
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం అగత్తియా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మనం చూసే సినిమాలలో మనకు తెలియని చరిత్రకు సంబంధించిన రహస్యాలు చాలావరకు తెలుపుతూ ఉంటాయి. అటువంటి రహస్యాలలో మన సంస్కృతికి సంబంధించిన సిద్ధ వైద్యం ఒకటి. కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం అద్భుత ఔషధాల వివరాలను గోప్యంగా పొందుపరిచారు. కోట్ల విలువైన సంపద కంటే ఈ వివరాలు ఎంతో విలువగలవి.
కానీ దురదృష్టవశాత్తు అటువంటి వివరాలు చాలావరకు విదేశీయులు నాశనం చేయడమో, కొల్లగొట్టడమో జరిగింది. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ఆ మహత్ గ్రంథాలను కాపాడిప్రాణత్యాగం చేశారు. ఆ నేపథ్యంలోనే అల్లుకున్న కథ ‘అగత్తియా’. దేవతలకు రాక్షసుల మధ్య పోరాటం అనే టాగ్ లైన్‌తో సినిమా కథాంశం నడుస్తుంది. కథానుగుణంగా సీరియస్‌పాయింట్ అయినా ఈ సినిమా దర్శకుడుపా. విజయ్ తన స్క్రీన్‌ప్లేతో దీనిని హారర్ కామెడీలా తెరకెక్కించారు.

సినిమా మొత్తం సిద్ధ వైద్యం గొప్పతనాన్ని ప్రేక్షకులకు ఓ పక్క చెబుతూనే మరో పక్క కమర్షియల్ కామెడీ హంగులతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో జీవా, రాశీ ఖన్నా నటించారు. మరో ముఖ్యపాత్రలో ప్రముఖ నటుడు అర్జున్ నటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే... అగత్యన్ అనే ఆర్ట్ డైరెక్టర్ ఓ సినిమా కోసం తాను కూడా డబ్బులు పెట్టి ఓ పురాతన బంగ్లాలో షూటింగ్ ఏర్పాటు చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ రద్దవుతుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులు పోతాయనే ఉద్దేశంతో ఆ బంగ్లాని ఓ హారర్ థీమ్‌తో పర్యాటక కేంద్రంగా మారుస్తాడు.
పర్యాటకులను ఆ బంగ్లాలో అనుమతించినప్పటి నుండి బంగ్లాలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అంతేకాదు అగత్యన్ టీమ్‌కి ఓపాత పియానో కూడా దొరుకుతుంది. ఆ మిస్టరీ పియానో అగత్యన్‌కి ఆ బంగ్లా కథ చెబుతుంటుంది. అగత్యన్ తల్లి కేన్సర్‌తో బాధ పడుతుంటుంది. ఆ బంగ్లా వల్ల వాళ్ల అమ్మ కోలుకుంటుంది. అది ఎలానో మీరు సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘అగత్తియా’ చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగు వెర్షన్ ‘అగత్యా’ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఐదేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లాడిపోయింది. అప్పుడు ఇంగ్లిషు మందులతోపాటు మనప్రాచీన వైద్యంతో కూడా చాలా మంది కోలుకున్నారు.
అలానే మన సిద్ధ వైద్యం కూడా. అసలింతలా ఏముంది ఆ సిద్ధ వైద్యంలో అని అనుకుంటే ‘అగత్యా’ సినిమా చూడండి. ఉగాది పండగ రోజు పూజా పునస్కారాలయ్యాక మంచి కాలక్షేపం ఈ సినిమా. – ఇంటూరు హరికృష్ణ