మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకే..
టీ-హబ్‌కు వచ్చానన్న
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భేటీ
- లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని మీలో నిర్మించుకోండి
- ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆశయాన్ని సడలనివ్వవద్దు
- మీ విజయాల్లో భాగమవుతాం..
- టీ-హబ్‌తో కలసి పనిచేస్తాం
- స్టార్టప్‌లకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తాం
- మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం వైట్‌స్పేస్ టెక్నాలజీ
- దీనిపై స్థానిక పారిశ్రామికవేత్తలకు సహకరిస్తామని వెల్లడి
- మంత్రి కేటీఆర్‌తో కలసి టీ-హబ్‌ను సందర్శించిన సత్య నాదెళ్ల
- స్టార్టప్‌లకు టీ-హబ్ అద్భుత అవకాశం..
- ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని వ్యాఖ్య
- మైక్రోసాఫ్ట్ సహకారంతో పలు కార్యక్రమాలు: కేటీఆర్
- తరగతి గదుల డిజిటైజేషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక (స్టార్టప్) పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌తో కలసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ‘మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకే హైదరాబాద్‌కు వచ్చా, మీ విజయాల్లో భాగ మవుతా’నని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పేర్కొన్నారు. స్టార్టప్‌లను ఆశయమే ముందుకు నడిపిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని సడలనివ్వవద్దని సూచించారు. టీ-హబ్ ఒక అద్భుత అవకాశమని.. ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలను కల్పించడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.
మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. ఇందుకోసం స్థానిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో టీ-హబ్‌ను సత్య నాదెళ్ల సందర్శించారు. మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టీ-హబ్ సీఈవో జే కృష్ణన్, టీ-హబ్ వ్యవస్థాపకుడు కొల్లిపర శ్రీనివాస్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల టీ-హబ్ మొత్తం కలియదిరిగారు. ఇక్కడి వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. టీ-హబ్‌కు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ‘‘స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ టీ-హబ్‌తో కలసి పనిచేస్తుంది. మీ విజయాల్లో భాగమయ్యేందుకు ఇక్కడికి వచ్చాను. అన్నింటికీ మించి మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకు వచ్చాను. స్టార్టప్‌లు మూడు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. మిమ్మల్ని ముందుకు నడిపేది ఆశయమే.. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆశయాన్ని సడలనివ్వవద్దు. మీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని మీలో నిర్మించుకోండి. పట్టుదలతో లక్ష్యం దిశగా వెళ్లే సంస్కృతిని సంస్థలో నెలకొల్పండి. దీనిని సంస్థలో ఎంత సజీవంగా ఉంచుకోగలుగుతారో... వ్యాపారంలో అంత స్థిరత్వాన్ని ప్రతిఫలంగా పొందగలుగుతారు..’’ అని సత్య నాదెళ్ల సూచించారు. పారిశ్రామికవేత్తలకు టీ-హబ్ అద్భుత అవకాశమని కొనియాడారు. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలను కల్పించడం ప్రశంసనీయమన్నారు.
మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ
మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో అవకాశాల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ కెన్యాలో తక్కువ ధరతో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ‘వైట్‌స్పేస్ టెక్నాలజీ’ని వినియోగించింది. దీని గురించి సత్యనాదెళ్ల వివరించారు. మారుమూల/చిట్టచివరి గమ్యంతో అనుసంధానం (కనెక్టివిటీ) కోసం ఈ పరిజ్ఞానం ఎంతో ప్రయోజనకరమని ఆయన చెప్పారు. తన దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో అనుసంధానం ఒకటని పేర్కొన్నారు.
స్థానిక మార్కెట్ అవసరాలకు తగినట్లుగా మారుమూల ప్రాంతాలతో అనుసంధానమయ్యేలా ఈ సేవలను తక్కువ ధరకు అందించగల పారిశ్రామికవేత్తలు మనకు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ‘మన హైదరాబాదీ సత్య నాదెళ్ల...’ అంటూ మంత్రి కేటీఆర్ అక్కడున్న పారిశ్రామికవేత్తలతో పేర్కొనబోతుండగా... సత్య నాదెళ్ల జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘నేను ఇక్కడ పెరిగిన సమయంలో ఏ టీ-హబ్ లేదు.. టీ అక్షరానికి దగ్గరగా ట్యాంక్‌బండ్ మాత్రమే ఉండేది..’’ అని నవ్వుతూ పేర్కొన్నారు.
వైఫల్యాలపైనే విజయాల నిర్మాణం
ఔత్సాహికులతో మాట్లాడిన సందర్భంగా పలు ప్రశ్నలకు సత్య నాదెళ్ల సమాధానాలిచ్చారు. వైఫల్యాలను మీరెలా తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘‘ వైఫల్యం గురించి పట్టించుకోవద్దు. దాని నుంచి నేర్చుకునే పాఠాలే ముఖ్యమైనవి. ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. మళ్లీ ఓటమి పాలు కాకుండా జాగ్రత్తపడాలి. ప్రపంచంలో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారే. నేనూ అలాంటి అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకున్నాను. గత వైఫల్యాల నుంచి నేర్చుకున్నదానిపైనే నా విజయాలు నిర్మితమయ్యాయి..’’ అని పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేస్తాం: కేటీఆర్
సత్య నాదెళ్లతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అద్భుతమైన అనుభవమని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌తో సహకారం విషయంలో వివిధ అంశాల్లో పరిశీలన జరిపామని... వారితో కలసి ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. స్టార్టప్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేయాలని భావిస్తున్నామని... సత్య నాదెళ్ల సైతం ఈ విషయంలో ఆసక్తితో ఉన్నారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ‘వైట్‌స్పేస్ టెక్నాలజీ’పై పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని.. మారుమూల ప్రాంతాలకు ఐటీ సేవల అనుసంధానం సమస్యను దానితో అధిగమించాలని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే మైక్రోసాఫ్ట్ సహకారంతో స్థానిక పారిశ్రామికవేత్తలే ఈ సేవలను అందించాలని సత్య నాదెళ్ల కోరుకుంటున్నారని చెప్పారు. క్లౌడ్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఎన్నో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సుస్థిరంగా నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని కేటీఆర్ చెప్పారు. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాల గదులను డిజిటలైజ్ చేసేందుకు సహకారం అందించాలని మైక్రోసాఫ్ట్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, నాస్కాం చైర్మన్ బీవీ మోహన్‌రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ సీఈవో జీవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.