లండన్/బ్రస్సెల్స్: పదేపదే వస్తున్న ఎన్నికలతో విసిగిన బ్రిటిష్ ఓటర్లు ఈసారి నిర్ణాయక తీర్పునిచ్చారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. ఈ చారిత్రక విజయంతో వచ్చే జనవరి ఆఖరులోగా యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి వైదొలిగేందుకు అవకాశం లభించిందని బోరిస్ జాన్సన్(55) తెలిపారు. ‘బ్రెగ్జిట్ పూర్తి చేసుకుందాం’ అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జాన్సన్..1980వ దశకంలో ప్రధాని మార్గరెట్ థాచర్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేశారు. జెరెమి కార్బిన్ నేతృత్వంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కేవలం 203 సీట్లను సాధించింది.
అక్టోబర్ 31వ తేదీలోగా బ్రెగ్జిట్ అమలే లక్ష్యంగా జూలైలో థెరిసా మే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్, పార్లమెంట్‌లో మెజారిటీ లేకపోవడంతో అనుకున్నది సాధించలేక ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే, గత అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత శీతాకాలంలో గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓట్లేశారు. పార్లమెంట్(కామన్స్ సభ)లోని 650 సీట్లకు గాను కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాలను సాధించింది. విజయోత్సవ ర్యాలీలో బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్‌కు ఇది మరో శుభోదయం. గడువులోగా బ్రెగ్జిట్ సాధిస్తాం. ప్రతిష్టంభనను తొలగిస్తాం. ఓటర్ల నమ్మకాన్ని వమ్ముచేయను’ అని ప్రకటించారు. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయంపై ఈయూ వెంటనే స్పందించింది. బ్రిటన్‌తో బ్రెగ్జిట్‌పై తదుపరి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది.
జాన్సన్ జయకేతనం
Published Sat, Dec 14 2019 2:00 AM | Last Updated on Sat, Dec 14 2019 4:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment