
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం మిస్టర్ హౌస్ కీపింగ్(Mr. Housekeeping) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సౌత్ సినిమాలకు ఓ రకమైన నేటివిటీ ఉంటుంది. ఆ చిత్రాలు భారతదేశంలోని ఏ భాషలో అనువాదమైనా ప్రేక్షకులు మన కథలు అనుకొని ఆదరిస్తారు. చిన్న లైన్ తీసుకుని ఆ లైన్‌కు రసవత్తరమైన స్క్రీన్‌ప్లే జోడించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు సౌత్ దర్శకులు. అందులో తమిళ దర్శకులు కూడా ఉన్నారు. ఆ కోవలోనే తమిళ దర్శకుడైన అరుణ్ రవిచంద్రన్ ఓ రొటీన్ లవ్ స్టోరీలా తలపించే చిన్న లైన్ తీసుకుని, దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కటి మెసేజ్‌ని ఇస్తూ, అద్భుతమైన కామెడీ అనే మసాలాని జోడించి ‘మిస్టర్ హౌస్ కీపింగ్’ అనే మెగా థాళి లాంటి సినిమా భోజనాన్ని ప్రేక్షకుడి ముందు వడ్డించారు.
ఇంకేముందీ... ప్రేక్షకులు లొట్టలేసుకొని మరీ ఆస్వాదిస్తున్నారు ఈ సినిమాని. మరి... అంతలా ఏముంది ఈ సినిమాలో ఓసారి చూద్దాం. హానెస్ట్ రాజ్ కాలేజ్ రోజుల నుంచి ఇసాయ్‌తో ప్రేమలో ఉంటాడు. కానీ ఇసాయ్ మాత్రం రాజ్‌ను ప్రేమించదు... సరి కదా హానెస్ట్ రాజ్ చేసే పనులతో విసిగి వేసారి పోయి ఉంటుంది. హానెస్ట్ రాజ్ మరీ బద్ధకస్తుడు. ఎంతలా అంటే తిన్నాక హోటల్‌లో సర్వ్ చేసినట్లు ఇంట్లో కూడా చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బౌల్‌ని కోరుకుంటాడు. హానెస్ట్ రాజ్ అమ్మకు కొడుకు అంటే బాగా గారాబం. తండ్రి మాత్రం రోజూ రాజ్ మీద చిటపటలాడుతుంటాడు.
ఓ రోజు అనుకోకుండా తన తండ్రి ఫోన్ ద్వారా ఓ బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్‌కి కనెక్ట్ అవుతాడు రాజ్. వాళ్లకి 5000 రూపాయలు ఇవ్వవలసి వస్తే తెలియకుండానే హౌస్ కీపింగ్ టీమ్‌లో చేరతాడు. అనుకోకుండా హానెస్ట్ రాజ్ తాను కాలేజీలో ప్రేమించిన ఇసాయ్ వాళ్లింటికే హౌస్ కీపింగ్‌కి వెళతాడు. ఇసాయ్ ఇల్లు అని రాజ్‌కి తెలిసి నాలుక్కరుచుకుని ఇసాయ్‌ని బ్రతిమలాడి పనికి కుదురుతాడు. ఇసాయ్‌కి తన కొలీగ్ హరీష్ నచ్చి, పెళ్లి కుదుర్చుకుంటుంది.
కానీ ఇసాయ్ ఇంట్లో పని చేస్తున్న రాజ్ మాత్రం ఇసాయ్ తనను ప్రేమిస్తుందని అనుకుంటాడు. మరి... పనివాడిగా వచ్చిన రాజ్... ఇసాయ్ మనసు గెలుచుకుంటాడా? హరీష్‌తో పెళ్లి కుదిరిన ఇసాయ్... రాజ్ ప్రేమను అంగీకరిస్తుందా? అన్నది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘మిస్టర్ హౌస్ కీపింగ్’లో చూడాల్సిందే. నేటి తరం చూడాల్సిన సినిమా ఇది. అలాగే లివింగ్ టు గెదర్ అనే ట్రెండ్‌ను విడమర్చి సినిమా భాషలో అర్థం చెప్పిన దర్శకుడికి హ్యాట్సాఫ్. ఉద్యోగస్తులు తమ తల్లి, తండ్రులతో కలిసి చూసి, చాలా తెలుసుకోవాల్సిన సినిమా ఇది. వాచ్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ.
– హరికృష్ణ ఇంటూరు