conservative party
-
విపక్ష నేత పదవికి సునాక్ గుడ్‌బై
లండన్: బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్‌మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్‌కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. వెనక బెంచీల్లో కూచుంటాఅమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్ తోసిపుచ్చారు. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు. -
Britain: రిషి వారసుడెవరో?!
బ్రిటన్‌లో రిషి సునాక్ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్‌నాక్ మొదలుకుని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశముంది.గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్ (టోరీ) పార్టీ కకావికలైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా అది రికార్డులకెక్కింది. పార్లమెంటులో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఎకాయెకి 121కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయడం కొత్త నాయకునికి పెను సవాలే కానుంది. భారత మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్, మెల్ స్ట్రైడ్ తొలి రౌండ్లలోనే వైదొలిగి రేసులో నలుగురు మిగిలారు. వారిలో క్లెవర్లీకే మొగ్గున్నట్టు పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు, నేతలు జెన్రిక్ వైపే మొగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.కేమీ బేడ్‌నాక్ (44)నైజీరియా తల్లిదండ్రులకు లండన్‌లో జన్మించారు. 2017, 2022ల్లో ఎంపీగా గెలిచారు. బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక పార్టీ నేత పదవికి తొలిసారి పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచారు. ముక్కుసూటి నాయకురాలిగా పేరు. దివంగత ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శమంటారు. ట్రాన్స్జెండర్ల హక్కులు మొదలుకుని ప్రతి అంశంపైనా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమర్థులకు కీలక బాధ్యతలివ్వడం ద్వారా పార్టీలో సమూల ప్రక్షాళనే లక్ష్యమని చెబుతున్నారు.జేమ్స్ క్లెవర్లీ (54)పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పని చేశారు. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం, విదేశాంగ మంత్రిగా చేశారు. బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. పార్టీకి బ్రిటన్‌లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష, అటు రైట్‌వింగ్ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్ ఇమేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. పలు సర్వేల్లో ముందంజలో ఉన్నారు.రాబర్ట్ జెన్రిక్ (42)పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీం ఆశించిన ఫలితాలివ్వడం లేదంటూ గత డిసెంబర్లో వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు.టామ్ టూగన్హాట్ (51)మాజీ సైనికుడు. ఇరాక్‌లో పని చేశారు. అరబిక్‌లో ధారాళంగా మాట్లాడగలరు. సెంట్రిస్ట్ నాయకుడు. 2022లో పార్టీ నేత పదవికి జరిగిన పోరులో లిజ్ ట్రస్ చేతిలో ఓడారు. ఎంపిక ఇలా...టోరీల సారథి ఎంపిక ప్రక్రియ కాస్ల సంక్లిష్టంగా ఉంటుంది. తుది రేసులో ఉన్న నలుగురు నేతలు పార్టీ ఎంపీలు, ముఖ్య నేతల మద్దతు గెలుచుకోవడం కీలకం. అందుకోసం పలు అంశాలపై తమ వైఖరిని వారి ముందుంచాలి. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. టోరీ ఎంపీలు, నేతల 4 రోజుల కీలక సదస్సు బర్మింగ్‌హాంలో ఆదివారం మొదలైంది. అభ్యర్థులను వారు మంగళవారం దాకా ఇంటర్వ్యూ చేస్తారు. చివరి రోజైన బుధవారం అభ్యర్థులకు ప్రధాన పరీక్ష ఎదురవుతుంది. ఒక్కొక్కరు 20 నిమిషాల పాటు చేసే ప్రసంగం కీలకం కానుంది. ఎంపీలు, నేతలను ఆకట్టుకునే వారి ఎన్నిక దాదాపు లాంఛనమే అవుతుంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే టోరీ ఎంపీల ఓటింగ్ ప్రక్రియ అనంతరం చివరికి ఇద్దరు అభ్యర్థులు రేసులో మిగులుతారు. వారి నుంచి తమ నాయకున్ని ఎన్నుకునేందుకు 1.7 లక్షల పై చిలుకు టోరీ సభ్యులు అక్టోబర్ 15 నుంచి 31 దాకా ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. విజేత ఎవరన్నది నవంబర్ 2న తేలుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గట్టెక్కిన కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందున్న సవాళ్లు.. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్‌పై రెండో ఓటింగ్‌ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్‌లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్‌లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. -
బ్రిటన్ విపక్షనేత రేసులో మాజీ మంత్రి ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్ విపక్షనేత పదవి కోసం భారతీయ మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్ పోటీపడుతున్నారు. తన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో రిషి సునాక్ తన విపక్ష నేత పదవి నుంచి నవంబర్ రెండోతేదీన వైదొలగనున్నారు. దీంతో పార్టీని మళ్లీని విజయయంత్రంగా మారుస్తానంటూ 52 ఏళ్ల ప్రీతీపటేల్ ఆదివారం తన అభ్యరి్థత్వాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు జేమ్స్ క్లెవర్లీ, టామ్ టగెన్డాట్, మెల్ స్టైడ్, రాబర్ట్ జెన్రిక్లతో ఆమె పోటీపడనున్నారు. -
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. భగవద్గీతపై ప్రమాణం చేసి కింగ్ ఛార్లెస్ రాజుకు విదేయతగా ఉంటానని పేర్కొన్నారు.శివాని రాజా చేసిన స్వీకారోత్సవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. మన పవిత్ర గ్రంథాలకు మీరు తగిన గౌరవం ఇవ్వడం సంతోషంగా ఉంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఈ భగవద్గీత మార్గదర్శకంగా పనిచేస్తుందని భావిస్తున్నాం* అంటూ కామెంట్ చేస్తున్నారు.It was an honour to be sworn into Parliament today to represent Leicester East. I was truly proud to swear my allegiance to His Majesty King Charles on the Gita.#LeicesterEast pic.twitter.com/l7hogSSE2C— Shivani Raja MP (@ShivaniRaja_LE) July 10, 2024 కాగా గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ నుంచి ఆమె కన్జర్బేటివ్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. అక్కడ గత 37 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేతలెవరూ గెలవకపోవడం గమనార్హం. ఇన్నేళ్ల తరవాత గెలిచి శివాని రాజా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడించింది కూడా భారత సంతతికి చెందిన నేత (రాజేశ్ అగర్వాల్) కావడం విశేషం. శివానికి 14,526 ఓట్లు రాగా రాజేశ్‌కు 10,100 ఓట్లు పడ్డాయి.ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారాన్ని కోల్పోగా.. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. -
British Parliament Election 2024: ఆ డ్రెస్సేంటి?
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ నేత రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లండన్‌లోని తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ గుమ్మం ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా చివరి మాటలు చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన భార్య అక్షతా మూర్తి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. జోకులు సైతం విసురుతున్నారు. ఆమె ధరించిన డ్రెస్సు ధరపై కూడా చర్చ జరుగుతోంది. రిషి సునాక్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్షతా మూర్తి ఆయన వెనుకే గొడుగు పట్టుకొని నిల్చున్నారు. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన నిలువు, అడ్డం చారల డ్రెస్సును ధరించారు. ఈ డ్రెస్సు చాలామందికి నచ్చలేదు. ఆ సందర్భానికి అలాంటి వ్రస్తాలు నప్పలేదని అంటున్నారు. చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని చెబుతున్నారు. డెస్సుపై క్యూఆర్ కోడ్ మాదిరిగా ఆ చారలేంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అక్షతా మూర్తి డెస్సు ఖరీదు 395 పౌండ్లు(రూ.42,000). రిషి సునాక్ వెనుక ఆమె అలా గొడుగు పట్టుకొని నిల్చోవడం అస్సలు బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అక్షతా మూర్తి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, భారత రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతుల కుమార్తె అనే సంగతి తెలిసిందే. -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
ఘోర పరాజయంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం మొదలైన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష లేబర్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దాదాపు 300కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతుంది. భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకన్జర్వేటివ్ పార్టీ కేవలం 63 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. దీంతో బ్రిటన్ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు ఖాయంగా మారింది. ఇక బ్రిటన్ ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమిని ప్రధాని రిషి సునాక్ అంగీకరించారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్లో తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఆయన దేశ ప్రజలను క్షమాపణలు కోరారు.‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా, సరైన పద్దతిలో చేతులు మారుతుంది. ఇది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’ అని సునాక్ అన్నారు.ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ (61) బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి అవనున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడటంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. -
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్‌పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
Britain general elections: బ్రిటన్‌లో ప్రశాంతంగా ఎన్నికలు
లండన్: పధ్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చరమగీతం పాడనున్నారన్న విశ్లేషణల నడుమ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం గురువారం ప్రశాంతంగా పూర్తయింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, వలసల కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెల్సిందే. ఉదయాన్నే భార్య అక్షతామూర్తితో కలిసి సునాక్ నార్త్ఆలెర్టన్ సిటీ దగ్గర్లోని కిర్బీ సిగ్స్టన్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో ఫేవరెట్‌గా నిలిచిన విపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ సైతం భార్య విక్టోరియాతో కలిసి ఉత్తర లండన్‌లోని క్యామ్‌డెన్ విల్లింగ్‌హామ్ హాల్ పోలింగ్‌కేంద్రంలో హుషారుగా ఓటేశారు. బ్రిటిష్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటలకే 40,000 పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ మొదలైంది. బ్రిటన్‌లో 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటలదాకా అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ఉన్న మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు. సాధారణ మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు గెలవాలి. ప్రధానమైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతోపాటు లిబరల్ డెమొక్రాట్స్, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ, సిన్ ఫియెన్, ప్లెయిడ్ సిమ్రూ, ది యాంటీ ఇమిగ్రేషన్ రిఫామ్ పార్టీలతోపాటు స్వతంత్రులు బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్‌పోల్స్ వెలువడే అవకాశముంది. కన్జర్వటివ్ పార్టీ కేవలం 53–150 సీట్లు సాధిస్తుందని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓపీనియన్స్ పోల్స్ వెల్లడయ్యాయి. -
రిషి సునాక్‌కు షాక్ తప్పదా.?.. తాజా సర్వే ఏం చెప్పింది?
లండన్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. రిషి సునాక్‌కు ఓటమి తప్పేలా లేదు. బ్రిటన్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు రిషి సునాక్‌కు ఓడిపోవడం ఖాయమని చెప్పగా.. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రిషి సునాక్‌కు షాక్ తప్పదా.? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. బ్రిటన్‌కు తొలి భారత సంతతి ప్రధాని అయిన రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఒపీనియన్ పోల్స్ ఇదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటికే మూడు సర్వేలు వెల్లడించగా.. తాజాగా మరో సర్వే కూడా జూలై 4న జరుగనున్న ఎన్నికల్లో సునాక్ ఘోరంగా ఓడిపోతారని అంచనా వేసింది.సండే టెలిగ్రాఫ్ పత్రిక కోసం మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత సర్వేను నిర్వహించింది. జూన్ 12 నుంచి 14 మధ్య సర్వే చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్లు తగ్గి 21 శాతానికి చేరుకుంది. రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్కిన్స్ తెలిపారు. ఇక.. ప్రజలు పోస్టల్ బ్యాలెట్లు అందుకోవాడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే సర్వే ఫలితాలు వెలువడటం విశేషం.కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. 200 ఏండ్ల బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఇదే అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాగా, మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు. -
British Parliament Dissolve: బ్రిటన్ పార్లమెంట్ రద్దు..
బ్రిటన్ పార్లమెంట్ రద్దైంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పార్లమెంట్‌ను గురువారం రద్దు చేశారు. ఇక, పార్లమెంట్ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.కాగా, జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద సునాక్ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ..‘ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది’ అంటూ కామెంట్స్ చేశారు. #BreakingNews #Updates #ukpolitics#British Parliament is formally dissolved ahead of July 4 general #election which polls indicate #Labour is expected to win over ruling #Conservative party pic.twitter.com/Lubf43M6r4— Tanveer Roomi (@TanveerRoomi) May 30, 2024ఇక బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి దాదాపు 129 మంది ఎంపీలు పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. -
రిషి సాహసం!
వచ్చే జులై 4న బ్రిటన్ దిగువసభ ఎన్నికలు నిర్వహిస్తామంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బుధవారం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్సర్వేటివ్ పార్టీ నిరంతరాయంగా పద్నాలుగేళ్లనుంచి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుంది. అయిదేళ్ల గడువుకు అయిదు నెలల ముందే జరుగుతున్న ఈ ఎన్నికలు వారి పాలనకు చరమగీతం పాడతాయా, మరోసారి అందలమెక్కిస్తాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ కన్సర్వేటివ్‌లకు ఆ విషయంలో అనుమానం లేదు. ఓటమి ఖాయమన్న దిగులు ఆ పార్టీని ఆవరించింది. విశ్వవిఖ్యాత కవి, రచయిత విలియం షేక్స్పియర్ విరచిత ‘హామ్లెట్’ నాటకంలోని పాత్ర పలికిన ఆత్మగత సంభాషణలో ‘టు బీ ఆర్ నాట్ టు బీ...’ అందరికీ గుర్తుండిపోయే పదబంధం. బతకటమా, చావటమా అనే సందిగ్ధ స్థితిని అది చెబుతుంది. కన్సర్వేటివ్ పార్టీ ప్రస్తుతం ఆ సంకటస్థితిలోనే ఉంది. నిరుడు జులైలో దిగువ సభకు జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకటే గెల్చుకుంది. ఈ నెల మొదట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ దాని పరిస్థితి ఏమంత బాగులేదు. నిజానికి నిరుడూ, అంతకు ముందు సంవత్సరమూ దేశం అధిక ద్రవ్యోల్బణంతో కుంగిపోయింది. కానీ నెలరోజుల్లో ఉప ఎన్నికలుంటాయనగా అది చెప్పుకోదగ్గ మేర తగ్గింది. అయినా వోటర్లు కరుణించలేదు. మొన్న స్థానిక ఎన్నికల సమయానికి కూడా ఆర్థిక స్థితి మెరుగుపడిన సూచనలు కనబడ్డాయి. వృద్ధి రేటు బాగుందని జీడీపీ గణాంకాలు చాటాయి. ఆర్థిక మాంద్య ప్రమాదం తప్పిందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ స్థానిక ఎన్నికల్లో జనం లేబర్ పార్టీవైపే మొగ్గారు. కన్సర్వేటివ్ పార్టీ రేటింగ్ కనీవినీ ఎరుగని రీతిలో 20 శాతానికి పడిపోయిందని, లేబర్ పార్టీ 44 శాతంతో ముందంజలో ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. బహుశా అందుకే కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలూ, రిషి మంత్రివర్గ సహచరులూ గడువుకు ముందే పార్లమెంటు రద్దు చేయటం ప్రమాదకరమంటూ వాదించారు. అయితే రిషి సునాక్ లెక్కలు వేరు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు వెల్లడైన ఆర్థిక గణాంకాలు ఆయనకు ధైర్యాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని గణాంకాలు తేల్చాయి. 2022 అక్టోబర్‌లో 11.1 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.3 శాతానికి దిగొచ్చింది. కన్సర్వేటివ్‌లు పెట్టుకున్న 2 శాతం లక్ష్యం కన్నా ఇది కాస్తా ఎక్కువే అయినా ఇంతకు మించి ఆశించకూడదన్న అభిప్రాయం అధికారపక్షంలో ఉంది. మరోపక్క అక్రమ వలసదారులను రువాండాకు సాగనంపే చట్టం ఆమోదం పొందాక ఆ తరహా వలసలు కొద్దో గొప్పో తగ్గాయి. ఈ నేపథ్యంలోనే రిషి అత్యుత్సాహంగా ఎన్నికల ప్రకటన చేశారు. అయితే ఈ పరిస్థితి నిలకడగా కొనసాగుతుందా... మళ్లీ దిగజారుతుందా అన్న సంశయం కన్సర్వేటివ్ శ్రేణులను పట్టి కుదుపుతోంది.అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా తప్పుడు సమాచారాన్ని జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం రివాజుగా మారింది. బ్రిటన్ కూడా అందుకు మినహాయింపు కాదు. దేశం ఎదుర్కొంటున్న సకల అరిష్టాలకూ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగటమే కారణమన్న తప్పుడు ప్రచారాన్ని తలకెత్తుకున్నది కన్సర్వేటివ్ పార్టీయే. చివరకు వారి ఏలుబడిలోనే తప్పనిసరై ఆ తంతు ముగించారు. బ్రిటన్ స్వేచ్ఛాజీవి అయింది. అయినా ఆర్థిక ఒడుదొడుకులు దాన్ని పీడించాయి. అధిక ధరలు, నిరుద్యోగం పాలకపక్షాన్ని నిద్రపోనీయకుండా చేశాయి. వోటర్లలో కనబడిన అనాసక్తత వల్ల 2019 డిసెంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా కన్సర్వేటివ్ పార్టీ నికరమైన మెజారిటీతో బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దలేక ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన లిజ్ ట్రస్ సైతం ప్రజల్ని నిరాశపరిచారు. కనుకనే ప్రధానిగా రిషి సునాక్‌ను కన్సర్వేటివ్ పార్టీ ఎంచుకుంది. కానీ పదవిలోకొచ్చింది మొదలు రిషికి సమస్యలు తప్పలేదు. జాన్సన్, ట్రస్‌ల మాదిరే ఆయనపై కూడా సాధారణ వోటర్లలో ఏవగింపు మొదలైంది. వ్యక్తిగతంగా రిషి రేటింగ్ కూడా తీసికట్టే! సర్వేలన్నీ వరసబెట్టి దీన్నే చాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధపడటమంటే ఏ ప్రధానికైనా ఆత్మహత్యాసదృశమే. కానీ రిషి తెగింపు వెనక కారణం ఉంది. ప్రత్యర్థి లేబర్ పార్టీకి వోటర్ల ఆదరణ బాగానేవున్నా వ్యక్తిగతంగా ఆ పార్టీ నాయకుడు కియర్ స్టార్మర్ పై ప్రజలకంత విశ్వాసం లేదు. అందుకే ఎన్నికలకు ఇంతకన్నా మంచి ముహూర్తం ఉండబోదన్న నిర్ణయానికి రిషి వచ్చివుండొచ్చు. దానికితోడు స్టార్మర్ ప్రధాన నినాదం ‘ఆర్థిక సుస్థిరత’. అది ఇప్పటికే సాధించినట్టు గణాంకాలు చెబుతుండగా ఆ నినాదానికి విలువుండదని రిషి నమ్మకం.రష్యా దురాక్రమణ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ, ఇరాన్ దూకుడు... మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తాయన్న భయాందోళనలు అన్నిచోట్లా ఉన్నట్టే బ్రిటన్‌లోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మితవాద పార్టీ కన్సర్వేటివ్‌లు అధికారంలో ఉండటమే ఉత్తమమన్న వాదనను ఆ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది. సైనిక వ్యయాన్ని అదుపు చేస్తామన్న లేబర్ పార్టీ వాగ్దానం ప్రమాదకరమని కూడా ఆ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. కనుక రాబోయే ఎన్నికలు రక్షణ, భద్రత చుట్టూ తిరిగే అవకాశం లేకపోలేదు. తనకొచ్చిన అవకాశాన్ని లేబర్ పార్టీ సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వస్తుందా లేక వోటర్లను ఒప్పించలేక చతికిలపడుతుందా అన్నది మరికొన్నాళ్లలో తేలిపోతుంది. -
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్‌లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
రిషి సునాక్ పాపులారిటీ రేటింగ్ 25%
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌కు, అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇదొక పెద్ద ఊరట. ఇటీవల మంత్రివర్గంలో మార్పుల తర్వాత సునాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే, శీతాకాల బడ్జెట్లో కొన్నిరకాల పన్నులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌తోపాటు ప్రభుత్వానికి ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లు తాజాగా ‘ద టైమ్స్’ పత్రిక నిర్వహించిన ఓపీనియన్ పోల్స్‌లో వెల్లడయ్యింది. బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను మినహాయింపుల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. సర్వేలో సునాక్ ప్రభుత్వ పాపులారిటీ రేటింగ్ 25 శాతానికి చేరినట్లు తేలింది. గత వారంతో పోలిస్తే ఇది 4 పాయింట్లు అధికం కావడం విశేషం. ఇటీవలి కాలంతో కన్జర్వేటివ్ పారీ్టకి దక్కిన అత్యధిక రేటింగ్ ఇదే. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ రేటింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రజాదరణ 44 శాతంగానే ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
మార్పుల వ్యూహంతో మేలెంత?!
మార్పు మంచికే! అయితే, అన్ని మార్పులూ మంచి చేస్తాయా? మంచిని ఆశించడమే తప్ప, ఆఖరికి ఏమవుతుందో అప్పటికప్పుడు చెప్పలేం. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ప్రస్తుతం మార్పునే నమ్మారు. క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలపై విరుచుకుపడిన హోమ్ మంత్రి సువెల్లా బ్రేవెర్మన్ను పక్కకు తప్పించారు. ఆమె స్థానాన్ని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి అప్పగించారు. మాజీ ప్రధాని అయిన 57 ఏళ్ళ డేవిడ్ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా ముందుకు తెచ్చారు. భారతీయ సంతతికి చెందిన 43 ఏళ్ళ బ్రేవెర్మన్ ఛాందసవాద, వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడడంతో, ఆమెకు ఉద్వాసన పలికి, మధ్యేవాదానికి జై కొడుతున్నట్టు కనిపించే యత్నం చేశారు. మునుపటి లిజ్ ట్రస్ హయాం నుంచి ప్రతికూలత మూటగట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ పట్ల మళ్ళీ నమ్మకం కలిగించడానికి సునాక్‌కు ఇవి సరిపోతాయా? కన్జర్వేటివ్ పార్టీ తన సొంత ఉనికిని కాపాడుకొనేందుకు కిందా మీదా పడుతోందనడానికి తాజా ఉదాహరణ రిషీ సునాక్ తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని విశ్లేషకుల మాట. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఒక్కరే కాక ఇంకా పలువురు పెద్ద పదవులు నిర్వహించినవారు సైతం ఈ మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో చిన్న హోదాలు చేపట్టారు. గతంలో ప్రధానమంత్రి పదవికి రేసులో నిలబడ్డ నాయకురాలు, వ్యాపార శాఖ మంత్రి అయిన డేమ్ ఆండ్రియా లెడ్సమ్ ఇప్పుడు జూనియర్ హెల్త్ మినిస్టర్ పదవి చేపట్టారు. అలాగే ఇంకొందరు! సునాక్ వైపు నుంచి చూస్తే – ఇది మునుపటి లిజ్ ట్రస్ హయాం వారిని కొందరినైనా వదిలించుకొని, తనదైన జట్టును నిర్మించుకొనేందుకు ఆయన చేస్తున్న యత్నంగా కనిపిస్తుంది. మరోవైపు నుంచి చూస్తే – మునుపటి లిజ్ పాలన తలనొప్పులు తేవడంతో ఏడాది క్రితం ఆ స్థానంలోకి వచ్చిన సునాక్ తన సర్కార్‌పై నమ్మకం కలిగించడంలో విఫలమయ్యారనీ, అందుకే ఈ మార్పులనీ అనిపిస్తుంది. ప్రధానిగా పదవి చేపట్టినప్పటి నుంచి సునాక్ తరచూ కామెరాన్‌తో సంభాషిస్తున్నారనీ, వారం రోజుల క్రితమే విదేశాంగ మంత్రిగా పగ్గాలు పట్టాల్సిందిగా కోరారనీ ఒక కథనం. ఇంతలోనే బ్రేవెర్మన్ దురుసు రాతలతో రచ్చ రేగింది. చివరకు సునాక్ అనుకుంటున్న మార్పే అనివార్యంగా, ముందుకు తోసుకొచ్చింది. ‘డీసీ’గా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే డేవిడ్ కామెరాన్ పునరాగ మనంతో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పాలకçపక్షం చిక్కుల్లో పడి, బయటపడేందుకు మరో మార్గం లేనప్పుడు పాత కాపులను మళ్ళీ రంగంలోకి దింపి ఉన్నత పదవులివ్వడం, ఎంపీలు కాని వారిని ఎగువ సభ ద్వారా పార్లమెంట్‌లోకి తేవడం బ్రిటన్‌లో తరచూ ఉన్నదే! వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతున్న వేళ సునాక్ సర్కార్ ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి. అందులో భాగమే తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కామెరాన్ పునరాగమనం లాంటి చర్యలు. మాటలతో ముగ్ధుల్ని చేయగల కామెరాన్‌ను జనం నమ్ముతారనీ, రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందనీ సునాక్ అంచనా. అయితే, పదకొండేళ్ళు పార్టీకి నేతగా, ఆరేళ్ళ కాలం ప్రధానిగా పనిచేసి, గత ఏడేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన కామెరాన్ అనుభవం కష్టాల్లో ఉన్న పార్టీకీ, సునాక్ ప్రభుత్వానికీ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. కామెరాన్‌కు పలువురు ప్రపంచ నేతలతో స్నేహం, అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలన్నీ అస్థిరంగా ఉన్న వర్తమానంలో అది బ్రిటన్ ప్రభుత్వానికి ఉపయుక్తమే. కానీ, వచ్చే ఎన్నికల్లో కలిసిరావడం మాత్రం కష్టమే. కేవలం 24 శాతం మంది బ్రిటన్ వయోజనులు కామెరాన్‌కు సానుకూలంగా ఉంటే, 45 శాతం మంది ఆయనకు ప్రతికూలంగా ఉన్నారని నెల కిందటి తాజా సర్వే. వెరసి కామెరాన్‌పై సునాక్ అతిగా ఆశలు పెట్టుకుంటే నిరుత్సాహం తప్పదు. పదమూడేళ్ళ పాటు సొంత కన్జర్వేటివ్ పార్టీయే గద్దె మీద ఉన్నాక వచ్చే ఎన్నికలు సునాక్‌కు ఏటికి ఎదురీతే. ఆయన తనను తాను మార్పుకు ప్రతిరూపంగా, స్థిరచిత్తుడిగా జనానికి చూపుకోవడం అవసరం. అందుకని మాటల్లో, రాతల్లో జాత్యహంకార, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బ్రేవెర్మన్ను పదవిలో కొనసాగిస్తే కష్టం. గతంలో పలుమార్లు మాటల తూటాలు పేల్చిన ఆమె తాజాగా పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనపై నిర్లక్ష్యంగా, నొప్పించేలా ‘ది టైమ్స్’ పత్రికలో రాశారు. ప్రధాని ఆమోదం లేని ఆ వ్యాసంతో తన కథకు తానే ముగింపు రాసుకున్నారు. స్వతంత్ర పోలీసు వ్యవస్థను తప్పుబట్టడమే కాక, నిరసనను ప్రాథమిక హక్కుగా భావించే ఆధునిక బ్రిటన్ సమాజాన్నీ దూరం చేసుకున్నారు. పదవీచ్యుతురాలయ్యారు. అయితే, రానున్న రోజుల్లో ఆమె ఊరకుంటారని అనుకోలేం. సునాక్ పాలన అనంతరం అవసరమైతే పార్టీ పగ్గాలు చేపట్టగల ఛాందస వర్గ నేతగా ఆమె తనను తాను గట్టిగా నిలుపుకొన్నారు. అయిదేళ్ళ లోపల 650 మంది సభ్యుల దిగువ సభకు ఎన్నికలు జరగడం బ్రిటన్ విధానం. ఆ లెక్కన 2025 జనవరి 28 లోపల ఎన్నికలు జరగాలి. ఏ తేదీన జరగాలో నిర్ణయించే అధికారం ప్రధా నిదే. 2011లో చట్టం తెచ్చి, దాన్ని మార్చినా, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత కన్జర్వేటివ్‌లు మళ్ళీ యథాపూర్వ స్థితిని పునరుద్ధరించారు. ఆ లెక్కన పార్లమెంట్‌ను ముందే రద్దు చేసి, ఎన్నికలు జరిపించమని సునాక్ కోరినా కోరవచ్చు. ఏడాది క్రితం సునాక్ పగ్గాలు చేపట్టినప్పటితో పోలిస్తే, కన్జర్వే టివ్‌ల ప్రతిష్ఠ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అప్పటి అనుకూల వాతావరణమూ లేదు. మరి, సునాక్ చేసిన తాజా మార్పులు ఎన్నికల నాటికి అద్భుతాలు చేయగలవా? ఏమో గుర్రం ఎగరావచ్చు! -
యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ
లండన్: యూకే స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టాక జరిగిన మొదటి ఎన్నికలివి. ఇంగ్లండ్‌లోని 317 కౌన్నిళ్లకుగాను 230 కౌన్సిళ్లలోని 8 వేల సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార పార్టీ 20కిపై కౌన్సిళ్లను కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 8 వేల సీట్లలో లేబర్ పార్టీ 1,384, కన్జర్వేటివ్ పార్టీ 1,041, లిబరల్ డెమోక్రాట్లు 768 సీట్లను సాధించాయి. 20 ఏళ్లుగా అధికారపక్షానికి కంచుకోటగా ఉన్న మెడ్వే లాంటి కౌన్సిళ్లను సైతం లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా వెలువడిన ఈ ఫలితాలపై ప్రధాని రిషి సునాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సహచర మంత్రి జహావిపై సునాక్ వేటు
లండన్: పన్నుల వివాదంలో చిక్కుకున్న అధికార కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్, సహచర కేబినెట్ మంత్రి నదీమ్ జహావిని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మంత్రి మండలి నుంచి తొలగించారు. జహావి పన్ను వ్యవహారాల్లో మంత్రులకుండే నియమనిబంధనల్ని ఉల్లంఘించారంటూ విచారణలో తేలడంతో సునాక్ ఆయనపై వేటు వేశారు. ప్రస్తుతం జహావి శాఖ లేని మంత్రిగా కేబినెట్లో ఉన్నారు. ప్రభుత్వం నియమించిన స్వతంత్ర విచారణ నివేదికను కూడా సునాక్ విడుదల చేశారు. ఇరాక్‌లో జన్మించిన జహావి ఆర్థిక మంత్రిగా ఉండగా అంతకు ముందు కట్టని పన్నులకు పెనాల్టీగా 50 లక్షల పౌండ్లు చెల్లించారు. ఈ విషయాన్ని దాయడం మినీస్టిరియల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని విచారణ నివేదిక తేల్చి చెప్పింది. -
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్‌డేటా పోలింగ్‌లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..!
అపజయం ఎదురైన చోటే విజయాన్ని అందుకొని బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆ పదవి పూలపాన్పు కాదు. ముందున్నది అంతా ముళ్లబాటే. బ్రెగ్జిట్, కోవిడ్–19 సంక్షోభం, , రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్ను దారిలోని తీసుకురావాల్సిన అతి పెద్ద సవాల్ ఆయన ఎదురుగా ఉంది. ఆర్థిక సవాళ్లు బ్రిటన్‌లో ప్రస్తుతం ఎగుమతులయ్యే వ్యయం కంటే దిగుమతులకయ్యే వ్యయం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కనీవినీ స్థాయిలో ద్రవ్యోల్బణం 10% దాటిపోయి ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్య ప్రజలు ధరాభారాన్ని మోయలేకపోతూ ఉంటే కార్పొరేట్ సెక్టార్ కుదేలైపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. రానున్న చలికాలంలో ఫ్రీజింగ్ గ్యాస్‌ను కొనుక్కోవడం కూడా ప్రజలకు భారం కానుంది. దీంతో ఈ సారి చలికాలంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తాయన్న అంచనాలున్నాయి. సరైన ఆదాయ మార్గాలు చూపించకుండా ఎడాపెడా పన్ను మినహాయింపులనిస్తూ లిజ్‌ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో కుదేలైపోయిన మార్కెట్లను బలోపేతం చేయడంపై రిషి దృష్టి సారించాల్సి ఉంది. పన్నులు పెంచుతూ, ఖర్చుల్ని తగ్గించడం రిషి ముందున్న అతి పెద్ద టాస్క్. పార్టీ ఐక్యత కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. టోరీ సభ్యుల మధ్య ఐక్యత కాగడా వేసినా కనిపించడం లేదు. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీని ఒక్కతాటిపైకి తీసుకురావల్సి ఉంది. మన పార్టీ మన దేశం ఐక్యంగా ఉండాలని ఇప్పటికే రిషి నినదిస్తున్నారు. వలసవిధానం బ్రిటన్ అక్రమ వలసలతో సతమతమవుతోంది. నాటు పడవల్లో యూకే తీరానికి ఈ ఏడాది 30వేల మందికి పైగా చేరుకున్నారని అంచనా. ఈ నేపథ్యంలో వలసలపై కఠిన ఆంక్షలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలోనే రిషి చెబుతూ వచ్చారు. ప్రతీ ఏడాది వచ్చే శరణార్థుల సంఖ్యపై పరిమితులు విధించాలని యోచిస్తున్నారు. అక్రమంగా వచ్చే వారిని పర్యవేక్షించి వారిని నిర్బంధించడానికి అధికారులకు అదనపు బాధ్యతలు ఇవ్వానికి ఒక ప్రణాళికన తీసుకురావాలని యోచిస్తున్నారు. సమ్మెలు రాబోయే రోజుల్లో బ్రిటన్‌లో చాలా వర్గాలు సమ్మెకు దిగనున్నాయి. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పనిచేసే ప్రాంతంలో పరిస్థితులపై రైలు యూనియన్, సమ్మె నోటీసు ఇచ్చింది. క్రిస్మస్కు ముందు దేశంలోని 150 యూనివర్సిటీల్లో 70 వేల మంది సమ్మెకు దిగనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: పాలించడమెలాగోచూపిస్తా -
UK political crisis: బ్రిటన్‌లో రిషీరాజ్..
లండన్: నూటా యాభయ్యేళ్లకు పైగా మనల్ని పాలించిన బ్రిటన్ను ఇక మనవాడు పాలించనున్నాడు. దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) సరికొత్త చరిత్ర లిఖించారు. సోమవారం పలు ఆసక్తికర పరిణామాల నడుమ అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న నేతగా రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి శ్వేతేతరుడు కూడా రిషియే కావడం మరో విశేషం! అంతేగాక గత 210 ఏళ్లలో అతి పిన్న వయస్కుడైన బ్రిటన్ పీఎంగా కూడా రిషి మరో రికార్డు నెలకొల్పారు. ప్రధాన పోటీదారుగా భావించిన మాజీ ప్రధాని బోరిస్ సోమవారం అనూహ్యంగా తప్పుకోవడంతో ఆయనకు ఒక్కసారిగా లైన్ క్లియరైంది. మూడో అభ్యర్థి పెన్నీ మోర్డంట్ గడువు లోపు 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమవడంతో రిషి ఎన్నిక ఏకగ్రీవమైంది. అలా, నెలన్నర క్రితం లిజ్ ట్రస్‌తో హోరాహోరీగా జరిగిన పోటీలో అందినట్టే అంది తృటిలో చేజారిన ప్రధాని పదవి ఈసారి రిషిని వచ్చి వరించింది. తాను హిందువునని ప్రతి వేదికపైనా సగర్వంగా ప్రకటించుకునే రిషి సరిగ్గా దీపావళి పర్వదినం నాడే ప్రధానిగా ఎన్నికవడం భారతీయుల హర్షోత్సాహాలను రెట్టింపు చేసింది. మంగళవారం టోరీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించాక ఆయన రాజు చార్లెస్–3ని కలిశారు. అనంతరం దేశ 57వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అస్తవ్యస్తంగా మారిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే గురుతర బాధ్యత ఇప్పుడు రిషి భుజస్కంధాలపై ఉంది. ఈ విషయంలో విఫలమవడం వల్లే ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేయాల్సి రావడం, బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పీఎంగా కొనసాగిన చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన అపారమైన ఆర్థిక అనుభవాన్ని రంగరించి దేశాన్ని రిషి ఎలా ఒడ్డున పడేస్తారన్నది ఆసక్తికరం. ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి చేసిన తొలి అధికారిక ప్రసంగంలోనూ రిషి ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బ్రిటన్ అత్యంత కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అంగీకరించారు. ‘‘ఈ సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు ఏ మాత్రం వెనకాడబోను. నాపై ఉన్న ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తా’’అంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశాన్ని బంగారు భవిష్యత్తులోకి నడిపిస్తానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో దేశవాసులకు హామీ ఇచ్చారు. రెండు నెలల్లో మూడో ప్రధాని! బోరిస్ జాన్సన్, ట్రస్ తర్వాత గత ఏడు వారాల్లో బ్రిటన్‌కు రిషి మూడో ప్రధాని కావడం విశేషం. పార్టీ గేట్ కుంభకోణం తదితరాల దెబ్బకు మంత్రులు సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌కు తలొగ్గి జాన్సన్ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్‌లో జరిగిన హోరాహోరీ పోరులో రిషిపై నెగ్గి ట్రస్ ప్రధాని అయ్యారు. కానీ పన్ను కోతలు, అనాలోచిత మినీ బడ్జెట్‌తో ఆర్థిక పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేశారంటూ ఇంటా బయటా తీవ్ర విమర్శల పాలయ్యారు. తప్పుకోవాలంటూ సొంత ఎంపీలే డిమాండ్ చేయడం, అవసరమైతే అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధమవడంతో మరో మార్గం లేక ఆమె గురువారం రాజీనామా ప్రకటించారు. మంగళవారం ఆపద్ధర్మ ప్రధాని హోదాలో ట్రస్ చివరి కేబినెట్ సమావేశానికి సారథ్యం వహించారు. అనంతరం బకింగ్‌హం ప్యాలెస్‌కు వెళ్లి చార్లెస్–3కి లాంఛనంగా రాజీనామా సమర్పించారు. తర్వాత రిషి రాజసౌధానికి వెళ్లి రాజుతో లాంఛనంగా భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న రాజు ఆహ్వానాన్ని అంగీకరిస్తూ రాచరిక సంప్రదాయాన్ని అనుసరించి ఆయన ముంజేతిని ముద్దాడారు. కల్లోల సమయంలో కఠిన బాధ్యతలను చేపడుతున్న రిషి తన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చాలంటూ ప్రార్థించాల్సిందిగా బ్రిటన్ పౌరులకు కాంటర్బరీ ఆర్చిబిషప్ జస్టిన్ వెల్బీ పిలుపునిచ్చారు. ‘‘ఇది మన దేశానికి అత్యంత కష్టకాలం. ఈ అస్థిర పరిస్థితుల్లో బాధ్యతలు చేపడుఉతన్న రిషి కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’’అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని గ్టటెక్కించగలిగే సత్తా ఉన్న నేత రిషి మాత్రమేనని టోరీ ఎంపీల్లో అత్యధికులు నమ్ముతున్నారు. వారిలో సగం మందికి పైగా ఆయనకు బాహాటంగా మద్దతు ప్రకటించడం అందుకు నిదర్శనంగా నిలిచింది. అభినందనల వెల్లువ... రిషికి నా హార్దిక శుభాభినందనలు. బ్రిటన్‌తో భారత్ చారిత్రక సంబంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మార్చుకుంటున్న వేళ ఇది నిజంగా గొప్ప పరిణామం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి రిషితో కలిసి పని చేసేందుకు, 2030–రోడ్‌మ్యాప్‌ను అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా – ప్రధాని నరేంద్ర మోదీ రిషి సాధించింది అపురూప విజయం. ఇదో చరిత్రాత్మక మైలు రాయి. ప్రపంచ భద్రత, ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, యూరప్, మిగతా ప్రపంచంపై దాని ప్రభావాలను రిషితో కలిసి ఉమ్మడిగా ఎదుర్కొంటాం – ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రిషికి హార్దిక అభినందనలు. ఆయన హయాంలో బ్రిటన్–ఉక్రెయిన్ బంధం మరింత బలపడాలి – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం – ఐర్లండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్ రిషి హయాంలో బ్రిటన్–ఈయూ సంబంధాలు ఇరుపక్షాల ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ సాగుతాయని ఆశిస్తున్నాం – యూరోపియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాండెర్ లియాన్ ఇదో చరిత్రాత్మక రోజు. రిషికి అభినందనలు. టోరీ ఎంపీలంతా కొత్త ప్రధానికి పూర్తి మద్దతివ్వాల్సిన వేళ ఇది – బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధానిగా పని చేయడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. రిషికి నా అభినందనలు. అన్ని అంశాల్లో నూ ఆయనకు నా పూర్తి మద్దతుంటుంది – బ్రిటన్ తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ రిషికి శుభాకాంక్షలు – కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రిషికి అభినందనలు. కానీ దేశంలో తక్షణం ఎన్నికలు జరపాల్సిన అవసరముంది – బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ రిషి వచ్చినా బ్రిటన్‌తో సమీప భవిష్యత్తులోనూ రష్యా సంబంధాలు మెరుగు పడతాయన్న ఆశలేమీ లేవు – రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ రిషి హయాంలో బ్రిటన్‌తో చైనా సంబంధాలు ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నాం – చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ రిషిని చూసి ఎంతో గర్విస్తున్నాం. ప్రధానిగా అద్భుతంగా పాలించాలని కోరుకుంటున్నాం. – రిషి మామ, ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి -
Rishi Sunak: రిషి సునాక్ సక్సెస్ సీక్రెట్ ఇదే..
బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికయ్యారు . దీంతో బ్రిటన్ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించారు. బ్రిటన్ పార్లమెంట్లో సునాక్‌కు 193 మంది ఎంపీల మద్దతు ఉంది. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రస్ రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్‌ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.. కుటుంబ నేపథ్యం: రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు. ఉద్యోగం- వివాహాం : స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. ► ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందూ వ్యక్తిగా నిలిచారు. అలాగే.. తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా గుర్తింపు పొందారు. ► చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో కొంతకాలం ఇంటర్న్‌షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా రిషిని నియమించారు. ► కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు. ► రిషిపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. ఆయన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. ► డౌన్స్ట్రీట్లో సమావేశానికి హాజరై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు. -
UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు నామినేషన్ కోసం అవసరమైన 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఆయనకు ఇప్పటికే సమకూరిందని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన లండన్ తిరిగొచ్చారు. ఆయనకు కూడా 100 మంది ఎంపీల మద్దతు సమకూరిందని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. రిషి, జాన్సన్ ఇప్పటిదాకా తాము రేసులో ఉన్నట్టు వెల్లడించలేదు. ఎంపీల మద్దతుపై కూడా ఏమీ మాట్లాడలేదు. పెన్నీ మోర్డంట్ మాత్రమే పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నానికల్లా 100 మంది ఎంపీల మద్దతు సాధించిన వారి మధ్య తదుపరి పోటీ ఉంటుంది. రిషికి పెరుగుతున్న మద్దతు రిషిని సమర్థిస్తున్న మంత్రులు, పార్టీ ఎంపీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు దేశ పౌరులకు విశ్వాసం కల్పించగల నేత ప్రస్తుతం రిషి మాత్రమేనని మాజీ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ అభిప్రాయపడ్డారు. మళ్లీ వెనకటి రోజులకు వెళ్లేమని బోరిస్నుద్దేశించి అన్నారు. అయితే మళ్లీ ప్రధాని కావాలని తహతహలాడుతున్న బోరిస్ పోటీ లేకుండా నెగ్గేలా వ్యూహాలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా రిషిని తప్పుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. -
‘ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి’.. బోరిస్‌కు పెరుగుతున్న మద్దతు!
లండన్: కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషీ సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీకి సిద్ధమయ్యారు. విహారయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని బ్రిటన్ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత సంతతి వ్యక్తి, బోరిస్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పని చేసిన ప్రీతి పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని పదవి చేపట్టేందుకు బోరిస్ జాన్సన్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఓవైపు.. రిషీ సునాక్‌కు ఎంపీల మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోరిస్ జాన్సన్‌కు మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా వెల్లడించారు ప్రీతి పటేల్.‘ ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగల సత్తా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఉందనటంలో ఆయనకు సరైన ట్రాక్ రికార్డ్ ఉంది. మన మేనిఫెస్టోను అమలు చేయగలరు. ఈ నాయకత్వ పోటీలో నేను ఆయనకు మద్దతు ఇస్తున్నాను.’అనిపేర్కొన్నారు ప్రీతి పటేల్. ప్రధాని రేసులో నిలవాలని భావిస్తున్న బోరిస్ జాన్సన్ హుటాహుటిన బ్రిటన్ తిరిగి వచ్చిన క్రమంలో ప్రీతి పటేల్ ట్వీట్ చేయటం గమనార్హం. బోరిస్ జాన్సన్ ఆరు వారాల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. తన కేబినెట్లోని అసమ్మతి నేతలు రాజీనామాలు చేయటం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే, ఇప్పటికీ ఆయనకు పార్టీలో ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు బోరిస్‌కు మద్దతు ప్రకటించారు. వాణిజ్య శాఖ మంత్రి జాకబ్ రీస్ మోగ్, రక్షణ మంత్రి బెన్ వల్లాస్, సిమోన్ క్లెర్క్‌లు బోరిస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌కు 46 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రిషీ సునాక్‌కు 100 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎవరు పోటీలో ఉండనున్నారని తెలనుంది. అయితే, ఒక్కరే పోటీలో ఉన్నట్లు తెలితే వచ్చే వారమే కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కానీ, ఒకవేళ ఇద్దరు బరిలో ఉంటే 1,70,000 మంది పార్టీ సభ్యులు వచ్చే శుక్రవారం ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకుడిని ఎన్నుకుంటారు. I'm backing @BorisJohnson to return as our Prime Minister, to bring together a united team to deliver our manifesto and lead Britain to a stronger and more prosperous future. pic.twitter.com/6wyGmASLda — Priti Patel MP (@pritipatel) October 22, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’
దాదాపుగా వంద మంది అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతుతో ప్రధాని పదవి పోటీకి సిద్ధమయ్యారు రిషి సునాక్. లిజ్ ట్రస్ రాజీనామాతో సెకండ్ ఛాయిస్‌గా మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కే పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ రేసులోకి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం వచ్చి చేరారు. సెలవులపై కరేబియన్ దీవులకు(డొమినికన్ రిపబ్లిక్) వెళ్లిన బోరిస్ జాన్సన్.. తాజా రాజకీయ పరిణామాలతో హడావిడిగా లండన్‌కు బయలుదేరారు. అయితే.. ఈలోపే ఆయన రిషి సునాక్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం తనకు ఇవ్వాలని బోరిస్.. రిషి సునాక్‌కు కోరినట్లు లండన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. ఒకవైపు రూలింగ్ పార్టీ ప్రాబల్యం, జనాదరణ కోల్పోయినందున.. ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని.. తద్వారా 2024 డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో ఓటమి నుంచి కన్జర్వేటివ్ పార్టీని గట్టెక్కించగలనని రిషి సునాక్‌తో బోరిస్ జాన్సన్ చెప్పినట్లు ఆ కథనం తెలిపింది. ప్రస్తుతానికి డిప్యూటీ పీఎం పదవిని ఆఫర్ చేసిన బోరిస్.. 2024 ఎన్నికల నాటికి కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా నిలబడవచ్చని రిషి సునాక్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని.. కాబట్టి ప్రధాని అవకాశం తనకు ఇవ్వాలని రిషి సునాక్‌ను బోరిస్ జాన్సన్ కోరినట్లు టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. అయితే.. బోరిస్ ఆఫర్లను రిషి సునాక్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ మరో కథనం ప్రచురించింది టెలిగ్రాఫ్. ఇదీ చదవండి: తర్వాతి వైరస్ పుట్టుక అక్కడి నుంచేనా? Rishi Sunak is expected to reject any offer by Boris Johnson to drop his leadership bid in return for a Cabinet job as two Tory big beasts mull over whether to strike a deal. https://t.co/WyjB4zi7RG — The Telegraph (@Telegraph) October 22, 2022 Rishi Sunak became the first Tory leadership candidate to secure the backing of 100 MPs on Friday night as Boris Johnson’s supporters began warning of a stitch-up. 🔓 This front page story is currently free to read https://t.co/sBwlD3ysls — The Telegraph (@Telegraph) October 22, 2022 ఎక్స్ ఛాన్స్లర్ రిషి సునాక్‌కు 93 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా.. టోబియాస్ ఎల్వుడ్ తాను వందవ మద్దతుదారుడినని ప్రకటించడం విశేషం. తద్వారా రిషి సునాక్‌కు పోటీలో నిలబడడానికి అవసరమైన 100 మంది ఎంపీల మద్దతు లభించినట్లయ్యింది. ఇక.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు 44 మంది మద్దతు ఉండగా.. మూడో స్థానంలో పెన్నీ మోర్డాంట్ 21 మంది మద్దతుతో ఉన్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నాం 2గం. వరకు నామినేషన్లకు గడువు ఉంది. అదే రోజు కన్జర్వేటివ్ పార్టీ నేత కోసం ఎన్నిక సైతం జరిగే అవకాశం ఉంది.