కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా! | Satya Nadella, Sundar Pichai Consortium wins 49% of The Hundred Team | Sakshi
Sakshi News home page

కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!

Published Sat, Feb 1 2025 5:51 PM | Last Updated on Sat, Feb 1 2025 6:32 PM

Satya Nadella, Sundar Pichai Consortium wins 49% of The Hundred Team

PC: X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై  మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్‌ ఏకంగా ప్రపంచ క్రికెట్‌ని శాసించే స్థాయికి  చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. 

గత సంవత్సరం  గణాంకాల ప్రకారం ఐపీఎల్  మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు  ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.

ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ  దేశాల్లో  జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. 

కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం.  ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్‌కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.

'ది హండ్రెడ్' 
ఇక ఐపీఎల్‌ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది.  ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్‌పై పడ్డాయి.

టెక్‌ దిగ్గజాలు కూడా
అమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. 

టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.

అమాంతం పెరిగిపోయిన విలువ
ఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం.  లండన్‌లోని  ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం.  

లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ  ది హండ్రెడ్‌ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో  లండన్ స్పిరిట్‌ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్‌ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%
అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు  వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. 

దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం  అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్‌ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.

చదవండి: హర్షిత్‌ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement