Prince Charles
-
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్ చార్లెస్: వీడియో వైరల్
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ లండన్‌కి 30 కి.మీ దూరంలో లూటన్ అనే పట్టణంలో కొత్తగా నిర్మించిన గురుద్వారాను సందర్శించారు. అక్కడ పూజలు చేసి భక్తులతో మమేకమయ్యారు. ఈ మేరకు గురద్వారాకు విచ్చేసిన ప్రిన్స్ చార్లెస్‌కు వివిధ మతాలకు చెందిన పిల్లలు సిక్కు జెండాలతో స్వాగతం పలికారు. అక్కడ పిండివంటలు తయారు చేసే పాకశాలను, అక్కడ పనిచేసే వాలంటీర్లను కలిశారు. వారానికి ఏడు రోజులు, ఏడాదిలో 365 రోజులు గురుద్వారా శాఖాహారంతో కూడిని వేడి వేడి భోజనాన్ని అందిస్తుంది. కోవిడ్ మహమ్మారీ సమయంలో వారు చేసిన సేవలను కూడా ఎంతగానే కొనియాడారు. ఈ గురద్వార్లో కోవిడ్ వ్యాక్సిన్ క్లినిక్‌ని నడుపుతోంది. అలాగే వ్యాక్సిన్‌కి సంబంధించి అపోహలను పోగొట్టేలా గురుద్వార్ ఇతర ప్రార్థన స్థలాలకు సహాయ సహకారాలను అందించి ప్రోత్సహించింది. At the newly built Guru Nanak Gurdwara, His Majesty met volunteers who run the Luton Sikh Soup Kitchen Stand. The kitchen provides vegetarian hot meals 7 days a week, 365 days a year at the Gurdwara. pic.twitter.com/G6DaMkfkeW — The Royal Family (@RoyalFamily) December 6, 2022 (చదవండి: జిన్‌పింగ్ మూడు రోజుల సౌదీ పర్యటన...టెన్షన్లో అమెరికా) -
‘రాజుగారు’ ఒక ఆశాకిరణం
వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు మానవాళి బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను బ్రిటిష్ సింహాసనాన్ని కొత్తగా అధిష్ఠించిన ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చుకున్నారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాక, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న దృఢమైన నిబద్ధత ఆయనను కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచకపోవచ్చు. ప్రపంచంలో నిస్పృహలు పెరుగుతున్న సమయంలో ఈ కొత్త రాజు కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరు. మనోహరమైన చిద్విలాసాలు, ప్రజాసమూ హాలకు అభివాదాలు, కార్యక్రమాల ప్రారం భోత్సవాలు.. ఇటువంటి సాధారణ కర్తవ్యాల వరకే రాచరికాలు పరిమితమై ఉన్న తరుణంలో బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్ఠించిన మూడవ ఛార్లెస్ రాజు తన సొంతవైన ఆలోచనలతో, సున్నితమైన వ్యక్తిత్వంతో, భూగ్రహాన్ని రక్షించాలన్న ప్రబలమైన కాంక్షతో ‘హరిత చక్రవర్తి’గా అవతరించగలరన్న ఆశలు రేకెత్తిస్తున్నారు. ‘‘ఆయన తన ఇరవైల ప్రారంభంలో భవిష్యత్ కాలుష్య దుష్ప్రభావాలపై ప్రభావ వంతమైన ప్రసంగాలు చేశారు. తన మధ్యవయస్సులో ఆర్థిక, పర్యా వరణ, సామాజిక అంశాల మధ్య సమతూకం సాధించే అత్యున్నత స్థాయి సుస్థిరతలకు చొరవ చూపారు. ఈ ఏడాది జనవరిలో తన 73 ఏళ్ల వయసులో వాతావరణ మార్పును నియంత్రించేందుకు అత్యవ సర చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, వ్యాపార దిగ్గజాలకు స్పష్టమైన పిలుపు నిచ్చారు’’ అని ‘టైమ్’ పత్రిక రాసింది. రానున్న కాలంలో కానున్న రాజుగా మొన్నటి వరకు ఆయన సాగించిన ప్రయాణాన్ని ఈ నాలుగు మాటల్లో ఆ పత్రిక సముచిత పరిచింది. బ్రిటన్ రాజైన వెంటనే, బ్రిటిష్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ‘చరిత్ర నాపై మోపిన బాధ్యత ఎంత బరువైనదో తెలుస్తోంది’ అని ఛార్లెస్ అన్నారు. తనెంతో శ్రద్ధ వహిస్తూ వచ్చిన స్వచ్ఛంద కార్య కలాపాలకు, ఇతర విధులకు ఇకపై తన సమయాన్ని, శక్తిని కేటా యించడం మునుపటి స్థాయిలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆయన యోగ్యతలను, పర్యావరణ పరిరక్షణపై ఆయన కున్న దృఢమైన నిబద్ధతను గుర్తెరిగిన చరిత్ర ఆయన్ని కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచగలదని నేను భావించడం లేదు. ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు ఐరోపా దేశాల రాచరిక కుటుంబాల నుంచి హాజ రైన వారిలో జపాన్ చక్రవర్తి దంపతులు సహా అందరూ అనామకంగా ఉన్న రాజులు, రాణులే. వారందరిలోనూ ఉన్న సారూప్యం ఒక్కటే. వారిలో ఎవరి జీవితాలూ సునిశితమైన గమనింపులతో గడుస్తున్నవి కావు. వారు తమ మనోభావాలను బయటి వ్యక్తం చేసేవారు కాదు కనుక ప్రజా జీవనంలో వారి గురించి మాట్లాడటానికి ఉన్నది చాలా తక్కువ. పైగా అది వారు ఎంపిక చేసుకుని, అనుసరిస్తున్న జీవనశైలి కూడా. కానీ ఛార్లెస్ అలా కాదు. తన మనోభావాలను వెల్లడించడానికి ఆయన ఏనాడూ సంకోచించలేదు. అది వ్యతిరేకమైన ఫలితాన్నే ఇచ్చినా ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఉదాహరణకు ఆయన నిశ్చితాభి ప్రాయాలు ఇలా వ్యక్తం అయ్యేవి : ‘రసాయనాల వాడకం వ్యవసా యానికి వినాశకరంగా పరిణమిస్తుంది. అనేక విధాలుగా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాలుష్య కారకాలైన ఉద్గారాలు విపరీతంగా వెలువడతాయి’ అనేవారు. లేదా, ‘చిన్న పొలాలు కనుమరుగైతే అది బ్రిటిష్ గ్రామీణ ప్రాంతాల హృదయాన్నే చీల్చివేస్తుంది’ అని చెప్పే వారు. విధ్వంసక వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు రాయితీలు అనే అంశాలు తరచు ఆయన మాటల్లో వెల్లడయేవి. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాకుండా, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చు కున్నారు. మాంసాహారాన్ని దాదాపుగా త్యజించారు. పశుగణాభివృద్ధి అవసరాన్ని తగ్గిస్తే ఉద్గారాలను నియంత్రించవచ్చు అన్న ఆలోచనే ఆయన్ని శాకాహారం వైపు మళ్లించింది. పాల ఉత్పత్తులను తీసు కోవడాన్ని కూడా ఛార్లెస్ తగ్గించారు. ‘కాప్–26’ సదస్సుకు ముందు ఆయన తన ఆస్టన్ మార్టిన్ కారును బయో–ఇథనాల్‌తో నడుపు తున్నట్లు వెల్లడించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని ‘ది గార్డియన్’ ఒక వార్తాకథనం రాసింది. ఇంగ్లిష్ వైట్ వైన్ అవశేషాలు, జున్ను తయారీలోని పాల విరుగుడుల మిశ్రమమే ఆ బయో– ఇథనాల్. దాని ద్వారా ఛార్లెస్ తన ప్రజలకు ఒక స్పష్టమైన ఆచరణా త్మక సందేశాన్ని అందిస్తున్నారు. ‘మీ వంతుగా ఉద్గారాలను తగ్గిం చండి, తద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషించండి’ అన్నదే ఆ సందేశం. వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు, సేంద్రియ వ్యవసాయం నుండి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన వరకు... బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసు కున్నారు. దీనిని ఎలాగైనా పిలవండి. విపరీతం అనండి, అతిమోహం అనండి. ఒకటి మాత్రం వాస్తవం. ఆయన బాగా చదివినవారు. విషయంపై అవగాహన లేకుంటే, ఆధిపత్య కథనాలను సవాలు చేయడం అంత సులభమేమీ కాదు. అది కూడా డబ్బు మూటలతో పెద్ద పెద్ద కంపెనీలు ఆ కథనాలకు మద్దతు ఇస్తున్నప్పుడు! దీనిని బట్టి ఆయన తన పాలనను ఎలా నిర్వహిస్తారు, తన కొత్త పాత్రను ఎలా మలుచుకుంటారు అనేవి ఆధారపడి ఉంటాయని భావిస్తు న్నాను. అంతకంటే కూడా ఆయన తను ఎలా గుర్తుండి పోవాలని అనుకుంటున్నారో అది కూడా కీలక పాత్ర వహిస్తుంది. నేను బాగా ఇష్టపడే మరొక చక్రవర్తి కూడా ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నారు. థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అదుల్యాతేజ్ 1946లో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 70 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షంగా వారితో సమయం గడపడం అనే ఆయన మానవీయ దృక్పథానికి విద్యార్థిగా ఉండగా నేను ఆకర్షితుడనయ్యాను. ఒక రాజుగా ఆయనకు అంత చేయవలసిన అవసరం లేదు. కానీ ఆర్థిక శ్రేయస్సు, ప్రజా సంక్షేమంపై ఆయన ఆసక్తి చివరికి ఆయన ఓ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి దోహద పడింది. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో ఉన్నప్పుడు టెలివిజన్ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు: ‘‘దేశం పులిగా మారా లని దేశ ప్రజలు పిచ్చిగా కోరుకుంటున్నారు. పులిగా ఉండటం ముఖ్యం కాదు. దేశం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం ముఖ్యం. సమృద్ధిగా అంటే, మనల్ని మనం పోషించుకోవడానికి తగి నంతగా.’’ ఈ మాటలు ప్రస్తుతం భారత్‌కు కూడా వర్తిస్తాయి. ఏదేమైనా అభివృద్ధి చక్రానికి స్థిరత్వపు ఇరుసు లాంటి ఆ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతం నేడు థాయ్‌లాండ్‌లోని 23 వేల గ్రామాల్లో ఆచరణలో ఉంది. ఎగుమతులపై దృష్టి పెట్టడానికి బదులు, స్వయం సమృద్ధిని నిర్మించడం అనే భావనపై ఆ సిద్ధాంతం ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మట్టి పునరుత్పత్తి, సూక్ష్మక్రిమి కణాల సేకరణలతో పాటు అనేక అభివృద్ధి ప్రణాళికల కోసం కృషి చేసిన థాయ్ రాజును ఐక్యరాజ్య సమితి 2006లో తన మొదటి ‘మానవాభివృద్ధి అవార్డు’కు ఎంపిక చేసింది. ఆయనకు ప్రపంచంలోని మొట్టమొదటి, ఏకైక ‘అభివృద్ధి రాజు’గా గుర్తింపు ముద్ర వేస్తూ, ఆనాటి సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్... ‘‘థాయ్‌లాండ్‌లోని పేద, అత్యంత బలహీన వర్గాల ప్రజల చెంతకు.. వారి స్థితి, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా థాయ్ రాజు వెళ్లారు. వారి జీవితాలను వారే తమ చేతుల్లోకి తీసుకునే సాధికారతను వారికి ఇచ్చారు’’ అని కీర్తించారు. అనేక విధాలుగా ఛార్లెస్ కూడా తనను కేంద్ర స్థానంలో నిలబెట్టే ఒక వారసత్వాన్ని పంచుకున్నారు. ప్రపంచానికి ఇప్పుడు సుస్థిరతపై దృష్టిని మళ్లించగల కొన్ని తెలివైన స్వరాల అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, అసమానతలు మరింత పెరిగేందుకు దారితీసిన ఆర్థిక మాంద్యంపై కచ్చితంగా ఆయన దృష్టి సారించాలి. ఎలాంటి రాజకీయ వివాదాలలోకీ వెళ్లకుండా, నిస్పృహలు పెరుగు తున్న ఈ సమయంలో ఆశలను పెంపొందించేందుకు ఈ కొత్త రాజు ఒక కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరని నేను విశ్వసి స్తున్నాను. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) ఈ–మెయిల్: hunger55@gmail.com -
కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్
లండన్: బ్రిటన్‌లో రోలర్ స్కేటింగ్ చేస్తున్న వ్యక్తి కింగ్ చార్లెస్ కారుని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్ర భయాందోళలనకు గురయ్యాడు. వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న రాణి శవపేటిక వద్దకు చార్లెస్ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ సమీపంలో రాయల్ అశ్వికదళం వైపు రోలర్ స్కేట్లపై వేగంగా వెళ్తున్న వ్యక్తిని సుమారు ఎనిమిది మంది పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి అతనికి ఎలాంటి దుర్దేశాలు లేవని అధికారుల నిర్థారించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ పోలీసులు మాట్లాడుతూ...రాత్రి 7 గంటల సమయంలో పోలీసు వాహనాలు పార్లమెంట్ స్క్వేర్లోకి ప్రవేశిస్తుండగా ఒక పాదచారి రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు చార్లెస్ కార్ని దాదాపు ఢీ కొట్టాడని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని తప్పించుకోనివ్వకుండా...నేలపై పడుకోబెట్టి సంకెళ్లు వేశారు. ఆ తర్వాత విచారణలో పోలీసులు ఆ వ్యక్తి ఎలాంటి దురుద్దేశంతో ఈ ఘటనకు పాల్పడలేదని, అనుకోకుండా జరిగిందేనని ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Rollerblader evaded security and seemingly tried to collide into #KingCharles motorcade travelling to the vigil, shortly after 1930 on parliament square. Police intervened just in time. #QueenElizabeth #queueforthequeue @BBCNews @itvnews @SkyNews @Channel4News pic.twitter.com/P0rw2qqlRz — Tom (@pt1408) September 16, 2022 (చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
‘ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు’, ప్రిన్స్ ఛార్లెస్ ఫంక్షన్‌కు ‘రతన్ టాటా’ డుమ్మా!
అత్యధిక కాలం బ్రిటన్ను పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 అస్తమయం కావడంతో యూకే రాజుగా ఆమె కుమారుడు, ప్రిన్స్ ఛార్లెస్ నియమితులు అయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్రిటన్ రాజుగా ప్రిన్స్ ఛార్లెస్, రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75)లు అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన నెటిజన్లు, వ్యాపార దిగ్గజాలు బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్, దేశీయ దిగ్గజం రతన్ టాటా'ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో పెంపుడు కుక్కల విషయంలో రతన్ టాటా - ప్రిన్స్ ఛార్లెస్‌తో జరిగిన సంభాషణల్ని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. రతన్ టాటా దాతృత్వానికి గుర్తింపుకు గాను ఆయనను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలని 2018 ఫిబ్రవరి 6న ప్రిన్స్ ఛార్లెస్.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డుల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? రెండు పెంపుడు కుక్కల వల్ల. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఇది అక్షరాల నిజం. ఇదే అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన కాలమిస్ట్, వ్యాపార వేత్త సుహెల్ సేథ్ నాటి మధుర స్మృతుల్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ రతన్ టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు. రతన్ టాటాకు లైఫ్ టైమ్ అవార్డును ప్రధానం చేసేందుకు లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌ను సర్వం సిద్ధం చేశారు. ‘‘ 2018 ఫ్రిబవరి 2,3 తేదీలలో బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ కోసం నేను లండన్‌కు చేరుకున్నాను. లండన్ ఎయిర్ పోర్ట్ దిగిన తర్వాత టాటా నుండి సుమారు 11 మిస్డ్ కాల్లు రావడంతో షాకయ్యా. వెంటనే నా బ్యాగ్‌లను తీసుకొని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఆయనకు కాల్ చేశా. టాంగో, టిటో (రతన్ టాటా కుక్కలు ) అనారోగ్యానికి గురయ్యాయి. తిండి తినడం లేదు. నీళ్లు తాగడం లేదు. నేను వాటిని వదిలి రాలేను అని’’ తనతో చెప్పినట్లు సుహెల్ సేథ్ గుర్తు చేసుకున్నారు. ప్రిన్స్ చార్లెస్ ఈవెంట్‌కు టాటా వచ్చేలా నేను ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. టాటా తన అవార్డును స్వీకరించేందుకు రాలేదు. ఈ సందర్భంగా అవార్డుల కార్యక్రమానికి రతన్ టాటా ఎందుకు రాలేదో తెలుసుకున్న ప్రిన్స్ ఛార్లెస్.. టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు.‘‘మనసున్న మారాజు..అతడే రతన్ టాటా ” అని ప్రిన్స్ చార్లెస్ అన్నట్లు సేథ్ తెలిపారు. -
రాజుగా చార్లెస్ ప్రమాణం
లండన్: బ్రిటన్ కొత్త రాజుగా 73 ఏళ్ల చార్లెస్–3 నియుక్తులయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించింది. ప్యాలెస్ బాల్కనీ నుంచి నియామక ప్రకటనను బహిరంగంగా చదివి విన్పించింది. భేటీలో పాల్గొన్న ముఖ్య అతిథులంతా ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ తమ అంగీకారం తెలిపారు. అనంతరం చార్లెస్–3 రాజుగా ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ ప్రకటన పత్రం తాలూకు రెండు ప్రతులపై తన కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ కానుకగా ఇచ్చిన ఇంక్ పెన్నుతో సంతకం చేశారు! ఆ వెంటనే కింగ్స్ ట్రూప్స్ 41 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75), నూతన యువరాజుగా విలియం తదితరులు రాజ ప్రకటన పత్రంపై సాక్షి సంతకాలు చేశారు. బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటికీ ఇకపై చార్లెస్–3 అధినేతగా వ్యవహరిస్తారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులతో పాటు కొత్త ప్రధాని లిజ్ ట్రస్, విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. చార్లెస్–3 నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలిసారిగా పత్య్రక్ష ప్రసారం చేశారు. బ్రిటన్ను రికార్డు స్థాయిలో 70 ఏళ్లపాటు పాలించిన ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 గురువారం 96వ ఏట కన్నుమూయడం తెలిసిందే. ‘‘అనంతమైన ప్రేమ, నిస్వార్థ సేవ, తిరుగులేని అంకితభావాలతో నా తల్లి పాలన అన్ని విషయాల్లోనూ సాటిలేనిదిగా సాగింది. ఆమె అస్తమయం అత్యంత దుఃఖమయమైన విషయం. నాపై ఎంతటి భారీ బాధ్యతలున్నాయో తెలుసు. ఆమె నెలకొల్పిన ప్రమాణాలను కొనసాగిస్తా. అందుకు నా జీవితాన్ని ధారపోస్తా’’ అంటూ తన తొలి ప్రసంగంలో కింగ్ చార్లెస్–3 ప్రతిజ్ఞ చేశారు. తల్లిని తలచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘ప్రియాతి ప్రియమైన అమ్మా! దివంగతుడైన నాన్నను కలుసుకునేందుకు మహాప్రస్థానానికి బయల్దేరిన నీకు నేను చెప్పగలిగింది ఒకటే. మన కుటుంబం పట్ల నీ ప్రేమకు, అంకితభావానికి థాంక్యూ’’ అంటూ నివాళులర్పించారు. నూతన రాజుకు విధేయులుగా ఉంటామంటూ ప్రధాని ట్రస్, ఆమె మంత్రివర్గ సభ్యులంతా హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిజ్ఞ చేశారు. భర్త సమాధి పక్కనే... రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బకింగ్‌హాం ప్యాలెస్ ఈ మేరకు ప్రకటన చేసింది. రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్ కోటకు తరలిస్తారు. మంగళవారం అక్కడినుంచి విమానంలో లండన్‌కు తీసుకెళ్తారు. సెప్టెంబర్ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచుతారు. 19న సోమవారం విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో భర్త చార్లెస్ సమాధి పక్కనే ఖననం చేస్తారు. కార్యక్రమానికి వస్తున్న మాజీ ప్రధానులు థెరిసా మే, జాన్ మేజర్, గార్డన్ బ్రౌన్, టోనీ బ్లెయిర్, డేవిడ్ కామెరాన్, బోరిస్ జాన్సన్ -
బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్ కాస్టిల్లో జరిగిన విషయాలపై బ్రిటీష్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురించింది. ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తన చిన్న కూమారుడు హ్యారీకి ఓ విషయం తేల్చిచెప్పినట్లు పేర్కొంది. ఎలిజబెత్‌ను చివరి క్షణాల్లో చూసేందుకు హ్యారీ తన భార్య మెర్కెల్‌ను తీసుకురావద్దని చార్లెస్ చెప్పారని వెల్లడించింది. 'మహారాణి చనిపోయే ముందు అతి తక్కువ మంది దగ్గరి బంధువులే పరిమిత సంఖ్యలో ఆమెతో పాటు ఉంటున్నారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో మెర్కెల్‌ను ఇక్కడకు తీసుకురావడం సరికాదు. అందుకే ఆమెను తీసుకురావొద్దు' అని ప్రిన్స్ చార్లెస్ తన కుమారుడు హ్యారితో చెప్పినట్లు ది సన్, స్కై న్యూస్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ కారణంతోనే గురువారం ఎలిజబెత్ చనిపోవడానికి ముందు హ్యారీనే బల్మోరల్ క్యాస్టిల్కు చివరగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణాంతరం శుక్రవారం రోజు క్యాస్టిల్‌ను వీడిన తొలి వ్యక్తి కూడా హ్యారీనే అని సమాచారం. దీంతో బ్రిటన్ రాజకుటుంబంలో వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నానమ్మతో అన్యోన్యంగా.. గతంలో ఎలిజబెత్ ఆమె మనవడు హ్యారీల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2016లో బరాక్ ఒబామా, మిచేలీ ఒబామా దివ్యాంగుల కోసం ఇన్విక్టస్ గేమ్స్ కాంపిటీషన్‌ను ప్రారంభించినప్పుడు ఎలిజబెత్, హ్యారీల రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ గేమ్స్‌కు హ్యారీనే ప్రమోటర్‌గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు.. అయితే అమెరికాకు చెందిన మేఘన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హ్యారికి రాజకుటుంబంతో సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ దంపతులు 2021 మార్చిలో ఓప్రా విన్ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేఘన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకుటుంబంలో తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది భరించలేక తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాదు తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో ఉంటాడా? అని రాజకుటుంబంలో చర్చించుకునేవారని తెలిపారు. మేఘన్ తల్లి నల్లజాతీయురాలు కాగా.. తండ్రి శ్వేతజాతీయుడు. అప్పటి నుంచి మరింత దూరం ఈ ఇంటర్వ్యూ అనంతరం రాజకుటుంబంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బకింగ్‌హామ్ ప్యాలెస్ వీటిని తోసిపుచ్చింది. మేఘన్ ఆరోపణలు ఆందోళన కల్గించాయని పేర్కొంది. అప్పటినుంచి హ్యారీ దంపతులకు రాజకుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఇద్దరూ ఆమెరికాలో నివాసముంటున్నారు. తమకు రాజకుటుంబం హోదా వద్దని ప్రకటించారు. అయితే తల్లి మృతి అనంతరం కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ తన మొదటి ప్రసంగంలో హ్యారీ, మేఘన్‌ల గురించి ప్రస్తావించారు. విదేశాలో నివసిస్తున్న ఈ ఇద్దరిపై కూడా తనకు ప్రేమ ఉందని పేర్కొన్నారు. అయితే ఎలిజబెత్-2 మరణానికి ముందు హ్యారీ బ్రిటన్‌లోనే ఉన్నారు. అయితే ఇది యాదృచ్చికమే అని బ్రిటీష్ మీడియా సంస్థలు తెలిపాయి. చదవండి: తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టిన మహిళ -
తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టిన మహిళ
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3. అయితే రాణికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లిన జెన్నీ అస్సిమినోయిస్ అనే మహిళ బాధతో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో జెన్నీ దీనిపై వివరణ ఇచ్చారు. కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని జెన్నీ చెప్పారు. ఆయనను చాలా దగ్గరనుంచి నుంచి చూసి నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ముద్దు పెడతానని కింగ్ చార్లెస్‌ను అడిగానని, అందుకు ఆయన అనుమతి ఇచ్చాకే కిస్ చేసినట్లు వెల్లడించారు. కింగ్ చార్లెస్‌ను చూడటమే గాక, ముద్దు పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఛాన్స్ ఎప్పటికీ రాదని.. కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టే అవకాశం జీవితంలో ఎప్పటికీ రాదని తన మనసుకు అనిపించిందని జెన్నీ చెప్పారు. రాజకుటుంబీకులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను ఎల్లవేళలా గమనిస్తూనే ఉన్నట్లు జెన్నీ పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ల చిన్నప్పటి నుంచి ఫోటోలు కొని పెట్టుకున్నట్లు వివరించారు. తన దివంగత భర్త గ్రీస్ దేశానికి చెందినవాడని, కింగ్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్‌ది కూడా గ్రీసే అని సిప్రస్‌కు చెందిన జెన్నీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అందుకే కింగ్ చార్లెస్‌తో పాటు రాజవంశస్థులు తనకు దగ్గరివాళ్లలా కన్పిస్తారని పేర్కొన్నారు. జెన్నీ ముద్దుపెట్టిన అనంతరం చిరునవ్వుతో అలాగే ముందుకుసాగారు కింగ్ చార్లెస్. తన తల్లికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వచ్చిన వేలాది మందికి కరచాలనం ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో మహిళ కూడా కింగ్ చార్లెస్ చేతిపై ముద్దుపెట్టింది. చదవండి: బకింగ్హమ్ ప్యాలెస్‌పై జంట ఇంద్రధనుస్సులు -
రాకుమారునిగా వెళ్లి... రాజుగా లండన్‌కు చార్లెస్
లండన్: రాణి ఎలిజబెత్–2 ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే గురువారం ఉదయం రాకుమారుని హోదాలో లండన్ వీడిన చార్లెస్, ఆమె మరణానంతరం శుక్రవారం బ్రిటన్ రాజు హోదాలో తిరిగి రాజధానిలో అడుగు పెట్టారు. ఆయన తల్లి రాణి ఎలిజబెత్–2 వృద్ధాప్యంతో గురువారం స్కాట్లాండ్లో మరణించడం తెలిసిందే. దాంతో నిబంధనల ప్రకారం ఆ మరుక్షణం నుంచే చార్లెస్ బ్రిటన్ రాజయ్యారు. శుక్రవారం స్కాట్లండ్ నుంచి లండన్ చేరుకున్న ఆయనకు ప్రజలు ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ జాతీయ గీతం పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రాజు హోదాలో చార్లెస్ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని లిజ్ ట్రస్‌తో భేటీ అయ్యారు. అంత్యక్రియలపై అస్పష్టత ఎలిజబెత్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా తేలలేదు. రెండు వారాల్లోపు చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబేలో అంత్యక్రియలు జరుగుతాయని బీబీసీ వెల్లడించింది. పార్లమెంటు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై రాణికి నివాళులర్పించింది. 96 ఏళ్లపాటు జీవించిన రాణి గౌరవార్థం సెంట్రల్ లండన్‌లో 96 రౌండ్ల గన్ సెల్యూట్ జరిగింది. శనివారం హౌజ్ ఆఫ్ కామన్స్ ప్రత్యేక భేటీలో ఎంపీలంతా కింగ్ చార్లెస్–3కి విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై చార్లెస్‌ను రాజుగా లాంఛనంగా ప్రకటించనుంది సంతాపాల వెల్లువ ఎలిజబెత్ అస్తమయం పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భా్రంతి వెలిబుచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతులు వాషింగ్టన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ నివాళులర్పించారు. ‘‘రాణిది అరుదైన, గొప్ప వ్యక్తిత్వం. అమెరికన్లందరి తరఫున మా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సంతాపాల పుస్తకంలో రాశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితరులు కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో 11న ఆదివారం ఒక్కరోజు సంతాప దినంగా పాటించనున్నారు. -
క్వీన్ ఎలిజబెత్–2 మృతి.. కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి.. హక్కుదారు ఎవరు?
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్లో జనం డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్ ధరిస్తారు. కోహినూర్ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. -
ఎలిజబెత్ అస్తమయంతో మారిన వారసుల జాబితా
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. రాణి మృతితో బ్రిటన్ సింహాసనానికి వారసుల జాబితాలో కూడా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం, ఆయన సంతానానికే వారసత్వంలో ఇక అగ్ర తాంబూలం దక్కనుంది. ఆ లెక్కన విలియం, తర్వాత ఆయన పిల్లలు జార్జ్, చార్లెటీ, లూయిస్ జాబితాలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉంటారు. తర్వాత ఐదో స్థానంలో మాత్రమే విలియం సోదరుడు హ్యారీ ఉంటారు! ఆ తర్వాత ఆయన పిల్లలిద్దరూ వస్తారు. రాణి బతికుండగా చార్లెస్, విలియం తర్వాత హ్యారీ మూడో స్థానంలో ఉండేవారు. ► బ్రిటన్‌లో రాజు/రాణి పెద్ద కుమారుడు మాత్రమే రాజయ్యే సంప్రదాయం ఇటీవలిదాకా కొనసాగింది. తొలి సంతానమైనా సరే అమ్మాయికి అవకాశం ఉండేది కాదు. గురువారం మరణించిన రాణి ఎలిజబెత్–2 కింగ్ జార్జి–6కు తొలి సంతానంగా జన్మించింది. ఆమెకు తమ్ములెవరూ లేకపోవడం వల్ల మాత్రమే రాణి కాగలిగింది. ఈ పురాతన సంప్రదాయాన్ని 2013లో సింహాసన వారసత్వ చట్టం ద్వారా మార్చారు. దాని ప్రకారం తొలిచూరు అమ్మాయైనా బ్రిటన్ సింహాసనం ఆమెకే దక్కుతుంది. దీని ప్రకారం ప్రిన్స్ విలియం కూతురు చార్లెట్ వారసత్వ జాబితాలో తన తమ్ముడు లూయీస్ కంటే ముందుంది. ► రోమన్ క్యాథలిక్కును పెళ్లాడే రాజ కుటుంబీకులు సింహాసనానికి అనర్హులన్న నిబంధనను కూడా 2013 చట్టం ద్వారా తొలగించారు. అయితే రాజు/రాణి కావాలనుకునేవారు మాత్రం రోమన్ క్యాథలిక్కులు అయి ఉండరాదు. ► సింహాసనానికి వారసులను చట్టాల ద్వారా నియంత్రించడానికి, మార్చడానికి కూడా బ్రిటన్ పార్లమెంటుకు అధికారముంది. పాలన సరిగా లేకుంటే రాజు/రాణిని కూడా పార్లమెంటు మార్చగలదు. సింహాసనమెక్కే వారు ఇంగ్లండ్ చర్చికి, ప్రొటస్టెంట్ సంప్రదాయాలకు విధేయులై ఉండాలి. జాతీయ గీతమూ మారుతుంది చార్లెస్ రాజు కావడంతో బ్రిటన్ జాతీయ గీతమూ మారనుంది. ఎలిజబెత్–2 హయాంలో 70 ఏళ్లుగా బ్రిటన్‌లో ‘గాడ్ సేవ్స్ ద క్వీన్’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇకపై అది ‘గాడ్ సేవ్ అవర్ గ్రేషియస్ కింగ్’ అంటూ మొదలవుతుంది. బ్రిటన్ రాచరికాన్ని లాంఛనంగా అంగీకరించే న్యూజిలాండ్‌కూ ఇదే జాతీయ గీతం కాగా ఆస్ట్రేలియా, కెనడాలకు రాయల్ ఆంథెమ్‌గా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం కరెన్సీపై కూడా ఎలిజబెత్ బదులు ఇక చార్లెస్ ఫొటో వస్తుంది. అయితే ఇందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ పాస్‌పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరు వస్తుంది. బకింగ్‌హం ప్యాలెస్ బయట విధులు నిర్వహించే క్వీన్స్ గార్డ్ ఇకపై కింగ్ గార్డ్‌గా మారుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Queen Elizabeth II: అరుదైన వ్యక్తిత్వం
‘రవి అస్తమించని సామ్రాజ్యం’ తన ప్రాభవం క్రమేపీ కోల్పోతూ, కొడిగడుతున్న తరుణంలో బ్రిటిష్ పట్టపు రాణిగా వచ్చిన రాణి ఎలిజబెత్–2 గురువారం రాత్రి కన్నుమూశారు. బ్రిటన్‌తో పాటు మరో 14 దేశాలకు లాంఛనప్రాయపు రాజ్యాంగాధినేత హోదాలో అయితేనేమి, పూర్వపు బ్రిటిష్ వలస దేశాలతో కూడిన కామన్వెల్త్ అధినేత హోదాలో అయితేనేమి... ఈ ఏడు దశాబ్దాలూ ఆమె తనదైన ముద్రవేశారు. ఎలిజబెత్–2 సింహాసనం అధిష్ఠించేనాటికి అదే యూరప్ ఖండంలోని అనేక దేశాలు హింసాత్మకంగానో, సామరస్యపూర్వక మార్గంలోనో రాచరిక వ్యవస్థల్ని పూర్తిగా వదుల్చుకుని ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లుగా అవతరిస్తున్నాయి. బ్రిటన్ గురించే చెప్పాలంటే అంతకు రెండున్నర శతాబ్దాల పూర్వమే అది ప్రజాస్వామ్య ఫలాలను రుచిచూడటం ప్రారంభించింది. అయినా బ్రిటన్ ప్రజాజీవన రంగం ఈనాటికీ రాచరిక వ్యవస్థతోనే పెనవేసుకుని ఉండటం, బకింగ్‌హామ్ రాజప్రాసాద పరిణామాలు ఈనాటికీ అక్కడి పౌరుల్లో ఆసక్తిదాయకం కావడం ఆ సమాజ తీరుతెన్నుల్ని పట్టిచూపుతుంది. ఇందుకు రాణిగా ఎలిజబెత్–2 నిర్వహించిన పాత్ర కూడా తక్కువేమీ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడటం, తమ పరిధులు, పరిమితులు గుర్తెరిగి మసులుకోవడం వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా శోభనిస్తుంది. రాణి ఎలిజబెత్ ఆ పని చేశారు కాబట్టే పెద్దగా వివాదాలు ముసురుకోలేదు. తనదైన ఆ శైలే 70 ఏళ్లపాటు ఆమెను అవిచ్ఛిన్నంగా నిలబెట్టింది. దేశానికి రాచరికం ఎందుకన్న ప్రశ్న తలెత్తకుండా చేసింది. రాజ్యాధినేతగా ఆమె ప్రతి వారం ప్రధానితో, విదేశాంగ మంత్రి తదితరులతో సంభాషించటం ఆనవాయితీ. ఇంటా బయటా జరిగే పరిణామాలను తెలుసుకోవటం, సలహాలివ్వటం రివాజు. ఆమె రాణి అయ్యేనాటికి విన్స్టన్ చర్చిల్ దేశ ప్రధాని. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ అన్నివిధాలా దెబ్బతిని, తన వలస రాజ్యాల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహం పర్యవసానంగా ఒక్కో దేశంనుంచే నిష్క్రమించకతప్పని దుస్థితిలో పడింది. ఆమె వచ్చాక సైతం అది కొనసాగింది. తన తాతలకాలం లోనే రాజ కుటుంబీకులకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండే దశ అంతరించి సమానత్వ భావన వచ్చింది. ఇక 1956 నాటి సూయెజ్ కాల్వ సంక్షోభం బ్రిటన్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలో తన వాస్తవ స్థానమేమిటో చూపింది. సామ్రాజ్యంగా వెలుగులీనిన బ్రిటన్ యూరోప్ యూనియన్ (ఈయూ)లో ఒక భాగస్వామిగా మారడం... ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా అదే ఈయూ నుంచి రెండేళ్లక్రితం బయటకు రావడం వంటి పరిణామాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. స్కాట్లాండ్లో స్వాతంత్య్ర కాంక్ష క్రమేపీ పెరిగి ఒక దశలో ఆ ప్రాంతం విడిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వాలూ, వాటి అస్థిరతా సరేసరి. వీటన్నిటినీ చూస్తూ, దశాబ్దాల తన అనుభవంతో ప్రభుత్వంలో ఉండేవారికి ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ఆమె తన ప్రభావాన్ని చూపగలిగారు. అదే సమయంలో అనవసర జోక్యం చేసుకుంటున్నారన్న అపప్రథ రాకుండా చూసుకున్నారు. అందుకే బ్రిటన్ రాచరికానికి ఇప్పటికీ ప్రాసంగికత అడుగంటకపోవటం వెనక ఆమె వ్యక్తిగత ముద్రను కాదనలేం. ‘రాచరిక వ్యవస్థలోకి తొంగి చూడనంత కాలం దానిపై పూజ్యభావన ఉంటుంది. ఒక్కసారి అలా చూశాక మరి దాన్ని కీర్తించడం అసాధ్యం. అందుకే ఆ మార్మికతను అట్లే కొనసాగనీయండి’ అన్నాడు రాజ్యాంగ నిపుణుడు వాల్టర్ బాజెట్ ఒక సందర్భంలో వ్యంగ్యంగా. అలా చూస్తే బకింగ్ హామ్ రాజప్రాసాదంలో దిగ్భ్రాంతిపరిచేవి ఎన్నో కనబడతాయి. 1992లో ఒకేసారి ఆమె సంతానం లోని ముగ్గురు విడాకులు తీసుకోవటం బ్రిటన్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయారు. ఆ మాటకొస్తే తాను రాణి అయిన కొద్దికాలానికే తన సోదరి ఒక సాధారణ వ్యక్తితో సాన్నిహిత్యం నెరపడం, మీడియాలో అది చిలవలు పలవలుగా రావడం, చివరికామె అతన్ని పెళ్లాడి, ఆ తర్వాత కొద్దికాలానికే విడాకులు తీసుకోవటం వంటి పరిణామాలు రాజకుటుంబీకుల్ని ఊపిరాడని స్థితిలో పడేశాయి. ఎందుకంటే రాణిగా ఆమె చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కు సుప్రీం గవర్నర్. సంప్రదాయానికి అత్యంత విలువ నిచ్చే సమాజం దృష్టిలో ఇవన్నీ ‘జరగకూడని ఘోరాలు’. ఇక యువరాణి లేడీ డయానా స్పెన్సర్ విషయంలో ఆమె తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నారు. కోడలిగా సంప్రదాయ పాత్రలో ఒదిగి, ప్రచారానికి దూరంగా ఉండాల్సిన డయానా ప్రముఖురాలిగా మారడం రాజప్రాసాదంలో ఎవరికీ నచ్చలేదంటారు. డయానాను ఆమె అత్తగా ఆరళ్లు పెట్టారని ఆరోపణ లొచ్చాయి. దానికి తగ్గట్టే 1995లో ప్రిన్స్ చార్లెస్‌తో విడిపోయిన డయానా మరో రెండేళ్లకు పారిస్‌లో దుర్మరణం పాలైనప్పుడు మొదట్లో రాణి నుంచి స్పందన లేదు. చివరకు ప్రజాభిప్రాయానికి ఆమె తలొగ్గక తప్పలేదు. నాలుగురోజులు ఆలస్యమైనా విషాద సూచకంగా రాజప్రాసాదంపై ఉన్న యూనియన్ జాక్‌ను అవనతం చేయమని ఆదేశించవలసి వచ్చింది. ఇక భిన్న సందర్భాల్లో రాజ్యాధినేతగా అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల అధినేతలకూ, సీనియర్ సైనికాధికారులకూ నైట్‌హుడ్, ఆనరరీ నైట్ కమాండర్ వంటి భుజకీర్తులు తగిలించడం విమర్శలకు తావిచ్చింది. వీరంతా వియత్నాం, పాలస్తీనా, ఇరాక్ తదితరచోట్ల రక్తపుటేర్లు పారించారన్న ఆరోపణలు ఎదు ర్కొన్నవారు. ఏదేమైనా ఎలిజెబెత్లా సంయమనంతో మెలగటం, ఆ ఒరవడిని కొనసాగించటం కుమారుడు చార్లెస్‌కు సంక్లిష్టమైనదే. ఆయన ఆ బాధ్యత ఎలా నెరవేరుస్తారో బ్రిటన్ గమనిస్తూనే ఉంటుంది. -
70 ఏళ్ల తర్వాత కొత్త మహారాణి.. కానీ, పవర్ నిల్!
డచ్చెస్ ఆఫ్ కార్న్‌వాల్ క్యామిల్లా ఇకపై బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించబోతోంది. అంటే.. ఏడు దశాబ్డాల తర్వాత బ్రిటన్‌కు ఓ కొత్త రాణి రాబోతోందన్నమాట. భర్త ఛార్లెస్ మహారాజు అయినప్పుడు.. ఆటోమేటిక్‌గా ఆమె మహారాణి అవ్వాల్సిందే కదా!. కానీ.. ఇక్కడే క్యామిల్లా కలలో కూడా ఊహించని కొన్ని అభ్యంతరాలతో బకింగ్హమ్ ప్యాలెస్‌లో అడుగుపెట్టబోతోంది. తలపై కీరిటంతో ఉత్త మహారాణి ట్యాగ్‌తో మాత్రం ఇకపై ఆమె జీవించాల్సి ఉంటుంది. 75 ఏళ్ల క్యామిల్లా.. యునైటెడ్ కింగ్డమ్కు కొత్త మహారాణి. కానీ, ఆమెకు ఎలాంటి సార్వభౌమాధికారాలు ఉండవు. అదేంటీ.. రాజు భార్యగా మహారాణి హోదాలో ఆమెకు విశేష అధికారాలు ఉండాలి కదా!. నిజమే.. రాణి హోదాలో రాజరికంలోకి అడుగుపెట్టే వాళ్లకు రాజుతో సమానమైన హోదా దక్కుతుంది. సార్వభౌమాధికారంతో పాటు రాజకీయ అధికారాలు, సైన్యాధికారాలు ఉంటాయి. బ్రిటన్ రాజరికంలోనూ ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అలాంటప్పుడు క్యామిల్లాకే ఎందుకు అభ్యంతరాలు?.. ఎందుకంటే ఆమెకు రాణి(Queen) హోదా బదులు.. క్వీన్ కాన్సోర్ట్(రాజు భార్య)గా మాత్రమే హోదా ఉంది కాబట్టి. అంతకంటే ముఖ్యంగా ఆమె చార్లెస్‌కు రెండో భార్య కాబట్టి. ► అవును.. ఛార్లెస్ మొదటి భార్య(మాజీ) ప్రిన్సెస్ డయానా 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే వీళ్ల విడాకులకు ముందు.. క్యామిల్లాతో ఎఫైర్ నడిపించారు ఛార్లెస్. ఈ క్రమంలో క్యామిల్లా వల్లే డయానా-ఛార్లెస్‌లు విడిపోయారనే వాదన సైతం బలంగా వినిపించింది అప్పట్లో. ఆపై డయానా నుంచి విడాకులు తీసుకున్న ఛార్లెస్.. 2005లో క్యామిల్లాను వివాహం చేసుకున్నారు. అయితే ఆనాడూ క్యామిల్లాను ‘మూడో వ్యక్తి’గానే భావించింది బ్రిటన్ సమాజం. ► అయితే ఇన్నేళ్లలో పరిస్థితులు చాలానే మారిపోయాయి. భర్తతో అన్యోన్యంగా ఉండడం.. విచక్షణ, సింప్లిసిటీ లాంటి కారణాలతో బ్రిటిష్ ప్రజల్లో ఆమె పట్ల సింపథీ ఏర్పడుతూ వచ్చింది. వాస్తవానికి ఆమెకు డయానా స్థానంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ హోదా ఇవ్వాలి. కానీ, తీవ్ర అభ్యంతరాల నడుమ డచ్చెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ను ఇచ్చారు. ఛార్లెస్-డయానా.. (ఎడమ).. ఛార్లెస్-క్యామిల్లా(కుడి) ► మరోవైపు ఛార్లెస్ సింహాసనానికి అర్హుడైన సమయంలోనూ క్యామిల్లాకు క్వీన్ కాన్సోర్ట్(భార్యకు మహారాణి హోదా)కి బదులు.. ప్రిన్సెస్ కాన్సోర్ట్ను ఇచ్చింది బకింగ్హమ్ ప్యాలెస్. ఇలాంటి పరిస్థితులు రాజ వంశంలో అంతకు ముందు ఒకేఒక్కసారి ఎదురయ్యాయి. అదీ క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ అల్బర్ట్(1837-1901 దాకా.. ప్రిన్స్ కాన్సోర్ట్ హోదా ఇచ్చారు) విషయంలో జరిగింది. ► ఆపై ఆమె హోదాను ప్రిన్సెస్ కాన్సోర్ట్ నుంచి క్వీన్ కాన్సోర్ట్కు మార్చేశారు. కానీ, పూర్తిస్థాయి ‘క్వీన్’ హోదా లేకపోవడంతో ఆమె నామమాత్రపు మహారాణిగానే బకింగ్హమ్ ప్యాలెస్‌లో నివసించబోతున్నారు. ► 2010లో ఛార్లెస్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. మీరు రాజు అయితే గనుక.. క్యామిల్లా రాణి అవుతుందా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన తడబడుతూ.. బహుశా.. మనం చూస్తాం కదా? అది కావచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. ► ఇక తన తదనంతరం తనకు దక్కిన ఆదరణే.. రాజు అయ్యే ఛార్లెస్, అతని భార్య క్యామిల్లాకు దక్కాలన్నది క్వీన్ ఎలిజబెత్-2.. 70 ఏళ్ల వారికోత్సవం సందర్భంగా చెప్పిన మాట కూడా. అయితే ఆ సందర్భంలోనూ ప్రిన్సెస్ కాన్సోర్ట్ పదాన్ని నొక్కి పలికారు క్వీన్ ఎలిజబెత్-2. క్వీన్ ఎలిజబెత్-2 తో క్యామిల్లా ► బ్రిటన్ రాజరికంలో ఇంతకు ముందు క్వీన్ కాన్సోర్ట్గా.. జార్జ్-6వ భార్య క్వీన్ ఎలిజబెత్ హోదా అందుకుంది. ఆ తర్వాత ఆమె కూతురు అయిన క్వీన్ ఎలిజబెత్-2 నేరుగా సింహాసనాన్ని అధిష్టించి యూకేకు మహారాణి అయ్యి ఏడు దశాబ్దాలకు పైగా పాలించారు. క్వీన్ క్యామిల్లా ప్రస్థానం గమనిస్తే.. ► క్యామిల్లా రోజ్మేరీ షాండ్.. జులై 17, 1947లో జన్మించారు. బ్రిటన్ రాజకుటుంబంతో చాలాకాలంగా ఆమెకు సంబంధాలున్నాయి. ఆమె వంశానికి చెందిన ఎలైస్ కెప్పెల్.. కింగ్ ఎడ్వర్డ్-7తో ప్రేమాయణం నడిపించారు కూడా. ► 1970లో ఓ పోలో మ్యాచ్ సందర్భంగా ఛార్లెస్..క్యామిల్లా తొలిసారి కలుసుకున్నారు. అప్పటికి క్యామెల్లా వయసు 23 ఏళ్లు. ► అయితే.. నేవల్ డ్యూటీ కారణంగా వాళ్ల రిలేషన్‌కు కొంతకాలం బ్రేక్ పడింది. ఆ గ్యాప్‌లో తన బాయ్‌ఫ్రెండ్ అయిన ఆండ్రూ పార్కర్ బౌల్స్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ► తిరిగి.. 22 ఏళ్ల తర్వాత ఛార్లెస్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో క్యామిల్లా-ఆండ్రూలు విడాకులు తీసుకున్నారు. ► ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఛార్లెస్ తనకు, క్యామిల్లాకు ఎఫైర్ ఉందని ఓపెన్ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో మరోవైపు డయానా కూడా ఛార్లెస్‌కు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ► విడాకుల తర్వాత ఏడాదికే డయానా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆమె మృతిపై అనుమానాలు.. రాజకుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి. ► అయితే.. ఛార్లెస్-క్యామిల్లా వివాహమనే బంధంతో ఒక్కటి కావడానికి తొమ్మిదేళ్లు ఎదురు చూశారు. 2005లో విండ్సోర్లో గుయిల్దాల్ వద్ద కోలాహలం లేకుండానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ► అప్పటి నుంచి క్యామిల్లాకు రాయల్ డ్యూటీస్ వర్తించడం మొదలయ్యాయి. తొంభైకి పైగా ఛారిటీలకు ఆమె గౌరవ అధ్యక్షత వహిస్తున్నారు. విద్యను, మహిళా సాధికారికతను ప్రోత్సహించడం, మూగజీవాల సంక్షేమం కోసం, లైంగిక దాడులు.. గృహహింసకు వ్యతిరేకంగా ప్రసంగాలతో వక్తగా ఆమె బిజీబిజీగా గడిపారు. ► అయితే రాజవంశం తరుపున క్యామిల్లా నిర్వహిస్తున్న బాధ్యతలపై జనాల్లో ఆమెపట్ల ఒక సానుకూల ధోరణి ఏర్పడింది. కానీ.. అన్యోన్యంగా ఉన్న ఛార్లెస్-డయానా కాపురంలో చిచ్చు రేపిందని, పరోక్షంగా ఆమె మరణానికి కూడా కారణమైందన్న కోపం మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. అందుకే ఆమెకు పూర్తిస్థాయి మహారాణి హోదా దక్కలేదనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు అక్కడ. ప్రస్తుతం క్వీన్ కాన్సోర్ట్ హోదాలో యూకే రాణిగా క్యామిల్లా.. ఇంతకు ముందులాగే కేవలం రాయల్ డ్యూటీస్‌కు మాత్రమే పరిమితం కానుంది. ఇదీ చదవండి: అగ్గి రాజేసిన పెళ్లాలు.. డయానా కొడుకుల మధ్య అగాధం -
King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే
లండన్: బ్రిటన్ను సుధీర్ఘకాలం పాలించిన మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచారు. 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం అందుకున్న ఎలిజబెత్ 70 ఏళ్లకు పైగా ఆ హోదాలో కొనసాగారు. ఇక ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా అవతరించనున్నారు. చార్లెస్‌కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. రాణి ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ (73) బ్రిటన్‌కు కొత్త రాజు కానున్నారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జన్మించారు. ఎలిజబెత్ నలుగురు సంతానంలో చార్లెస్ పెద్దవారు. 1981లో డయానాను వివాహమాడిన చార్లెస్ దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ. వ్యక్తిగత కారణాలతో చార్లెస్ డయానా దంపతులు 1992లో విడిపోయారు. అనంతరం 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన చార్లెస్.. కింగ్ చార్లెస్-3గా వ్యవహరించనున్నారు. అలాగే 14 కామన్వెల్త్ దేశాలకూ రాజుగా కూడా ఉంటారు. బ్రిటన్ కొత్త రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు పాస్‌పోర్టు లేకుండా విహారం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లగలరు. లైసెన్స్ లేకుండా ప్రయాణించగలరు. రాజకుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరి ఆయనకి పాస్‌పోర్టు అవసరం లేదు. బ్రిటన్ రాజు ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా ప్రయణించగలడు. వారికి అవసరమైన సహాయాన్ని, రక్షణ అందిస్తూ బ్రిటన్ రాజు పేరు మీద ప్రత్యేక డాక్యుమెంట్ జారీ చేస్తారు. ఈ కారణంతో బ్రిటన్‌లో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయగల ఏకైక వ్యక్తి రాజు మాత్రమే. రెండు పుట్టినరోజులు చార్లెస్ తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. ఆమె అసలు పుట్టిన రోజుఏప్రిల్ 21. దీనిని ప్రైవేట్‌గా జరుపుకుంటారు. అయితే వేసవి వాతావరణం అవుట్డోర్ పరేడ్స్(బహిరంగ కవాతులకు) అనుకూలంగా ఉంటుందని జూన్ నెలలోని రెండో మంగళవారాన్ని రాణి అధికారిక బహిరంగ వేడుకగా నిర్వహిస్తారు. ఇక చార్లెస్ పుట్టినరోజు కూడా శీతాకాలం ప్రారంభమయ్యే నవంబర్ 14న ఉండటంతో అతని బర్త్‌డేను కూడా వేసవి నెలలో 2అధికారిక పుట్టినరోజు’గా జరిపే అవకాశం ఉంది. ఈ బహిరంగ వేడుకల్లో 1,400 కంటే ఎక్కువ మంది సైనికులు, 200 గుర్రాలు, 400 మంది సంగీతకారులు పాల్గొంటారు. సెంట్రల్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాజ కుటుంబ సభ్యులు చూస్తుండగా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లై-పాస్ట్‌తో ఈ వేడుక కార్యక్రమాలను ముగిస్తుంది. నో ఓటింగ్ బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు ఓటింగ్‌లో పాల్గొనరు. అలాగే ఎన్నికల్లో పోటీచేయరు. దేశాధినేతగా, అతను రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరు పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్లమెంటు నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. అదే విధంగా ప్రధానమంత్రితో వారానికోసారి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రజలకే కాదు బ్రిటీష్ చక్రవర్తి ప్రజలను మాత్రమే పరిపాలించరు. 12వ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్, వేల్స్ అంతటా బహిరంగ జలాల్లోని మూగ హంసలు చక్రవర్తి ఆస్తిగా పరిగణించబడుతున్నాయి. వీటితోపాటు బ్రిటీష్ జలాల్లోని స్టర్జన్(ఒక రకం చేప), డాల్ఫిన్లు, తిమింగలాలకు కూడా రాయల్ ప్రత్యేకాధికారం వర్తిస్తుంది. అధికారిక రచయిత బ్రిటన్ చక్రవర్తి కోసం పద్యాలను రచించేందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఆస్థాన కవిని నియమిస్తారు. ఈ సంప్రదాయం 17వ శతాబ్దం నుంచి వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ రచయితగా నామినేట్ అయిన మొదటి మహిళగా నిలిచారు. ఆమె 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేక 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం పద్యాలను కంపోజ్ చేశారు. రాయల్ వారెంట్ చక్రవర్తికి వస్తువులు సరఫరా చేసే., సేవలను అందించే కంపెనీలకు రాయల్ వారెంట్ జారీ చేస్తారు. ఈ వారెంట్ వారికి గొప్ప గౌరవాన్ని అందించడమే కాకుండా అమ్మకాల ప్రోత్సాహనికి ఉపయోగపడుతుంది. వారెంట్ పొందిన కంపెనీలు తమ వస్తువులపై రాజ ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం కలిగి ఉంటాయి. బర్బెర్రీ, క్యాడ్బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్లు రాయల్ వారెంట్ ఉన్న కంపెనీలలో ఉన్నాయి. -సాక్షి, వెబ్‌డెస్క్ -
ఇక బ్రిటన్ రాజు చార్లెస్
బల్మోరల్ క్యాజిల్: బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్ కౌన్సిల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది. కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రైవీ కౌన్సిల్ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్ చార్లెస్ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదీ చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత -
షాకింగ్! బ్రిటన్ ప్రిన్స్‌కు బిన్ లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు!
లండన్: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్.. ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఒక మిలియన్ పౌండ్లు(రూ.9.6కోట్లు) విరాళంగా తీసుకున్నారని ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ మొత్తం చార్లెస్‌కు చెందిన చారిటబుల్ ట్రస్టులో జమ అయినట్లు తెలిపింది. అమెరికా ట్విన్ టవర్లపై దాడి(9/11) ఘటనలో బిన్ లాడెన్ ప్రధాన సూత్రధారి. అలాంటిది ఆయన సోదరులు బకర్ బిన్ లాడెన్, షఫీక్‌ల నుంచి ప్రిన్స్ చార్లెస్ భారీ విరాళం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే సౌదీకి చెందిన వీళ్లు ఏదైనా తప్పు చేశారా? అనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇప్పటికే నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్స్ చార్లెస్ చారిటబుల్ ట్రస్టులపై అధికారుల నిఘా మరింత పెరిగింది. 2013లో బకర్ లాడెన్‌ను ప్రిన్స్ చార్లెస్ లండన్‌లో కలిసినప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫండ్(పీడబ్ల్యూసీఎఫ్)కు విరాళం అందిందని నివేదిక తెలిపింది. ట్రస్టు సలహాదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రిన్స్ దీన్ని అంగీకరించారని పేర్కొంది. అయితే ఆ సమయంలో ట్రస్టులోని ఐదుగురు సభ్యులు విరాళం తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని పీడబ్ల్యూసీఎఫ్ ఛైర్మన్ ఇయాన్ చెషైర్ వెల్లడించారు. సౌదీ వ్యాపారవేత్తతో క్యాష్ ఫర్ ఆనర్స్ కుంభకోణం ఆరోపణలపై ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన మరో చారిటబుల్ ట్రస్టుపై బ్రిటిష్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ అనంతరం ప్రిన్స్ పౌండేషన్ ముఖ్య అధికారి గతేడాదే రాజీనామా చేశారు. చదవండి: సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు.. -
ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా
లండన్: బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ చార్లెస్‌కు మరోమారు కరోనా సోకింది. గురువారం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణైందని, దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్లోకి వెళ్లారని యువరాజు కార్యాలయం తెలిపింది. కరోనా సోకడంతో ముందుగా అనుకున్నట్లు వించస్టర్ పర్యటనకు రాలేకపోతున్నందుకు విచారిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. బుధవారం సాయంత్రం ఆయన బ్రిటిష్ మ్యూజియం వద్ద చాలామందిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య కమిల్లా, బ్రిటన్ ట్రెజరీ చీఫ్ రుషి సనక్ తదితరులు కూడా ఉన్నారు. కమిల్లీకు పరీక్షలో నెగెటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. చార్లెస్‌కు గతంలో ఒకమారు కరోనా సోకింది. అనంతరం ఆయన మూడు డోసుల టీకా తీసుకున్నారు. ఈ దఫా కరోనా సోకినప్పుడు లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు ఆయన సిబ్బంది చెప్పారు. స్పెయిన్ రాజదంపతులకు కూడా కరోనా సోకింది. -
తాగి కారు నడిపితే నేరం.. మరీ కారే వైన్ తాగి రోడ్ల మీదకి వస్తే!?
డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం, అంటే మద్యం సేవించి కారు నడిపితే చట్ట ప్రకారం శిక్షార్హులు. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే అది నేరమా? దానికేమైనా శిక్షలు ఉంటాయా? అసలు అది సాధ్యమా ? అంటే అవుననే అంటున్నారు యువరాజా వారు. అనడమే కాదు నిజం చేసి చూపించారు కూడాను. అసలు కారేంటి, అది వైన్ తాగడమేంటీ అనే సందేహాలు వస్తున్నాయా? అయితే ఈ వివరాలేంటో మీరే చూడండి. అది అలాంటి ఇలాంటి కారు కాదు. రాజుగారు వాడే కారు. ఆయనేమో సామాన్యమైన రాజు కాదు, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్ రాజవంశపు కాబోయే చక్రవర్తి. అందుకే ఈ కారు నడిచేందుకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్‌లు ఉపయోగించడం లేదు. అంతకు మించి మనమెవరం ఊహించలేని ఇంధనాన్ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వివరించారు. కొత్త ఐడియా కార్లను కనిపెట్టినప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు అవి నడిచేందుకు ఫ్యూయల్‌గా వాడేది డీజిల్ లేదా పెట్రోల్లను ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్జీ గ్యాస్. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ రాజుగారు మరో అడుగు ముందుకు వేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్రోలు , డీజిల్ బదులు వైన్‌తో నడిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. వెంటనే తన సిబ్బందిని పిలిపించి ఆదేశాలు జారీ చేశారు. అస్టోన్ మార్టిన్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్‌కి 21వ ఏటా ఆస్టోన్మార్టిన్ కారుని బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా సరే ఆ పాత ఆస్టోన్ మార్టిన్ కారు వన్నె తగ్గలేదు. రాజుగారికి దానిపై మోజు పోలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో చక్కర్లు కొడుతూనే ఉంటారు. తన మనసులో మాట చెప్పేందుకు ఈ కారునే రాజుగారు ఎంచుకున్నారు. వైన్ ఉంటే చాలు యువరాజు ఆజ్ఞలకు తగ్గట్టుగా కారుని రీ డిజైన్ చేశారు ఇంజనీర్లు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు జున్ను తయారు చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఫ్యూయల్‌గా వాడుతున్నారు. ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్ ఛార్లెస్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అక్టోబరు 31న వాతావరణ మార్పులపై సమావేశం జరగనుంది. కర్బణ ఉద్ఘారాలు తగ్గించేందుకు ప్రపంచ నాయకులు చేస్తున్న కృషికి నా వంతు సహాకారం అందించేందుకు పెట్రోలు, డీజిల్ బదులు వైన్‌ను ఉపయోగిస్తున్నాను’ అంటూ ఆయన తెలిపారు. కాలుష్యమే కారణం ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కర్బణ ఉద్ఘారాలను తగ్గించాలంటూ ప్రపంచ దేశాలన్నీ నిర్ణయిస్తున్నాయి. వాతావరణ కాలుష్యంపై ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. బ్రిటీష్ యువరాజు ఇప్పటి వరకు స్పందించలేదు,. దీంతో ఆయనపై చాలా విమర్శలు లోగడ వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్ కార్లంటే రాయల్ రేంజ్ ఏముంటుంది అనుకున్నారో ఏమో? ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్ కారు ఫార్ములాను యువరాజు ఎంచుకున్నారు. అయితే రాజుగారి నిర్ణయంపై గ్లోబల్ లీడర్ల నుంచి పెద్దగా స్పందన లేకున్నా సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. చదవండి :ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్! -
వేలానికి 40 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఏకంగా
లండన్: పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణలుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువుల వేలం కోసం ఎదురు చూస్తుంటారు. వాటికి లక్షల్లో డబ్బులు చెల్లించి మరి సొంతం చేసుకుంటారు. వేలం పాటలో వస్తువులను సొంతం చేసుకుంటే పర్లేదు కానీ.. మరీ ఏళ్ల క్రితం నాటి ఆహారాన్ని తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుంది. అటు తినలేం ఇటు పడేయలేం. వాసన రాకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క వేలానికి రాబోతుంది. అది కూడా బ్రిటన్ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడంతో చాలా మంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలు.. ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా అనగా 1981 కాలంలో తయారు చేసిన కేక్ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. వివాహం సందర్భంగా వచ్చిన 23 అధికారక పెళ్లి కేకుల్లోని ఓదాని ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. దీనిపై జూలై 29, 1981 అని డేట్ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది. ఈ కేక్ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు ఇవ్వబడింది. ఆమె దీన్ని ఓ పూల కేక్ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్ అంటించి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్ చార్లెస్-ప్రిన్సెస్ డయానాల వివాహ కేక్’ అని ఉంది. అలానే 24-07-81 అని డేట్ వేసి ఉంది. స్మిత్ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మారు. ఆ తర్వాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు. త్వరలో జరగబోయే వేలంలో ఈ కేక్ ముక్క 300-500 పౌండ్ల (31,027-51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్ ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్ వింటర్ ఔక్షనీర్స్ సీనియర్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు. -
ప్రిన్సెస్ డయానా కారు వేలం; వామ్మో అంత ధర!
వేల్స్: వేల్స్ యువరాణి డయానాకు చెందిన ఫోర్డ్ ఎస్కార్ట్ కారును వేలం వేశారు. కాగా వేలంలో దక్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యుజీషియన్ ఆ కారును కొనుగోలు చేశాడు. డయానా వాడిన కారుకు వేలంలో 50 వేల పౌండ్స్‌కు పైగా ధర పలికింది. మన ఇండియన్ కరెన్సీలో కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షల కన్నా ఎక్కువ. ప్రస్తుతం డయానా వాడిన కారుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఒక పాతకారుకు ఇంత ధర అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రిన్సెస్ డయానా 1961 లో జన్మించింది. 1981లో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. 1981లో వారి వివాహానికి ముందు డయానాకు ఎంగేజ్మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారును డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది. అయితే 36 ఏళ్ల వయసులో ఆగస్టు 31, 1997లో పారిస్‌కు వెళ్లిన డయానా ఘోరరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోటార్‌బైక్‌ను తప్పించబోయి కారు పల్టీ కొట్టడంతో డయానా అక్కడికక్కడే మరణించారు. చదవండి: యువతి క్లాసికల్ డ్యాన్స్; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్ -
'క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది'
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటన్ రాజకుటుంబం కూడా మహమ్మారి బారీన పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకుటుంబంలో క్వీన్ ఎలిజబెత్ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కరోనా బారీన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. కాగా తండ్రి ఆరోగ్యంపై ప్రిన్స్ విలియమ్స్ స్పందించాడు. ' 70 ఏళ్ల వయసున్న నా తండ్రి ప్రిన్స్ చార్లెస్ గత నెలలో కోవిడ్-19 బారీన పడ్డాడు. ఒక వారం పాటు స్కాట్లాండ్లోని తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే నా తండ్రికి చాతి ఇన్ఫెక్షన్తో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఇప్పట్లో కోలుకోలేడోమోనని భావించాం. కానీ కరోనాను జయించిన వారిలో ఇప్పుడు మా నాన్న ముందు వరుసలో ఉంటాడు. అయితే నానమ్మ క్వీన్ ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వయసులో పెద్దవారు కావడంతో వారి ఆరోగ్యంపై కొంచెం దిగులుగా ఉంది. అయినా వారి ఆరగ్యో పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కరోనా మహమ్మారి వారి దరి చేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిడంతో ప్రజలంతా తమ మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని, అది అంతా మన మంచికేనని ప్రిన్స్ విలియమ్స్, అతని భార్య కేట్ పేర్కొన్నారు. దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు ప్రజలంతా మనో నిబ్భరం కోల్పోవద్దని, అందరూ దైర్యంగా ఉండాలని తెలిపారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల కరోనా పూర్తిగా తగ్గదు: చైనా) -
వైరల్ : ప్రిన్స్ చార్లెస్‌తో కనికా..
కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పేరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆమె లండన్ నుంచి తిరిగివచ్చాక కరోనా నిర్ధారణ కాకముందు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా పార్టీలకు హాజరుకావడం కొద్ది రోజుల కిందట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. దీంతో కనికా నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా కనికా కపూర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌ను కనికా కలిసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో ప్రిన్స్ చార్లెస్‌తో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఈ ఫొటోలు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అక్కడే సమస్య మొదలైందని ఒకరు, యూపీ టూ యూకే అని మరోకరు ట్వీట్లు చేస్తున్నారు. కాగా, ఆ ఫొటోలు ఇప్పటివి కావని.. 2015 ప్రిన్స్ చార్లెస్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి చెందినవిగా తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న కనికాకు మూడోసారి నిర్వహించిన పరీక్షలోనూ కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా: ఇంకా కోలుకోని కనికా కపూర్ బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా -
బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా
లండన్: బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌కూ కరోనా వైరస్ సోకింది. ఛార్లెస్‌లో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు బుధవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. అధికార వర్గాలు తెలిపిన దాని ప్రకారం బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 20వేలమందికిపైగా మరణించారు. మొత్తం 181 దేశాల్లో 4.45 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. బాధితులు సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తూండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటలీలో ఫిబ్రవరిలో తొలి కోవిడ్ మరణం నమోదు కాగా, నెల తిరక్కుండానే ఆ దేశంలో సుమారు 6,820 మంది ప్రాణాలు కోల్పోవడం, వ్యాధి పుట్టిన చైనా కంటే ఎక్కువ మరణాలు స్పెయిన్‌లోనూ సంభవించడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం చైనాలో 3281 మరణాలు సంభవించగా స్పెయిన్‌లో ఈ సంఖ్య 3434కు చేరుకుంది. వ్యాప్తి కట్టడికి స్పెయిన్ అనేక కఠిన చర్యలు చేపట్టినప్పటికీ సుమారు 47,610 మంది వ్యాధి బారిన పడ్డారని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికా దేశం కామరూన్, నైజర్‌లో మంగళవారం తొలి కరోనా మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్ రాజకుటుంబానికి పరీక్షలు బ్రిటన్ రాజకుటుంబానికి సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా చార్లెస్‌కు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన భార్య కెమిల్లాతో కలిసి స్కాట్లాండ్లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కెమిల్లాకు వ్యాధి లేనట్లు తేలింది. ఇరాన్లో రెండువేలకు పైమాటే ఇరాన్లో బాధితుల సంఖ్య 2077కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో 143 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 27,017గా ఉన్నట్లు తెలిపారు. -
ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్
లండన్ : కరోనా మహమ్మారి సెగ బ్రిటన్ రాజకుటుంబాన్ని తాకింది. ప్రిన్స్ చార్లెస్(71)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ప్రిన్స్ చార్లెస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన స్కాట్‌ల్యాండ్‌లోని తన నివాసంలో స్వీయ నిర్భందంలో ఉన్నారని క్లారెన్స్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, చార్లెస్ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్ వచ్చిందన్నారు. మరోవైపు బ్రిటన్‌లో ఇప్పటివరకు 8077 కేసులు నమోదు కాగా.. 422 మంది మృత్యువాతపడ్డారు. -
కరోనా ఎఫెక్ట్.. ఇక నమస్తే విశ్వవ్యాప్తం
కరోనా వైరస్ పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనాకు మందు లేకపోవడంతో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి మొదలకుని పలు దేశాధినేతలు.. షేక్ హ్యాండ్‌కు స్వస్తి పలికి భారతీయ సంప్రదాయమైన ‘నమస్తే’ను ఫాలో అవుతున్నారు. ఇతరులను నమస్తే అంటూ పలకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ కూడా ప్రపంచం మొత్తం నమస్తేను ఆదరిస్తుందని అన్నారు. పలు కారణాలతో మన అలవాటు(నమస్తే)కు ముగింపు పలికినవారు.. తిరిగి ప్రారంభించడానికి ఇదే మంచి సమయమని అన్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్లు ఒకరినొకరు నమస్తే అంటూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఇండియాలో పర్యటించినప్పుడు అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూడలేదు. వాళ్లు చాలా సులువుగా నమస్తే చెప్పుకుంటార’ని తెలిపారు. మరికొందరకు విదేశీ ప్రముఖులు కూడా షేక్‌హ్యాండ్ గుడ్ బై చెప్పి.. నమస్తే బాట పట్టారు. నమస్తే బాటలో.. ► ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహు షేక్‌హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలని ప్రజలను కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. ► ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్ కూడా అతిథులను నమస్తే అంటూ పలకరిస్తున్నారు. పారిస్ పర్యటనకు వచ్చిన స్పెయిన్ రాజు ఫెలిపేకు మక్రాన్ నమస్తేతో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ► ప్రిన్స్ చార్లెస్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేందకు భయపడిపోతున్నారు. లండన్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రిన్స్ చార్లెస్.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించి వెంటనే నమస్తే చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూకే దాదాపు 500 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్ రాజ కుటుంబం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. చదవండి : ఐపీఎల్ 2020 వాయిదా కరోనాపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం