
వలస కార్మికుల కోసం ఎంతోమంది తమకు చేతనైన సాయం చేస్తున్న కథనాలు మన చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఎంతోమంది తమ ఉదాత్త మనసు చాటుకుంటూ వలస కార్మికులకు చేతనైన సాయం చేస్తున్నారు. వారి జాబితాలో ఇప్పుడు నోయిడాలో నివసిస్తున్న 12 ఏళ్ల అమ్మాయి నిహారికా ద్వివేదీ చేరింది. నిహారిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ న్యూస్‌ఛానెళ్లలో వలస కార్మికుల కష్టాలు, వారి దయనీయ కథనాలు చూస్తూ చలించిపోయింది. కొందరికైనా తన వంతు సాయం చేయాలనుకుంది. తమ నివాస ప్రాంతంలోనూ వలకార్మికులు ఉన్నారు. వారు సొంత ప్రాంతాలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా తన దృష్టికి వచ్చిన ముగ్గురు వలస కార్మికుల గురించి తెలుసుకుంది.
రెండేళ్లుగా పిగ్గీబ్యాంకులో తను దాచుకున్న డబ్బు ఎంత ఉందో లెక్క కట్టింది. పిగ్గీ బ్యాంకులో 48 వేల 530 రూపాయల ఉన్నాయి. ఆ డబ్బులతో తమ ప్రాంతంలో ఉన్న ఆ ముగ్గురు వలస కార్మికులను వారి సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కి విమానంలో పంపింది. ఈ 12 ఏళ్ల నిహారిక సున్నిత మనసుకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. చిన్న వయసులో పెద్దమనసును చాటుకుంటున్న నిహారికకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. నిహారిక మాట్లాడుతూ ‘ఆ ముగ్గురు వలస కార్మికుల్లో ఒకరు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నారు. అలాంటి వారు వెయ్యికి పైగా కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ల స్వస్థలానికి చేరుకోవాలి. అది తలుచుకుంటే బాధగా అనిపించింది. మా అమ్మనాన్నలతో మాట్లాడి నా పిగ్గీ బ్యాంక్ మనీతో వారిని సొంతప్లేస్‌కు పంపించాలనుకుంటున్నట్టు చెప్పాను. వాళ్లు ఆనందంగా ఒప్పుకున్నారు. దాంతో ఆ కార్మికులు సురక్షితంగా, తక్కువ సమయంలో వాళ్ల తమ సొంత ఊళ్లకు చేరారు. ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది’ అని వివరించింది నిహారిక.
Comments
Please login to add a commentAdd a comment