seventh class student
-
అయ్యో బిడ్డా! ఏమైందిరా?
రణస్థలం (శ్రీకాకుళం): పదమూడేళ్ల కుర్రవాడు. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్నవాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రా ణాలు వదిలేసి తల్లిదండ్రులకు శోకం మిగిల్చాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని జేఆర్ పురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బౌరోతు సంతోష్(13) ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంచీపై కూర్చుని ఉన్న సంతోష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు టీచర్‌కు చెప్పగా ఆయన స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే స్కూల్ వ్యాన్లోనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. నిమిషాల వ్యవధిలో ఇంత విషాదం చోటుచేసుకోవడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దీనిపై బాలుడి తల్లి మణికి సమాచారం అందించగా.. ఆమె ఆస్పత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వీరు జేఆర్‌పురంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలుడి తండ్రి జయరావు అరబిందో పరిశ్రమలో టెక్నికల్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా విషయం చెప్పడంతో ఆస్పత్రికి వచ్చి గుండెలవిసేలా రోదించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంలోని గొడుగువలస. మృతదేహాన్ని అక్కడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. అనంతరం ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. (చదవండి: భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే?) -
వయసు చిన్న.. మనసు పెద్ద
వలస కార్మికుల కోసం ఎంతోమంది తమకు చేతనైన సాయం చేస్తున్న కథనాలు మన చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఎంతోమంది తమ ఉదాత్త మనసు చాటుకుంటూ వలస కార్మికులకు చేతనైన సాయం చేస్తున్నారు. వారి జాబితాలో ఇప్పుడు నోయిడాలో నివసిస్తున్న 12 ఏళ్ల అమ్మాయి నిహారికా ద్వివేదీ చేరింది. నిహారిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ న్యూస్‌ఛానెళ్లలో వలస కార్మికుల కష్టాలు, వారి దయనీయ కథనాలు చూస్తూ చలించిపోయింది. కొందరికైనా తన వంతు సాయం చేయాలనుకుంది. తమ నివాస ప్రాంతంలోనూ వలకార్మికులు ఉన్నారు. వారు సొంత ప్రాంతాలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా తన దృష్టికి వచ్చిన ముగ్గురు వలస కార్మికుల గురించి తెలుసుకుంది. రెండేళ్లుగా పిగ్గీబ్యాంకులో తను దాచుకున్న డబ్బు ఎంత ఉందో లెక్క కట్టింది. పిగ్గీ బ్యాంకులో 48 వేల 530 రూపాయల ఉన్నాయి. ఆ డబ్బులతో తమ ప్రాంతంలో ఉన్న ఆ ముగ్గురు వలస కార్మికులను వారి సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కి విమానంలో పంపింది. ఈ 12 ఏళ్ల నిహారిక సున్నిత మనసుకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. చిన్న వయసులో పెద్దమనసును చాటుకుంటున్న నిహారికకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. నిహారిక మాట్లాడుతూ ‘ఆ ముగ్గురు వలస కార్మికుల్లో ఒకరు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నారు. అలాంటి వారు వెయ్యికి పైగా కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ల స్వస్థలానికి చేరుకోవాలి. అది తలుచుకుంటే బాధగా అనిపించింది. మా అమ్మనాన్నలతో మాట్లాడి నా పిగ్గీ బ్యాంక్ మనీతో వారిని సొంతప్లేస్కు పంపించాలనుకుంటున్నట్టు చెప్పాను. వాళ్లు ఆనందంగా ఒప్పుకున్నారు. దాంతో ఆ కార్మికులు సురక్షితంగా, తక్కువ సమయంలో వాళ్ల తమ సొంత ఊళ్లకు చేరారు. ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది’ అని వివరించింది నిహారిక. -
నాదెళ్ల 'థ్యాంక్స్'
టెక్ దిగ్గజం, ‘మైక్రోసాఫ్ట్’ అధినేత సత్య నాదెళ్ల ఎవరికైనా థ్యాంక్స్ చెప్పారంటే.. వాళ్లెంత దిగ్గజాలు అయి ఉండాలి! అయితే ఆయన థ్యాంక్స్ చెప్పింది.. లూథియానాలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక నమ్యా జోషికి! నాదెళ్ల, నమ్య మంగళవారం ఢిల్లీలోని ఒక వేదికపై కలుసుకున్నారు. ‘యంగ్ ఇన్నొవేటర్స్’ సదస్సు అది. మొత్తం 250 మంది చిన్నారి టెకీలు, విద్యావేత్తలు హాజరయ్యారు. చిన్నారులలో ఎవరి ప్రతిభ వారికి ఉన్నప్పటికీ నమ్యకు ఉన్న ప్రత్యేకతే నాదెళ్ల చేత ఆమెకు థ్యాంక్స్ చెప్పించింది. అర్థంచేసుకోడానికి కష్టమైన స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్), సైబర్ సెక్యూరిటీ పాఠాలను నమ్య మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌ను ఉపయోగించి విద్యార్థులకు, టీచర్లకు కూడా పాఠాలను బోధిస్తోంది. అది ఆశ్చర్యపరచింది నాదెళ్లను. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా టెక్ పాఠాల కోసం ‘స్కైప్’ నమ్యను సంప్రదిస్తున్నారని తెలిసి ముగ్ధులైపోయిన మైక్రోసాఫ్ట్ సీఈవో ఆమెను అభినందించారు. అందుకోసం నమ్య మైన్‌క్రాఫ్ట్‌ని వాడుతోందని తెలిసి థ్యాంక్స్ చెప్పారు. మైన్‌క్రాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ వాళ్లదే. అదొక శాండ్బాక్స్ వీడియో గేమ్. -
డెంగ్యూతో విద్యార్థి మృతి
చింతకొమ్మదిన్నె (వైఎస్సార్‌జిల్లా) : డెంగ్యూతో చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయిశంకర్ (13) కడపలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా గత వారం రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. -
హోమ్‌వర్క్‌కు భయపడి.. కిడ్నాప్ నాటకం!
మోత్కూరు (నల్లగొండ): ఏడవ తరగతి విద్యార్థి హోమ్ వర్క్ చేయక, టీచర్ దండిస్తారేమోనన్న భయంతో కిడ్నాప్ నాటకం ఆడాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన ఓ విద్యార్థి బుధవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో తప్పిపోయిన విద్యార్థిని మోత్కూరులో గుర్తించారు. విచారించగా... తనను, తన స్నేహితుడ్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని చెప్పాడు. తన స్నేహితుడు వెనక్కి వెళ్లిపోయాడని, సంబంధం లేని మాటలు చెబుతుండడంతో కిడ్నాప్ డ్రామాగా తేల్చారు. హోమ్‌వర్క్‌కు భయపడే ఇలా కట్టుకథ చెబుతున్నట్టు భావించిన పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
కరస్పాండెంట్ అకృత్యం: ఏడో తరగతి విద్యార్థినికి గర్భం
దర్శి (ప్రకాశం): ఓ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు! ఫలితంగా 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అనారోగ్యంగా ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ అఘాయిత్యం వెలుగు చూసింది. ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. వివరాలు.. దర్శిలోని తూర్పు చవటపాలెం రోడ్డులో నివసించే 14 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. మామయ్య సంరక్షణలో ఉన్న ఆమె స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బుధవారం బంధువులు ఒంగోలులోని రిమ్స్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆరు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె బంధువులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చాక్లెట్లు ఇస్తానని ప్రిన్సిపాల్ జాయ్ తనను లొంగదీసుకున్నట్టు బాధితురాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ విద్యార్థిని గతేడాది అదే స్కూల్లో 3వ తరగతి చదివింది. అయితే, నేరుగా 7వ తరగతిలో చేర్పించి బాగా చదివిస్తానని కూడా ప్రన్సిపాల్ ఆశ చూపినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ జాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, బాలికతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వ్యాసెక్టమీ సర్జరీ చేయించుకున్నానని, తన వల్ల గర్భం వచ్చే అవకాశమే లేదని ప్రిన్సిపాల్ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబందించి పోలీసులు అధికారికంగా మీడియాకు ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.