రెఫరెండం సరే.. తర్వాత ఏంటి?
బ్రిటన్‌లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ
- వీలైనంత త్వరగా తెగదెంపుల ప్రక్రియకు శ్రీకారం
- కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ పోరు
లండన్: చరిత్రాత్మక రెఫరెండమ్‌తో ప్రజా తీర్పు వెల్లడైంది కానీ... తర్వాత ఏం జరుగుతుందనే విషయమై బ్రిటన్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. యురోపియన్ యూనియన్లోని దేశాలతో వాణిజ్య భాగస్వామ్యంపై చర్చల ప్రక్రియే యూకే ముందున్న అతిపెద్ద సవాలు. దీంతోపాటు.. అధికార కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ రేసు మొదలు కానుంది. సాధారణంగా అయితే రెఫరెండం ఫలితానికి బ్రిటన్ ప్రభుత్వం చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. 2015 సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే కన్జర్వేటివ్ పార్టీ రెఫరెండాన్ని నిర్వహించి.. ప్రజాతీర్పును గౌరవించాల్సి వచ్చింది. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. కాగా, సోమవారం కామెరాన్ అధ్యక్షతన బ్రిటన్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాత మంగళ, బుధవారాల్లో ఆయన బ్రసెల్స్ చేరుకుని యూరోపియన్ కౌన్సిల్‌కు బ్రిటన్ రిఫరెండమ్ గురించి సమాచారం అందజేస్తారు.
కొత్త ప్రధానికి కత్తిమీద సామే!
బ్రెగ్జిట్‌పై ప్రజాతీర్పు వరకు అంతా సవ్యంగానే సాగినా.. ఇకపై పరిస్థితులు క్లిష్టంగా మారనున్నాయి. దీనికి కారణాలనేకం. ముఖ్యంగా రెఫరెండమ్ అమల్లోకివచ్చిన తర్వాత వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున పునఃసంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలి. అలాగే ఈయూ-బ్రిటన్ మధ్య భవిష్యత్తులో సంబంధాలు ఏవిధంగా ఉంటాయనేదీ కీలకమే. ఈ సంప్రదింపుల ప్రక్రియ ఏళ్లకేళ్లు కొనసాగొచ్చనేది నిపుణుల అంచనా. ఈయూ నుంచి నిష్ర్కమణతో బ్రిటన్ స్వేచ్ఛా మార్కెట్‌గా మారుతుంది. దీంతో కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ప్రపంచ దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదంతా కామెరాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు తీసుకునే వ్యక్తికి కత్తిమీద సామే.
ఇదే తొలిసారి: వాస్తవానికి ఈయూ నుంచి ఒక సభ్య దేశం వైదొలగాలంటే 2009 లిస్బాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50 ప్రకారమే సాధ్యమవుతుంది. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీని ప్రకారం ఈయూతో తెగదెంపులు చేసుకునేందుకు రెండేళ్లలో సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం బ్రిటన్ విడిపోయే ప్రక్రియను పూర్తి చేసేందుకు 2020 వరకు సమయం పడుతుందని అంచనా. 1982లో ఈయూ నుంచి గ్రీన్‌లాండ్ విడిపోయింది. కానీ అప్పటికీ ఈ ఒప్పందం అమల్లో లేదు. కాగా బ్రెగ్జిట్ గురించి చర్చించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, ఇటలీ, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులు శనివారం సమావేశం కానున్నారు. బ్రిటన్ బాటలో పయనించేందుకు పలు దేశాలు ఆలోచిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. 27 సభ్యదేశాలు తమ పార్లమెంటులలో తీర్మానం చేసి బ్రిటన్ నిష్ర్కమణకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.