Sathya Nadella
-
కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్ ఏకంగా ప్రపంచ క్రికెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. గత సంవత్సరం గణాంకాల ప్రకారం ఐపీఎల్ మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్‌కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.'ది హండ్రెడ్' ఇక ఐపీఎల్ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్‌పై పడ్డాయి.టెక్ దిగ్గజాలు కూడాఅమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.అమాంతం పెరిగిపోయిన విలువఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం. లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో లండన్ స్పిరిట్ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
మిలటరీని దింపుతా: ట్రంప్
వాషింగ్టన్: జార్జ్‌ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఈ ఉద్యమాలను అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు భారతీయ అమెరికన్ సీఈవోలు పలువురు ఆందోళనలకు మద్దతు పలికారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో సోమవారం ట్రంప్ ప్రసంగిస్తూ..ఆందోళనలను, దుకాణాల లూటీ, విధ్వంసకర చర్యలను అదుపు చేసేందుకు సాయుధులైన వేలాది మంది సైనికులు, మిలటరీ అధికారులను పంపుతున్నట్లు ప్రకటించారు. ‘‘హింసాత్మక ఘటనలు తగ్గేంతవరకూ ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు తగినంత మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను విధుల్లో నియమించాలి. చట్టాలు అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలి’’అని స్పష్టం చేశారు. ఏదైనా రాష్ట్రం, నగరంతగిన చర్యలు తీసుకోలేని పక్షంలో సమస్యలు పరిష్కరించేందుకు అక్కడ అమెరికా మిలటరీని నియమిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఇటీవలి కాలంలో నేరస్తులు, దుండగులు, విధ్వంసకారుల చేతుల్లో బందీ అయిపోయిందని ఇది స్థానిక ఉగ్రవాదమేనని, అమాయకుల ప్రాణాలు తీయడం మానవజాతిపై మాత్రమే కాకుండా దేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలని అన్నారు. వైట్‌హౌస్ ప్రాంగణంలో సైనిక వాహనాలు.. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతు నొక్కుకుపోయిన కారణంగా అతడి మరణం సంభవించిందని ఇది హత్యేనని అధికారికంగా ప్రకటించారు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసగా మొదలైన నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్స్‌కు చెందిన 67 వేల మంది పలు నగరాల్లో పరిస్థితిని నియంత్రించే ప్రయత్నాల్లో ఉన్నారు. చర్చిని సందర్శించిన ట్రంప్... వాషింగ్టన్లో ఆందోళనకారుల చేతుల్లో పాక్షికంగా దహనమైన సెయింట్ జాన్స్ చర్చ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సందర్శించారు. చేతిలో బైబిల్ పట్టుకున్న ట్రంప్ చర్చిలో కొంత సేపు గడిపారు. అధ్యక్షుల చర్చిగా పేర్కొనే సెయింట్ జాన్స్ ఎపిస్కాపల్ చర్చ్‌లో తొలి ప్రార్థనలు 1816 అక్టోబరు 27న జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వైట్‌హౌస్‌కు దగ్గరగా ఉంటుంది ఈ చర్చి. జేమ్స్ మాడిసన్ మొదలుకొని అధ్యక్షులంతా ఈ చర్చిలో ప్రార్థనలు చేసిన వారే. సత్య నాదెళ్ల మద్దతు జార్జ్‌ఫ్లాయిడ్ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలకు మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు పలికారు. ‘సమాజంలో హింసకు, ద్వేషానికి తావులేదు. సానుభూతి, అర్థం చేసుకోవడం అవసరం. అయితే వీటికంటే ఎక్కువ చేయాల్సి ఉంది’అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. ఆఫ్రికన్ అమెరికన్లకు మద్దతు తెలుపుతున్నానని, తమ కంపెనీలోనూ, సమూహాల్లోనూ ఇదే పంథా అనుసరిస్తామన్నారు. సుందర్ పిచాయ్ ఒక ట్వీట్ చేస్తూ.. ‘‘ఈ రోజు అమెరికాలోని గూగుల్, యూట్యూబ్ హోం పేజీల్లో ఆఫ్రికన్ అమెరికన్లకు సంఘీభావం తెలుపుతా’’అని చెప్పారు. పెప్సీ కో మాజీ సీఈవో ఇంద్రా నూయీ కూడా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు పలికారు. వారం రోజులుగా లక్షలాది మంది అమెరికన్లు తమ బాధను నిరసన ప్రదర్శనల రూపంలో వ్యక్తం చేశారని ట్వీట్ చేశారు. -
నాదెళ్ల 'థ్యాంక్స్'
టెక్ దిగ్గజం, ‘మైక్రోసాఫ్ట్’ అధినేత సత్య నాదెళ్ల ఎవరికైనా థ్యాంక్స్ చెప్పారంటే.. వాళ్లెంత దిగ్గజాలు అయి ఉండాలి! అయితే ఆయన థ్యాంక్స్ చెప్పింది.. లూథియానాలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక నమ్యా జోషికి! నాదెళ్ల, నమ్య మంగళవారం ఢిల్లీలోని ఒక వేదికపై కలుసుకున్నారు. ‘యంగ్ ఇన్నొవేటర్స్’ సదస్సు అది. మొత్తం 250 మంది చిన్నారి టెకీలు, విద్యావేత్తలు హాజరయ్యారు. చిన్నారులలో ఎవరి ప్రతిభ వారికి ఉన్నప్పటికీ నమ్యకు ఉన్న ప్రత్యేకతే నాదెళ్ల చేత ఆమెకు థ్యాంక్స్ చెప్పించింది. అర్థంచేసుకోడానికి కష్టమైన స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్), సైబర్ సెక్యూరిటీ పాఠాలను నమ్య మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌ను ఉపయోగించి విద్యార్థులకు, టీచర్లకు కూడా పాఠాలను బోధిస్తోంది. అది ఆశ్చర్యపరచింది నాదెళ్లను. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా టెక్ పాఠాల కోసం ‘స్కైప్’ నమ్యను సంప్రదిస్తున్నారని తెలిసి ముగ్ధులైపోయిన మైక్రోసాఫ్ట్ సీఈవో ఆమెను అభినందించారు. అందుకోసం నమ్య మైన్‌క్రాఫ్ట్‌ని వాడుతోందని తెలిసి థ్యాంక్స్ చెప్పారు. మైన్‌క్రాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ వాళ్లదే. అదొక శాండ్బాక్స్ వీడియో గేమ్. -
కొందరికే పరిమితం కాకూడదు!
బెంగళూరు: టెక్నాలజీ ఆధారిత పరిష్కార మార్గాలను అభివృద్ధి చేసే డెవలపర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. సొల్యూషన్స్ రూపొందించేటప్పుడు నైతికత, విశ్వసనీయతపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ లభించేలా చూడాలని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్ రూపకల్పనలో ఎలాంటి పక్షపాత ధోరణులు చొరబడకుండా .. వివిధ వర్గాల వారు ఉన్న టీమ్‌లతో డెవలపర్లు కలిసి పనిచేయాలని నాదెళ్ల చెప్పారు. ‘ప్రస్తుతం అంతటా టెక్నాలజీమయం అయిపోయింది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. డెవలపర్లు రూపొందించే సొల్యూషన్స్ ఫలాలు.. సమాజంలో కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమవుతాయా? లేదా రిటైల్, వైద్యం, వ్యవసాయం .. ఇలా చాలా వర్గాలకు అందుతాయా? అన్నది బేరీజు వేసుకోవాలి‘ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఫ్యూచర్ డీకోడెడ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కస్టమర్లు, డెవలపర్లు, భాగస్వాములు మొదలైన వారు ఈ సదస్సులో పాల్గొన్నారు. డెవలపర్లు సృష్టించే సొల్యూషన్స్‌ను ముందుగా వారే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు కాబట్టి.. సదరు టెక్నాలజీ రూపకల్పనలో విశ్వసనీయతకు పెద్ద పీట వేయాలని సత్య చెప్పారు. కస్టమర్ల డేటా కీలకంగా ఉండే బ్యాంకుల్లాంటివి.. తాము రూపొందించే యాప్‌లపై సంబంధిత వర్గాలకు నమ్మకం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నాదెళ్ల చెప్పారు. తమ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని డేటా రెసిడెన్సీ చట్టాలకు అనుగుణంగానే ఆయా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ‘మాకు 57 డేటా సెంటర్ రీజియన్లు ఉన్నాయి. భారత్‌లో మూడు ప్రాంతాల్లో (పుణె, చెన్నై, ముంబై) ఇవి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తున్నాం. ఆయా దేశాల్లోని డేటా చట్టాలను తు.చ. తప్పకుండా పాటించడం వల్లే ఇది సాధ్యపడుతోంది‘ అని నాదెళ్ల చెప్పారు. -
టాప్ 3 ఎకానమీల్లోకి భారత్
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్.. కచ్చితంగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ డిజిటల్ సమాజంగా భారత్ రూపొందుతుందని ఆయన చెప్పారు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుస్తుందన్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘ప్రపంచంలోని టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. ఇందుకు అయిదేళ్లు పడుతుందా లేక పదేళ్లు పడుతుందా అన్నది చెప్పలేము కానీ.. కచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. అప్పటికల్లా మన దేశం సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందినదిగా ఉంటుందా? అభివృద్ధి పనుల్లో టెక్నాలజీ వాడకం ఎలా ఉంటుంది? టెక్నాలజీ వినియోగం విషయంలో మనం మిగతా వాళ్లకు దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉండగలమా? ఇలాంటి విషయాలను మనం తేల్చుకోవాలి. ప్రపంచంలోనే ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఎదిగేందుకు భారత్ ముందు అద్భుతమైన అవకాశం ఉంది. మనం అస్త్రశస్త్రాలన్నీ అందిపుచ్చుకుని ముందుకు దూసుకెళ్లడమే తరువాయి‘ అని అంబానీ చెప్పారు. 300 బిలియన్ డాలర్ల నుంచి ..3 ట్రిలియన్ డాలర్లకు.. సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు భారత ఎకానమీ పరిమాణం 300 బిలియన్ డాలర్లుగా ఉండేదని.. ప్రస్తుతం ఇది 3 ట్రిలియన్ డాలర్లకు ఎగిసిందని ముకేశ్ అంబానీ చెప్పారు. టెక్నాలజీ ఊతంతోనే ఇది సాధ్యపడిందన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టాక పురోగతి మరింత వేగవంతం అయిందన్నారు. ‘జియో రాక ముందు దేశీయంగా డేటా ఖరీదు జీబీకి రూ. 300 నుంచి రూ. 500 దాకా ఉండేది. 2జీ ఫోను ఉపయోగించే అత్యంత సామాన్యుడికైతే ఏకంగా రూ. 10,000 దాకా జీబీ ధర ఉండేది. కానీ జియో వచ్చిన తర్వాత ఇది జీబీకి రూ. 12–14 స్థాయికి తగ్గిపోయింది. గడిచిన మూడేళ్లలో 38 కోట్ల మంది కస్టమర్లు 4జీ టెక్నాలజీకి మారారు. సగటు నెట్ స్పీడ్ 256 కేబీపీఎస్ నుంచి ఇప్పుడు 21 ఎంబీపీఎస్‌కు చేరింది‘ అని ఆయన తెలిపారు. ట్రంప్ చూస్తున్నది.. నవ భారతం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను కూడా అంబానీ ప్రస్తావించారు. గతంలో వచ్చిన అమెరికా అధ్యక్షులు కార్టర్ గానీ బిల్‌క్లింటన్.. ఆఖరుకు ఇటీవలి బరాక్ ఒబామా కూడా చూడని ఒక కొత్త భారత్‌ను ట్రంప్ నేడు చూస్తున్నారని ఆయన చెప్పారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు, తండ్రి ధీరూభాయ్ అంబానీ అప్పట్లో ఒక టేబులు, కుర్చీ, చేతిలో రూ. 1,000 పెట్టుబడితో ప్రారంభించిన స్టార్టప్ సంస్థ నేడు దిగ్గజంగా వృద్ధి చెందిందని తెలిపారు. చిన్న వ్యాపారస్తులైనా.. ధీరూభాయ్ లేదా బిల్‌గేట్స్ స్థాయికి ఎదిగేందుకు భారత్‌లో పుష్కలమైన అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని తెలియజెప్పడానికి ఇది నిదర్శనంగా అంబానీ వివరించారు. నాదెళ్లపై ప్రశంసలు.. మైక్రోసాఫ్ట్‌కి సత్య నాదెళ్ల సారథ్యం వహించడం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమని అంబానీ చెప్పారు. సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవాలి ముంబై: సమ్మిళిత వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెట్టాలని, సొంతంగా సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భారతీయ సంస్థలకు సూచించారు. గత దశాబ్దంలో మొబైల్ ద్వారా స్మార్ట్ టెక్నాలజీలు విరివిగా వాడకంలోకి వచ్చాయన్నారు. అయితే, అగ్రిగేటర్ సంస్థలు మాత్రమే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందాయని పేర్కొన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవోల సదస్సులో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. టెక్నాలజీ భవిష్యత్తు, భారతీయ కంపెనీలతో కలిసి మైక్రోసాఫ్ట్ పనిచేసే తీరుతెన్నులు మొదలైన వాటి గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘మనం ఏదైనా టెక్నాలజీని రూపొందించినప్పుడు.. సమ్మిళిత ఆర్థిక వృద్ధికి అది ఏవిధంగా ఉపయోగపడుతుందన్నది కూడా దృష్టిలో ఉంచుకోవాలి‘ అని నాదెళ్ల పేర్కొన్నారు. నాయకత్వ హోదాల్లో ఉన్న సంస్థలు ఓవైపు సాంకేతిక సామర్థ్యాలను నిర్మించుకుంటూనే మరోవైపు టెక్నాలజీపరమైన మార్పులను సాధ్యమైనంత త్వరగా అందిపుచ్చుకోవాలని చెప్పారు. గడిచిన దశాబ్దంలో వినియోగదారుల వ్యయాల ధోరణులే ప్రధానమన్న రీతిగా ఎకానమీ నడిచిందని.. కానీ ఆర్థిక వ్యవస్థ అంటే అదొక్కటే కాదని నాదెళ్ల తెలిపారు. టెక్నాలజీని వివిధ ప్రక్రియల్లో విరివిగా వాడే కంపెనీలన్నీ కూడా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మొదలైన అంశాల్లో సంబంధిత వర్గాల విశ్వాసం చూరగొనే విధంగా వ్యవహరించాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీ ఉద్యోగాల తీరు.. సాంకేతిక రంగంలో ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోతున్నాయని, కొంగొత్త నైపుణ్యాల్లో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతుండటం కీలకంగా మారిందని ఆయన చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సుమారు 72 శాతం ఉద్యోగాలు.. టెక్నాలజీయేతర కంపెనీల్లోనే ఉంటున్నాయన్న నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ డేటా ఇందుకు నిదర్శనమని చెప్పారు. పిరమల్ గ్లాస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల్లో సాంకేతికత వినియోగాన్ని నాదెళ్ల ప్రస్తావించారు. రిలయన్స్‌తో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం .. రాబోయే దశాబ్దంలో అత్యంత కీలకమైనదిగా ఆయన అభివర్ణించారు. -
త్వరలో ‘డిజిటలైజేషన్’పై పూర్తి స్థాయి నివేదిక
ఏపీ సీఎం చంద్రబాబు ముంబై: దేశంలో లావాదేవీలను ‘డిజిటలైజ్’ చేయడంపై త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని కమిటీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కార్డు లావాదేవీల మీద అధిక చార్జీల వసూలుపై ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. ముంబైలో బుధవారం మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. డిజిటలైజేషన్‌పై ఐదుగురు సీఎంలు, నీతి ఆయోగ్ సభ్యులం సంయుక్తంగా పని చేస్తున్నామని, ఇటీవలే దీనిపై మధ్యంతర నివేదిక సమర్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విధానాలు, ప్రజలు డిజిటల్లోకి మళ్లేందుకు ప్రోత్సాహకాలు వంటి వాటిపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. పీఓఎస్‌లపై అద్దె వసూలు, ఇతర సర్వీసు చార్జీలు అధికంగా ఉన్నాయని, వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓతో చంద్రబాబు భేటీ సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై చర్చించారు. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించి ప్యూచర్ డీకోడెడ్ అనే అంశంపై బుధవారం జరిగిన సాంకేతిక సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. దేశంలోనే తొలి నగదు రహిత నగరం విశాఖ న్యూఢిల్లీ: దేశంలోనే ‘తొలి నగదు రహిత నగరం’గా ఏపీలోని విశాఖపట్నం పేరుగాంచనుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు పేమెంట్స్ నెట్వర్క్ సంస్థ ‘వీసా’ ముందుకొచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరంలో ఈ– చెల్లింపులు 70 శాతం నుంచి 100 చేరుకుంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. కాగా విశాఖను భారతదేశపు ‘ఫిన్‌టెక్ వ్యాలీ’గా మార్చేందుకు కూడా సహకరిస్తామని ‘వీసా’ సంస్థ పేర్కొంది. -
ఏపీకి హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీ
హామీ ఇచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దావోస్‌లో సీఎంతో సమావేశం సాక్షి, అమరావతి: హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించినట్లు సీఎం కార్యాలయం (సీఎంవో) తెలిపింది. దావోస్‌లో మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన సత్య నాదెళ్ల సంబంధిత ప్రతిపాదనలపై చర్చించినట్లు పేర్కొంది. సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం బాబు దావోస్ పర్యటన వివరాలివీ.. లింక్డ్ ఇన్ సంస్థను తాము కొనుగోలు చేశామని, దీనిపై సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు సత్య నాదెళ్ల సీఎంకు తెలిపారు. ఈ–గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో తమతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఏడాది జరిగే దావోస్ సదస్సు నాటికి హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీలో ప్రగతి సాధించాలని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 47వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం మంగళవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ సానుకూలతలపై వివరించారు. వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చాన్స్‌లర్ నికోలస్ డక్స్‌తో సీఎం చర్చలు జరిపారు. ఏపీలోని మోరిలో బర్కెలీ వర్సిటీకి చెందిన సోలమన్ డార్విన్ చేస్తున్న కృషిని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ చైర్మన్ బిబాప్‌తో సమావేశమైన బాబు బుల్లెట్, స్పీడ్ రైళ్లలో ఆధునిక సాంకేతికత, ఇంధన విని యోగం మొదలైన అంశాలపై చర్చించారు. ఐచర్ మోటార్స్ ప్రతినిధి సిద్ధార్థ లాల్‌తో సమావేశమై ఏపీకి పెట్టుబడులతో రావాలని కోరారు. ‘ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచురీ’ అనే అంశంపై దావోస్‌లో జరుగుతున్న చర్చలో సీఎం ప్రసంగించారు. గ్రీన్ అండ్ బ్లూ సిటీగా ఏపీ రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దావోస్‌లో జరిగే సదస్సుకు సీఎం ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైనట్లు సీఎంఓ తెలిపింది. బాబుతో అజీం ప్రేమ్‌జీ, ముఖేశ్ అంబాని సమావేశమయ్యారు. -
కేసీఆర్‌తో సత్య నాదెళ్ల భేటీ
40 నిమిషాలపాటు ముఖ్యమంత్రితో మైక్రోసాఫ్ట్ సీఈవో సమావేశం నాదెళ్ల కోరిక మేరకు వివరాల్ని గోప్యంగా ఉంచిన సీఎం కార్యాలయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) సత్య నాదెళ్ల ఆదివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. వాస్తవానికి సీఎం కేసీఆర్‌తో సత్య నాదెళ్ల భేటీకి సంబంధించి ముందస్తుగా ఎలాంటి అపాయింట్మెంట్ లేదు. కానీ ఆయన ఆదివారమే హైదరాబాద్ రావడం.. సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమవుతానని చెప్పడంతో హడావుడిగా ఈ భేటీ జరిగినట్లు అధికారవర్గాలు వివరించాయి. సత్య నాదెళ్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చేసరికి సీఎం అక్కడ లేరు. ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక, ఇంధనశాఖల ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావులతో కొత్త పారిశ్రామిక విధానానికి తుదిరూపు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారు. ఆ సమయంలోనే సత్య నాదెళ్ల నుంచి ముఖ్యమంత్రికి ఫోన్రావడం, క లవడానికి వస్తున్నానని, సమయం ఇవ్వాలని కోరడంతో.. సీఎం కేసీఆర్ సరేనని అంగీకరించారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో సత్య నాదెళ్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం ‘నాక్’ నుంచి క్యాంపు కార్యాలయానికి వచ్చేవరకు ఆయన 15 నిమిషాలు వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సత్య నాదెళ్ల దాదాపు 40 నిమిషాలపాటు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాక్రమాలతోపాటు విస్తరణపై కూడా సీఎంతో చర్చించినట్లు సమాచారం. సాఫ్ట్వేర్ రంగంలో యువతలో నైపుణ్యం కల్పించడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడానికి సత్య నాదెళ్ల సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను విస్తరించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని సత్య నాదెళ్లను సీఎం కేసీఆర్ కోరినట్టుగా సమాచారం. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంపై కసరత్తు జరుగుతోందని వివరించారు. పరిశ్రమల విస్తరణకు, మనుగడకు సానుకూల వాతావరణమే పారిశ్రామిక విధాన లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి ఐటీ రంగంలో జరిగిన అభివృద్ధే ప్రధాన కారణమని కేసీఆర్ అభిప్రాయపడినట్టుగా తెలిసింది. తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ రంగ విస్తరణకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి విసృ్తతమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా వివరించినట్టు సమాచారం. ఐటీ రంగంతోపాటు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఫార్మా వంటి కీలక ఉత్పత్తులపైనా దృష్టి పెడుతున్నామన్నారు. వీటికోసం తెలంగాణవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను సత్య నాదెళ్ల ప్రశంసిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రితో తన సమావేశానికి సంబంధించిన అంశానికి అధిక ప్రచారం కల్పించవద్దని ఆయన స్వయంగా కోరినట్లు తెలిసింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటో కానీ, పత్రికా ప్రకటన కానీ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేయలేదు. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సమాచారం వెల్లడించడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం. నేడు మైక్రోసాఫ్ట్ సిబ్బందికి దిశానిర్దేశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ రంగ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌కు(ఎంఐడీసీ) రానున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ అధికార బృందంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే ఎంఐడీసీ అంతర్గత సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి కీలకోపన్యాసం చేయడంతోపాటు ఉద్యోగులకు భవిష్యత్ దిశానిర్దేశం చేయనున్నారు. మైక్రోసాఫ్ట్‌కు భారత్ ఎంత ప్రాముఖ్యమో ఆయన వివరించనున్నారు. భారతీయులపై టెక్నాలజీ పాత్ర అన్న అంశంపైనా చర్చించనున్నారు. ఉదయం 8.30 నిముషాలకు ఈ సమావేశం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలిసారిగా హైదరాబాద్‌కు.. మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భాగ్యనగరికి నాదెళ్ల రావడం ఇదే తొలిసారి. అంతేగాక మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్లో కాలుమోపడం కూడా ఇదే మొదటిసారి. మైక్రోసాఫ్ట్‌కు అమెరికా వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం హైదరాబాద్‌లోనే ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సత్య నాదెళ్ల సోమవారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో తనతో చదువుకున్న విద్యార్థులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది. అలాగే, సెప్టెంబర్ 30న ఢిల్లీలో నాస్కామ్ ఏర్పాటు చేస్తున్న రెండు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా సత్య నాదెళ్ల పాల్గొంటున్నారు. ఒకటి స్టార్టప్‌ల కార్యక్రమం కాగా, మరొకటి డిజిటల్ అంశంపై జరగనుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ‘ఉమెన్ ఇన్ టెక్’ కార్యక్రమానికి సైతం అతిథిగా విచ్చేయనున్నారు. 10 ల క్షల మంది యువతులు, మహిళలకు ఐటీ రంగంలో శిక్షణ ఇవ్వడం ఉమెన్ ఇన్ టెక్ లక్ష్యం. -
తెలుగోడికి మైక్రోసాప్ట్ పగ్గాలు.....
-
మురిసిన నగరం
సత్య ఎన్నికతో హెచ్‌పీఎస్‌లో ఆనందోత్సాహాలు జూబ్లిహిల్స్, న్యూస్‌లైన్ : ప్రపంచ వాణిజ్య పటంలో హైదరాబాద్ నగరం మరోసారి మెరిసి మురిసింది. క్లౌడ్ గురు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎన్నికవడంతో తెలుగు‘వాడి’ వేడి... నగర ఖ్యాతి... అంతర్జాతీయంగా మరోసారి చాటిన ట్లైంది. ఈ ఎన్నిక నగరాన్ని ఆనంద సాగరంలో ముంచెత్తింది. సత్య నాదెళ్లే కాదు ఎంతోమంది ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలను తయారుచేసిన ఘనత మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) సొంతం. సత్య అత్యున్నత స్థానానికి ఎన్నికవడంతో హెచ్‌పీఎస్ యాజమాన్యం ఉబ్బితబ్బిబ్బవుతోంది. నిపుణులెందరో.. బ్లాక్‌బెర్రి ఫోన్ కంపెనీని కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి ఇటీవల అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తున్న ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈవో ప్రేమ్‌వత్సా... లండన్‌లో కోబ్రాబీర్ హోల్డింగ్స్ పేరుతో బడా మద్యం సంస్థను నిర్వహిస్తున్న కరణ్ బిలిమోరియా... మరో టెక్నాలజీ దిగ్గజం అడాబ్ కార్పొరేషన్ సీఈవో శంతను నారాయణ్... ప్రాక్టర్ అండ్ గాంబల్ నార్త్ అమెరికా వైస్ ప్రెసిడెంట్... శైలేష్ జుజెరికర్ తదితరులంతా హెచ్‌పీఎస్‌లో ఓనమాలు దిద్దినవారే. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన హెచ్‌పీఎస్‌లో చదువుకున్న పలువురు విద్యార్థులు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నతస్థాయిల్లో రాణించడం తమకు గర్వకారణమని స్కూల్ పూర్య విద్యార్థి, సత్య సహధ్యాయి, ప్రస్తుతం హెచ్‌పీఎస్ బోర్డు సెక్రటరీగా ఉన్న ఫయాజ్‌ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనాదెళ్లతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. సత్య సాధించిన విజయం పాఠశాలకే కాకుండా ఎందరో యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు. త్యరలో పూర్య విద్యార్థులంతా కలిసి సత్యను ఆహ్వనించి, ఘనంగా సన్మానించాలనుకుంటున్నట్లు తెలిపారు. చిన్ననాటి స్కూల్‌ను మరిచిపోని సత్య సత్య హెచ్‌పీఎస్‌లో 1984 బ్యాచ్‌కు చెందినవారు. ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి స్కూల్‌ను ఆయన మరిచిపోలేదు. రెండేళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆయన హెచ్‌పీఎస్‌లో నిర్వహించిన ‘ఐ స్పార్క్ రోబోటిక్స్ షో ’లో విద్యార్థులతో ముచ్చటించారు. రోబోటిక్స్, కంప్యూటర్స్ ప్రాధాన్యతను, భవిష్యత్ తరం టెక్నాలజీల గురించి విద్యార్థులతో చాలాసేపు సంబాషించారు. అనంతరం ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో కలిసిపోయారు. ఆయన తండ్రి యుగంధర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి. గతంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. -
హైదరాబాద్ టు మైక్రోసాఫ్ట్ సీఈఓ వరకు
వాషింగ్టన్: క్రికెట్ నుంచే టీమ్ వర్క్ నేర్చుకున్నానని ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ నూతన సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా 46 ఏళ్ల సత్య నాదెళ్లను మంగళవారం నియమించారు. ఓ భారతీయుడికి, అందులోనూ తెలుగు వ్యక్తికి ఈ అరుదైన అవకాశం రావడం గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చైర్మన్ బిల్‌గేట్స్ ఈ పదవి నుంచి తప్పుకుని సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.యుగంధర్ ఐఏఎస్ అధికారి. 2004-09 మధ్య కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. సత్య నాదెళ్ల నగరంలోని బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ అభ్యసించారు. అనంతరం అమెరికా వెళ్లి ఎంఎస్, ఎంబీఏ చేశారు. అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మైక్రోసాఫ్ట్ పురోగతికి మరింత కఠినంగా శ్రమించాల్సిన అవసరముందని సత్య నాదెళ్ల అన్నారు. తాము చాలా వేగంగా ముందుకు సాగాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ నాయకుడిగా సత్యనాదెళ్లను మించిన వారు లేరని బిల్ గేట్స్ ప్రశంసించారు. సిబ్బందిని కలిసికట్టుగా నడిపించడంలో ఆయనే మెరుగైన వ్యక్తని చెప్పారు. అపారమైన ఇంజినీరింగ్ పరిజ్ఞానం, వ్యాపార దృష్టి ఉన్న వ్యక్తి సత్యనాదెళ్ల అని బిల్‌గేట్స్ కొనియాడారు.