Indian CEOs
-
ఏడాదికి రూ.84.16 కోట్లు.. ఇండియాలో అధిక వేతనం తీసుకునే సీఈఓ
2023-24 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ సీ విజయకుమార్ అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు. ఈయన మొత్తం జీతం సుమారు 10.06 మిలియన్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 84.16 కోట్లు. ఈ విషయాన్ని కంపెనీ నివేదికలో వెల్లడించింది. దీంతో ఈయన ఈ ఏడాది భారతీయ ఐటీ కంపెనీల సీఈఓలలో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు.హెచ్‌సీఎల్ టెక్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 ప్రకారం.. విజయకుమార్ వేతనం గత ఏడాది కంటే 190.75 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈయన మొత్తం ప్యాకేజీలో 16.39 కోట్లు (1.96 మిలియన్ డాలర్లు) బేసిక్ శాలరీ కాగా.. పర్ఫామెన్స్ లింక్డ్ బోనస్ 1.14 మిలియన్ డాలర్లు లేదా రూ. 9.53 కోట్లు, లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ రూ. 2.36 మిలియన్ డాలర్లు (రూ. 19.74 కోట్లు). ఇతరత్రా ప్రయోజనాల కింద కూడా భారీ మొత్తంలోనే లభిస్తుంది. విజయకుమార్ వేతనం.. కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగుల జీతం కంటే 707.6 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.ఇతర కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 66 కోట్లు, విప్రో సీఈఓ శ్రీని పల్లియా రూ. 50 కోట్లు, టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దేశంలోని దిగ్గజ కంపెనీలలో పని చేసే సీఈఓలలో ఎక్కువ వేతనం తీసుకునే వ్యక్తిగా విజయకుమార్ నిలిచారు. -
ఖరీదైన వస్తువులు పోతున్నాయ్.. ఆందోళనలో భారతీయ సీఈఓలు
యూకే షాడో ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ, భారతీయ వ్యాపారవేత్తల మధ్య జరిగిన సమావేశంలో.. లండన్‌లో రోలెక్స్ వాచ్ దొంగతనాల అంశాన్ని ప్రస్తావించారు. సమావేశాలకు లేదా వ్యాపార అవసరాల నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు తమవెంట ఖరీదైన వస్తువులు కూడా తీసుకెళ్తారు. అలాంటి వస్తువులు దొంగతనానికి గురైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో వెల్లడించారు. లగ్జరీ వాచ్‌లు, మొబైల్స్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగులు సైతం దొంగలిస్తున్నారని పలు కంపెనీల సీఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు. 2022తో పోలిస్తే.. గతేడాది దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. 2023లో దొంగతనాలు ఏకంగా 27 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2022లో 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేల కేసులు నమోదైనట్లు మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. గత ఐదేళ్లలో లండన్‌లో దాదాపు 29,000 వాచీ దొంగతనాలు జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది జాతీయ ఎన్నికలకు ముందు బ్రిటన్‌లో పెరుగుతున్న నేరాలు ఇప్పుడు రాజకీయ సమస్యగా మారాయి. ఇదీ చదవండి: 'వీసా లేకుండా ఎంట్రీ' - ఇరాన్ నాలుగు షరతులు ఇవే.. లండన్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రత లేకపోతే మేము ఎందుకు రావాలని సీఈఓలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి, బ్రిటన్ ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించాలని వ్యాపారవేత్తలు వెల్లడించారు. ఈ దొంగతనాలను తగ్గించడానికి లండన్ పోలీసులు అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించి తగ్గించడానికి పూనుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు. -
గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు.. దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్ సారథ్యంలోనే!
టెక్నాలజీలో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతున్నాయి. భారత్ కూడా ఏ మాత్రం వెనుకడుగేయకుండా ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటోంది. భారతీయులు కూడా జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ అనేక దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. 2015లో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఎంపిక కావడంతో దాదాపు 25 పెద్ద సంస్థలు భారతీయ సంతతికి చెందిన వారి నేతృత్వంలోకి చేరాయి. ఇది గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకు చాలా కంపెనీలు భారతీయ సీఈఓల నిర్వహణలోనే ఉన్నాయి. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓగా వసంత్ నరసింహన్, మైక్రోచిప్ టెక్నాలజీ సీఈఓగా గణేష్ మూర్తి, ఐబీఎమ్ సీఈఓగా అరవింద్ కృష్ణన్, నెట్ యాప్ సీఈఓగా జార్జ్ కురియన్, మార్నింగ్ స్టార్ సీఈఓగా కునాల్ కపూర్, మైక్రా టెక్నాలజీ సీఈఓగా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు నిర్వహిస్తూ భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. THE COMPLETE INDIAN TAKEOVER. With Neal Mohan becoming the CEO of YouTube, these are the 25 big firms led by Indian Americans with a total market value of 5 trillion dollars, more than the current Indian GDP. A very proud moment for all Indians.🇮🇳 pic.twitter.com/BPmKsQ6Wus — Aviator Anil Chopra (@Chopsyturvey) November 16, 2023 -
మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు
Karthik Rao Named CEO of Nielsen అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్‌కు సీఈవోగా కార్తీక్ రావు నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. మరోవైపు 2018 నుంచి సీఈవోగా ఉన్న డేవిడ్ కెన్నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఇదీ చదవండి: బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్ కార్తీక్ రావు సుదీర్ఘకాలంగా నీల్సన్‌లోని వివిధ విభాగాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నైలనోని లయోలా యూనివర్సిటీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివిన కార్తీక్ రావు, అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు. నీల్సన్ ప్రపంచవ్యాప్తంగా 55 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. (ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్’! టాప్-5 లిస్ట్ ఇదే!) -
కార్పొరేట్ రంగంలో సాహో భారత్! గ్లోబల్ కంపెనీలను ఏలుతోంది మనోళ్లే..
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. అడోబ్.. ఐబీఎం.. నోవార్టిస్.. డెలాయిట్.. స్టార్‌బక్స్.. బాటా.. యూట్యూబ్.. గోడాడీ.. మైక్రాన్.. ఫెడ్ఎక్స్.. డీబీఎస్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది లిస్ట్! ఇంతకీ ఏంటీ లిస్ట్ అంటారా? వీటన్నింటిలోనూ కామన్ విషయం ఒకటుంది. అదేనండీ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో దుమ్మురేపుతున్న ఈ గ్లోబల్ కంపెనీలన్నింటినీ ఏలుతున్నది మనోళ్లే! మనదేశంలో పుట్టి.. సప్తసముద్రాలను దాటి కార్పొరేట్ రారాజులుగా తమ సత్తా ఏంటో చాటిచెబుతున్నారు భారతీయులు. టెక్నాలజీ.. ఫార్మా.. ఫ్యాషన్.. బ్యాంకింగ్.. రిటైల్.. తయారీ.. ఐటీ.. ఏ రంగంలోనైనా మనోళ్లు సరైనోళ్లు అనిపించుకుంటున్నారు. అందుకే ప్రపంచం ఇప్పుడు భారత్ లీడర్స్ వెంటపడుతోంది. ఫార్చూన్-500 టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీల డ్రైవింగ్ సీట్లో ఉన్నది భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే!! అంటే మన కరెన్సీలో 492 లక్షల కోట్ల రూపాయలన్న మాట! మనదేశ ఎకానమీ (జీడీపీ) దాదాపు 3.2 లక్షలకోట్లడాలర్లతో పోలిస్తే రెట్టింపు విలువ వీటి సొంతం. ఇతర రంగాల్లోనూ భారత సారథులు దూసుకుపోతున్నారు. అమెరికా వైస్‌ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఐఎంఎఫ్ డిప్యుటీ ఎండీ గీతా గోపీనాథ్‌తో పాటు తాజాగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్ బంగా దీనికి నిదర్శనం. అసలు కార్పొరేట్ ప్రపంచమంతా సారథ్యం కోసం భారత్ వైపు ఎందుకు చూస్తోంది? మనోళ్లకున్న ప్రత్యేకతేంటి? ఈ కథేంటో చూద్దాం రండి మరి!! అమెరికా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా. ఎందుకంటే అక్కడున్న అనేక టెక్నాలజీ, ఐటీ కంపెనీల్లో మన ఇంజినీర్లు లక్షల సంఖ్యలో (దాదాపు మూడో వంతు) పని చేస్తుండటమే కాదు.. ఏకంగా చాలా దిగ్గజ కంపెనీల్లో టాప్ పొజిషన్లను చేరుకుని భారత్ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేస్తున్నారు. శంతను నారాయణ్ దాదాపు 15 ఏళ్లుగా అడోబ్ సీఈఓ స్థానంలో పాతుకుపోయారు. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అనేక కంపెనీలు భారత సంతతికి చెందిన వారి వెంటపడి మరీ సారథ్యాన్ని అప్పగిస్తుండటం వారి ప్రతిభాపాటవాలను చాటిచెబుతోంది. 2004లో గూగుల్‌లో చేరిన సుందర్ పిచాయ్ దాదాపు పదేళ్లలోనే కంపెనీ టాప్ పొజిషన్‌కు చేరుకోవడం దీనికి నిదర్శనం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ డ్రైవ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ వంటి ప్రాజెక్టుల సక్సెస్‌కు సుందర్ పిచాయ్ దూరదృష్టి అపారమైన నైపుణ్యాలే కారణం. అంతేకాదు, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే గూగుల్ షేర్ ధర ఏకంగా 76 శాతం ఎగబాకడం విశేషం. ఆయన హయాంలోనే ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) తొలిసారిగా 2020 జనవరిలో ట్రిలియన్ (లక్షకోట్ల) డాలర్ల మైలురాయిని చేరుకోగా, 2021 నవంబర్‌లో 2 ట్రిలియన్ డాలర్లను సైతం తాకింది. ఇక మన తెలుగు తేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ను పోటీదారులకు అందనంత ఎత్తులో నిలబెట్టి ప్రపంచ కార్పొరేట్లలో తన రూటే సెపరేటు అని చూపించారు. ఎందుకంటే 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల.. 2019లో కంపెనీని తొలిసారి ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించేలా చేశారు. అజూర్‌క్లౌడ్ బిజినెస్‌తో భవిష్యత్తు దిశగా కంపెనీని నడిపించడమే కాదు.. 2021లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ దూసుకెళ్లేలా చేసిన ఘనత నాదెళ్లదే. తన హయాంలో 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు కనకవర్షం కురిపిస్తున్నాయి. వీటిలో లింక్డ్ఇన్, మోజాంగ్ (మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్), న్యూయన్స్, గిట్ హబ్ వంటివి ఉన్నాయి. గత సీఈఓ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ బామర్ 14 ఏళ్ల సారథ్యంలో కంపెనీ షేరు 32 శాతం పడిపోగా, ఆయన కొనుగోలు చేసిన అక్వాంటివ్, నోకియా మొబైల్ బిజినెస్ వంటివి కంపెనీకి నష్టాలు మిగల్చడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా, టాప్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న ఐబీఎం సారథిగా కూడా భారత్‌కు చెందిన అరవింద్ కృష్ణను నియమించడం విశేషం. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన నీల్మోహన్ కూడా ఈ జాబితాలో చేరారు. లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ.. ఫార్చూన్-500 ప్రపంచ టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీలకు భారత సంతతికి చెందిన వారే సీఈఓలు. మనోళ్లు సారథ్యం వహిస్తున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల మార్కెట్ విలువ ఏకంగా 6 లక్షలకోట్ల (ట్రిలియన్) డాలర్లకు పైగానే ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే ఈ విలువ దాదాపు రూ. 492 లక్షలకోట్లు. మన దేశ ప్రస్తుత జీడీపీ (స్థూలదేశీయోత్పత్తి) విలువ దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్లు కాగా, అంతర్జాతీయంగా భారతీయ గ్లోబల్ సీఈఓల నేతృత్వంలోని కంపెనీల మార్కెట్ విలువ దీనికి రెట్టింపు కావడం విశేషం. అంతేకాదు మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాల జీడీపీ (3.1 ట్రిలియన్ డాలర్లు)తో లెక్కగట్టినా ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు డబుల్ అన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోని ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ మొత్తం మార్కెట్ విలువలో 13 శాతం వాటా భారతీయ సీఈఓల నిర్వహణలో ఉన్న కంపెనీలదే. మనోళ్ల సత్తా అది మరి! ఇక ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాలదీ అదిరిపోయే రేంజే. నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 2022లో 202 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర లాభం 72 బిలియన్ డాలర్లు (రూ. 5 లక్షల కోట్లు). సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తున్న ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) గతేడాది 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 60 బిలియన్ డాలర్ల నికరలాభాన్ని సంపాదించింది. ఇక మిగతా 60 కంపెనీల ఏడాది లాభాలను కూడా లెక్కేస్తే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీని మించి పోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు 4 మాత్రమే ఉండగా (యాపిల్, సౌదీ ఆరామ్కో, మైక్రోసాఫ్ట్, గూగుల్) వీటిలో రెండింటి పగ్గాలు మనోళ్ల చేతిలోనే ఉన్నాయి. ఇక టాప్-100 ప్రపంచ కంపెనీల్లో మన రిలయన్స్ ఇండస్ట్రీస్ (మార్కెట్ విలువ 196 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 47), టీసీఎస్ (149 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 74), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (126 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 96) మాత్రమే ఉన్నాయి. ఏ రంగమైనా సై.. ఇందు గలరందు లేరని సందేహము వలదు, ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు అన్న చందాన.. మనోళ్లుఅన్ని రంగాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. టెక్నాలజీలో చేయి తిరిగిన భారతీయులు ఇతర రంగాలకు చెందిన అనేక గ్లోబల్ దిగ్గజాల సీఈఓలుగానూ దూసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫార్మా అగ్రగామి నోవార్టిస్. అమ్మకాలపరంగా ఫైజర్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా నిలుస్తున్న ఈ కంపెనీకి సారథిగా ఉన్నది కూడా భారత్‌కు చెందిన వసంత్ నరసింహన్. ఇక ప్రపంచంలోనే నంబర్‌వన్ కాఫీ రిటైల్ బ్రాండ్‌గా నిలుస్తున్న స్టార్‌బక్స్ ఘుమఘుమలు దశదిశలా వ్యాపించేలా చేస్తున్నది లక్ష్మణ్ నరసింహన్. గతంలో ఆయన బ్రిటిష్ కన్జూమర్ గూడ్స్ దిగ్గజం రెకిట్ బెన్కిసర్ సీఈఓగా కూడా పనిచేశారు. ప్రపంచ స్కాచ్ విస్కీ రారాజుగా వెలుగొందుతున్న బ్రిటిష్ కంపెనీ డియాజియో పగ్గాలు సైతం మన ఇవాన్మెనెజెస్ చేతిలోనే ఉన్నాయి. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 5 స్కాచ్ విస్కీ బాటిల్స్‌లో ఒకటి డియాజియోకు చెందిన ‘జానీవాకర్’ బ్రాండ్‌దే కావడం విశేషం. గ్లోబల్ మల్టీనేషనల్ కెమికల్ కంపెనీ.. లిండే సీఈఓగా గత ఏడాది సంజీవ్ లాంబా బాధ్యతలు చేపట్టారు. ఆదాయం, మార్కెట్ వాటా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్యాస్ కంపెనీగా వెలుగొందుతోంది. గ్లోబల్ కన్సల్టింగ్ వ్యాపార రంగంలో వరుసగా ఐదో ఏడాది కూడా నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్న డెలాయిట్‌ను నడిపిస్తోంది భారతీయ సంతతికి చెందిన పునీత్ రంజన్. బిగ్ అంతర్జాతీయ అకౌంటింగ్ కంపెనీల్లో సైతం డెలాయిట్దే పైచేయి. ఇక మరో గ్లోబల్ ఫార్మాదిగ్గజం వెర్టెక్స్ సీఈఓ రేష్మా కేవలరమణి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీగా నిలుస్తున్న ఫెడెక్స్ చీఫ్ రాజ్ సుబ్రమణ్యం, మల్టీనేషనల్ ఇంజినీరింగ్ దిగ్గజం ఎమర్సన్ ఎలక్ట్రిక్ కంపెనీ చీఫ్ సురేంద్రలాల్ కర్సన్ భాయ్, గ్లోబల్ టాప్-10 ఇన్సూరెన్స్ కంపెనీల్లోఒకటైన ప్రుడెన్షియల్ సారథి అనిల్ వాధ్వానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ దిగ్గజం అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింగపూర్ బ్యాంకింగ్ అగ్రగామి డీబీఎస్ గ్రూప్‌సీ ఈఓ పియూష్ గుప్తా, బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంక్ బార్క్లేస్ గ్రూప్ సీఈఓ సీఎస్ వెంకట కృష్ణన్, ప్రపంచ ఫుట్‌వేర్ దిగ్గజం బాటా కార్పొరేషన్ సీఈఓ సందీప్ కటారియా, డొమైన్ నేమ్ సర్వీసుల రంగంలో ప్రపంచ నంబర్ వన్ గోడాడీ సీఈఓ అమన్ భూటానీ సైతం తమ ప్రతిభాపాటవాలతో భారతీయ లీడర్స్‌గా అవతరించారు. ఇక బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానెల్’ను నడిపిస్తున్నది భారతీయ సంతితికి చెందిన లీనా నాయర్ కావడం మరో విశేషం. ప్రపంచ టాప్-5 లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో లూయీ విటోన్ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ‘చానెల్’ మూడో ర్యాంకును చేజిక్కించుకుందంటే అదంతా నాయర్ ఘనతే! ఇలా ఒకటేంటి కార్పొరేట్ ప్రపంచంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీలు ఇప్పుడు తమకు భారతీయ లీడర్లే కావాలంటూ వెంట పడుతున్నారు!! మాజీ గ్లోబల్ సీఈఓలు పెప్సీకో ఇంద్రానూయీ, వొడాఫోన్ అరుణ్ శరీన్, నోకియా రాజీవ్ సూరి, సన్ మైక్రోసిస్టమ్స్ వినోద్ ఖోస్లా, హార్మన్ ఇంటర్నేషనల్ దినేష్ పలివాల్, సిటీ బ్యాంక్ విక్రమ్ పండిట్, ట్విటర్ పరాగ్ అగర్వాల్ కూడా ఈ కోవకు చెందినవారే. మన మూలాలే బలం.. భారతీయులు గ్లోబల్ కంపెనీల్లో లీడర్‌షిష్ స్థానాలకు చేరుకోవడానికి కారణం మన మూలాలే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన విద్యా వ్యవస్థ. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారిలో చాలామంది దాదాపు భారత్‌లోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవడం.. ముఖ్యంగా ఐఐటీలు, ఇతర అత్యున్నత కాలేజీల్లో ఇంజినీరింగ్ చేయడం గమనార్హం. మనకున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేసి, అమెరికా, యూరప్ తదితర దేశాల్లో మరింత ఉన్నత చదువులు చదవడం కూడా వారి ఎంపికకు దోహదం చేస్తోంది. అంటే ప్రాథమికస్థాయిలో వారికి బలమైన నాయకత్వ పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లిష్ భాషపై మనోళ్లకున్న పట్టు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోందని సింగపూర్ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ గ్రూప్ సీఈఓ పియూష్ గుప్తా విశ్లేషించారు. చాలా వరకు మధ్యతరగతి బ్యాగ్రౌండ్ నుంచి రావడం కూడా సాధించాలన్న పట్టుదలకు ప్రధాన కారణమనేది ఆయన అభిప్రాయం. చొచ్చుకుపోయే తత్వం, ఎలాంటి సవాళ్లనైనా అధిగమించ గల ఆత్మవిశ్వాసం, నిర్వహణ సామర్థ్యం, పరిస్థితులకు అనువుగా మారగల నైజం, కుటుంబ విలువలు, తోటివారికి చేయూతనందించడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్నిరంగాల్లోనూ అగ్రస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాయని అంటున్నారు ఫైర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స. భారతీయులు సహజంగానే పొదుపరులు. కంపెనీ చీఫ్లుగా అనవసర వ్యయాలను తగ్గించి, లాభాలను పెంచడంలో తమకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు. ఇది కూడా వారికి సారథ్యాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు, మన ఆర్థికవ్యవస్థ పురోగతి సైతం భారతీయుల నాయకత్వానికి దన్నుగా నిలుస్తోంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3.2 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న జీడీపీ 2028 కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు, 2036 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు, 2045 నాటికి 20 ట్రిలియన్ డాలర్లను అధిగమించనుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదికలో అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తూ నవకల్పనలకు పెద్దపీట వేస్తుండటం కూడా ఎంట్రప్రెన్యూర్స్, నాయకత్వలక్షణాలకు దోహదం చేస్తోందనేది పరిశ్రమ నిపుణుల మాట. దేశంలో యూనికార్న్‌లుగా (బిలియన్ డాలర్ల విలువను అధిగమించినవి) ఆవిర్భవించిన స్టార్టప్స్ సంఖ్య ఇప్పటికే 100కు చేరింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్‌లో కూడా 25 శాతం సంస్థల సారథ్యం భారతీయుల చేతిలోనే ఉండటం భవిష్యత్తులో మనోళ్ల జోరుకు అద్దం పడుతోంది. దక్షిణాది దూకుడు.. తెలుగు వెలుగులు! అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న మెజారిటీ భారత సంతతి సీఈఓలు దక్షిణ భారతావనికి చెందిన వారే కావడం మరో విశేషం. సందర్ పిచాయ్, వసంత్ నరసింహన్, లక్ష్మణ్ నరసింహన్, రాజేష్ సుబ్రమణ్యం, రంగరాజన్ రఘురామ్, గణేష్ మూర్తి, రవి కుమార్, సీఎస్ వెంకట కృష్ణన్ ఇంకా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ, కేవియం సీఈఓ సయ్యద్ అష్రాఫ్ అలీ, కెనడా ఆటోమొబైల్ కాంపొనెంట్ దిగ్గజం మ్యాగ్నా కార్పొరేషన్ సీఈఓ సీతారామ (స్వామి) కోటగిరి వీళ్లంతా తెలుగు రాష్ట్రాల్లో జన్మించారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్‌పాల్ సింగ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) పూర్వ విద్యార్థులు. కెనడా ఆర్థిక సేవల దిగ్గజం ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స సైతం హెచ్‌పీఎస్‌లోనే హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు. ఏడాదికి రూ. 2,300 కోట్లు! ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే! 2022లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీలు అందుకున్న టాప్-10 సీఈఓల్లో సుందర్ కూడా ఒకరు. ఆయన ఏకంగా 28 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 2,300 కోట్లు. ఏంటీ ఈ సొమ్ముతో ఏకంగా ఒక కంపెనీయే పెట్టేయొచ్చు అనుకుంటున్నారా.. అట్లుంటది మరి మన సుందర్తోని! అంతేకాదు ప్రస్తుతం సుందర్ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లడాలర్ల (రూ.12,300 కోట్లు) పైనే అని అంచనా. ఒక మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సుందర్ పిచాయ్ తన కలలను సాకారం చేసుకున్న తీరు, ఆయన లైఫ్ జర్నీ భారతీయ యువతకు నిజంగా గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. చిన్నప్పుడు తామంతా హాల్లో ఒకే చోట కిందే పడుకునేవారిమని.. మొదటిసారి ఇంట్లోకి ఫ్రిజ్ వచ్చినప్పుడు కలిగిన ఆనందం ఇంకా తన కళ్లముందే కదలాడుతోందంటూ పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో నెమరువేసుకున్న తీపిగుర్తులు ఆయన ఏ స్థాయి నుంచి టెక్నాలజీ ఎవరెస్ట్‌ను అధిరోహించారనేందుకు చిన్న ఉదాహరణ మాత్రమే! మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లదీ దాదాపు ఇలాంటి సక్సెస్ జర్నీయే. ఆయన 2022లో అందుకున్న మొత్తం ప్యాకేజీ 5.5 కోట్లడాలర్లు (రూ. 451 కోట్లు). నాదెళ్ల నెట్‌వర్త్ సుమారు 81 కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)గా అంచనా. ఐబీఎం చీఫ్ అరవింద్ కృష్ణ, పాలో ఆట్లో సీఈఓ నికేష్ అరోరా, స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ ఇలా భారత సంతతికి చెందిన గ్లోబల్ సీఈఓలు అందరూ ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల స్థాయిలో వార్షిక వేతన ప్యాకేజీలను అందుకుంటుండటం వారి ప్రతిభకు దక్కుతున్న ప్రతిఫలానికి నిదర్శనం. అపూర్వసహోదరులు.. ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవి సైతం భారతీయుడినే వరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవలే నామినేట్ చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయుడిగా బంగా రికార్డ్ సృష్టించారు. మాస్టర్‌కార్డ్ సీఈఓగా 12 ఏళ్ల పాటు పని చేసిన అజయ్ బంగా కోవిడ్ సమయంలో కూడా కంపెనీలో ఉద్యోగాల కోత అనేది లేకుండా చూశారు. 50 కోట్లమంది డిజిటల్ ఎకానమీలో భాగస్వామ్యం అయ్యేలా తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బంగా పీఈ సంస్థ జనరల్ అట్లాంటిక్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. అంతేకాదు, అజయ్ సోదరుడు ఎంఎస్ బంగా సైతం ప్రపంచ ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్లో టాప్ పొజిషన్లలో పని చేశారు. అంతక్రితం ఆయన హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓగా ఉన్నారు. అంతేకాదు, నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్, కాఫీ కింగ్ స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ కూడా స్వయానా అన్నదమ్ములే. మరో సోదరుల జంట కూడా గ్లోబల్ సీఈఓలుగా ‘మా ఆట సూడు నాటు.. నాటు.. నాటు’ అంటూ దుమ్ము రేపుతున్నారు. హైబ్రీడ్ క్లౌడ్ డేటా సర్వీసుల గ్లోబల్ కంపెనీ నెట్‌యాప్ సీఈఓ జార్జ్ కురియన్, గూగుల్‌క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇద్దరూ ఒకే రంగంలోని రెండు దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్నారు. ఈ అపూర్వసహోదరులు... ప్రపంచ కార్పొరేట్రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటూ భారత్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు. -శివరామకృష్ణ మిర్తిపాటి -
మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి: ట్రంప్
న్యూఢిల్లీ: తమ దేశంలో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ భారత కంపెనీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసే దిశగా నియంత్రణలను మరింతగా సడలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ దిగ్గజ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తదితర దిగ్గజాలు దీనికి హాజరయ్యారు. తమ వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడుల గురించి ట్రంప్‌నకు వారు వివరించారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. అపూర్వ విజయాలు సాధించిన మీకు అభినందనలు. మీరు అమెరికా రావాలని, బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మేం పెట్టుబడులను నిధులపరంగా కాకుండా ఉద్యోగాల కల్పన దృష్టితో చూస్తాం‘ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చట్టాలపరంగానూ, ప్రభుత్వపరంగానూ ఉన్న నియంత్రణలపరమైన సమస్యల అంశాన్ని ఈ సందర్భంగా కొందరు వ్యాపారవేత్తలు ప్రస్తావించారు. ‘చాలా నియంత్రణలను ఎత్తివేయబోతున్నాం. పెను మార్పులను మీరు త్వరలోనే చూడబోతున్నారు. ఇకనుంచి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది‘ అని ట్రంప్ సమాధానమిచ్చారు.(సీఎన్ఎన్ X ట్రంప్) ఇక్కడ మేము.. అక్కడ మీరు.. అమెరికా, భారతీయ కంపెనీలు ఇరు దేశాల్లోనూ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు తోడ్పాటు మాత్రమే అందించగలవని, ప్రైవేట్ రంగమే వాస్తవానికి ఉద్యోగాలు కల్పించగలుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తాను కలిసి పనిచేస్తున్నామని ట్రంప్ చెప్పారు. ‘మీ ద్వారా మేము ఈ దేశంలో, ఆయన మా దేశంలో ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ట్రంప్.. మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు. సీఈవోల సమావేశంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘మోదీ చాలా మంచి వ్యక్తి అని ఎవరో చెప్పారు. ఆయన నిజంగా మంచి వ్యక్తే. అంతే కాదు చాలా స్థిరంగానూ వ్యవహరిస్తారు. ఆయన గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు‘ అని ట్రంప్ కితాబిచ్చారు.(నమస్తే ట్రంప్ అదిరింది... ) మళ్లీ నేనే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తానే గెలుపొందుతానం టూ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో మార్కె ట్లు భారీగా లాభపడతాయన్నారు. ఆర్థిక వ్యవస్థ, సైన్యం, వైద్యం తదితర రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందని ట్రంప్ చెప్పా రు. తన సారథ్యంలో అమెరికా ఎకానమీ.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వృద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ఒప్పందానికి చేరువలో: గోయెల్ భారత్ అమెరికాలు కీలక వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నట్లు మంగళవారం వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలిపారు. ‘యూఎస్–ఇండియా ఫోరమ్: పార్ట్నర్స్ ఫర్ గ్రోత్’ అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో గోయెల్ మాట్లాడారు. పరస్పర భారీ వాణిజ్య ప్రయోజనాలు ఈ ఒప్పందం వల్ల ఒనగూరుతాయని అన్నారు. 2020 నాటికి కేంద్రం లక్ష్యాలను ఆయన ఈ సందర్భంగా వివరిస్తూ, ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు, 24 గంటలూ విద్యుత్, వంట గ్యాస్, ఇంటర్నెట్ విస్తృతి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. అమెరికా నుంచి చమురు దిగుమతులు పదింతలు నిత్యం 2,50,000 బ్యారెళ్ల చమురు దిగుమతి భారత్‌కు అమెరికా నుంచి చమురు సరఫరాలు రెండేళ్లలో పది రెట్లు పెరిగి.. రోజుకు 2,50,000 బ్యారెళ్ల స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఇంధన బంధం బలోపేతాన్ని ఇది తెలియజేస్తోంది. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన వ్యాపార భేటీలో అమెరికా ఇంధన శాఖ మంత్రి డాన్ బ్రోలెట్ మాట్లాడుతూ.. భారత్ 2017లో అమెరికా నుంచి నిత్యం 25,000 బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. గత రెండేళ్లలో ఇది 25,000 బ్యారెళ్ల నుంచి నిత్యం 2,50,000 బ్యారెళ్ల దిగుమతి స్థాయికి చేరుకుంది. ఇది ఇంకా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం’’ అని బ్రోలెట్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇంధన వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందంటూ ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డాన్బ్రోలెట్ను అభినందించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో అమెరికా 5.4 మిలియన్ టన్నుల చమురును భారత్‌కు ఎగుమతి చేసింది. భారత్‌కు అమెరికా ఆరో అతిపెద్ద చమురు వనరుగా అవతరించినట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో జరిగిన భారత్–అమెరికా వ్యాపార కార్యక్రమంలో భాగంగా తెలిపారు. అలాగే, అమెరికాకు భారత్ ఇప్పుడు 4వ అతిపెద్ద చమురు ఎగుమతి మార్కెట్‌గా మారినట్టు ఆయన వివరించారు.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) -
భారత సీఈవోలకు సత్య నాదెళ్ల సలహా
సాక్షి,ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల సోమవారం భారత్ చేరుకున్నారు. రానున్న డిజిటల్ యుగంల దూసుకుపోయేందుకు దేశంలోని వ్యాపారవేత్తలు తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతిలో మిళితమై ఉన్న ఈ సామర్ధ్యాలను భారత సీఈవోలు అలవర్చుకోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ చిన్న పెద్ద అన్ని రంగాల్లోనూ కీలక పాత్రపోషించనుందని, ఈ నేపథ్యంలో భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు 72 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ పరిశ్రమకు వెలువల ఉన్నాయని నాదెళ్ల తెలిపారు. సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను క్లౌడ్‌కు మార్చడం, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రతపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. వచ్చే దశాబ్దంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి టెక్నాలజీలో తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను నిర్మించుకోవాలని నాదెళ్ల కంపెనీలను కోరారు. ఇది మరింత సమగ్ర వృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ముంబైలో ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య శిక్షణలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దేశంలోని యువతకు అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని, అలాగే త్వరగా నేర్చుకునే తత్వం వారి సొంతమని, అయితే దానిపై వారికి శిక్షణ అవసరమని ఆయన అన్నారు. 2020 నాటికి ఎగైల్ టెక్నాలజీలను పూర్తిగా స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ డెవలపర్లలో 59 శాతం మంది ప్రస్తుతం ఎగైల్‌పైనే పనిచేస్తున్నారని టీసీఎస్ సీఎండీ తెలిపారు. (చదవండి : ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా భారత్ - అంబానీ) భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశముందని రిలయన్స్ అధినేత ముకేశ అంబానీ పేర్కొన్నారు. జియో ఆవిష్కారం అనంతరం భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు. తద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సీఈవోతో రిలయన్స్ అధినేత -
భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసేందుకు సిద్ధంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్‌ను కలవనున్న ప్రముఖుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏ.ఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. -
రేపటి నుంచి దావోస్ సదస్సు
దావోస్: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్దేవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, ఎన్ చంద్రశేఖరన్, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్, నందన్ నీలేకని, అజయ్ పిరమల్ సహా 100కు పైగా భారత సీఈవోలు మంగళవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తదితర దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆదాయ అసమానతలు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ వైపరీత్యాల విషయంలో దేశాల భిన్న ధోరణులు తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. వ్యాపారాలు తమ వాటాదారులకే కాకుండా, సామాజిక ప్రయోజనాల కోసం కూడా పనిచేయాలన్న విధానాన్ని 1973 నాటి దావోస్ మేనిఫెస్టో పేర్కొనగా, దీని ప్రగతిపై ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రానున్న దశాబ్దంలో లక్ష కోట్ల మొక్కలను నాటాలని, నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం 100 కోట్ల మందికి అవసరమైన నైపుణ్యాలు కల్పించాలన్నది సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సదస్సులో మానసిక ఆరోగ్యంపై నటి దీపిక పదుకునే ప్రసంగం ఇవ్వనున్నారు. సద్గురు ప్రాణాయామ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జీరో ఎమిషన్స్ లక్ష్యానికి కట్టుబడాలి... 2050 లేదా అంతకుముందుగానే కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు(జీరో కార్బన్ ఎమిషన్స్) సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్‌ష్వాబ్ కోరారు. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలను ఆచరణలో పెట్టాలని కోరుతూ సభ్య దేశాలను ఓ లేఖ రూపంలో ఆయన కోరారు. కాగా, ప్రకృతిపై వ్యాపార ధోరణి పెరిగిపోతున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రకృతిపై పెట్టుబడులు 44 ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని, ప్రపంచ జీడీపీలో ఇది సగానికి సమానమని వార్షిక సదస్సుకు ముందుగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూటీఎఫ్ తెలిపింది. చైనా, ఈయూ, అమెరికాలు ప్రకృతిపై ఎక్కువ పెట్టుబడులను కలిగిన దేశాలుగా ప్రస్తావించింది. -
టాప్ 10 గ్లోబల్ సీఈఓల్లో మనోళ్లు..
న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన ఈ ఏడాది టాప్–100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా ఉండడం విశేషం. కాగా.. తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో నిలిచారు. తొలి పది స్థానాల్లో ముగ్గురు భారత సంతతి వారు ఉండగా.. పూర్తి జాబితాలో డీబీఎస్ బ్యాంక్ పియూష్ గుప్తా 89వ స్థానంలో నిలిచి మొత్తం భారత సంతతి సంఖ్యను నాలుగుకు పెంచారు. 62వ స్థానంలో టిమ్‌కుక్ గ్లోబల్ టాప్ 100 జాబితాలో నైక్ సీఈఓ మార్క్ పార్కర్ (20), జేపీ మోర్గాన్ చీఫ్ జామీ డిమోన్ (23), లాక్‌హీడ్ మార్టిన్ సీఈఓ మారిలిన్ హ్యూసన్ (37), డిస్నీ సీఈఓ రాబర్ట్ (55), ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (66), సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ (96) ర్యాంకుల్లో ఉన్నారు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్రస్థానంలో నిలిచారు. -
సీఈవోలుగా ఇండియన్స్.. చైనా ఆందోళన
హై-టెక్ ప్రొడక్ట్‌లను తయారుచేయడంలో చైనా ముందంజలో ఉంది. కానీ ఆ ప్రొడక్ట్‌లను తయారుచేస్తున్న దిగ్గజ కంపెనీలను నడపడంలో మాత్రం వారు వెనుకంజే అట. సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు సీఈవోలుగా భారతీయులను ఎందుకు నియమించుకుంటున్నాయి? దాన్ని నుంచి చైనా ఏం నేర్చుకోవాలి? అని ప్రస్తావిస్తూ ఆ దేశపు అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్‌లో టెక్ దిగ్గజాలు భారతీయులకే ఎందుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయో హైలెట్ చేసింది. కార్పొరేట్ కంపెనీలను పైకి ఎగిసేలా చేయడానికి భారతీయులకు సరియైన నైపుణ్యాలు ఉన్నాయని, ఆ విషయంలో సిలికాన్ వ్యాలీలోని చైనా నిపుణులు వెనుకబడి ఉన్నారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో భారత్ కంటే కూడా చైనా అత్యధిక స్థానంలోనే ఉన్నా.. ప్రపంచ దిగ్గజ కంపెనీలను నడిపించడంలో మాత్రం వెనుకబడే ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో చాలా మంది భారతీయ అమెరికన్లు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారని, ప్రస్తుతం సిలీకాన్ రాజ్యమేలేది భారతీయులేని తెలిపింది. ప్రస్తుతం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల ఉన్నారు. కేవలం దిగ్గజ బహుళ జాతీయ కంపెనీలకు మాత్రమే కాక, ఇతర కంపెనీలకు కూడా భారతీయులే సారథ్యం వహిస్తున్నారని పేర్కొంది. శాన్డిస్క్‌కు సంజయ్ మెహ్రోత్రా, పెప్సికోకు ఇంద్రానూయీ వంటి వారి కూడా దశాబ్ద కాలంగా కంపెనీలను విజయవంతమైన బాటలో నడిపిస్తున్నట్టు తెలిపింది. వారికి భిన్నంగా చైనీస్ మాత్రం సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో టాప్ స్థానాల్లో ఎవరూ లేరని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి గల కారణాలను కూడా గ్లోబల్ టైమ్స్ వివరించింది. భారతీయులు ఎక్కడికి వెళ్లినా... త్వరగా అక్కడి వాతావరణాన్ని అలవరుచుకుంటారని ఐడీసీ చైనా గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ చెరిస్ డాంగ్ తెలిపారు. చైనా ప్రజలు మాత్రం తిరిగి స్వదేశానికి వచ్చేస్తారని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో ఇంగ్లీష్ భాషను అనర్గళంగా మాట్లాడగలగడం, వెంటనే అర్థం చేసుకోగలగడం వచ్చి ఉండాలి. కానీ చైనీస్ మాత్రం ఈ భాష సమస్యను తట్టుకోలేక తిరిగి స్వదేశ బాట పడుతున్నారని వివరించారు. అమెరికా హై-టెక్ సంస్థల్లోని భారతీయ సంతతి సీఈవోలు మాస్టర్స్ డిగ్రీని కానీ సైన్స్‌లోని పీహెచ్డీ డిగ్రీని కానీ కలిగి ఉంటున్నారని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు ఎంబీఏ డిగ్రీలు చాలా సామాన్యమైన విద్యా అర్హతలుగా మారాయని తెలిపారు. ఇలా మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ భారతీయులకు ఎక్కువగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక విదేశీ కంపెనీలు ఎక్కువగా భారత్‌లో అవుట్సోర్సింగ్ సెంటర్లను, రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని డాంగ్ చెప్పారు. దాంతో భారతీయులు ఎక్కువగా లబ్దిపొందుతున్నారని, వారు టాప్ స్థానాల్లో నిలిచేందుకు అవి దోహదం చేస్తున్నాయని డాంగ్ అన్నారు. -
భారత్‌లో సత్య నాదెళ్ల ముద్ర..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సత్య నాదెళ్ల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు సీఈవో. అంతటి ప్రాముఖ్యమున్న సంస్థకు కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన భారత్‌లో అడుగుపెట్టి సుడిగాలిలా దేశాన్ని చుట్టేశారు. భారతీయుల ఆలోచనల్ని మరోసారి మైక్రోసాఫ్ట్వైపు తీసుకెళ్లారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా అత్యున్నత పదవి చేపట్టిన తెలుగు వాడిగా రికార్డు నమోదు చేసిన నాదెళ్ల హైదరాబాద్ పర్యటన మాత్రం ఆసాంతం గోప్యంగా సాగడం విశేషం. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయినా, అటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్ని మైమరిపించినా, మరోవైపు స్నేహితుల్ని పలకరించినా మీడియా కంటికి మాత్రం చిక్కలేదు. ఢిల్లీ వేదికగా వేలాదిమంది విద్యార్థులతో ముచ్చటించి తన అనుభవాలను పంచుకున్నారు. నిత్య విద్యార్థులుగా ఉండాలంటూ ఉద్బోధించారు. చరిత్రలో ఎన్నడూ లేనటువం టి అవకాశాలు మీ ముందు ఉన్నాయంటూ దిశానిర్దేశం చేశారు. ముంబైలో మరో కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆది గోద్రెజ్, చందా కొచ్చర్ వంటి 150 మందికిపైగా పరిశ్రమ పెద్దలను ఆకట్టుకున్నారు. ఊహించని అతిథి.. సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో నాస్కామ్ రెండు సదస్సులతోపాటు మైక్రోసాఫ్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే సత్య నాదెళ్ల భారత్ వచ్చారు. రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. సత్య తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ వచ్చిన నాదెళ్ల, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. అరగంట పాటు చర్చలు సాగాయి. ఇదంతా రహస్యంగా జరిగి పోయింది. నాదెళ్ల విన్నపం మేరకే ఈ గోప్యత అని అధికారులు చెబుతున్నారు. నాదెళ్ల పర్యటన గురించి అధికారులకుగానీ, అటు సీఎంకుగానీ సమాచారం లేదు. ఊహించని అతిథి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంతో.. సత్య నాదెళ్ల కేసీఆర్‌ను కలవడంతో ఆంధ్రప్రదేశ్ సీఎంతోనూ సమావేశమవుతారని అందరూ అనుకున్నారు. ఐటీ కంపెనీల సీఈవోల సమావేశం కోసం చంద్రబాబు విశాఖపట్నంలో ఉన్నారు. దీంతో ఇరువురి భేటీ సాధ్యపడలేదు. చంద్రబాబుతో సత్య ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం వైజాగ్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా బాబు కోరినట్టు సమాచారం. ఉద్యోగుల్లో ఉత్సాహం.. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఎంఐడీసీ)లో సెప్టెంబర్ 29న సీఈవో హోదాలో తొలిసారిగా నాదెళ్ల అడుగుపెట్టారు. క్లౌడ్ టెక్నాలజీపై ఫోకస్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉద్బోధించారు. ప్రభుత్వాలతో కలసి పనిచేయబోతున్నామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ప్రతిభ, వనరులు, పట్టుదల మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల వద్ద సమృద్ధిగా ఉన్నాయని, ఇది నిరూపితమైందంటూ ఇష్టాగోష్టిలో భుజం తట్టారు. సరదాగా నవ్వుతూ, లక్ష్యాలను గుర్తు చేస్తూ ఉత్సాహం నింపారు. ఇక్కడి సెంటర్‌ను, కంపెనీ కార్యకలాపాల విస్తరణను చేపడుతున్నామని తెలిపారు. భారత ప్రాజెక్టులపై..: 2019 నాటికి 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం, 2.5 లక్షల పాఠశాలలు, యూనివర్సిటీల్లో వైఫై, నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో వైఫై హాట్‌స్పాట్స్, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్లు 4 లక్షలు, ఐటీ రంగంలో ఉద్యోగాలకై గ్రామీణులకు శిక్షణ వంటివి డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం చేపడుతోంది. ప్రస్తుత పథకాలకు రూ.1 లక్ష కోట్లు, కొత్త పథకాలకు రూ.13 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈవో భారత పర్యటన ఆసక్తి కలగిస్తోంది. భారత్‌తో కలసి పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని ఇప్పటికే ఆయన ప్రకటించారు కూడా. రాష్ట్ర ప్రభుత్వాలకూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేసే పనిలో నిమగ్నమైంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దుతోంది. ఇక స్మార్ట్‌సిటీస్ ప్రాజెక్టు అమలులో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకం. అయితే మైక్రోసాఫ్ట్‌తో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చొరవ గురించి నాదెళ్ల ఆసక్తిగా తెలుసుకున్నారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సహకారం అందిస్తుందని సీఎంకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం సైతం కంపెనీ విస్తరణకు వెన్నంటి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది. వీటి సరసన మైక్రోసాఫ్ట్ సైతం చేరనుంది.