నమ్యాజోషి
టెక్ దిగ్గజం, ‘మైక్రోసాఫ్ట్’ అధినేత సత్య నాదెళ్ల ఎవరికైనా థ్యాంక్స్ చెప్పారంటే.. వాళ్లెంత దిగ్గజాలు అయి ఉండాలి! అయితే ఆయన థ్యాంక్స్ చెప్పింది.. లూథియానాలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక నమ్యా జోషికి! నాదెళ్ల, నమ్య మంగళవారం ఢిల్లీలోని ఒక వేదికపై కలుసుకున్నారు. ‘యంగ్ ఇన్నొవేటర్స్’ సదస్సు అది. మొత్తం 250 మంది చిన్నారి టెకీలు, విద్యావేత్తలు హాజరయ్యారు. చిన్నారులలో ఎవరి ప్రతిభ వారికి ఉన్నప్పటికీ నమ్యకు ఉన్న ప్రత్యేకతే నాదెళ్ల చేత ఆమెకు థ్యాంక్స్ చెప్పించింది.
అర్థంచేసుకోడానికి కష్టమైన స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్), సైబర్ సెక్యూరిటీ పాఠాలను నమ్య మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌ను ఉపయోగించి విద్యార్థులకు, టీచర్లకు కూడా పాఠాలను బోధిస్తోంది. అది ఆశ్చర్యపరచింది నాదెళ్లను. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా టెక్ పాఠాల కోసం ‘స్కైప్’ నమ్యను సంప్రదిస్తున్నారని తెలిసి ముగ్ధులైపోయిన మైక్రోసాఫ్ట్ సీఈవో ఆమెను అభినందించారు. అందుకోసం నమ్య మైన్‌క్రాఫ్ట్‌ని వాడుతోందని తెలిసి థ్యాంక్స్ చెప్పారు. మైన్‌క్రాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ వాళ్లదే. అదొక శాండ్‌బాక్స్ వీడియో గేమ్.
Comments
Please login to add a commentAdd a comment