
కేసీఆర్‌తో సత్య నాదెళ్ల భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) సత్య నాదెళ్ల ఆదివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.
40 నిమిషాలపాటు ముఖ్యమంత్రితో మైక్రోసాఫ్ట్ సీఈవో సమావేశం
నాదెళ్ల కోరిక మేరకు వివరాల్ని గోప్యంగా ఉంచిన సీఎం కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) సత్య నాదెళ్ల ఆదివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. వాస్తవానికి సీఎం కేసీఆర్‌తో సత్య నాదెళ్ల భేటీకి సంబంధించి ముందస్తుగా ఎలాంటి అపాయింట్‌మెంట్ లేదు. కానీ ఆయన ఆదివారమే హైదరాబాద్ రావడం.. సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమవుతానని చెప్పడంతో హడావుడిగా ఈ భేటీ జరిగినట్లు అధికారవర్గాలు వివరించాయి. సత్య నాదెళ్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చేసరికి సీఎం అక్కడ లేరు. ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(నాక్)లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక, ఇంధనశాఖల ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావులతో కొత్త పారిశ్రామిక విధానానికి తుదిరూపు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారు. ఆ సమయంలోనే సత్య నాదెళ్ల నుంచి ముఖ్యమంత్రికి ఫోన్‌రావడం, క లవడానికి వస్తున్నానని, సమయం ఇవ్వాలని కోరడంతో.. సీఎం కేసీఆర్ సరేనని అంగీకరించారు.
సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో సత్య నాదెళ్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం ‘నాక్’ నుంచి క్యాంపు కార్యాలయానికి వచ్చేవరకు ఆయన 15 నిమిషాలు వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సత్య నాదెళ్ల దాదాపు 40 నిమిషాలపాటు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాక్రమాలతోపాటు విస్తరణపై కూడా సీఎంతో చర్చించినట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్ రంగంలో యువతలో నైపుణ్యం కల్పించడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడానికి సత్య నాదెళ్ల సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను విస్తరించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని సత్య నాదెళ్లను సీఎం కేసీఆర్ కోరినట్టుగా సమాచారం. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంపై కసరత్తు జరుగుతోందని వివరించారు. పరిశ్రమల విస్తరణకు, మనుగడకు సానుకూల వాతావరణమే పారిశ్రామిక విధాన లక్ష్యమని తెలిపారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి ఐటీ రంగంలో జరిగిన అభివృద్ధే ప్రధాన కారణమని కేసీఆర్ అభిప్రాయపడినట్టుగా తెలిసింది. తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ రంగ విస్తరణకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి విసృ్తతమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా వివరించినట్టు సమాచారం. ఐటీ రంగంతోపాటు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఫార్మా వంటి కీలక ఉత్పత్తులపైనా దృష్టి పెడుతున్నామన్నారు. వీటికోసం తెలంగాణవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను సత్య నాదెళ్ల ప్రశంసిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రితో తన సమావేశానికి సంబంధించిన అంశానికి అధిక ప్రచారం కల్పించవద్దని ఆయన స్వయంగా కోరినట్లు తెలిసింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటో కానీ, పత్రికా ప్రకటన కానీ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేయలేదు. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సమాచారం వెల్లడించడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
నేడు మైక్రోసాఫ్ట్ సిబ్బందికి దిశానిర్దేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌కు(ఎంఐడీసీ) రానున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ అధికార బృందంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే ఎంఐడీసీ అంతర్గత సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి కీలకోపన్యాసం చేయడంతోపాటు ఉద్యోగులకు భవిష్యత్ దిశానిర్దేశం చేయనున్నారు. మైక్రోసాఫ్ట్‌కు భారత్ ఎంత ప్రాముఖ్యమో ఆయన వివరించనున్నారు. భారతీయులపై టెక్నాలజీ పాత్ర అన్న అంశంపైనా చర్చించనున్నారు. ఉదయం 8.30 నిముషాలకు ఈ సమావేశం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తొలిసారిగా హైదరాబాద్‌కు..
మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భాగ్యనగరికి నాదెళ్ల రావడం ఇదే తొలిసారి. అంతేగాక మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌లో కాలుమోపడం కూడా ఇదే మొదటిసారి. మైక్రోసాఫ్ట్‌కు అమెరికా వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం హైదరాబాద్‌లోనే ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సత్య నాదెళ్ల సోమవారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో తనతో చదువుకున్న విద్యార్థులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది. అలాగే, సెప్టెంబర్ 30న ఢిల్లీలో నాస్కామ్ ఏర్పాటు చేస్తున్న రెండు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా సత్య నాదెళ్ల పాల్గొంటున్నారు. ఒకటి స్టార్టప్‌ల కార్యక్రమం కాగా, మరొకటి డిజిటల్ అంశంపై జరగనుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ‘ఉమెన్ ఇన్ టెక్’ కార్యక్రమానికి సైతం అతిథిగా విచ్చేయనున్నారు. 10 ల క్షల మంది యువతులు, మహిళలకు ఐటీ రంగంలో శిక్షణ ఇవ్వడం ఉమెన్ ఇన్ టెక్ లక్ష్యం.