
హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా కూలీలు, కార్మికులు, పేదలు, అనాథల పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతోంది. మహమ్మారి కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ రెక్కాడితేగానీ డొక్కాడని పేదల జీవితాలను ఛిద్రం చేసింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది జియాగూడలోని మేకలమండీ.
జియాగూడ మేకలమండీ నిత్యం మేకలు, గొర్రెల క్రయ విక్రయాలతో కిటకిటలాడేది. లాక్‌డౌన్ కారణంగా మండీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జీవాల దిగుమతి పూర్తిగా నిలిచిపోంది. దీంతో జియాగూడ మేకలమండీ నిర్మానుష్యంగా మారింది. లాక్‌డౌన్ సడలింపు ఉన్నా అది కొన్ని గంటలు మాత్రమే కావడంతో జీవాలు మండీకి రాకపోగా వచ్చే 1, 2 లారీలలో 300లకు పైగా జీవాలతో కార్మికులకు పూట గడవడం లేదు. రోజూ 20 వేలకుపైగా కార్మికులు మండీలో వివిధ పనులతో ఉపాధి పొందుతుంటారు. వచ్చే జీవాలు కూడా నాగ్‌పూర్, మహారాష్ట్రాల నుంచి మండీకి దిగుమతి కావాల్సి ఉంది.
లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు మండీకి రావడం లేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే స్వల్ప జీవాల విక్రయాలు కార్మికులకు పొట్ట నిండక పూటగడవడమే గగనమైంది. కార్మికుల ద్వారా శుభ్రపరచిన మటన్ నగరంలోని హోటల్స్, మాల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, నాన్‌వెజ్ హోటల్స్ తదితర మటన్ దుకాణాలకు మండీ నుంచే ఎగుమతి అవుతుంది. లాక్‌డౌన్‌తో హోటల్స్, మాల్స్, మటన్ దుకాణాలు మూతపడటంతో మండీలో కొనుగోలు చేయడానికి ఎవరూ రావడం లేదు. దిగుమతి అంతంత మాత్రమే, సప్లయ్ అంతమాత్రమే కావడంతో కార్మికులకు ఉపాధి లభించక ఎంతో మంది మండీకి వచ్చి తిరిగి వెళ్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌లతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా ప్రతి ఆధార్ కార్డుదారునికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేపట్టాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి కాలయాపన చేస్తుండటం దారుణమని జియాగూడ మాజీ కార్పొరేటర్ ఎ.మునేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment