
హైదరాబాద్ టు మైక్రోసాఫ్ట్ సీఈఓ వరకు
వాషింగ్టన్: క్రికెట్ నుంచే టీమ్ వర్క్ నేర్చుకున్నానని ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ నూతన సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా 46 ఏళ్ల సత్య నాదెళ్లను మంగళవారం నియమించారు. ఓ భారతీయుడికి, అందులోనూ తెలుగు వ్యక్తికి ఈ అరుదైన అవకాశం రావడం గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చైర్మన్ బిల్గేట్స్ ఈ పదవి నుంచి తప్పుకుని సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు.
సత్య నాదెళ్ల హైదరాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.యుగంధర్ ఐఏఎస్ అధికారి. 2004-09 మధ్య కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. సత్య నాదెళ్ల నగరంలోని బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ అభ్యసించారు. అనంతరం అమెరికా వెళ్లి ఎంఎస్, ఎంబీఏ చేశారు. అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
మైక్రోసాఫ్ట్ పురోగతికి మరింత కఠినంగా శ్రమించాల్సిన అవసరముందని సత్య నాదెళ్ల అన్నారు. తాము చాలా వేగంగా ముందుకు సాగాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ నాయకుడిగా సత్యనాదెళ్లను మించిన వారు లేరని బిల్ గేట్స్ ప్రశంసించారు. సిబ్బందిని కలిసికట్టుగా నడిపించడంలో ఆయనే మెరుగైన వ్యక్తని చెప్పారు. అపారమైన ఇంజినీరింగ్ పరిజ్ఞానం, వ్యాపార దృష్టి ఉన్న వ్యక్తి సత్యనాదెళ్ల అని బిల్‌గేట్స్ కొనియాడారు.