Brexit bill
-
ఎట్టకేలకు ఒప్పందం
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి నిష్క్రమించే బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా ముగుస్తుందా లేదా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన బ్రిటన్ పౌరులకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్రిస్మస్ పర్వదినాన బ్రస్సెల్స్ నుంచి మంచి కబురు అందించారు. ఈయూ నుంచి వైదొలగడానికి సంబంధించిన ఒప్పందానికి ఇక కేవలం ఏడు రోజులే గడువుండగా ఎవరూ ఊహించని రీతిలో దీనికి శుభం కార్డు పడింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి లాంఛనంగా బ్రిటన్ ఈయూ నుంచి బయటికొచ్చింది. కానీ దానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఒప్పందం కుదరడానికి మళ్లీ ఏడాది పట్టింది. ఒకటా రెండా... నాలుగేళ్లుగా అటు ఈయూకూ, ఇటు బ్రిటన్‌కూ ఇదొక సంక్లిష్ట సమస్యగా మారింది. ఎడతెగకుండా సాగిన చర్చలు ప్రతిసారీ ప్రతిష్టంభనలోనే ముగిసి ఉసూరనిపించాయి. ఒప్పందం వల్ల జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడటం.... అందుకు అనువైన రీతిలో ఈయూను ఒప్పించడం జాన్సన్‌కు పెను సమస్యగా మారింది. ఒక దశలో విసుగెత్తి ఒప్పందం లేకున్నా ఖాతరు చేసేది లేదని, దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అటు ఈయూకు సైతం ఇది జీవన్మరణ సమస్యే. బయటికెళ్లిన బ్రిటన్‌కు అంతా బాగుందని, అందువల్ల అది ఎంతో లాభపడిందని ఇతర సభ్య దేశాలు అనుకుంటే ఈయూ నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు. వెళ్లిపోవడం వల్ల అది ఎంతో నష్టపోయిందన్న అభిప్రాయం కలగడం దాని మనుగడకు ముఖ్యం. కనుకనే ఒప్పందం కుదరడానికి నాలుగేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అయితే తాజాగా ఒప్పందం కుదిరిందంటూ చేసిన ప్రకటనతోపాటు విడుదలైన జాన్సన్ ఫొటో చూస్తే అంతా బ్రిటన్‌కు అనుకూలంగానే ముగిసిందన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. అటు ఈయూ కూడా ఈ ఒప్పందం ఇరుపక్షాలకూ ప్రయోజనం చేకూర్చేదని, న్యాయమైనదని అంటోంది. అయితే ఇంతమాత్రం చేత ఇంకా అంతా అయిపోయినట్టు కాదు. ఈ ఒప్పందాన్ని జాన్సన్ బ్రిటన్ పార్లమెంట్ ముందుంచి దాని ధ్రువీకరణ పొందాలి. అందుకోసం మరో అయిదు రోజుల్లో బ్రిటన్ పార్లమెంటు సమావేశం కాబోతోంది. అటు 27 మంది ఈయూ పెద్దలు సభ్య దేశాల రాయబారులనూ సమావేశపరిచి ఒప్పంద వివరాలు చెప్పడం క్రిస్మస్ రోజునే మొదలైంది. ఈ రాయబారులంతా వెనువెంటనే స్వదేశాలకెళ్లి అధినేతలకు ఒప్పందాన్ని వివరిస్తారు. అన్ని దేశాల పార్లమెంటులూ ఈ నెలాఖరుకల్లా ఒప్పందంపై ఆమోదముద్ర వేయాలి. ఇది నష్టదాయకమైనదని ఏ దేశం భావించినా ఒప్పందాన్ని వీటో చేయొచ్చు. ఈ ప్రక్రియ సాఫీగా ముగిసిపోతే ఈయూ పార్లమెంటు వచ్చే నెల మొదట్లో ఒప్పందాన్ని పరిశీలించడం మొదలెడుతుంది. అది ధ్రువీకరించేవరకూ దీన్ని తాత్కాలిక ఒప్పందంగానే పరిగణిస్తారు. బ్రెగ్జిట్ భూతం 2016లో డేవిడ్ కామెరాన్, నిరుడు థెరిస్సా మే జాతకాలను తలకిందులు చేసింది. వారిద్దరూ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు ఎన్నికలు తప్పలేదు. థెరిస్సా మే స్థానంలో వచ్చిన బోరిస్ జాన్సన్ గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అది కాస్తా పార్లమెంటులో వీగిపోవటంతో ఆయన ప్రభుత్వం రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సివచ్చింది. తిరిగి మళ్లీ ప్రధాని అయిన దగ్గరినుంచి ఆయన బ్రెగ్జిట్పైనే అధిక సమయం వెచ్చించారు. ఒకపక్క హఠాత్తుగా విరుచుకుపడిన కరోనా మహమ్మారితో దేశం అయోమయావస్థలో పడగా... ఆయనే ఆ వ్యాధిబారిన పడ్డారు. ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఇంతకూ ఒప్పందంలో ఏముంది? ఇరు పక్షాలూ చెప్పుకుంటున్నట్టు అది ఉభయత్రా ప్రయోజనకరమైనదేనా... లేక పాత ఒప్పందాల మాదిరే దీన్ని కూడా పార్లమెంటు విసిరికొడుతుందా అన్నది తేలడానికి మరికొన్ని రోజులు పడుతుంది. 1,800 పేజీలున్న ఒప్పందంలో ఇరుపక్షాల సంబంధాలపైనా అనేకానేక నిబంధనలున్నాయి. ఇటు బ్రిటన్, అటు ఈయూ వేర్వేరుగా మనుగడ సాగిస్తూ వాణిజ్యరంగంలో కలిసి పనిచేయడానికి ఏమేం పాటించాలో, ఉత్పత్తయ్యే సరుకుపై విధించే పన్నులు ఎలా వుండాలో చెప్పే నిబంధనలవి. ఒక దేశంగా బ్రిటన్‌కు ఇకపై పూర్తి సార్వభౌమాధికారం చేతికొచ్చినట్టే. అది తన భవిష్యత్తును తానే నిర్దేశించుకోగలుగుతుంది. ఇకపై ఈయూ నియమ నిబంధనలు వర్తించవు. నచ్చిన చట్టాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఈయూ ధ్రువీకరణ అవసరం లేదు. యూరపియన్ న్యాయస్థానం బెడద వుండదు. బ్రిటన్ పౌరులు ఈయూ ప్రాంత దేశాలకు వెళ్లాలన్నా, అక్కడివారు ఇటు రావాలన్నా ఇకపై వీసా తప్పనిసరి కావొచ్చు. బ్రిటన్ పరిధిలోని ఇంగ్లిష్ చానెల్లో చేపలు పట్టడానికి ఈయూ ఫిషింగ్ బోట్లకు అనుమతులు అవసరమవుతాయి. ఈయూ ఏటా 60 లక్షల టన్నుల చేపల్ని ఎగుమతి చేస్తుంది. అందులో ఏడు లక్షల టన్నులు ఇంగ్లిష్ చానెల్, ఇతర కెనాల్స్‌లో లభిస్తాయి. దీని విలువ 65 కోట్ల పౌండ్లు. ఇదే ఒప్పందం కుదరడానికి అడ్డంకిగా మారింది. చివరకు ఏకాభిప్రాయం కుదిరింది. అయితే ప్రశ్నలు చాలానే వున్నాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవారంగంపై ఆధారపడివుంటుంది. ఆ రంగానికి ఈయూ ప్రాంత దేశాల్లో అవకాశాలెలా వుంటాయో తెలియదు. ఎందుకంటే ఈ ఒప్పందంలో దాని ఊసే లేదు. ముఖ్యంగా విత్త సంబంధ సేవారంగం పరిస్థితేమిటో అగమ్యగోచరం. ఆ రంగానికి ఈయూ ఏమేరకు చోటిస్తుందో చూడాలి. ఏడాది క్రితం కుదిరిన అవగాహనకు భిన్నంగా ఇటీవలే అంతర్గత మార్కెట్లకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. అది ఈయూకు మింగుడుపడటం లేదు. బిల్లును వెనక్కి తీసుకోనట్టయితే ప్రతీకార చర్యలుంటాయని అది హెచ్చరించింది. ఇలాంటి సమస్యలు ఇకముందూ తప్పకపోవచ్చు. మొత్తానికి బ్రిటన్ ఈయూతో వున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకుని బయటికొచ్చింది. ఇందువల్ల అది జీడీపీలో 4 శాతం కోల్పోతుంది. ఒప్పందం లేకుండా బయటికొస్తే ఇది 6 శాతం మేర వుండేది. తదుపరి దశలు కూడా సాఫీగా పూర్తయితే అది జాన్సన్ ప్రతిష్టను మరింత పెంచుతుంది. -
యూకే పార్లమెంట్‌కు కొత్త వీసా విధానం
లండన్: బ్రెగ్జిట్ అనంతర వీసా విధానానికి సంబంధించిన బిల్లును సోమవారం బ్రిటన్ పార్లమెంటులో మరోసారి ప్రవేశపెట్టారు.ఏ దేశం వారనే ప్రాతిపదికన కాకుండా, నైపుణ్యాల ఆధారంగా, పాయింట్స్ కేటాయించి, తదనుగుణంగా వీసాలను జారీ చేయాలనే ప్రతిపాదనతో ఆ చరిత్రాత్మక బిల్లును రూపొందించారు. ఈ కొత్త విధానం వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. బ్రిటన్‌లో ఉద్యోగం పొందేందుకు, అక్కడ ఉండేందుకు అనుమతి లభించాలంటే ఈ పాయింట్స్ విధానం ప్రకారం.. కనీసం 70 పాయింట్లు రావాలి. వృత్తిగత నైపుణ్యం, ఇంగ్లీష్ మాట్లాడగలిగే నైపుణ్యం, మంచి వేతనంతో స్థానిక సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ లెటర్.. మొదలైన వాటికి పాయింట్స్ ఉంటాయి. -
జాన్సన్ జయకేతనం
లండన్/బ్రస్సెల్స్: పదేపదే వస్తున్న ఎన్నికలతో విసిగిన బ్రిటిష్ ఓటర్లు ఈసారి నిర్ణాయక తీర్పునిచ్చారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. ఈ చారిత్రక విజయంతో వచ్చే జనవరి ఆఖరులోగా యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి వైదొలిగేందుకు అవకాశం లభించిందని బోరిస్ జాన్సన్(55) తెలిపారు. ‘బ్రెగ్జిట్ పూర్తి చేసుకుందాం’ అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జాన్సన్..1980వ దశకంలో ప్రధాని మార్గరెట్ థాచర్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేశారు. జెరెమి కార్బిన్ నేతృత్వంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కేవలం 203 సీట్లను సాధించింది. అక్టోబర్ 31వ తేదీలోగా బ్రెగ్జిట్ అమలే లక్ష్యంగా జూలైలో థెరిసా మే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్, పార్లమెంట్లో మెజారిటీ లేకపోవడంతో అనుకున్నది సాధించలేక ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే, గత అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత శీతాకాలంలో గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓట్లేశారు. పార్లమెంట్(కామన్స్ సభ)లోని 650 సీట్లకు గాను కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాలను సాధించింది. విజయోత్సవ ర్యాలీలో బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్‌కు ఇది మరో శుభోదయం. గడువులోగా బ్రెగ్జిట్ సాధిస్తాం. ప్రతిష్టంభనను తొలగిస్తాం. ఓటర్ల నమ్మకాన్ని వమ్ముచేయను’ అని ప్రకటించారు. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయంపై ఈయూ వెంటనే స్పందించింది. బ్రిటన్‌తో బ్రెగ్జిట్‌పై తదుపరి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. -
బ్రెగ్జిట్‌కు కొత్త డీల్
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడానికి (బ్రెగ్జిట్) ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. ఇది న్యాయంగా, సమతూకంతో ఉందన్న జంకర్.. దీన్ని ఆమోదించాల్సిందిగా ఈయూ సభ్య దేశాలను అభ్యర్థించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ప్రస్తుతం ఈయూ సభ్యదేశాల సదస్సు జరుగుతోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా సాగేందుకిదే సరైన సమయమని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు జంకర్ ఒక లేఖ రాశారు. బ్రెగ్జిట్ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఒప్పందం కూడా శనివారం బ్రిటన్ పార్లమెంటు ముందు వస్తుంది. బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మద్దతిస్తున్న డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) ఇటీవలే బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2017 ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ.. కొందరు ఎంపీల రాజీనామా, దాదపు 20 ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో ఆ పార్టీకి మెజారిటీ తగ్గి, ప్రస్తుతం డీయూపీ మద్దతుపై ఆధారపడింది. ఇదీ ఒప్పందం... ప్రస్తుత ఒప్పందం.. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మే హయాంలో రూపొందించిన ఒప్పందం దాదాపు ఒకలాగే ఉన్నాయి. అయితే, బ్రెగ్జిట్ తరవాత కూడా కొన్ని విషయాల్లో ఈయూ నిబంధనలు కొనసాగుతాయన్న మునుపటి నిబంధన తాజా ఒప్పందలో లేదు. తాజా ఒప్పందం ఇదీ... బ్రెగ్జిట్ తరవాత ఐర్లాండ్‌కు, యూకేలో భాగంగా ఉండే ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య మరీ కఠినతరమైన సరిహద్దు ఉండకూడదని అన్ని పక్షాలూ భావిస్తున్నాయి. తాజా ఒప్పందాన్ని కూడా దీన్ని పరిష్కరించటంలో భాగంగానే తీసుకొచ్చారు. ► యూరోపియన్ కస్టమ్స్ యూనియన్ నుంచి యూకే పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో భవిష్యత్తులో ఇతర దేశాలతో యూకే స్వతంత్రంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలుగుతుంది. ► ఐర్లాండ్‌కు– ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య చట్టబద్ధమైన కస్టమ్స్ సరిహద్దు ఉంటుంది. కానీ ఆచరణలో అది ఐర్లాండ్– యూకే సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర ఐర్లాండ్‌లోకి ప్రవేశించే చోట సరుకుల తనిఖీలుంటాయి. ► బ్రిటన్ నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చే సరుకులపై ఆటోమేటిగ్గా సుంకాలు చెల్లించటమనేది ఉండదు. కానీ ఈయూలో భాగమైన ఐర్లాండ్‌కు వచ్చే సరుకుల్ని గనక ఇబ్బందికరమైనవిగా పరిగణిస్తే... వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ ‘ఇబ్బందికరమైన’ సరుకులు ఏంటనేది యూకే– ఈయూ ప్రతినిధుల ఉమ్మడి కమిటీ ఒకటి నిర్ణయిస్తుంది. ► ఈ సరిహద్దుల మధ్య వ్యక్తులు పంపించుకునే సరుకులపై పన్నులు విధించకపోవటం... ఉత్తర ఐర్లాండ్ రైతులకివ్వాల్సిన సాయం... సరుకుల నియంత్రణకు సంబంధించి ఈయూ సింగిల్ మార్కెట్ నిబంధనల్ని ఉత్తర ఐర్లాండ్ పాటించటం... సరిహద్దులో యూకే అధికారులతో పాటు ఈయూ అధికారులూ ఉండటం... సేవలకు మినహాయించి సరుకులకు మాత్రం ఉత్తర ఐర్లాండ్‌లో ఈయూ చట్టాలే అమలుకావటం... ఈయూలోని యూకే పౌరులు– యూకేలోని ఈయూ పౌరులు ఇకపైనా తమ నివాస, సోషల్ సెక్యూరిటీ హక్కుల్ని యథాతథంగా పొందగలగటం... ఇలాంటివన్నీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. -
బ్రిటన్‌లోలాగా భారత్‌లో అది సాధ్యమా?
న్యూఢిల్లీ : ప్రపంచంలో బ్రిటీష్ పార్లమెంట్‌తో పోల్చతగ్గ ప్రజాస్వామ్య సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి. 1649లో ఇంగ్లండ్ రాజు చార్లెస్–1 మద్దతుదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రాజుకు ఉరిశిక్ష అమలు చేసిన నాటి నుంచి బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి వ్యవహరిస్తున్నారు. పార్టీ లేదా ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓటర్లు, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగకుండా బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు బుధవారం నాడు తమ ప్రభుత్వాన్ని అడ్డుకున్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రవేశ పెట్టిన బ్రిగ్జిట్ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా పాలకపక్ష కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ఓటు వేశారు. వారు ప్రభుత్వ ప్రయోజనాలకన్నా ఓటర్లు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే వ్యవహరించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో బ్రిటీష్ పార్లమెంట్ వ్యవస్థను కూడా స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకునే భారత దేశం పార్లమెంట్లో ఇలాంటి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎప్పుడైన చూడగలమా? పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం భారత్ పార్లమెంట్లో, రాష్ట్రాల అసెంబ్లీలో చట్ట విరుద్ధం. అలాంటి వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడి శాసన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మూడింట రెండొంతుల మంది పార్టీ విప్‌ను ధిక్కరించినా, మరో పార్టీలో చేరిపోయినా వారి సభ్యత్వానికి లోటు లేదు. మంత్రి పదవులను ఆశించో, ఇతర ప్రలోభాలకు లోబడో కొంత మంది సభ్యులు పార్టీలు ఫిరాయిస్తున్నారని, వారిని అలా చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. భారత రాజకీయాల్లో ఏకపార్టీ ప్రాబల్యం తగ్గిపోయి, వివిధ పార్టీలతో కూడిన సంకీర్ణ రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజీవ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయాల్లో అవినీతిని అరికట్టడం కోసమే తామీ చట్టాన్ని తీసుకొచ్చామని నాడు రాజీవ్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1985 నుంచి రాజకీయాల్లో అవినీతి తగ్గిన దాఖలాలు లేవుగదా, పెరిగిన దాఖలాలు ఎక్కువగానే ఉన్నాయి. పోనీ పార్టీ ఫిరాయింపులు తగ్గాయా అంటే అదీ లేదు. ఇంకా పెరిగాయి. చట్టానికి ముందు ఫిరాయింపులు చిల్లర వ్యాపారంగా సాగితే ఇప్పుడు టోకు వ్యాపారంగా సాగుతున్నాయి. గోవాలో గత జూలై నెలలో 15 మంది కాంగ్రెస్ సభ్యులకుగాను ఏకంగా పది మంది సభ్యులు బీజేపీలో చేరిపోయారు. దాంతో వారిలో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి. ఇక సిక్కింలో గత ఆగస్టులో 13 మంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో పది మంది బీజేపీలో చేరిపోయారు. దాంతో ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మూడింట రెండొంతల మంది పార్టీని ఫిరాయించడం వల్ల వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడలేదు. ఒకప్పుడు చట్టంలో మూడోంతుల మంది ఫిరాయింపును మినహాయిస్తే ఆ తర్వాత సవరణ ద్వారా మూడింట రెండొంతుల మంది ఫిరాయింపునకు మినహాయింపు ఇచ్చారు. చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ! ఒకరిద్దరు పార్టీ ఫిరాయిస్తే తప్పు పది మంది ఫిరాయిస్తే తప్పకాదనడం ఎలా ఒప్పవుతుంది? తప్పొప్పుల సంగతి పక్కన పెడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. జరుగుతోంది. పార్టీ అధిష్టానం చెప్పినట్లు నడుచుకునే పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఉన్నప్పుడు ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం కూడా కష్టమే. ఓటర్లు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించకుండా కేవలం పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నడుచుకోవడం వల్ల పార్లమెంట్లోగానీ, అసెంబ్లీలోగానీ ప్రజస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతుందని అనుకోవడం భ్రమే అవుతుంది. అదీ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు, ఒకరిద్దరు వారసత్వ నాయకులో, నియంతృత్వ నేతల చేతుల్లో పార్టీ నాయకత్వం చిక్కుకున్నప్పుడు ప్రజాస్వామిక విలువలు మరింత మసకబారుతాయి. -
బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం కారణంగా ఆ దేశ ప్రధాని బాధ్యతల నుంచి థెరెసా మే దిగిపోవడంతో కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడం తెలిసిందే. రాణి ఎలిజబెత్ బుధవారం సాయంత్రమే జాన్సన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఆ వెంటనే మంత్రివర్గంలో జాన్సన్ మార్పులు చేశారు. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ అనే భారత సంతతి ఎంపీలు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో రిషి సునక్, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. వీరంతా గతంలో జాన్సన్ వెన్నంటే ఉండి ప్రచారాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ గురువారం కొత్త కేబినెట్ తొలి సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎలాంటి ఒప్పందమూ లేకుండానైనా సరే, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్న హామీతో జాన్సన్‌కు ప్రధాని పదవి లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ప్రకటించారు. వారంతా బ్రెగ్జిట్ ప్రక్రియలో తనకు సహకరిస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ప్రీతీ పటేల్ బోరిస్ జాన్సన్ కేబినెట్లో కీలక పదవి దక్కిన భారత సంతతి వ్యక్తి ప్రీతీ పటేలేనని చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులకు బ్రిటన్‌లోనే జన్మించిన ప్రీతీ పటేల్ (47) హోం మంత్రిగా నియమితులయ్యారు. బ్రెగ్జిట్‌పై థెరెసా మే విధానాలను ప్రీతి తూర్పారపట్టేవారు. బ్రిటన్‌లో భారతీయ కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీకి ప్రీతి బ్రిటన్‌లో కీలకమద్దతుదారు. బ్రిటన్ ప్రధాని ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ శాఖ బా«ధ్యతలిచ్చారు. 2010 నుంచి అలోక్శర్మ ఎంపీగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలోక్ శర్మ జన్మించారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిషి రిషి సునక్ (39) ట్రెజరీ విభాగానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రిషి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిచ్మాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిషి తండ్రి భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. రిషి సునక్ బ్రిటన్‌లోనే పుట్టారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగానికి చెందినవారు. కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తితో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్‌తో జాన్సన్కీ అనుబంధం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా భారత్‌తో ఒకప్పుడు అందమైన అనుబంధమే ఉంది. ఆయన మొదటి భార్య మరీనా వీలర్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి చార్లెస్ వీలర్ బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆయన రెండో భార్య దీప్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సరొగోధకు చెందినవారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. దీప్ సింగ్ మొదటి భర్త ప్రముఖ బాక్సర్ సర్ శోభాసింగ్ కుమారుల్లో ఒకరైన దల్జీత్. దల్జీత్ ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సోదరుడు. బోరిస్ జాన్సన్, మరీనా దంపతులు భారత్‌కు చాలా సార్లు వచ్చారు. దల్జీత్‌సింగ్ కుటుంబంతో కూడా జాన్సన్ సంబంధాలు కొనసాగించారు. 2017 ఎన్నికల సమయంలో బ్రిస్టల్‌లో గురుద్వారాలో మాట్లాడుతూ భారత్‌కు వెళ్లినప్పుడల్లా తమ బంధువులకి స్కాచ్ విస్కీ తీసుకువెళుతుండేవాడినని చెప్పి వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. -
పార్టీ నాయకత్వానికి మే రాజీనామా
లండన్: బ్రెగ్జిట్ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధనకు మూడేళ్ల పాటు అటు ప్రతిపక్షాలతో ఇటు సొంత పార్టీలోని అసమ్మతివాదులతో పోరాడి ఓడిన బ్రిటన్ ప్రధాని థెరీసా మే గతంలో (మే 23న) చెప్పిన ప్రకారం శుక్రవారం కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. కొత్త ప్రధాని వచ్చేంత వరకు ఆమె తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ సోమవారం మొదలుకానుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని అమలు పరచలేకపోయానన్న బాధ ఎప్పటికీ ఉంటుందని మే 23వ తేదీన చేసిన ప్రసంగంలో థెరీసా భావోద్వేగం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా వారసునిపై ఉంది. పార్లమెంటులో ఏకాభ్రిప్రాయం సాధించడం ద్వారానే వారు దీన్ని సాధించగలరు. బలమైన, సుస్థిర నాయకత్వంతో బ్రిటిష్ సమాజంలోని అన్యాయాలపై పోరాటమే తన కర్తవ్యమని ప్రకటించి ప్రధాని పదవి చేపట్టిన థెరీసాకు బ్రెగ్జిట్ పుణ్యమా అని ఆ అవకాశమే లభించలేదు.ç పదవిలో ఉన్న మూడేళ్లూ బ్రెగ్జిట్తోనే సరిపోయింది. 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఆ నేపథ్యంలో ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవీచ్యుతుడవడంతో థెరీసా ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఈయూతో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలను కూడా బుజ్జగించేందుకు విఫలయత్నం చేశారు. అయితే, మూడుసార్లు పార్లమెంటులో జరిగిన ఓటింగులో థెరీసా ఒప్పందం వీగిపోయింది. 2017లో జరిగిన ఎన్నికల్లో థెరీసా పార్లమెంటులో మెజారిటీ కూడా కోల్పోవడంతో బ్రెగ్జిట్ భవిష్యత్తు మరింత సంక్లిష్టమయింది. వరుసగా మూడో సారి కూడా పార్లమెంటులో ఒప్పందం వీగిపోయింది. ఫలితంగా 62 ఏళ్ల థెరీసా రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రధాని పదవికి పోటీలో 11 మంది ప్రధాని పదవి కోసం 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాని పదవి కోసం పోటీ చేసే అభ్యర్థి కనీసం 8 మంది ఎంపీల మద్దతు చూపించాల్సి ఉంటుంది. జూన్ 13, 18, 19 తేదీల్లో జరిగే రహస్య బ్యాలెట్లో పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు. జూన్ 22 న కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది. -
బ్రిటన్ ప్రధాని రాజీనామాపై నిర్ణయం..!
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆమె పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేత గ్రాహమ్ బ్రాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యురోపియన్ దేశాల్లో చర్చంతా బ్రెగ్జిట్ చుట్టూనే నడుస్తోన్న విషయం తెలిసిందే. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో థెరిసా మే తీవ్రంగా విఫలమయ్యారని సొంత పార్టీ సభ్యులే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజీనామాపై వచ్చే వారం ఆమె కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్ ప్రధాని నిర్ణయం వీగిపోయిన విషయం తెలిసిందే. వాస్తవానికి రెండేళ్ల బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ మార్చి 29నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్లో ఆమె అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాడే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంచరించుకున్నాయి. ఒకవేళ మే రాజీనామా చేస్తే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. -
మూడోసారీ బ్రెగ్జిట్‌కు తిరస్కరణే
లండన్: మూడోసారి కూడా బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్ బిల్లును ఆ దేశ పార్లమెంటు శుక్రవారం తిరస్కరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చే పద్ధతి మరింత సంక్లిష్టమైంది. మే తెచ్చిన తాజా బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా 286 ఓట్లు, వ్యతిరేకంగా 344 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే బ్రెగ్జిట్‌కు సంబంధించిన అన్ని బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు థెరెసాకు మే 22వ తేదీ వరకు సమయం దొరికేది. వాస్తవానికి గత ప్రణాళిక ప్రకారం శుక్రవారం నుంచే (మార్చి 29) బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. బ్రెగ్జిట్ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందక పోవడంతో అది వాయిదా పడింది. -
డీల్ లేని ‘బ్రెగ్జిట్’ వద్దు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనుదిరిగే బ్రెగ్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని థెరిసా మే చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో గట్టెక్కలేకపోయింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం 43 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. 321 మంది సభ్యులు అనుకూలంగా, 278 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి మే ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలు రెండుసార్లు వీగిపోయినట్లయింది.షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 29న యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావాల్సి ఉంది. కానీ తాజా పరిణామం నేపథ్యంలో ఆ తేదీన ఒప్పందం లేకుండా నిష్క్రమించడం సాధ్యం కాదని ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పర్యవేక్షణను పార్లమెంట్‌కు అప్పగించాలని విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని చెప్పారు. రెండో రెఫరెండానికి తిరస్కరణ బ్రెగ్జిట్ కోసం రెండో రెఫరెండం నిర్వహించాలన్న ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంట్ గురువారం భారీ మెజారిటీతో తిరస్కరించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 334 మంది, అనుకూలంగా 85 మంది ఓటేశారు. విపక్ష లేబర్ పార్టీ సభ్యులు చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకవేళ ఈ సవరణ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గట్టెక్కినా, ప్రభుత్వం దానిని తప్పకుండా అమలుచేయాల్సిన అవసరం లేదు. -
‘బ్రెగ్జిట్ జరగకుంటే సంక్షోభమే’
గ్రిమ్స్బై: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకేయాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. లేదంటే బ్రెగ్జిట్ ఎన్నటికీ జరగదనీ, సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు తిరస్కరించింది. ‘వచ్చే మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే మిగిలేది సంక్షోభమే. అంతిమంగా బ్రిటన్ ఈయూ నుంచి ఎన్నటికీ విడిపోదు’ అని మే అన్నారు. 2016లో జరిగిన బ్రెగ్టిట్ లో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 51.9 శాతం మంది బ్రిటిషర్లు ఓటేశారు. -
అవిశ్వాసంలో గెలిచిన మే
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మే ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మే స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంపీలంతా పార్టీలకతీతంగా తమ స్వప్రయోజనాల ను పక్కనబెట్టి కొత్త బ్రెగ్జిట్ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం తనతో కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మే రెండేళ్లపాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలు జరిపి బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకొస్తే, అది బ్రిటన్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ పార్లమెంటు గత మంగళ వారం బ్రెగ్జిట్ బిల్లును భారీ ఆధిక్యంతో తిరస్కరించింది. అదేరోజు ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్ మే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా దానిపై ఓటింగ్ బుధవారం జరిగింది. బ్రెగ్జిట్ బిల్లుపై ఓటింగ్‌లో మే ఓడిపోయినా, అవిశ్వా సంలో మాత్రం 19 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. 26 ఏళ్ల తర్వాత తొలిసారి బ్రిటన్ పార్లమెంటు లో అవిశ్వాసంపై ఓటింగ్ జరగ్గా, మేకి అనుకూలం గా 325 ఓట్లు, వ్యతిరేకంగా 306 ఓట్లు వచ్చాయి. సోమవారమే మరో ఒప్పందం అవిశ్వాసంలో గెలిచిన అనంతరం మే మాట్లాడుతూ ‘ఇప్పుడు బ్రెగ్జిట్‌కు దారి కనుక్కోవడంపై దృష్టిపెట్టే అవకాశం మనకు లభించింది. మనం ఈయూ నుంచి బయటకు రావాలని బ్రిటన్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీలంతా తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి, బ్రెగ్జిట్ ఒప్పందం కోసం మాతో కలసి నిర్మాణాత్మకంగా పనిచేయాలి’అని ఆమె కోరారు. సోమవారమే మరో కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని సభ ముందు ఉంచుతానని మే స్పష్టం చేశారు. ‘ఇది అంత సులభమైన పని కాదు. దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్న విషయం ఎంపీలకు తెలుసు. వారంతా ఏకాభిప్రాయానికి వచ్చి, దీన్ని సాధించాలి. తమకు ఏం వద్దో ఎంపీలు ఇప్పుడు స్పష్టంగా చెప్పారు. పార్లమెంటుకు ఏం కావాలో తెలుసుకునేందుకు మనమంతా కలసి పనిచేయాలి. ఈయూ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్ ప్రజల కోరికను నెరవేర్చడం మన బాధ్యత అని నేను భావిస్తున్నా’అని మే వెల్లడించారు. మొండిపట్టు వీడాలి: కార్బిన్ థెరెసా మే తన మొండిపట్టును వీడి భవిష్యత్తు ప్రణాళికలపై తీవ్రంగా ఆలోచించాలని ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బిన్ అన్నారు. అసలు ఏ ఒప్పందమూ లేకుండా బ్రెగ్జిట్ జరగదని మే హామీ ఇస్తేనే తదుపరి ఆశాజనక చర్చలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తాము అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు బ్రెగ్జిట్‌ను సాధించేందుకు తాను ఏ పార్టీ ఎంపీతోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని మే ప్రకటించారు. కాగా, బ్రెగ్జిట్‌పై రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిందిగా దాదాపు 170 వాణిజ్య సంస్థలు మే, కార్బిన్‌లను కోరు తున్నట్లు టైమ్స్ పత్రిక తెలిపింది. ‘ప్లాన్ బీ’పై 29న ఓటింగ్ తొలి బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లు పార్లమెంటు తిరస్కరణకు గురవడంతో థెరెసా మే ప్రవేశపెట్టనున్న ప్రత్యామ్నాయ బిల్లుపై ఈ నెల 29న దిగువ సభలో ఓటింగ్ జరగనుంది. సోమవారం మే ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టి, తన తదుపరి చర్యలేంటో చెబుతారనీ, 29న పూర్తిగా రోజు మొత్తం చర్చించిన తర్వాత ఓటింగ్ ఉంటుందని హౌజ్ ఆఫ్ కామన్స్ నాయకురాలు ఆండ్రియా లీడ్సమ్ చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ మార్చి 29న బయటకు రావాల్సి ఉంది. అంటే బ్రెగ్జిట్‌కు సరిగ్గా రెండు నెలల ముందు ప్రత్యామ్నాయ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరగనుంది. -
తీవ్ర ఒడిదుడుకులు
తీవ్ర హెచ్చుతగ్గుల్లో సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితిల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ట్రేడింగ్ మొత్తంలో 184 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 3 పాయింట్ల లాభంతో 36,321 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 3 పాయింట్లు పెరిగి 10,890 పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ లాభాలు ఆవిరి... చైనా కేంద్ర బ్యాంక్ బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా 8,300 కోట్ల డాలర్ల నిధులను గుమ్మరించనున్నదన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్రెగ్జిట్ బిల్లు వీగిపోవడంతో యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. దీంతో మన మార్కెట్లో ఆటు పోట్లు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 144 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 40 పాయింట్ల వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 184 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్రిటన్‌లో అనిశ్చితి... యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంట్లో భారీ మెజారిటీతో వీగిపోయింది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముందని, ఎన్నికలు కూడా రావచ్చనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. లండన్ ఎఫ్టీఎస్ఈ 0.6 శాతం పతనం కాగా, ఇతర యూరప్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ల లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ విలీనం కారణంగా ఏర్పడిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఎస్ఈలో ఈ షేర్ రూ.47 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2.7 శాతం లాభంతో రూ.48 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.23,071 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్ రుణాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 32 శాతంగా ఉన్నాయి. ► జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుజ్జీవన ప్రణాళికపై అనిశ్చితి నెలకొనడంతో జెట్ ఎయిర్వేస్ షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీ భాగస్వామి ఎతిహాద్ జెట్ ఎయిర్వేస్లో మరింత వాటాను కొనుగోలు చేయనున్నదని, అయితే ఒక్కో షేర్‌ను రూ.150కు మాత్రమే ఆఫర్ ఇచ్చిందన్న వార్తల కారణంగా ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 8 శాతం తగ్గి రూ.271 వద్ద ముగిసింది. ► క్యూ3లో ఆర్థిక ఫలితాలు అదిరిపోవడంతో స్పెషాల్టీ రెస్టారెంట్ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.98 వద్ద ముగిసింది. -
బేతాళ ప్రశ్నగా మారిన బ్రెగ్జిట్!
ఐరోపా దేశాల సంఘం(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాల్సిన గడువు సమీపిస్తున్నా రెండింటి మధ్య తెగతెంపుల ఒప్పందం కుదిదే అవకాశాలు కనిపించడం లేదు. బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చాక ఇంగ్లండ్‌లో అంతర్భాగమైన ఉత్తర ఐర్లండ్ ఐరోపా సింగల్ మార్కెట్లో కొనసాగేలా ఒప్పంద పత్రం ముసాయిదాను ఈయూ రూపొందిస్తోందనే సమాచారంపై తాజాగా వివాదం తలెత్తింది. ఐరోపా కస్టమ్స్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే విషయం సహా ఇంకా అనేక అంశాలపై తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి బ్రెగ్జిట్ ఒడంబడిక కుదరకపోవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 28 ఐరోపా దేశాల రాజకీయ, ఆర్థిక ఐక్యతకు స్థాపించిన ఈయూ నుంచి 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు ఇంగ్లండ్ నిష్క్రమించాలని దాదాపు రెండేళ్ల క్రితమే నిర్ణయించారు. ఉత్తర ఐర్లండ్ ఈయూలో కొనసాగేలా చేసే ఒప్పందంపై సంతకం పెట్టేది లేదనీ, బ్రిటన్ ‘రాజ్యాంగ సమగ్రత’పై రాజీపడబోనని ఇంగ్లండ్ ప్రధాని థెరిసా మే హెచ్చరించారు. ఐరోపా సంఘం నుంచి వైదొలిగినా బ్రిటన్ను ఐరోపా కస్టమ్స్ యూనియన్‌లో కొనసాగేలా ఒత్తిడి చేయడానికే ఉత్తర ఐర్లండ్ సమస్యను ఈయూ నేతలు ముందుకు తెచ్చారని కొందరు అనుమానిస్తున్నారు. ఐర్లండ్ సరిహద్దు వాణిజ్యంపై ఏర్పడుతున్న చిక్కుముడి వల్ల ఈయూతో ఒప్పందం కుదరకపోవచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన జనం ఆలోచన మారుతోందా? 2016 బ్రెగ్జిట్ జనాభిప్రాయసేకరణలో ఈయూ నుంచి బయటపడాలంటూ ఓటేసిన ప్రజల్లో చాలా మంది తమ అభిప్రాయం మార్చుకున్నారని గత ఆరు నెలలుగా చేసిన సర్వేలు చెబుతున్నాయి. బ్రెగ్జిట్‌పై రెండోసారి రెఫరెండం జరపాలని 47 శాతం పౌరులు కోరుతున్నారని ఇటీవల గార్డియన్ పత్రిక జరిపిన సర్వే వెల్లడించింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత బ్రసెల్స్ కేంద్రంగా పనిచేసే ఈయూ, ఇంగ్లండ్ ప్రధాని మే కుదుర్చుకునే ఒప్పందం బ్రిటన్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్ తుది ఒప్పందంపై కామన్స్సభలో స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఎంపీలకు ఇవ్వాలని పాలకపక్షం కన్సర్వేటివ్ పార్టీ మాజీ ప్రధాని జాన్ మేజర్ సహా పలువురు కోరుతున్నారు. ఈయూ నుంచి వైదొలగే విషయమై రెండో రెఫరెండం జరపడానికి, బ్రెగ్జిట్‌ను పూర్తిగా తిరస్కరించడానికి కూడా దిగువసభకు అవకాశమివ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. తుది వాణిజ్య ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బయటికొస్తే ఇంగ్లండ్ జీడీపీ 8 శాతం తగ్గే ప్రమాదముందని బ్రెగ్జిట్‌పై బ్రిటిష్ సర్కారు అంచనా వేస్తోంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా అత్యధిక మద్దతు పలికిన ఈశాన్య, మిడ్లాండ్స్ వంటి ప్రాంతాలు అంతకు రెండు రెట్లు నష్టపోతాయని కూడా లీకైన ప్రభుత్వ నివేదిక చెబుతోంది. బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే కొత్త పార్టీ ‘రిన్యూ’ ఈయూ నుంచి వైదొలగకుండా బ్రిటన్ను ఆపడానికి ‘రిన్యూ’ అనే కొత్త పార్టీ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టి బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకాభిప్రాయం సాధించాలనే లక్ష్యంతో ‘లిసన్ టూ బ్రిటన్’ అనే ప్రచారోద్యమం ఆరంభించింది. ఇంగ్లండ్ ఈయూలోనే ఉండాలని వాదించే ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ అనే సంస్థకు అమెరికా బిలియనీర్ జార్జి సరోస్ ఐదు లక్షల పౌండ్ల విరాళం ఇచ్చారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రెగ్జిట్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేసేలా ఎంపీలపై ఈ సంస్థ ఒత్తిడితెస్తోంది. విస్తృత లాబీయింగ్ ద్వారా ఎంపీలకు నచ్చచెప్పి దేశంలో బ్రెగ్జిట్‌పై రెండో రిఫరెండం జరిపించడమే ఈ సంస్థ లక్ష్యం. సకాలంలో ఒప్పందం కుదరకపోతే... ఈయూ, బ్రిటన్ మధ్య ఒప్పందం అనుకున్న సమయానికి కుదరకపోతే బ్రిటన్ ఎక్కువ నష్టపోతుంది. ఇంగ్లండ్‌లో నివసిస్తున్న ఇతర ఈయూ దేశాల పౌరులు, ఈయూ దేశాల్లో స్థిరపడిన బ్రిటిష్ జాతీయుల నివాస హక్కులు గందరగోళంలో పడతాయి. ఈయూకు ఇంగ్లండ్ చెల్లుచీటీ ఇచ్చే విషయంపై లేదా ఈయూ సింగల్ మార్కెట్లో కొనసాడంపై ఒప్పందమేదీ కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారమే బ్రిటన్ ఇతర ఐరోపా దేశాలతో వ్యాపారం చేయాల్పివస్తుంది. ఇది ఆ దేశానికి నష్టదాయకంగా మారుతుంది. బ్రెగ్జిట్‌కు అధిక మద్దతు ఇచ్చిన ఇంగ్లండ్ రైతులు తమ ఉత్పత్తులను ఇతర ఈయూ దేశాలకు ఎగుమతి చేస్తే అదనంగా 30-40 శాతం సుంకాలు చెల్లించక తప్పదు. ఈయూ సభ్యత్వం ఉన్నందు వల్ల బ్రిటిష్ బ్యాంకులు, ఆర్థికసంస్థలు లండన్ నుంచి ఇతర సభ్య దేశాలతో అక్కడ ఎలాంటి అనుబంధ కంపెనీలు లేకుండా స్వేచ్ఛగా లావాదేవీలు సాగిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఒప్పందం లేకుంటే ఈ సంస్థలకు ప్రస్తుతమున్న పాస్పోర్టింగ్ హక్కులు కోల్పోతాయి. ఇంకా లండన్ నుంచి పనిచేసే అనేక ఐరోపా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సిబ్బందిని, కార్యకలాపాలను తగ్గించుకుంటే స్థానికులు వేల సంఖ్యలో నిరుద్యోగులవుతారు. ‘చంద్రుడిపై మానవుడు కాలు మోపడమంత’ కష్టమా? ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై జరిగే సంప్రదింపులు చంద్రునిపై మానవుడు కాలు మోపడమంత క్లిష్టంగా ఉందని బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ గతంలో వ్యాఖ్యానించారు. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఏడాది కాలమే ఉన్నా అవి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. కీలకమైన వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు బ్రెగ్జిట్‌కు అనుగుణంగా సర్దుకోవడానికి రెండేళ్లు అవసరమని ఆయన వాదిస్తున్నారు. దీనిపై అంగీకారం కుదిరాక వచ్చే రెండేళ్లలో బ్రిటన్ వాస్తవానికి ఈయూలో కొనసాగుతున్నట్టే పరిస్థితి ఉంటుందని అంచనా. అందుకే మార్చి నాటికి బ్రిటన్-ఈయూ మధ్య ఒప్పందం కుదిరితే మేలని ఆయన భావిస్తున్నారు. వచ్చే అక్టోబర్ నాటికి ఈ ఒప్పందం ముసాయిదా ఒక కొలిక్చి వస్తే, 2019 మార్చి 19 లోగా ఐరోపా పార్లమెంటులో దాన్ని మిగిలిన 27 దేశాలతో ఆమోదింపచేయవచ్చని బ్రిటన్ భావిస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదముద్ర
లండన్ : యూరపియన్ యూనియన్ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది. బ్రెగ్జిట్ బిల్లుపై దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రధాని థెరిసా మే వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు. ఈ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 324 మంది ఎంపీలు ఓటేయగా, వ్యతిరేకంగా 295 మంది ఓటేశారు. దిగవ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఇక ఎగువ సభలోనూ పాసవ్వాలి. యూరోపియన్ యూనియన్ చట్టాలన్నీ బ్రిటన్ చట్టాలుగా మారడానికి ఉద్దేశించిన 1972 చట్టం ప్రకారమే హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ)లో బ్రెగ్జిట్‌పై చర్చ జరగనుంది. ఇదిలావుండగా దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదమే అత్యంతక కీలక ఘట్టమని నిపుణులు చెబుతన్నారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని బ్రెగ్జిట్ సెక్రెటరీ డేవిడ్ డేవిస్ అన్నారు. బ్రిటన్ ప్రయోజనాలకే ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ సాఫీగా బయటకు రావడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని డేవిడ్ డేవిస్ చెప్సారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం ప్రధాని థెరిసా మే సాధించిన ఘనవిజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
లండన్: బ్రెగ్జిట్ (యూరప్ కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం)కు సంబంధించిన ఓ బిల్లుకు బ్రిటిష్ పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరెసా మే ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లైంది. ఈ బిల్లుకు అనుకూలంగా 326 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 290 ఓట్లు పడ్డాయి. బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని థెరెసా మే అన్నారు. తదుపరి దశలో ఈ బిల్లును ఎంపీలు క్షుణ్నంగా పరిశీలిస్తారు. 1972 నాటి యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టాన్ని ఈ బిల్లు ద్వారా రద్దు చేయనున్నారు. అలాగే ఈయూ చట్టాలను ఈ బిల్లు యూకే (యునైటెడ్ కింగ్డమ్) చట్టాలుగా మారుస్తుంది. -
బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ రాణి ఆమోదం
లండన్: ‘బ్రెగ్జిట్’ బిల్లుకు బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ రాజముద్ర వేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చే ప్రక్రియ ప్రారంభించేందుకు ఆ దేశ ప్రధాని థెరిసా మేకు అధికారం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు గురువారం ఆమె ఆమోదముద్ర వేశారు. యూరోపియన్ యూనియన్ (ఉపసంహరణ నోటిఫికేషన్) బిల్లును ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బ్రిటన్ రాణి సంతకంతో 28 సభ్య దేశాలు గల ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగే విషయమై చర్చలు జరిపేందుకు ప్రధానికి అధికారం లభించింది. మరోవైపు కొత్తగా ‘యునైటెడ్ ఫ్రంట్’ను ఏర్పాటు చేసేందుకు యూకేలోని వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర్ ఐర్లాండ్‌లో పర్యటించాలని థెరిసా మే ప్రయత్నిస్తున్నారు.