జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ | Tamil Movie Nilavuku En Mel Ennadi Kobam Movie OTT Review in Telugu | Sakshi
Sakshi News home page

OTT: జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ

Published Sun, Apr 6 2025 1:36 AM | Last Updated on Sun, Apr 6 2025 9:59 AM

Tamil Movie Nilavuku En Mel Ennadi Kobam Movie OTT Review in Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రా జెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘నిలవక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబమ్‌’ (Nilavuku En Mel Ennadi Kobam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

సినిమా అనేది 24 కళలతో రూపొందేది. అంటే 24 కళలకు సంబంధించిన కళాకారులు ఓ సినిమా కోసం పని చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మల్టీ టాలెంటెడ్‌ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. 24 కళలలో ఓ మూడు నాలుగు కళలు ఒక్కరే చేసేస్తున్నారు. అలా సినిమాలోని కొన్ని శాఖలను ఒక్కరే చేసి, ఓ సినిమాకి సింగిల్‌ కార్డుతో 80వ దశకంలోనే ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారు శ్రీకారం చూట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్‌ కొనసాగుతోంది.

‘నిలవక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబమ్‌’ అనేది ఓ తమిళ సినిమా. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అన్నది తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌. ప్రముఖ హీరో ధనుష్‌ తాను కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాను రాసిన కథకు తానే నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం కూడా చేశారు. ఇది ఓ రకంగా రిస్క్‌ అనే చెప్పాలి. అయినా ఈ సినిమాని మాత్రం ఈ తరం యంగ్‌ జనరేషన్‌తో పాటు నిన్న, మొన్నటి తరాలకు కూడా నచ్చే విధంగా తీర్చిదిద్దారు ధనుష్‌. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులను కదలనివ్వదు. అంత ప్లెజెంట్‌గా ఉంటుంది.

సినిమా టైటిల్‌ కూడా కొంటెగా పెట్టడంలోనే తెలిసిపోతుందీ సినిమా విషయం. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ ప్రైమ్‌ వీడియోలో లభ్యమవుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ప్రభు ఓ మంచి చెఫ్‌. తన గర్ల్‌ఫ్రెండ్‌ నిలాతో విడిపోయిన తరువాత ప్రభు తల్లిదండ్రులు ప్రీతితో వివాహం నిశ్చయించి,  సంబంధం కుదుర్చుకోవడానికి ప్రీతి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ప్రీతికి నిలా కథ చెబుతాడు. నిలా, ప్రభు ఫ్రెండ్స్‌ ఏర్పాటు చేసిన పార్టీలో కలిసి ప్రేమలో పడతారు.

 ఓ అనుకోని సంఘటన వల్ల నిలాకి దూరమవుతాడు ప్రభు. దాంతో నిలాకి కోపమొచ్చి తండ్రి చూసిన సంబంధానికి తలూపుతుంది. నిలా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని స్నేహితులందరినీ గోవాకి పిలుస్తుంది. నిలా పెళ్లి ఆహ్వానం ప్రభుకి కూడా అందుతుంది.  ప్రభు ఫ్రెండ్స్‌ అందరూ అతన్ని వారించినా నిలా పెళ్లికి వెళతాడు. తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రభుకి అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? తరువాత ప్రీతి పరిస్థితి ఏంటి? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి.

 ఇది చాలా సింపుల్‌ స్టోరీ. స్క్రీన్‌ ప్లే చక్కగా రాసుకున్నారు ధనుష్‌. ఈ సినిమాలోని పాత్రధారులంతా ఫ్రెష్‌గా అనిపించడంతో పాటు ప్రతి పాత్ర ప్రేక్షకులను కనువిందు చేస్తుందనే చెప్పాలి. హ్యాట్సాఫ్‌ టు ధనుష్‌. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌. – హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement