బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం మొదలైన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష లేబర్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దాదాపు 300కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతుంది.
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకన్జర్వేటివ్ పార్టీ కేవలం 63 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. దీంతో బ్రిటన్‌ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు ఖాయంగా మారింది.
ఇక బ్రిటన్ ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమిని ప్రధాని రిషి సునాక్ అంగీకరించారు. రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఆయన దేశ ప్రజలను క్షమాపణలు కోరారు.
‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా, సరైన పద్దతిలో చేతులు మారుతుంది. ఇది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’ అని సునాక్ అన్నారు.
ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ (61) బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి అవనున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడటంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment