Britain government
-
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Johnson Government: సంక్షోభంలో జాన్సన్ సర్కారు
లండన్: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్ జాన్సన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కలకలం రేపుతోంది. పార్టీ గేట్ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో అల్లాడుతున్న జాన్సన్ ప్రభుత్వం తాజా పరిణామాలతో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. కొంతకాలంగా జాన్సన్ పనితీరు దారుణమంటూ లేఖలో సునక్ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వం సజావుగా, సమర్థంగా, సీరియస్‌గా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి గనుకనే తప్పుకుంటున్నా’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రధాని నాయకత్వంలో పని చేసేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని సాజిద్ కూడా లేఖలో పేర్కొన్నారు. తానిక మళ్లీ మంత్రి చేపట్టకపోవచ్చని సునక్ చెప్పగా, జాతీయ ప్రయోజనాలను కన్జర్వేటివ్ పార్టీ సమర్థంగా కాపాడుతుందన్న ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయామంటూ సాజిద్ తన లేఖలో పదునైన విమర్శలు చేశారు. జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని తేల్చేశారు. వారి రాజీనామాకు ముందు మంగళవారం రోజంతా భారీ పొలిటికల్ డ్రామా నడిచింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ ఎంపీ క్రిస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా కీలక పదవిలో నియమించడం పొరపాటేనంటూ జాన్సన్ ప్రకటన చేశారు. అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు చెప్పారు. ఆ వెంటనే జాన్సన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో మంత్రుల రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయి. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్ ఇప్పటికే పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఆయనకు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్ బొటాబొటిగా బయటపడ్డారు. -
హోంక్వారంటైన్‌కు బ్రిటన్ గుడ్‌బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
భారతీయ విద్యార్థులకు లబ్ధి.. రెండేళ్లలో ఈ వీసాపై ఉద్యోగాలు
లండన్: యూకే యూనివర్సిటీలో కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలు కల్పించే పోస్ట్ స్టడీ వీసా (పీఎస్‌డబ్ల్యూ)కు దరఖాస్తు చేసే గడువును బ్రిటన్ ప్రభుత్వం పెంచింది. దీని మూలంగా భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. యూనివర్సిటీ కోర్సులు పూర్తయిన తర్వాత రెండేళ్లలో ఈ వీసాపై ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అంటే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాన్వేషణ నిమిత్తం రెండేళ్లు యూకేలో ఉండటానికి ఈ వీసా వీలు కల్పిస్తుంది. యూకే హోమ్ సెక్రటరీ ప్రితీ పటేల్ గత ఏడాది ప్రారంభించిన ఈ వీసాలకు దరఖాస్తు చేసే గడువు జూన్ 21తో ముగిసిపోతుంది. అయితే కోవిడ్–19 సంక్షోభం కారణంగా చాలామంది విద్యార్థులు సకాలంలో యూకేకు వెళ్లలేకపోయారు. దీంతో గడువుని సెప్టెంబర్ 27 వరకు పెంచారు. యూకేకి విద్యార్థిగా వచ్చి ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 27లోగా రావాల్సి ఉంటుందని యూకే అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. డెల్టా వేరియెంట్ వెలుగులోకి వచ్చాక భారత్ నుంచి ప్రయాణాలపై యూకే నిషేధం విధించి రెడ్ లిస్టులో ఉంచడంతో వీసా గడువు పెంచాలని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ యూకే (ఎన్ఐఎస్ఏయూ) విస్తృతంగా ప్రచారం చేసింది. చదవండి: పీసీసీపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి వచ్చిన ఇద్దరు నాయకులు -
యూకే వీసా మరింత ఖరీదు
లండన్: భారతీయులకు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం లేని దేశా లకు చెందిన పౌరులకు బ్రిటన్ వీసా మరింత ఖరీదు కానుంది. ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ను (ఐహెచ్ఎస్) బ్రిటన్ ప్రభుత్వం పెంచడంతో భారతీయులపై ఆర్థిక భారం భారీగా పడనుంది. బ్రిటన్‌లో నివాసమున్నప్పుడు వారి ఆరోగ్య సంరక్షణ కోసం నేషనల్ హెల్త్ సర్వీసు(ఎన్హెచ్ఎస్) పరిధిలోకి వచ్చేలా 2015 నుంచి బ్రిటన్ ప్రభుత్వం హెల్త్ సర్చార్జ్ను వసూలు చేస్తోంది. భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే సర్‌చార్జ్‌ని చెల్లించాల్సి ఉం టుంది. ఇప్పుడు ఈ సర్‌చార్జ్‌ని ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇన్నాళ్లూ ఈ సర్‌చార్జీ ఏడాదికి 200 పౌండ్లు(రూ.18వేలు) ఉంటే, ఇప్పుడు దానిని 400 పౌండ్లు (రూ.36వేలు) చేసింది. కొత్త చార్జీలు జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సర్‌చార్జీలను పెంచడమే కాదు, ఇంగ్లండ్‌కు వచ్చే విదేశీ విద్యార్థులకు అడ్డుకట్ట వేయడానికి పలు చర్యల్ని చేపట్టనుంది. కేవలం ప్రతిభ ఆధారంగానే విద్యార్థులు రావడానికి అనుమతులు మంజూరు చేస్తామని బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావేద్ వెల్లడించారు. ఈయూ నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు కల్పిస్తే ఏడాదికి కనీసం 30వేల పౌండ్లు (రూ.27 లక్షలు) వేతనం ఇచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. 30వేల పౌండ్లు వేతనం అన్నది చాలా ఎక్కువనీ, అలా చేస్తే నర్సుల వంటి ఉద్యోగాల కోసం ఈయూ మీదనే ఆధారపడ్డ వారికి చాలా నష్టం జరుగుతుందని నేషనల్ హెల్త్ సర్వీసు సహా పలు సంస్థల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. లండన్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతిబంధకంగా మారతాయని లండన్ నగర మేయర్ సాదిక్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చే బ్రెగ్జిట్ రిఫరెండం ఆమోదం పొందిన దగ్గర్నుంచి బ్రిటన్‌కు వలస వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. 2014–15లో 3 లక్షల మందికి పైగా ఇతర దేశాల విద్యార్థులు, ఉద్యోగులు వలసవస్తే, గత ఏడాది వారి సంఖ్య 2 లక్షల 80వేలకు తగ్గిపోయింది. -
రెఫరెండం సరే.. తర్వాత ఏంటి?
బ్రిటన్‌లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ - వీలైనంత త్వరగా తెగదెంపుల ప్రక్రియకు శ్రీకారం - కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ పోరు లండన్: చరిత్రాత్మక రెఫరెండమ్‌తో ప్రజా తీర్పు వెల్లడైంది కానీ... తర్వాత ఏం జరుగుతుందనే విషయమై బ్రిటన్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. యురోపియన్ యూనియన్‌లోని దేశాలతో వాణిజ్య భాగస్వామ్యంపై చర్చల ప్రక్రియే యూకే ముందున్న అతిపెద్ద సవాలు. దీంతోపాటు.. అధికార కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ రేసు మొదలు కానుంది. సాధారణంగా అయితే రెఫరెండం ఫలితానికి బ్రిటన్ ప్రభుత్వం చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. 2015 సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే కన్జర్వేటివ్ పార్టీ రెఫరెండాన్ని నిర్వహించి.. ప్రజాతీర్పును గౌరవించాల్సి వచ్చింది. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. కాగా, సోమవారం కామెరాన్ అధ్యక్షతన బ్రిటన్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాత మంగళ, బుధవారాల్లో ఆయన బ్రసెల్స్ చేరుకుని యూరోపియన్ కౌన్సిల్‌కు బ్రిటన్ రిఫరెండమ్ గురించి సమాచారం అందజేస్తారు. కొత్త ప్రధానికి కత్తిమీద సామే! బ్రెగ్జిట్‌పై ప్రజాతీర్పు వరకు అంతా సవ్యంగానే సాగినా.. ఇకపై పరిస్థితులు క్లిష్టంగా మారనున్నాయి. దీనికి కారణాలనేకం. ముఖ్యంగా రెఫరెండమ్ అమల్లోకివచ్చిన తర్వాత వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున పునఃసంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలి. అలాగే ఈయూ-బ్రిటన్ మధ్య భవిష్యత్తులో సంబంధాలు ఏవిధంగా ఉంటాయనేదీ కీలకమే. ఈ సంప్రదింపుల ప్రక్రియ ఏళ్లకేళ్లు కొనసాగొచ్చనేది నిపుణుల అంచనా. ఈయూ నుంచి నిష్ర్కమణతో బ్రిటన్ స్వేచ్ఛా మార్కెట్‌గా మారుతుంది. దీంతో కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ప్రపంచ దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదంతా కామెరాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు తీసుకునే వ్యక్తికి కత్తిమీద సామే. ఇదే తొలిసారి: వాస్తవానికి ఈయూ నుంచి ఒక సభ్య దేశం వైదొలగాలంటే 2009 లిస్బాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50 ప్రకారమే సాధ్యమవుతుంది. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీని ప్రకారం ఈయూతో తెగదెంపులు చేసుకునేందుకు రెండేళ్లలో సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం బ్రిటన్ విడిపోయే ప్రక్రియను పూర్తి చేసేందుకు 2020 వరకు సమయం పడుతుందని అంచనా. 1982లో ఈయూ నుంచి గ్రీన్లాండ్ విడిపోయింది. కానీ అప్పటికీ ఈ ఒప్పందం అమల్లో లేదు. కాగా బ్రెగ్జిట్ గురించి చర్చించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, ఇటలీ, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులు శనివారం సమావేశం కానున్నారు. బ్రిటన్ బాటలో పయనించేందుకు పలు దేశాలు ఆలోచిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. 27 సభ్యదేశాలు తమ పార్లమెంటులలో తీర్మానం చేసి బ్రిటన్ నిష్ర్కమణకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.