. ఫ్రాన్సిస్కో డిసౌజ (46): 2003లో సీఓఓ హోదాలో కాగ్నిజెంట్‌లో చేరిన ఈయన 2007లో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
డిజిటల్ ఇండియాకు తోడ్పాటు
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటునందిస్తామని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భద్రత, ఆధునీకీకరణ తదితర అంశాల గురించి చర్చించారు. ప్రధాని, ఇతర మంత్రులతో గౌరవపూర్వకంగా భేటీ అయినట్లు నాదెళ్ల వివరించారు. భారత వృద్ధికి తోడ్పడటంలో భాగంగా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు తాము కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత నాదెళ్ల భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. భారత్‌లో మరింతగా పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ ఆసక్తిగా ఉన్నట్లు జైట్లీకి ఆయన చెప్పారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు, డిజిటల్ ఇండియా కార్యక్రమం, ఈ-కామర్స్‌లో అవకాశాల గురించి నాదెళ్లకు రవిశంకర్ ప్రసాద్ వివరించారు. భారత్‌లో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి మంత్రి వివరించారు. -
మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు వచ్చిన ఆయన మరోసారి మోదీతో భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో ఆయన సమావేశం కావడం ఇది రెండోసారి. మైక్రోసాఫ్ట్ సీఈవోగా తొలిసారి స్వదేశానికి వచ్చినప్పుడు మోదీని మొదటిసారి సత్య నాదెళ్ల కలిశారు. కాగా, భారత్ లోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశముంది. -
సత్య నాదెళ్లకు రూ. 520 కోట్ల ప్యాకేజీ
-
సత్య నాదెళ్లకు రూ. 505 కోట్ల ప్యాకేజీ
సీఈవో అయ్యాక 10 రెట్లు జంప్ న్యూయార్క్: మహిళా ఉద్యోగుల జీతాల విషయంలో వ్యాఖ్యలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్న సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ ఏడాది దాదాపు రూ. 505 కోట్ల (84.3 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీ ఆర్జించారు. దీంతో టెక్నాలజీ రంగంలో అత్యధిక జీతభత్యాలు అందుకుంటున్న వారిలో ఒకరిగా నిల్చారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి మైక్రోసాఫ్ట్ సమర్పించిన వివరాల ప్రకారం 2013 ఆర్థిక సంవత్సరంలో ఆయన 7.66 మిలియన్ డాలర్లు. కొత్తగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి సీఈవోగా ప్రమోట్ అయ్యాక ఇది ఏకంగా పది రెట్లు పైగా ఎగిసింది. తాజాగా ఆయన 9,18,917 డాలర్ల జీతం, 3.6 మిలియన్ డాలర్ల బోనస్‌ను ఆర్జించారు. అలాగే కీలక సమయంలో కంపెనీలోనే కొనసాగుతూ సీఈవోగా ప్రమోట్ అయిన నేపథ్యంలో 79.77 మిలియన్ డాల ర్లు విలువ చేసే స్టాక్స్ ఆర్జించారు. దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఇందులో 59.2 మిలియన్ డాలర్ల స్టాక్స్ లభిస్తాయి. అయితే, 2019లోగా మాత్రం నాదెళ్ల వీటిని అందుకునే వీలు ఉండదు. జీతాల పెంపు విషయంలో మహిళా ఉద్యోగులు కంపెనీ వ్యవస్థను విశ్వసించి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలని నాదెళ్ల వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలి సిందే. అయితే, తన అభిప్రాయాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోయానంటూ ఆయన పలుమార్లు క్షమాపణ కోరారు. ఎవ్వరైనా సరే కెరియర్లో లింగవివక్షకు గురై ఉంటే కచ్చితంగా ఎదిరించాల్సిందేనన్నారు. -
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!
జీతాలు పెంచమని అడగక్కర్లేదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి మహిళా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో ఉద్బోధ విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణ న్యూయార్క్: మహిళా ఉద్యోగుల వేతనాల అంశంపై సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వివాదంలో చిక్కుకున్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలని, జీతం పెరగాల్సి ఉంటే పెరుగుతుంది కానీ ప్రత్యేకంగా అడగక్కర్లేదంటూ ఆయన చేసిన ఉద్బోధ.. శుక్రవారం పెను దుమారం రేపింది. తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో నాదెళ్ల చివరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. గ్రేస్ హాపర్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ కంప్యూటింగ్ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి దారితీశాయి. జీతం పెంచమని అడగడానికి ఇబ్బందిపడే మహిళా ఉద్యోగులకు ఎలాంటి సలహా ఇస్తారు అంటూ ఇంటర్వ్యూ చేసిన మైక్రోసాఫ్ట్ డెరైక్టర్ మరియా క్లావీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నిజం చెప్పాలంటే జీతం పెంచాలని అడిగే మహిళలకన్నా అడగని వారి దగ్గరే మరింత ఎక్కువగా అస్త్రశస్త్రాలు, శక్తి ఉన్నట్లు లెక్క. ఇలాంటివన్నీ సుకర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉన్నవి. మనం చేసిన దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. కాబట్టి జీతం పెంచాలని అడగడం కాదు.. వ్యవస్థ గురించి తెలుసుకోవాలి, దాన్ని గట్టిగా నమ్మాలి. అప్పుడే ముందుకెళుతున్న కొద్దీ సముచిత స్థాయిలో జీతాలు పెరుగుతాయి’ అంటూ నాదెళ్ల చెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో ఫేస్బుక్, ట్విటర్, లింక్డ్ఇన్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, బ్లాగ్‌లలో నాదెళ్ల కామెంట్ల మీద విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఎక్స్బాక్స్లైవ్ ధర తగ్గేదాకా కూడా నేనూ కర్మ సిద్ధాంతాన్నే నమ్ముకుని కొనకుండా నిరీక్షిస్తాను’ అంటూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు, నాదెళ్ల వ్యాఖ్యలతో విభేదించిన మరియాకు ప్రశంసలు లభించాయి. సారీ.. సరిగ్గా చెప్పలేకపోయాను .. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నాదెళ్ల తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయంలో తాను ఇచ్చిన సమాధానం పూర్తిగా తప్పని.. అసలు మహిళలు, పురుషులకు సమాన స్థాయిలో జీతాలు ఉండాన్నది తన అభిప్రాయమన్నారు. దీనిపై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ట్విటర్లో ట్వీట్ చేయడంతో పాటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు లేఖ రాశారు. ‘వేతనం పెంచాలని అడిగేందుకు ఇబ్బందిపడే మహిళా ఉద్యోగులకు మీరిచ్చే సలహా ఏమిటని ఇంటర్వ్యూ చివర్లో మరియా అడిగారు. దీనికి నేనిచ్చిన సమాధానం పూర్తిగా తప్పు. నా అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాను. ఈ రంగంలో జీతాల పెంపునకు సంబంధించి మహిళా, పురుషుల మధ్య వివక్షకు తావులేకుండా చూడాల్సిందే’ అంటూ నాదెళ్ల ట్వీట్ చేశారు. అలాగే తమ సంస్థ సిబ్బందికి పంపిన ఈమెయిల్ మెమోకి లింకునూ అందులో పొందుపర్చారు. ఈ విషయంపై మరియా ఇచ్చిన సలహా సరైనదేనని, వేతన పెంపునకు అర్హులమని భావించిన పక్షంలో కచ్చితంగా అడగాలని నాదెళ్ల పేర్కొన్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవో బాధ్యతలను చేపట్టడం తెలిసిందే. సత్యపై పుస్తకం.. మరోవైపు, మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి దాకా నాదెళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక పుస్తకం విడుదలైంది. నాదెళ్ల: ది చేంజింగ్ ఫేస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పేరిట జగ్మోహన్ ఎస్ భవర్ దీన్ని రచించగా, హాచెట్ ఇండియా ప్రచురించింది. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం నుంచి మైక్రోసాఫ్ట్ దాకా నాదెళ్ల ప్రస్థానం, ఆయన కుటుంబ వివరాలు, సాధించిన విజయాలు మొదలైన వాటిని రచయిత ఇందులో పొందుపర్చారు. అలాగే, కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే ఆధారపడుతున్న మైక్రోసాఫ్ట్ భవిష్యత్‌లో మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృష్టి సారించేలా నాదెళ్ల ఏ విధంగా ప్రయత్నించవచ్చు అన్నది భవర్ ఈ పుస్తకంలో చర్చించారు. -
సత్యనాదెళ్ల వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వారికి ఆగ్రహం తెప్పించాయి. ఆరిజోనాలో ఓ కంప్యూటింగ్ సదస్సులో స్టేజి మీద చర్చలో మాట్లాడుతున్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహిళలు కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నా, జీతాల పెంపు విషయంలో మాత్రం అసలు సంతృప్తిగా ఉండట్లేదని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించినప్పుడు నాదెళ్ల స్పందించారు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని, అప్పుడు మనకు పెరగాల్సిన జీతం అదే పెరుగుతుందని ఆయన అన్నట్లు సమాచారం. మహిళలు జీతాల పెంపు గురించి అడగక్కర్లేదని, వాళ్లు సత్కర్మలు చేస్తే ఆ పుణ్యం తిరిగొస్తుందని అన్నట్లు తెలిసింది. అయితే సత్య నాదెళ్ల వాదనతో ఆ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించిన మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యురాలు, కాలేజి ప్రెసిడెంట్ మారియా క్లావే తీవ్రంగా విభేదించారు. వెంటనే ప్రేక్షకుల నుంచి కరతాళధ్వనులు మిన్నంటాయి. ఒకే ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకు తక్కువ జీతాలు వస్తున్నాయని ఇప్పటికే పలు పరిశోధనలలో తేలింది. దీన్ని కూడా పరిష్కరించాలని, ఇందుకోసం మహిళలు హోంవర్క్ చేయాలని క్లేవ్ సలహా ఇచ్చారు. అయితే, ఈ వివాదానికి సత్యనాదెళ్ల ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. పరిశ్రమలో వేతనాల విషయంలో లింగ వివక్ష తగ్గాలని ఆయన అన్నారు. కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ మహిళలకు సూచించడంపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ ఓ మెమో కూడా పంపినట్లు తెలిసింది. ఆ ప్రశ్నకు అంతకుముందు తానిచ్చిన సమాధానం తప్పని కూడా అందులో పేర్కొన్నారు. Was inarticulate re how women should ask for raise. Our industry must close gender pay gap so a raise is not needed because of a bias #GHC14 — Satya Nadella (@satyanadella) October 9, 2014 -
భారత్‌లో సత్య నాదెళ్ల ముద్ర..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సత్య నాదెళ్ల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు సీఈవో. అంతటి ప్రాముఖ్యమున్న సంస్థకు కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన భారత్‌లో అడుగుపెట్టి సుడిగాలిలా దేశాన్ని చుట్టేశారు. భారతీయుల ఆలోచనల్ని మరోసారి మైక్రోసాఫ్ట్వైపు తీసుకెళ్లారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా అత్యున్నత పదవి చేపట్టిన తెలుగు వాడిగా రికార్డు నమోదు చేసిన నాదెళ్ల హైదరాబాద్ పర్యటన మాత్రం ఆసాంతం గోప్యంగా సాగడం విశేషం. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయినా, అటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్ని మైమరిపించినా, మరోవైపు స్నేహితుల్ని పలకరించినా మీడియా కంటికి మాత్రం చిక్కలేదు. ఢిల్లీ వేదికగా వేలాదిమంది విద్యార్థులతో ముచ్చటించి తన అనుభవాలను పంచుకున్నారు. నిత్య విద్యార్థులుగా ఉండాలంటూ ఉద్బోధించారు. చరిత్రలో ఎన్నడూ లేనటువం టి అవకాశాలు మీ ముందు ఉన్నాయంటూ దిశానిర్దేశం చేశారు. ముంబైలో మరో కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆది గోద్రెజ్, చందా కొచ్చర్ వంటి 150 మందికిపైగా పరిశ్రమ పెద్దలను ఆకట్టుకున్నారు. ఊహించని అతిథి.. సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో నాస్కామ్ రెండు సదస్సులతోపాటు మైక్రోసాఫ్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే సత్య నాదెళ్ల భారత్ వచ్చారు. రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. సత్య తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ వచ్చిన నాదెళ్ల, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. అరగంట పాటు చర్చలు సాగాయి. ఇదంతా రహస్యంగా జరిగి పోయింది. నాదెళ్ల విన్నపం మేరకే ఈ గోప్యత అని అధికారులు చెబుతున్నారు. నాదెళ్ల పర్యటన గురించి అధికారులకుగానీ, అటు సీఎంకుగానీ సమాచారం లేదు. ఊహించని అతిథి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంతో.. సత్య నాదెళ్ల కేసీఆర్‌ను కలవడంతో ఆంధ్రప్రదేశ్ సీఎంతోనూ సమావేశమవుతారని అందరూ అనుకున్నారు. ఐటీ కంపెనీల సీఈవోల సమావేశం కోసం చంద్రబాబు విశాఖపట్నంలో ఉన్నారు. దీంతో ఇరువురి భేటీ సాధ్యపడలేదు. చంద్రబాబుతో సత్య ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం వైజాగ్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా బాబు కోరినట్టు సమాచారం. ఉద్యోగుల్లో ఉత్సాహం.. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఎంఐడీసీ)లో సెప్టెంబర్ 29న సీఈవో హోదాలో తొలిసారిగా నాదెళ్ల అడుగుపెట్టారు. క్లౌడ్ టెక్నాలజీపై ఫోకస్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉద్బోధించారు. ప్రభుత్వాలతో కలసి పనిచేయబోతున్నామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ప్రతిభ, వనరులు, పట్టుదల మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల వద్ద సమృద్ధిగా ఉన్నాయని, ఇది నిరూపితమైందంటూ ఇష్టాగోష్టిలో భుజం తట్టారు. సరదాగా నవ్వుతూ, లక్ష్యాలను గుర్తు చేస్తూ ఉత్సాహం నింపారు. ఇక్కడి సెంటర్‌ను, కంపెనీ కార్యకలాపాల విస్తరణను చేపడుతున్నామని తెలిపారు. భారత ప్రాజెక్టులపై..: 2019 నాటికి 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం, 2.5 లక్షల పాఠశాలలు, యూనివర్సిటీల్లో వైఫై, నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో వైఫై హాట్‌స్పాట్స్, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్లు 4 లక్షలు, ఐటీ రంగంలో ఉద్యోగాలకై గ్రామీణులకు శిక్షణ వంటివి డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం చేపడుతోంది. ప్రస్తుత పథకాలకు రూ.1 లక్ష కోట్లు, కొత్త పథకాలకు రూ.13 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈవో భారత పర్యటన ఆసక్తి కలగిస్తోంది. భారత్‌తో కలసి పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని ఇప్పటికే ఆయన ప్రకటించారు కూడా. రాష్ట్ర ప్రభుత్వాలకూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేసే పనిలో నిమగ్నమైంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దుతోంది. ఇక స్మార్ట్‌సిటీస్ ప్రాజెక్టు అమలులో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకం. అయితే మైక్రోసాఫ్ట్‌తో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చొరవ గురించి నాదెళ్ల ఆసక్తిగా తెలుసుకున్నారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సహకారం అందిస్తుందని సీఎంకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం సైతం కంపెనీ విస్తరణకు వెన్నంటి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది. వీటి సరసన మైక్రోసాఫ్ట్ సైతం చేరనుంది. -
కేసీఆర్‌తో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ భేటీ
-
సత్య నాదెళ్ల జీతం ఏడాదికి 112 కోట్లు!!
-
సత్య నాదెళ్ల జీతం ఏడాదికి 112 కోట్లు!!
మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా ఎంపికైన తెలుగు తేజం సత్య నాదెళ్ల ఏడాదికి ఎంత జీతం తీసుకోబోతున్నారో తెలుసా.. అక్షరాలా 112 కోట్లు!! బోనస్, స్టాక్ అవార్డులు, అన్నీ కలిపి ఈ మొత్తం ఆయనకు అందుతుంది. అయితే బేస్ శాలరీ రూపంలో మాత్రం ఆయనకు అందేది ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు మాత్రమే. మైక్రోసాఫ్ట్‌లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న సత్య నాదెళ్ల (46)కు 0-300 శాతం వరకు బోనస్ కూడా అందుతుంది. దీంతోపాటు ఈయనకు స్టాక్ అవార్డులు కూడా అందుతాయి. ఇవన్నీ కలిపితే ఆయనకు మొత్తం 112 కోట్ల రూపాయలు ఏడాదికి అందుతాయి. ఆయన వార్షిక వేతనాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం (ఈఐపీ) నిర్ణయిస్తుంది. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయనకు వార్షిక ఈఐపీ స్టాక్ అవార్డు అందుతుందని నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ నుంచి అందిన ఆఫర్ లెటర్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద అందిన జీతానికి గరిష్ఠంగా మూడు రెట్లు.. అంటే 300 శాతాన్ని యాన్యువల్ క్యాష్ అవార్డుగా అందిస్తారు. అయితే, ఆయన పనితీరును బట్టి ఎంత శాతం ఇవ్వాలనే విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుందని ఆఫర్ లెటర్లో తెలిపారు. ఈ లేఖ కాపీని అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా పంపారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత నాదెళ్ల సత్యనారాయణ చౌదరే ఈ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవో అయ్యారు. గత సంవత్సరం నాదెళ్లకు దాదాపు పది కోట్ల రూపాయలు క్యాష్ బోనస్ లభించింది. -
తెలుగోడికి మైక్రోసాప్ట్ పగ్గాలు.....
-
మురిసిన నగరం
సత్య ఎన్నికతో హెచ్‌పీఎస్‌లో ఆనందోత్సాహాలు జూబ్లిహిల్స్, న్యూస్‌లైన్ : ప్రపంచ వాణిజ్య పటంలో హైదరాబాద్ నగరం మరోసారి మెరిసి మురిసింది. క్లౌడ్ గురు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎన్నికవడంతో తెలుగు‘వాడి’ వేడి... నగర ఖ్యాతి... అంతర్జాతీయంగా మరోసారి చాటిన ట్లైంది. ఈ ఎన్నిక నగరాన్ని ఆనంద సాగరంలో ముంచెత్తింది. సత్య నాదెళ్లే కాదు ఎంతోమంది ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలను తయారుచేసిన ఘనత మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) సొంతం. సత్య అత్యున్నత స్థానానికి ఎన్నికవడంతో హెచ్‌పీఎస్ యాజమాన్యం ఉబ్బితబ్బిబ్బవుతోంది. నిపుణులెందరో.. బ్లాక్‌బెర్రి ఫోన్ కంపెనీని కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి ఇటీవల అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తున్న ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈవో ప్రేమ్‌వత్సా... లండన్‌లో కోబ్రాబీర్ హోల్డింగ్స్ పేరుతో బడా మద్యం సంస్థను నిర్వహిస్తున్న కరణ్ బిలిమోరియా... మరో టెక్నాలజీ దిగ్గజం అడాబ్ కార్పొరేషన్ సీఈవో శంతను నారాయణ్... ప్రాక్టర్ అండ్ గాంబల్ నార్త్ అమెరికా వైస్ ప్రెసిడెంట్... శైలేష్ జుజెరికర్ తదితరులంతా హెచ్‌పీఎస్‌లో ఓనమాలు దిద్దినవారే. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన హెచ్‌పీఎస్‌లో చదువుకున్న పలువురు విద్యార్థులు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నతస్థాయిల్లో రాణించడం తమకు గర్వకారణమని స్కూల్ పూర్య విద్యార్థి, సత్య సహధ్యాయి, ప్రస్తుతం హెచ్‌పీఎస్ బోర్డు సెక్రటరీగా ఉన్న ఫయాజ్‌ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనాదెళ్లతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. సత్య సాధించిన విజయం పాఠశాలకే కాకుండా ఎందరో యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు. త్యరలో పూర్య విద్యార్థులంతా కలిసి సత్యను ఆహ్వనించి, ఘనంగా సన్మానించాలనుకుంటున్నట్లు తెలిపారు. చిన్ననాటి స్కూల్‌ను మరిచిపోని సత్య సత్య హెచ్‌పీఎస్‌లో 1984 బ్యాచ్‌కు చెందినవారు. ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి స్కూల్‌ను ఆయన మరిచిపోలేదు. రెండేళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆయన హెచ్‌పీఎస్‌లో నిర్వహించిన ‘ఐ స్పార్క్ రోబోటిక్స్ షో ’లో విద్యార్థులతో ముచ్చటించారు. రోబోటిక్స్, కంప్యూటర్స్ ప్రాధాన్యతను, భవిష్యత్ తరం టెక్నాలజీల గురించి విద్యార్థులతో చాలాసేపు సంబాషించారు. అనంతరం ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో కలిసిపోయారు. ఆయన తండ్రి యుగంధర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి. గతంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. -
హైదరాబాద్ టు మైక్రోసాఫ్ట్ సీఈఓ వరకు
వాషింగ్టన్: క్రికెట్ నుంచే టీమ్ వర్క్ నేర్చుకున్నానని ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ నూతన సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా 46 ఏళ్ల సత్య నాదెళ్లను మంగళవారం నియమించారు. ఓ భారతీయుడికి, అందులోనూ తెలుగు వ్యక్తికి ఈ అరుదైన అవకాశం రావడం గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చైర్మన్ బిల్‌గేట్స్ ఈ పదవి నుంచి తప్పుకుని సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.యుగంధర్ ఐఏఎస్ అధికారి. 2004-09 మధ్య కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. సత్య నాదెళ్ల నగరంలోని బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ అభ్యసించారు. అనంతరం అమెరికా వెళ్లి ఎంఎస్, ఎంబీఏ చేశారు. అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మైక్రోసాఫ్ట్ పురోగతికి మరింత కఠినంగా శ్రమించాల్సిన అవసరముందని సత్య నాదెళ్ల అన్నారు. తాము చాలా వేగంగా ముందుకు సాగాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ నాయకుడిగా సత్యనాదెళ్లను మించిన వారు లేరని బిల్ గేట్స్ ప్రశంసించారు. సిబ్బందిని కలిసికట్టుగా నడిపించడంలో ఆయనే మెరుగైన వ్యక్తని చెప్పారు. అపారమైన ఇంజినీరింగ్ పరిజ్ఞానం, వ్యాపార దృష్టి ఉన్న వ్యక్తి సత్యనాదెళ్ల అని బిల్‌గేట్స్ కొనియాడారు. -
మైక్రోసాప్ట్ సిఇఓగా తెలుగుతేజం సత్య నాదెళ్ల
హైదరాబాద్: మైక్రోసాప్ట్ సీఈఓ పదవి తెలుగువాడికి దక్కింది. సాప్ట్వేర్ దిగ్గజం బిల్గేట్ వారసుడిగా మైక్రోసాప్ట్ కార్పోరేషన్ కొత్త సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన ప్రవాస భారతీయుడు సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. 78 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో గ్లోబల్ జెయింట్గా ఉన్న మైక్రోసాప్ట్ సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత 38 ఏళ్లలో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పని చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సత్య మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఎంబీఏ పూర్తి చేశారు. చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. -
మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో మరో భారతీయుడు
తాజాగా వినిపిస్తున్న పేరు: సుందర పిచ్చయ్య జన్మ స్థలం: చెన్నై, వయస్సు-42 ఏళ్లు ప్రస్తుత హోదా: గూగుల్ ఆండ్రాయిడ్ విభాగం చీఫ్ చదువు: ఐఐటీ-ఖరగ్‌పూర్, పీజీ-స్టాన్ఫోర్డ్ న్యూయార్క్: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) పదవికి మరో భారతీయుడు పోటీ పడుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. చెన్నైకు చెందిన 42ఏళ్ల సుందర పిచ్చయ్య పేరు వెలుగులోకి వచ్చినట్లు సిలికాన్ యాంగిల్ అనే మీడియా వెబ్సైట్ పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల రేసులో ముందంజలో ఉన్నట్లు వార్తలు రావడం తెలిసిందే. కాగా, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ... ఆండ్రాయిడ్, క్రోమ్, ఆప్స్‌కు హెడ్‌గా పనిచేస్తున్న పిచ్చయ్య సైతం రేసులోకి వచ్చినట్లు సమాచారం. పిచ్చయ్యకు చాన్స్ ఇవ్వడం ద్వారా క్లౌడ్, మొబైల్, సోషల్ విభాగాలలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయవచ్చన్నది మైక్రోసాఫ్ట్ ఆలోచనగా సిలికాన్ ఏంగిల్ విశ్లేషించింది. అయితే సత్య మైక్రోసాఫ్ట్‌లో ఇప్పటికే వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించగా, పిచ్చయ్య ప్రస్తుతం గూగుల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. పిచ్చయ్య ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి టెక్నాలజీ డిగ్రీ పూర్తిచేయగా, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశా రు. పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆండ్రాయిడ్ విజయం నేపథ్యంలో ట్విటర్ వంటి దిగ్గజాల నుంచి పిచ్చయ్యకు భారీ డిమాండ్ ఉంని సిలికాన్ ఏంగిల్ పేర్కొంది. దీంతో గూగుల్‌లో కొనసాగేందుకు 5 కోట్ల డాలర్లను అందుకుంటున్నట్లు వెల్లడించింది. సీఈఓగా మూడో వ్యక్తి... 38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ చరిత్రలో ఇంత వరకూ ఇద్దరు మాత్రమే సీఈవోలుగా పనిచేయడం గమనార్హం. కంపెనీ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తరువాత కంపెనీ పగ్గాలు ప్రస్తుత చీఫ్ స్టీవ్ బామర్‌కు దక్కాయి. తాజాగా ఈ వారంలో మూడో వ్యక్తి కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈ టాప్ పోస్ట్‌కు రేసులో ఇద్దరు భారతీయులు పోటీపడటం చెప్పుకోదగ్గ విశేషం! -
మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల
-
మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల?
న్యూయార్క్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సీఈవో పదవి తెలుగు వ్యక్తికి దక్కనుంది. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా మన హైదరాబాదీ సత్య నాదెళ్ల(46) నియమితులయ్యే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. ఆయన నియామకం దాదాపు ఖాయమయిందని తెలిపాయి. సీఈవో ఎంపిక కోసం ఐదు నెలల పాటు సాగించిన కసరత్తు ముగిసిందని వెల్లడించాయి. సుదీర్ఘ కాలంగా సీఈవోగా స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముంది. సత్య నాదెళ్ల నియామకం ఖరారయితే మైక్రోసాఫ్ట్‌కు ఆయన మూడో సీఈవో అవుతారు. హైదరాబాద్‌కి చెందిన సత్య.. మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఎంబీయే చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ వచ్చే ఏడాదిలోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. -
మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో తెలుగోడు
న్యూయార్క్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి రేసులో మన హైదరాబాదీ సత్య నాదెళ్ల గట్టిగా తలపడుతున్నారు. షార్ట్‌లిస్ట్ అయిన మరో అభ్యర్థి, ఫోర్డ్ సీఈవో అలాన్ ములాలీకి తీవ్ర పోటీనిస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన సత్య.. మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఎంబీయే చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సీఈవో రేసులో ములాలీ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ.. మైక్రోసాఫ్ట్‌లోనే పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన వ్యక్తిని సీఈవోగా నియమించాలని యాజమాన్యం భావించిన పక్షంలో సత్య నాదెళ్లకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని పరి శీలకుల భావన. ఒకవేళ బయట వ్యక్తిని తీసుకురావాలనుకుంటే.. సుదీర్ఘ అనుభవం గల ములాలీకి అవకాశం ఉండగలదని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ వచ్చే ఏడాదిలోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించి న నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది.