భారత్‌లో సత్య నాదెళ్ల ముద్ర.. | India's energy, optimism impresses Microsoft CEO Satya Nadella | Sakshi
Sakshi News home page

భారత్‌లో సత్య నాదెళ్ల ముద్ర..

Published Thu, Oct 2 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

భారత్‌లో సత్య నాదెళ్ల ముద్ర..

భారత్‌లో సత్య నాదెళ్ల ముద్ర..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సత్య నాదెళ్ల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు సీఈవో. అంతటి ప్రాముఖ్యమున్న సంస్థకు కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన భారత్‌లో అడుగుపెట్టి సుడిగాలిలా దేశాన్ని చుట్టేశారు. భారతీయుల ఆలోచనల్ని మరోసారి మైక్రోసాఫ్ట్‌వైపు తీసుకెళ్లారు.

 మైక్రోసాఫ్ట్ సీఈవోగా అత్యున్నత పదవి చేపట్టిన తెలుగు వాడిగా రికార్డు నమోదు చేసిన నాదెళ్ల హైదరాబాద్ పర్యటన మాత్రం ఆసాంతం గోప్యంగా సాగడం విశేషం. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయినా, అటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్ని మైమరిపించినా, మరోవైపు స్నేహితుల్ని పలకరించినా మీడియా కంటికి మాత్రం చిక్కలేదు. ఢిల్లీ వేదికగా వేలాదిమంది విద్యార్థులతో ముచ్చటించి తన అనుభవాలను పంచుకున్నారు. నిత్య విద్యార్థులుగా ఉండాలంటూ ఉద్బోధించారు. చరిత్రలో ఎన్నడూ లేనటువం టి అవకాశాలు మీ ముందు ఉన్నాయంటూ దిశానిర్దేశం చేశారు. ముంబైలో మరో కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆది గోద్రెజ్, చందా కొచ్చర్ వంటి 150 మందికిపైగా పరిశ్రమ పెద్దలను ఆకట్టుకున్నారు.
 
 ఊహించని అతిథి..
 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో నాస్కామ్ రెండు సదస్సులతోపాటు మైక్రోసాఫ్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే సత్య నాదెళ్ల భారత్ వచ్చారు. రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. సత్య  తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ వచ్చిన నాదెళ్ల, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. అరగంట పాటు చర్చలు సాగాయి.  ఇదంతా రహస్యంగా జరిగి పోయింది. నాదెళ్ల విన్నపం మేరకే ఈ గోప్యత అని అధికారులు చెబుతున్నారు. నాదెళ్ల పర్యటన గురించి అధికారులకుగానీ, అటు సీఎంకుగానీ సమాచారం లేదు. ఊహించని అతిథి అయ్యారు.

 ఆంధ్రప్రదేశ్ సీఎంతో..
 సత్య నాదెళ్ల కేసీఆర్‌ను కలవడంతో ఆంధ్రప్రదేశ్ సీఎంతోనూ సమావేశమవుతారని అందరూ అనుకున్నారు. ఐటీ కంపెనీల సీఈవోల సమావేశం కోసం చంద్రబాబు విశాఖపట్నంలో ఉన్నారు. దీంతో ఇరువురి భేటీ సాధ్యపడలేదు. చంద్రబాబుతో సత్య ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం వైజాగ్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా బాబు కోరినట్టు సమాచారం.

 ఉద్యోగుల్లో ఉత్సాహం..
 హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఎంఐడీసీ)లో సెప్టెంబర్ 29న సీఈవో హోదాలో తొలిసారిగా నాదెళ్ల అడుగుపెట్టారు. క్లౌడ్ టెక్నాలజీపై ఫోకస్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉద్బోధించారు. ప్రభుత్వాలతో కలసి పనిచేయబోతున్నామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ప్రతిభ, వనరులు, పట్టుదల మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల వద్ద సమృద్ధిగా ఉన్నాయని, ఇది నిరూపితమైందంటూ ఇష్టాగోష్టిలో భుజం తట్టారు. సరదాగా నవ్వుతూ, లక్ష్యాలను గుర్తు చేస్తూ ఉత్సాహం నింపారు. ఇక్కడి సెంటర్‌ను, కంపెనీ కార్యకలాపాల విస్తరణను చేపడుతున్నామని తెలిపారు.

 భారత ప్రాజెక్టులపై..: 2019 నాటికి 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం, 2.5 లక్షల పాఠశాలలు, యూనివర్సిటీల్లో వైఫై, నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో వైఫై హాట్‌స్పాట్స్, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్లు 4 లక్షలు, ఐటీ రంగంలో ఉద్యోగాలకై గ్రామీణులకు శిక్షణ వంటివి డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం చేపడుతోంది. ప్రస్తుత పథకాలకు రూ.1 లక్ష కోట్లు, కొత్త పథకాలకు రూ.13 వేల కోట్లు వ్యయం చేస్తోంది.

ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈవో భారత పర్యటన ఆసక్తి కలగిస్తోంది. భారత్‌తో కలసి పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని ఇప్పటికే ఆయన ప్రకటించారు కూడా.

 రాష్ట్ర ప్రభుత్వాలకూ..
 తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేసే పనిలో నిమగ్నమైంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దుతోంది. ఇక స్మార్ట్‌సిటీస్ ప్రాజెక్టు అమలులో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకం. అయితే మైక్రోసాఫ్ట్‌తో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చొరవ గురించి నాదెళ్ల ఆసక్తిగా తెలుసుకున్నారు.

మైక్రోసాఫ్ట్ సాంకేతిక సహకారం అందిస్తుందని సీఎంకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం సైతం కంపెనీ విస్తరణకు వెన్నంటి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది. వీటి సరసన మైక్రోసాఫ్ట్ సైతం చేరనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement