సీఈవోలుగా ఇండియన్స్‌.. చైనా ఆందోళన | Google, Microsoft Led By India Born CEOs, So China Govt Is Worried | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 4:47 PM | Last Updated on Thu, Jun 21 2018 9:53 PM

Google, Microsoft Led By India Born CEOs, So China Govt Is Worried - Sakshi

హై-టెక్‌ ప్రొడక్ట్‌లను తయారుచేయడంలో చైనా ముందంజలో ఉంది‌. కానీ ఆ ప్రొడక్ట్‌లను తయారుచేస్తున్న దిగ్గజ కంపెనీలను నడపడంలో మాత్రం వారు వెనుకంజే అట. సిలికాన్‌ వ్యాలీలోని టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లు సీఈవోలుగా భారతీయులను ఎందుకు నియమించుకుంటున్నాయి? దాన్ని నుంచి చైనా ఏం నేర్చుకోవాలి? అని ప్రస్తావిస్తూ ఆ దేశపు అధికారిక వార్తా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్‌లో టెక్‌ దిగ్గజాలు భారతీయులకే ఎందుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయో హైలెట్‌ చేసింది. కార్పొరేట్‌ కంపెనీలను పైకి ఎగిసేలా చేయడానికి భారతీయులకు సరియైన నైపుణ్యాలు ఉన్నాయని, ఆ విషయంలో సిలికాన్‌ వ్యాలీలోని చైనా నిపుణులు వెనుకబడి ఉన్నారని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కంటే కూడా చైనా అత్యధిక స్థానంలోనే ఉన్నా.. ప్రపంచ దిగ్గజ కంపెనీలను నడిపించడంలో మాత్రం వెనుకబడే ఉందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. 

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీల్లో చాలా మంది భారతీయ అమెరికన్లు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారని, ప్రస్తుతం సిలీకాన్‌ రాజ్యమేలేది భారతీయులేని తెలిపింది. ప్రస్తుతం గూగుల్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల ఉన్నారు. కేవలం దిగ్గజ బహుళ జాతీయ కంపెనీలకు మాత్రమే కాక, ఇతర కంపెనీలకు కూడా భారతీయులే సారథ్యం వహిస్తున్నారని పేర్కొంది. శాన్డిస్క్‌కు సంజయ్ మెహ్రోత్రా, పెప్సికోకు ఇంద్రానూయీ వంటి వారి కూడా దశాబ్ద కాలంగా కంపెనీలను విజయవంతమైన బాటలో నడిపిస్తున్నట్టు తెలిపింది. వారికి భిన్నంగా చైనీస్‌ మాత్రం సిలికాన్‌ వ్యాలీ కంపెనీల్లో టాప్‌ స్థానాల్లో ఎవరూ లేరని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి గల కారణాలను కూడా గ్లోబల్‌ టైమ్స్‌ వివరించింది. 

భారతీయులు ఎక్కడికి వెళ్లినా... త్వరగా అక్కడి వాతావరణాన్ని అలవరుచుకుంటారని ఐడీసీ చైనా గ్లోబల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ చెరిస్‌ డాంగ్‌ తెలిపారు. చైనా ప్రజలు మాత్రం తిరిగి స్వదేశానికి వచ్చేస్తారని  పేర్కొన్నారు. సిలికాన్‌ వ్యాలీ కంపెనీల్లో ఇంగ్లీష్‌ భాషను అనర్గళంగా మాట్లాడగలగడం, వెంటనే అర్థం చేసుకోగలగడం వచ్చి ఉండాలి. కానీ చైనీస్‌ మాత్రం ఈ భాష సమస్యను తట్టుకోలేక తిరిగి స్వదేశ బాట పడుతున్నారని వివరించారు. అమెరికా హై-టెక్‌ సంస్థల్లోని భారతీయ సంతతి సీఈవోలు మాస్టర్స్‌ డిగ్రీని కానీ సైన్స్‌లోని పీహెచ్‌డీ డిగ్రీని కానీ కలిగి ఉంటున్నారని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు ఎంబీఏ డిగ్రీలు చాలా సామాన్యమైన విద్యా అర్హతలుగా మారాయని తెలిపారు. ఇలా మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ భారతీయులకు ఎక్కువగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక విదేశీ కంపెనీలు ఎక్కువగా భారత్‌లో అవుట్‌సోర్సింగ్‌ సెంటర్లను, రీసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని డాంగ్‌ చెప్పారు. దాంతో భారతీయులు ఎక్కువగా లబ్దిపొందుతున్నారని, వారు టాప్‌ స్థానాల్లో నిలిచేందుకు అవి దోహదం చేస్తున్నాయని డాంగ్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement