డిజిటల్ ఇండియాకు తోడ్పాటు
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
ప్రధాని మోదీతో భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటునందిస్తామని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భద్రత, ఆధునీకీకరణ తదితర అంశాల గురించి చర్చించారు.
ప్రధాని, ఇతర మంత్రులతో గౌరవపూర్వకంగా భేటీ అయినట్లు నాదెళ్ల వివరించారు. భారత వృద్ధికి తోడ్పడటంలో భాగంగా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు తాము కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత నాదెళ్ల భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. భారత్‌లో మరింతగా పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ ఆసక్తిగా ఉన్నట్లు జైట్లీకి ఆయన చెప్పారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, డిజిటల్ ఇండియా కార్యక్రమం, ఈ-కామర్స్‌లో అవకాశాల గురించి నాదెళ్లకు రవిశంకర్ ప్రసాద్ వివరించారు. భారత్‌లో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి మంత్రి వివరించారు.