రజనీ బెక్టార్... సమైక్య భారతంలోని కరాచీ నగరంలో 1940లో పుట్టారామె. తండ్రి అకౌంటెంట్ జనరల్. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం లాహోర్‌లో పెరిగారు. ఆమెకు ఏడేళ్లు నిండేలోపే దేశవిభజన జరిగింది. రజని కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో చదువుకుందామె.
కాలేజ్ చదువు పూర్తయ్యేలోపే లూథియానాలోని ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ఆమె జీవితంలో కీలకమైన ఘట్టాలు జరిగాయి. గానీ అప్పటికి ఆమె వయసు పదిహేడే. చదువు పూర్తికాకముందే పెళ్లికి తలవంచాల్సి రావడంతో కలిగిన ఆ అసంతృప్తే ఆమెను ఇప్పుడు విజేతగా నిలిపింది. లూథియానాలో అడుగుపెట్టినప్పటి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే వరకు సాగిన ఆమె విజయయాత్రను సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారామె.
ఓ కొత్త ప్రపంచం
‘‘నేను లూథియానాకి వచ్చేనాటికి అది చాలా చిన్న పట్టణం. ఢిల్లీ నుంచి వచ్చిన నాకు లూథియానాను పట్టణం అనడానికి కూడా మనసొప్పేది కాదు. పట్టణం మొత్తానికి నాలుగు కార్లుండేవి అంతే. మా అత్తగారింటివాళ్లు ఛాందసులు. మా పుట్టింట్లో అమ్మ వైపు, నాన్న వైపు వాళ్లందరూ ఉన్నత విద్యావంతులు, విశాల దృక్పథం కలిగిన వాళ్లు. అత్తగారిల్లు– పుట్టిల్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నం. దాంతో నేను కొత్త మనుషుల మధ్యకు మాత్రమే కాదు, ఏకంగా కొత్త ప్రపంచంలోకి వచ్చి పడ్డాననే చెప్పాలి.
వంటతో స్నేహం
నాకు రకరకాలు వండడం, కొత్త వంటలను ప్రయత్నించడం హాబీ. ఆ హాబీయే నాకు పెద్ద ఆలంబన అయింది. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానించడం వారికి చేసి పెట్టడం, వారు ప్రశంసిస్తుంటే పొంగిపోవడమే జీవితంగా మారిపోయాను. హీరో మోటార్ కార్పొరేషన్‌కు చెందిన బ్రిజ్‌మోహన్ ముంజాల్, ఎవన్ సైకిల్స్ కంపెనీకి చెందిన పహ్వాస్‌లు ‘లూథియానా ప్రజలకు మంచి వంటలను రుచి చూపిస్తున్నావ్’ అన్నారు.
అప్పటి ఎమ్‌ఎల్‌ఏ ఒకరు తన మనుమరాలి పెళ్లికి కేటరింగ్ చేసి పెట్టమని అడిగారు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. స్థాణువులా ఉండిపోయాను. ఎలాగో ధైర్యం చేసి అంగీకారంగా తలూపాను. ఇద్దరు అసిస్టెంట్‌ల సాయంతో రెండు వేల మందికి వంటలు చేయించాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏ వేడుక జరిగినా నాకు కబురు వచ్చేది.
అయితే అవేవీ కమర్షియల్ సర్వీస్‌లు కాదు, స్నేహపూర్వక సర్వీస్‌లే. కొంతకాలానికి ఇంట్లోనే కుకరీ క్లాసులు మొదలు పెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇంట్లో మగవాళ్లు వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారు, నువ్వు క్లాసులు చెప్పి సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని కోప్పడ్డారు. మా వారు నాకు మద్దతుగా నిలవడంతో ఆ పెనుతుఫాను సమసిపోయింది.
పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జైన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సలహాతో అందులో ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, బేకరీ కోర్సులో చేరాను. పిల్లలు కొంచెం పెద్దయి బోర్డింగ్ స్కూల్‌కెళ్లిన తర్వాత నేను కాలేజ్‌లో చేరడంతో ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. పెళ్లి కారణంగా చదువాపేసినప్పటి నుంచి మనసులో దాగి ఉన్న దిగులు ఒక్కసారిగా ఎగిరిపోయింది. కోర్సు పూర్తి కాగానే మా వారిచ్చిన ఇరవై వేలతో 1978లో క్రిమికా ఐస్‌క్రీమ్ యూనిట్ ప్రారంభించాను.
‘క్రీమ్ కా’ అనే అర్థంలో పెట్టానా పేరు. లూథియానాలో క్వాలిటీ ఐస్‌క్రీమ్ స్టాల్ పక్కన నేను స్టాల్ తెరిచాను కాని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను కాదని మా యూనిట్‌కి ఎవరైనా వస్తారా అనే భయం చాలా రోజులు వెంటాడింది. అయితే నేను స్టాల్‌లో కూర్చోవడం లూథియానాలో మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఇంట్లో మగ్గిపోకుండా బయటకు వచ్చి ఏదైనా సాధించాలనే తపన ఉన్న వాళ్లందరూ తమ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి నన్ను మోడల్‌గా చూపించేవారు. నా ఐస్‌క్రీమ్‌కి కూడా ఆదరణ పెరగసాగింది.
ఐస్‌క్రీమ్‌తో మొదలు బిస్కట్ వరకు
క్వాలిటీని కాదని మా స్టాల్‌కి రావాలంటే వాళ్లకంటే ఎక్కువగా చేయాలి. ఐస్‌క్రీమ్‌తోపాటు బ్రెడ్, బిస్కట్ వంటి బేకరీ ఫుడ్ చేయడం మొదలు పెట్టాను. మా స్టాల్‌ను విస్తరించి జీటీ రోడ్‌లోకి మార్చాం. అంతా గాడిలో పడిందనుకునే సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలైంది. పంజాబ్ అట్టుడికిపోయింది. అనంతరం దేశం మొత్తాన్ని కుదిపేసిన దుర్ఘటన ఇందిరాగాంధీ హత్య జరిగింది.
అప్పటికి వందేళ్ల నుంచి మా కుటుంబం చేస్తున్న ధాన్యం, ఎరువుల వ్యాపారం స్తంభించిపోయింది. రైతులతో సంబంధాలు తెగిపోయాయి. బెదిరింపులు ఎక్కువయ్యాయి. మా పెద్దబ్బాయి మీద అపహరణ ప్రయత్నం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే.. 1990 నుంచి నా ఫుడ్ బిజినెస్సే ఇంట్లో అందరికీ ఫుడ్ పెట్టింది. ఇంట్లో అందరమూ క్రిమికా కోసమే పని చేయడం మొదలుపెట్టాం.
పదహారు గంటల పని
ఇప్పుడు క్రిమికాకు సంబంధించిన రోజువారీ బాధ్యతలేవీ లేవు. కానీ కీలకమైన సమయాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేశాను. ఆహారం మీద నాకున్న ప్రత్యేకమైన అభిరుచే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. విజేతగా నిలబెట్టింది. నేను నా టేస్ట్‌బడ్స్‌కి థ్యాంక్స్ చెప్పాలి. క్వాలిటీ చెక్‌లో భాగంగా ప్రతిదీ రుచి చూడాలి. కేవలం రుచి మాత్రమే చూడాలి. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండితే రుచిని గ్రహించే శక్తిని కోల్పోతాం. ఆ నియమం పాటిస్తేనే విజయం మనదవుతుంది. ఈ దేశంలో జీవించాలని వచ్చాం. ఇక్కడే సవాళ్లనెదుర్కొన్నాం. జీవితాన్ని వెతుక్కున్నాం. మూడేళ్ల కిందట పద్మశ్రీ పురస్కారం అందుకున్నాను. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది’’ అన్నారు రజనీ బెక్టార్.
మెక్‌డీ బర్గర్‌లో మా బన్ను
మెక్ డొనాల్డ్ ఫుడ్ చైన్ మనదేశంలో అడుగుపెట్టింది. వాళ్లకు అవసరమైన బన్ కోసం బేకరీలన్నింటినీ సందర్శించారు. మా బేకరీని ఎంపిక చేసుకున్నారు. అయితే వారికి కావల్సిన నియమాలు, పరిమితులకు లోబడి తయారు చేసి ఇవ్వడానికి ఒక ఏడాదిపాటు ఎక్సర్‌సైజ్ చేశాం. మధ్యప్రదేశ్‌లో పండే నాణ్యమైన గోధుమల పిండితో చేసిన బన్ వారి ఆమోదం పొందింది.
మొదట్లో కొంత నష్టం వచ్చినప్పటికీ క్వాలిటీ కంట్రోల్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఇక మాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మెక్‌డీకి అవసరమైన సాస్ ΄్లాంట్ కూడా పెట్టాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా వేగంగా విస్తరించగలిగాం. టర్నోవర్ ఏడు వేల కోట్లకు చేరింది. మా ముగ్గురబ్బాయిలు బాధ్యతలు పంచుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మూడవ తరం అడుగుపెట్టింది. మా మనుమడు ఢిల్లీ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment