న్యూఢిల్లీ : ప్రపంచంలో బ్రిటీష్ పార్లమెంట్‌తో పోల్చతగ్గ ప్రజాస్వామ్య సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి. 1649లో ఇంగ్లండ్ రాజు చార్లెస్–1 మద్దతుదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రాజుకు ఉరిశిక్ష అమలు చేసిన నాటి నుంచి బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి వ్యవహరిస్తున్నారు. పార్టీ లేదా ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓటర్లు, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగకుండా బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు బుధవారం నాడు తమ ప్రభుత్వాన్ని అడ్డుకున్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రవేశ పెట్టిన బ్రిగ్జిట్ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా పాలకపక్ష కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ఓటు వేశారు. వారు ప్రభుత్వ ప్రయోజనాలకన్నా ఓటర్లు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే వ్యవహరించారు.
భారత రాజ్యాంగ నిర్మాణంలో బ్రిటీష్ పార్లమెంట్ వ్యవస్థను కూడా స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకునే భారత దేశం పార్లమెంట్‌లో ఇలాంటి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎప్పుడైన చూడగలమా? పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం భారత్ పార్లమెంట్‌లో, రాష్ట్రాల అసెంబ్లీలో చట్ట విరుద్ధం. అలాంటి వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడి శాసన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మూడింట రెండొంతుల మంది పార్టీ విప్‌ను ధిక్కరించినా, మరో పార్టీలో చేరిపోయినా వారి సభ్యత్వానికి లోటు లేదు. మంత్రి పదవులను ఆశించో, ఇతర ప్రలోభాలకు లోబడో కొంత మంది సభ్యులు పార్టీలు ఫిరాయిస్తున్నారని, వారిని అలా చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది.
భారత రాజకీయాల్లో ఏకపార్టీ ప్రాబల్యం తగ్గిపోయి, వివిధ పార్టీలతో కూడిన సంకీర్ణ రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజీవ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయాల్లో అవినీతిని అరికట్టడం కోసమే తామీ చట్టాన్ని తీసుకొచ్చామని నాడు రాజీవ్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1985 నుంచి రాజకీయాల్లో అవినీతి తగ్గిన దాఖలాలు లేవుగదా, పెరిగిన దాఖలాలు ఎక్కువగానే ఉన్నాయి. పోనీ పార్టీ ఫిరాయింపులు తగ్గాయా అంటే అదీ లేదు. ఇంకా పెరిగాయి. చట్టానికి ముందు ఫిరాయింపులు చిల్లర వ్యాపారంగా సాగితే ఇప్పుడు టోకు వ్యాపారంగా సాగుతున్నాయి.
గోవాలో గత జూలై నెలలో 15 మంది కాంగ్రెస్ సభ్యులకుగాను ఏకంగా పది మంది సభ్యులు బీజేపీలో చేరిపోయారు. దాంతో వారిలో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి. ఇక సిక్కింలో గత ఆగస్టులో 13 మంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో పది మంది బీజేపీలో చేరిపోయారు. దాంతో ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మూడింట రెండొంతల మంది పార్టీని ఫిరాయించడం వల్ల వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడలేదు. ఒకప్పుడు చట్టంలో మూడోంతుల మంది ఫిరాయింపును మినహాయిస్తే ఆ తర్వాత సవరణ ద్వారా మూడింట రెండొంతుల మంది ఫిరాయింపునకు మినహాయింపు ఇచ్చారు.
చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ!
ఒకరిద్దరు పార్టీ ఫిరాయిస్తే తప్పు పది మంది ఫిరాయిస్తే తప్పకాదనడం ఎలా ఒప్పవుతుంది? తప్పొప్పుల సంగతి పక్కన పెడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. జరుగుతోంది. పార్టీ అధిష్టానం చెప్పినట్లు నడుచుకునే పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఉన్నప్పుడు ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం కూడా కష్టమే. ఓటర్లు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించకుండా కేవలం పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నడుచుకోవడం వల్ల పార్లమెంట్‌లోగానీ, అసెంబ్లీలోగానీ ప్రజస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతుందని అనుకోవడం భ్రమే అవుతుంది. అదీ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు, ఒకరిద్దరు వారసత్వ నాయకులో, నియంతృత్వ నేతల చేతుల్లో పార్టీ నాయకత్వం చిక్కుకున్నప్పుడు ప్రజాస్వామిక విలువలు మరింత మసకబారుతాయి.
Comments
Please login to add a commentAdd a comment