రేపటి నుంచి దావోస్‌ సదస్సు | World Economic Forum Annual Meeting Davos 2020 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి దావోస్‌ సదస్సు

Published Mon, Jan 20 2020 3:07 AM | Last Updated on Mon, Jan 20 2020 3:07 AM

World Economic Forum Annual Meeting Davos 2020 - Sakshi

దావోస్‌: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్‌దేవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్‌ బజాజ్, సంజీవ్‌ బజాజ్, ఎన్‌ చంద్రశేఖరన్, ఆనంద్‌ మహీంద్రా, సునీల్‌ మిట్టల్, నందన్‌ నీలేకని, అజయ్‌ పిరమల్‌ సహా 100కు పైగా భారత సీఈవోలు మంగళవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, బ్రిటన్‌ ప్రిన్స్‌ చార్లెస్, జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ తదితర దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు.

ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆదాయ అసమానతలు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ వైపరీత్యాల విషయంలో దేశాల భిన్న ధోరణులు తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. వ్యాపారాలు తమ వాటాదారులకే కాకుండా, సామాజిక ప్రయోజనాల కోసం కూడా పనిచేయాలన్న విధానాన్ని 1973 నాటి దావోస్‌ మేనిఫెస్టో పేర్కొనగా, దీని ప్రగతిపై ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రానున్న దశాబ్దంలో లక్ష కోట్ల మొక్కలను నాటాలని, నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం 100 కోట్ల మందికి అవసరమైన నైపుణ్యాలు కల్పించాలన్నది సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సదస్సులో మానసిక ఆరోగ్యంపై నటి దీపిక పదుకునే ప్రసంగం ఇవ్వనున్నారు. సద్గురు ప్రాణాయామ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  

జీరో ఎమిషన్స్‌ లక్ష్యానికి కట్టుబడాలి...
2050 లేదా అంతకుముందుగానే కార్బన్‌ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు(జీరో కార్బన్‌ ఎమిషన్స్‌) సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాస్‌ష్వాబ్‌ కోరారు. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలను ఆచరణలో పెట్టాలని కోరుతూ సభ్య దేశాలను ఓ లేఖ రూపంలో ఆయన కోరారు. కాగా, ప్రకృతిపై వ్యాపార ధోరణి పెరిగిపోతున్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది. ప్రకృతిపై పెట్టుబడులు 44 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటాయని, ప్రపంచ జీడీపీలో ఇది సగానికి సమానమని వార్షిక సదస్సుకు ముందుగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూటీఎఫ్‌ తెలిపింది. చైనా, ఈయూ, అమెరికాలు ప్రకృతిపై ఎక్కువ పెట్టుబడులను కలిగిన దేశాలుగా ప్రస్తావించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement