బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది...
► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది.
► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది.
► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు.
ఐదు దశల్లో...
► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్‌బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది.
► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు.
► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు.
► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు.
► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు.
► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు.
► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది.
► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు.
► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది.
► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం!
► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు.
రూ.1,000 కోట్ల ఖర్చు
► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది!
► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment