కరోనా వ్యాక్సిన్ కోసం తిప్పలు తప్పడం లేదు. టీకాల కోసం ఆరోగ్య కేంద్రాల ముందు జనం బారులు తీరుతున్నారు. మరోవైపు కోవిడ్ కట్టడికి విధించిన ఆంక్షల కారణంగా వలస కార్మికులు, బడుగుజీవుల బతుకు ఆగమాగమైంది. లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు కోరుతున్నారు.
1/11
కరోనాపై అవగాహన కలిగించేందుకు మహబూబాబాద్ పోలీసులు వినూత్న పద్ధతిని అవలంబించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్‌లో సమీర్ అనే చిత్రకారుడితో భారీ పెయింటింగ్ వేయించారు. ఈ చిత్రంలో కరోనా రక్కసి చేతిలో రక్తం కారుతున్న ఆయుధంతో ఉండగా.. పక్కనే స్టే హోం, స్టే సేఫ్ అని ఇంగ్లిష్‌లో పెద్ద అక్షరాలు రాయించారు. అటువైపుగా వెళ్లేవారికి ఈ చిత్రం ఆసక్తి కలిగించడంతో పాటు ఆలోచింపజేసేదిగా ఉంది. ఇళ్లలోనే ఉంటే ఎవరూ కరోనా బారిన పడకుండా భద్రత ఉంటుందని అవగాహన కల్పించేందుకు ఈ చిత్రాన్ని వేయించామని పోలీసులు తెలిపారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
2/11
హైదరాబాద్‌లో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలవుతున్నా ఉదయం వేళ మాత్రం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. సడలింపు ఇచ్చిన నాలుగు గంటల్లో రోడ్లపై విపరీతమైన రద్దీ ఉంటోంది. గురువారం బేగంబజార్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో రోడ్లు ఇలా వాహనాలతో నిండిపోయాయి.
3/11
ఇప్పటికే మొదటి డోస్ టీకా వేసుకొని, రెండో డోస్ వేసుకునేందుకు ఎదురు చూస్తున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రోజుకు 100 మందికి మాత్రమే టీకా ఇస్తుండగా.. టీకా వేయించుకునేందుకు వందలాది మంది వస్తున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా వరుసలో నిలబడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద గురువారం టీకా వేసుకునేందుకు గుంపులుగా నిల్చున్న ప్రజలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రిభువనగిరి
4/11
వలస జీవుల కష్టాలు ఒడిశాకు చెందిన కూలీలు జగిత్యాల జిల్లాలోని ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఏటా వస్తుంటారు. ఈ ఏడాది కూడా పనుల కోసం అనేకమంది వచ్చారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ, ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అంతటా పనులు నిలిచిపోయాయి. దీంతో ఉపాధి లేకపోవడంతో చేసేదేమీ లేక సొంతూళ్లకు పయనమయ్యారు. ఒడిశా వెళ్లేందుకు ఉదయం మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రి ఒంటి గంటకు రైలు ఉండటంతో స్టేషన్ సమీపంలోని చెట్టుకింద ఇలా సేద తీరారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల
5/11
సాధారణంగా అమ్మ వేలు పట్టుకొని చిన్నారులు బుడిబుడి అడుగులు వేయడం చూస్తుంటాం.. కానీ 20 ఏళ్లు నిండినా ఓ యువకుడు బుద్ధిమాంద్యంతో నడవలేక పోతుండటంతో అతని నాన్నే దగ్గరుండి నడక నేర్పిస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ మాధవ్ కుమారుడైన ఓం అర్జున్ పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో నడవలేని స్థితిలో ఉన్నాడు. చికిత్స కోసం అనేక ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో తండ్రి మాధవ్ స్వయంగా తన కుమారుడికి నడక నేర్పించడంతో పాటు మాటలు సైతం నేర్పిస్తున్నాడు. నాన్న ధైర్యంతో ఆ యువకుడు ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా నడక నేర్చుకుంటున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
6/11
దేశంలోనే రెండో అతిపెద్ద నది, దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి ఎడారిని తలపిస్తోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 2 అడుగులకు పడిపోయింది. మంగళవారం నీటిమట్టం 1.6 అడుగులు ఉండగా, బుధవారం 2.0 అడుగులు నమోదైనట్లు కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. – భద్రాచలం అర్బన్
7/11
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన, ఇతర కారణాలతో వాహనాలపై వచ్చినవారి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో పట్టుబడిన వాహనదారులు అక్కడే ఉన్న ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తమ సమస్యలు తెలపడానికి వచ్చారు. దీంతో ఆయన మీకు దండం పెడుతా, ఇక్కడి నుంచి వెళ్లిపోయి జరిమానా కట్టుకోండి. మళ్లీ రాకండి అని దండం పెడుతూ చెప్పారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
8/11
యాస్ తుపాను ప్రభావంతో జార్ఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు తమర్ ప్రాంతంలో కాంచి నదిపై విరిగిపడిన వంతెన
9/11
ఒడిశాలో యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఏరియల్ సర్వే చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
10/11
దక్షిణ ఫ్రాన్సులోని లా గ్రాండే మొట్టే సమీపంలోని కార్నన్ బీచ్‌లో తీరానికి కొట్టుకువచ్చిన భారీ తిమింగలం కళేబరాన్ని అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యం.
11/11
ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మథుర సమీపంలో గురువారం రెండు సీటర్ల శిక్షణ విమానం అత్యవసరంగా దిగిన దృశ్యమిది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రహదారిపై దింపేశారు. అదృష్టవశాత్తు రోడ్డుపై వెళుతున్న వాహనాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ట్రైనీ పైలెట్, శిక్షకుడు ఇద్దరు క్షేమంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment