సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ అంటూ వినిపించిన అభివృద్ధి నినాదాలు ప్రజలను ఎంతగా ఆకర్షించాయో దేశంలోని వంద నగరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన ‘స్మార్ట్ సిటీ’లుగా మారుస్తానన్న హామీ కూడా అంతకంటే ఎక్కువే ఆకర్షించింది. మరి మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా ఆయన స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానన్న నగరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ట్విటర్ పారడీ అకౌంట్ ‘ఎట్‌ద రేట్ ఆఫ్ హిస్టరీపిక్ ’ మంగళవారం నాడు ట్విటర్ యూజర్ల అభిప్రాయాన్ని కోరగా, దాదాపు రెండువేల మంది తమదైన శైలిలో ట్వీట్లు చేశారు. ఎక్కువ మంది ఫొటోలు, చిత్రాలతో స్పందించారు.
కొందరు సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్ తరహాలో భారత నగరాలు అభివృద్ధి చెందినట్లు ఆర్కిటెక్చర్ డిజైన్లను పంపించగా, మరొకరు బుల్లెట్ రైలు ఇదిగో అంటూ లారీపైకి రైలు డబ్బా ఎక్కించిన ఫొటోషాప్ ఇమేజ్‌ని పంపించారు. భారత్ సిలికాన్ సిటీగా పేరుపడ్డ బెంగళూరు నగరం పకోడాపూర్‌గా మారిందని సూచిస్తూ ఇంకొకరు గ్రాఫిక్ డిజైన్‌ను పంపించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఇలా మారిందంటూ మరొకరు డిస్నీఐలాండ్ ఇంపోజ్డ్ చిత్రాన్ని పంపించారు. నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్‌గా అభివర్ణిస్తూ ఒంటెకు రెందు రాకెట్ బూస్టర్లను అమర్చుకొని, దానిపై రాకెట్‌లా దూసుకుపోతున్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేశారు.
ఇక నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం అమెరికాలోని వైట్‌హౌజ్‌గా మారిందంటూ వైట్‌హౌజ్ భవనం ఫొటేనే పొస్ట్ చేశారు. వర్షాలకు కొట్టుకుపోయే భారతీయ రోడ్లను చూసి కోపం వచ్చిందేమో నీళ్లతో గుంతలు పడిన రోడ్డులో రవాణా ట్రక్కు కూరుకుపోయిన ద్యశ్యం ఫొటోను పంపించారు. ప్రయాణికులకు 24 గంటలపాటు తాగునీరు అందిస్తూ, ట్రక్కులకు ప్రత్యేక పార్కింగ్ వసతి కల్పిస్తున్న మధ్యప్రదేశ్‌లోని స్మార్ట్ సిటీ అంటూ ఒకరు పోస్టింగ్ పంపించారు. గోవాలోని పాంజిం నగరంలో అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటూ జలమయమైన ఓ రహదారి ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు. ట్విటర్‌లో అందరు వ్యంగ్యంగానే స్పందించారు. అందరి బాధ ఒకటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క నగరాన్నైనా సంపూర్ణ స్మార్ట్ సిటీగా మార్చలేకపోయిందన్నదే!
Comments
Please login to add a commentAdd a comment