
మురిసిన నగరం
సత్య ఎన్నికతో హెచ్‌పీఎస్‌లో ఆనందోత్సాహాలు
జూబ్లిహిల్స్, న్యూస్‌లైన్ :
ప్రపంచ వాణిజ్య పటంలో హైదరాబాద్ నగరం మరోసారి మెరిసి మురిసింది. క్లౌడ్ గురు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎన్నికవడంతో తెలుగు‘వాడి’ వేడి... నగర ఖ్యాతి... అంతర్జాతీయంగా మరోసారి చాటిన ట్లైంది. ఈ ఎన్నిక నగరాన్ని ఆనంద సాగరంలో ముంచెత్తింది. సత్య నాదెళ్లే కాదు ఎంతోమంది ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలను తయారుచేసిన ఘనత మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) సొంతం. సత్య అత్యున్నత స్థానానికి ఎన్నికవడంతో హెచ్‌పీఎస్ యాజమాన్యం ఉబ్బితబ్బిబ్బవుతోంది.
నిపుణులెందరో..
బ్లాక్‌బెర్రి ఫోన్ కంపెనీని కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి ఇటీవల అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తున్న ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈవో ప్రేమ్‌వత్సా... లండన్‌లో కోబ్రాబీర్ హోల్డింగ్స్ పేరుతో బడా మద్యం సంస్థను నిర్వహిస్తున్న కరణ్ బిలిమోరియా... మరో టెక్నాలజీ దిగ్గజం అడాబ్ కార్పొరేషన్ సీఈవో శంతను నారాయణ్... ప్రాక్టర్ అండ్ గాంబల్ నార్త్ అమెరికా వైస్ ప్రెసిడెంట్... శైలేష్ జుజెరికర్ తదితరులంతా హెచ్‌పీఎస్‌లో ఓనమాలు దిద్దినవారే. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన హెచ్‌పీఎస్‌లో చదువుకున్న పలువురు విద్యార్థులు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నతస్థాయిల్లో రాణించడం తమకు గర్వకారణమని స్కూల్ పూర్య విద్యార్థి, సత్య సహధ్యాయి, ప్రస్తుతం హెచ్‌పీఎస్ బోర్డు సెక్రటరీగా ఉన్న ఫయాజ్‌ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనాదెళ్లతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. సత్య సాధించిన విజయం పాఠశాలకే కాకుండా ఎందరో యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు. త్యరలో పూర్య విద్యార్థులంతా కలిసి సత్యను ఆహ్వనించి, ఘనంగా సన్మానించాలనుకుంటున్నట్లు తెలిపారు.
చిన్ననాటి స్కూల్‌ను మరిచిపోని సత్య
సత్య హెచ్‌పీఎస్‌లో 1984 బ్యాచ్‌కు చెందినవారు. ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి స్కూల్‌ను ఆయన మరిచిపోలేదు. రెండేళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆయన హెచ్‌పీఎస్‌లో నిర్వహించిన ‘ఐ స్పార్క్ రోబోటిక్స్ షో ’లో విద్యార్థులతో ముచ్చటించారు. రోబోటిక్స్, కంప్యూటర్స్ ప్రాధాన్యతను, భవిష్యత్ తరం టెక్నాలజీల గురించి విద్యార్థులతో చాలాసేపు సంబాషించారు. అనంతరం ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో కలిసిపోయారు. ఆయన తండ్రి యుగంధర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి. గతంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు.