లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాని కావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇక రేసులో మిగిలి ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు కేవలం 29 మంది ఎంపీల మద్దతే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 100 మంది ఎంపీల సపోర్ట్ లేకుండా ఆమె పోటీ చేయడం అసాధ్యం. సోమవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా ఆమె 100 మంది సభ్యుల మద్దతు ఉందని నిరూపించుకోలేకపోతే.. 142 మంది సభ్యుల మద్దతున్న రిషి సునాక్ ఆటోమేటిక్‌గా ప్రధాని అవుతారు. ఫలితంగా బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.
పోటీ చేస్తానని తప్పుకున్న బోరిస్..
లిజ్ ట్రాస్ రాజీనామా చేయగానే.. ప్రధాని పదవి కోసం బోరిస్ మరోసారి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా వేగంగా పావులు కదిపారు. దాదాపు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపినట్లు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోటీ లేకుండా ప్రధాని అయ్యేందుకు ఆయన రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్‌తో చర్చలు జరపగా వారు రేసు నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. మరోవైపు రిషికి 142 మంది ఎంపీలు అండగా ఉన్నారు.
దీంతో రిషితో పోటీపడి గెలవలేనని భావించిన బోరిస్.. ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీని తాను ఏకం చేయలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయినా తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దేశానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
బోరిస్ నిర్ణయం అనంతరం రిషి సునాక్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. బ్రెగ్జిట్, కరోనా వ్యాక్సిన్ల పంపణీ, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాజీ ప్రధాని దేశాన్ని ముందుకు నడిపిన తీరు అద్భుతమని కొనియాడారు.
రిషి సునాక్.. భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారయణ మూర్తి అల్లుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూతురు అక్షతా మూర్తినే రిషి వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
చదవండి: బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్..
Comments
Please login to add a commentAdd a comment