
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!
జీతాలు పెంచమని అడగక్కర్లేదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి
మహిళా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో ఉద్బోధ
విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణ
న్యూయార్క్: మహిళా ఉద్యోగుల వేతనాల అంశంపై సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వివాదంలో చిక్కుకున్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలని, జీతం పెరగాల్సి ఉంటే పెరుగుతుంది కానీ ప్రత్యేకంగా అడగక్కర్లేదంటూ ఆయన చేసిన ఉద్బోధ.. శుక్రవారం పెను దుమారం రేపింది. తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో నాదెళ్ల చివరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. గ్రేస్ హాపర్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ కంప్యూటింగ్ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి దారితీశాయి.
జీతం పెంచమని అడగడానికి ఇబ్బందిపడే మహిళా ఉద్యోగులకు ఎలాంటి సలహా ఇస్తారు అంటూ ఇంటర్వ్యూ చేసిన మైక్రోసాఫ్ట్ డెరైక్టర్ మరియా క్లావీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నిజం చెప్పాలంటే జీతం పెంచాలని అడిగే మహిళలకన్నా అడగని వారి దగ్గరే మరింత ఎక్కువగా అస్త్రశస్త్రాలు, శక్తి ఉన్నట్లు లెక్క. ఇలాంటివన్నీ సుకర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉన్నవి. మనం చేసిన దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. కాబట్టి జీతం పెంచాలని అడగడం కాదు.. వ్యవస్థ గురించి తెలుసుకోవాలి, దాన్ని గట్టిగా నమ్మాలి. అప్పుడే ముందుకెళుతున్న కొద్దీ సముచిత స్థాయిలో జీతాలు పెరుగుతాయి’ అంటూ నాదెళ్ల చెప్పారు.
అయితే, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో ఫేస్‌బుక్, ట్విటర్, లింక్డ్‌ఇన్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, బ్లాగ్‌లలో నాదెళ్ల కామెంట్ల మీద విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఎక్స్‌బాక్స్‌లైవ్ ధర తగ్గేదాకా కూడా నేనూ కర్మ సిద్ధాంతాన్నే నమ్ముకుని కొనకుండా నిరీక్షిస్తాను’ అంటూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు, నాదెళ్ల వ్యాఖ్యలతో విభేదించిన మరియాకు ప్రశంసలు లభించాయి.
సారీ.. సరిగ్గా చెప్పలేకపోయాను ..
తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నాదెళ్ల తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయంలో తాను ఇచ్చిన సమాధానం పూర్తిగా తప్పని.. అసలు మహిళలు, పురుషులకు సమాన స్థాయిలో జీతాలు ఉండాన్నది తన అభిప్రాయమన్నారు. దీనిపై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ట్విటర్‌లో ట్వీట్ చేయడంతో పాటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు లేఖ రాశారు. ‘వేతనం పెంచాలని అడిగేందుకు ఇబ్బందిపడే మహిళా ఉద్యోగులకు మీరిచ్చే సలహా ఏమిటని ఇంటర్వ్యూ చివర్లో మరియా అడిగారు.
దీనికి నేనిచ్చిన సమాధానం పూర్తిగా తప్పు. నా అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాను. ఈ రంగంలో జీతాల పెంపునకు సంబంధించి మహిళా, పురుషుల మధ్య వివక్షకు తావులేకుండా చూడాల్సిందే’ అంటూ నాదెళ్ల ట్వీట్ చేశారు. అలాగే తమ సంస్థ సిబ్బందికి పంపిన ఈమెయిల్ మెమోకి లింకునూ అందులో పొందుపర్చారు. ఈ విషయంపై మరియా ఇచ్చిన సలహా సరైనదేనని, వేతన పెంపునకు అర్హులమని భావించిన పక్షంలో కచ్చితంగా అడగాలని నాదెళ్ల పేర్కొన్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవో బాధ్యతలను చేపట్టడం తెలిసిందే.
సత్యపై పుస్తకం..
మరోవైపు, మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి దాకా నాదెళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక పుస్తకం విడుదలైంది. నాదెళ్ల: ది చేంజింగ్ ఫేస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పేరిట జగ్‌మోహన్ ఎస్ భవర్ దీన్ని రచించగా, హాచెట్ ఇండియా ప్రచురించింది. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం నుంచి మైక్రోసాఫ్ట్ దాకా నాదెళ్ల ప్రస్థానం, ఆయన కుటుంబ వివరాలు, సాధించిన విజయాలు మొదలైన వాటిని రచయిత ఇందులో పొందుపర్చారు. అలాగే, కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే ఆధారపడుతున్న మైక్రోసాఫ్ట్ భవిష్యత్‌లో మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృష్టి సారించేలా నాదెళ్ల ఏ విధంగా ప్రయత్నించవచ్చు అన్నది భవర్ ఈ పుస్తకంలో చర్చించారు.