
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం మిసెస్(Mrs) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఈ సమాజంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రతి రోజూ బాధ్యతతో కష్టపడుతున్న వారెవరైనా ఉన్నారు అంటే వారు మన ఇంటి ఆడవారు. 365 రోజులు ఏ సెలవు లేకుండా ఇంట్లో ఉన్న ఆరు నుండి అరవై ఏళ్ల వాళ్ల బాగోగులు ప్రతి నిత్యం అలుపెరగకుండా చూసుకునేవారే ఆడవారు. మరి ఇంతలా కష్టపడుతున్న వారికి కొన్ని బాధలు ఉంటాయి కదా. వాటి గురించి విచారించేదెవరు... ఆ కోణంలో ఆలోచింపజేసేదే ఈ ‘మిసెస్’ చిత్రం.
2021లో విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కి హిందీ రీమేక్‌గా ‘మిసెస్’ రూపొందింది. ఆరతి కడావ్ దీనికి దర్శకురాలు. బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరొందిన సాన్యా మల్హోత్రా(Sanya Malhotra) ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పొషించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కనీసం ఓ క్షణమైనా తమ ఇంటి ఆడవారి కష్టం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచింపజేయడమే లక్ష్యంగా దర్శకురాలు ఈ సినిమాని రూపొందించారు. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం... రీచా ఓ చదువుకున్న ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. మంచి డ్యాన్స్ టీచర్ కూడా.
తనకు సొంతంగా డ్యాన్స్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉంటుంది. ఈ లోపల తల్లిదండ్రులు నిశ్చయించిన సంబంధంతో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా దివాకర్‌తో పెళ్లవుతుంది. దివాకర్ ఓ డాక్టర్. దివాకర్‌ది మరీ ఛాందస భావాలు కలిగిన కుటుంబం. ఇంటికి వచ్చిన కోడలితో ఇంటెడు చాకిరీ చేయించుకోవడమే కాక ఓ బానిస కన్నా చాలా హీనంగా చూస్తుంటారు. ప్రతి రోజూ అలారం పెట్టుకొని లేచి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వండి రాత్రి మళ్లీ నిద్రపొయేంతవరకు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకురాలు. ఇంట్లో కనీసం వాసన కూడా భరించలేని ఓ ప్రదేశాన్ని తాను ఎంత నరకయాతన అనుభవిస్తూ శుభ్రం చేసిందో చూస్తే చూసిన ప్రేక్షకులకు గుండె బరువెక్కుతుంది.
ఇంటి పెద్ద అయిన దివాకర్ తండ్రి బయటకు వెళ్లాలంటే ఆయన చెప్పులు కూడా చేత్తో తీసి, ముందు పెడితే తాపీగా వేసుకుని వెళతాడు. అటువంటి ఘోరమైన భావజాలమున్న ఈ కుటుంబంలోకి వచ్చిన రీచా ఎలా మనగలుగుతుంది? అలాగే తన డ్యాన్స్ డ్రీమ్ నెరవేర్చుకుంటుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలోని కథాంశం సమాజంలో ఉన్న ప్రతి గృహిణిది. ప్రతి రోజూ మీ కోసం కష్టపడుతున్న మీ వారి కోసం ఈ సినిమా చూడండి. ఆమె కష్టమేంటో మీ మనస్సుతో పాటు కళ్లకు కూడా తెలుస్తుంది. వర్త్‌ఫుల్ వాచ్.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment