సత్య నాదెళ్లకు రూ. 505 కోట్ల ప్యాకేజీ
సీఈవో అయ్యాక 10 రెట్లు జంప్
న్యూయార్క్: మహిళా ఉద్యోగుల జీతాల విషయంలో వ్యాఖ్యలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ ఏడాది దాదాపు రూ. 505 కోట్ల (84.3 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీ ఆర్జించారు. దీంతో టెక్నాలజీ రంగంలో అత్యధిక జీతభత్యాలు అందుకుంటున్న వారిలో ఒకరిగా నిల్చారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి మైక్రోసాఫ్ట్ సమర్పించిన వివరాల ప్రకారం 2013 ఆర్థిక సంవత్సరంలో ఆయన 7.66 మిలియన్ డాలర్లు. కొత్తగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి సీఈవోగా ప్రమోట్ అయ్యాక ఇది ఏకంగా పది రెట్లు పైగా ఎగిసింది.
తాజాగా ఆయన 9,18,917 డాలర్ల జీతం, 3.6 మిలియన్ డాలర్ల బోనస్‌ను ఆర్జించారు. అలాగే కీలక సమయంలో కంపెనీలోనే కొనసాగుతూ సీఈవోగా ప్రమోట్ అయిన నేపథ్యంలో 79.77 మిలియన్ డాల ర్లు విలువ చేసే స్టాక్స్ ఆర్జించారు. దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఇందులో 59.2 మిలియన్ డాలర్ల స్టాక్స్ లభిస్తాయి. అయితే, 2019లోగా మాత్రం నాదెళ్ల వీటిని అందుకునే వీలు ఉండదు. జీతాల పెంపు విషయంలో మహిళా ఉద్యోగులు కంపెనీ వ్యవస్థను విశ్వసించి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలని నాదెళ్ల వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలి సిందే. అయితే, తన అభిప్రాయాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోయానంటూ ఆయన పలుమార్లు క్షమాపణ కోరారు. ఎవ్వరైనా సరే కెరియర్‌లో లింగవివక్షకు గురై ఉంటే కచ్చితంగా ఎదిరించాల్సిందేనన్నారు.