Anti-defection law
-
ఫిరాయింపుల చట్టంపై సమీక్ష కమిటీ: ఓం బిర్లా
ముంబై: ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు కమిటీ వేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీనికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సారథ్యం వహిస్తారని ఆదివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచూ పార్టీలు మారడాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగం పదో షెడ్యూల్లో ఉంది. దీని ప్రకారంఎమ్మెల్యేలు పార్టీ మారినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా అనర్హత వేటు వేయవచ్చు. -
గుజరాత్: ఆప్‌ను వీడాలన్నది ప్రజలే నిర్ణయిస్తారు!
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తామని ప్రకటించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాకే తగిలింది. తొంబై సీట్లు సాధిస్తామని ధీమాగా ప్రకటించుకున్న ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు పెద్ద దెబ్బే పడింది. కేవలం ఐదు స్థానాలతో సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైంది గుజరాత్లో. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరంగా చతికిల బడింది. అయితే.. గుజరాత్ బీజేపీ భారీ విజయానికి.. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆప్‌లో కొనసాగుతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భూపత్ భయానీ.. తాజాగా షాకింగ్ ప్రకటన చేశారు. ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు తెర మీదకు రావడంతో.. మీడియా ఆయన్ని ప్రశ్నించింది. అయితే తాను ఇంకా ఏం నిర్ణయించుకోలేదని ప్రకటిస్తూనే.. పార్టీ మారే అంశంపై హింట్ ఇచ్చారాయన. బీజేపీలోకి వెళ్లే విషయమై ఇంకా అధికారికంగా ఏం ఆలోచించుకోలేదు. కానీ, ప్రజలు గనుక కోరుకుంటే ఆ పని చేస్తా అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ‘‘ తన పార్టీకి నెగ్గిన వాళ్లంతా మేలిమి రత్నాలని, ఎట్టి పరిస్థితుల్లో అమ్ముడుపోరు’’ స్టేట్మెంట్ను తెర మీదకు తెచ్చి ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై భయానీ ఓ జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. ఆప్‌ను వీడే ఆలోచన లేదు. బీజేపీలో చేరను. ఒకవేళ బీజేపీలో చేరాలా? వద్దా? అని ప్రజలను కోరతా అని మాత్రమే చెప్పాను. అలా అనడానికి కారణం ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సంఖ్య ఎలాగూ లేదు. ఎమ్మెల్యేగానూ నేను పెద్దగా ప్రభావం చూపించకపోనూ వచ్చు. తద్వారా ప్రజలకు ఏమీ ఒరగదు. నేను నెగ్గిన స్థానంలో రైతుల సంఖ్య ఎక్కువ. ఇరిగేషన్ సంబంధిత సమస్యలే పరిష్కరించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఉన్నారు. వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోతే ఎలా?. అందుకే ప్రజలను, స్థానిక నేతలనూ ఓసారి సంప్రదిస్తా అంటూ పార్టీ మారే అంశంపై స్పందించారు. గతంలో బీజేపీలోనే ఉన్న భూపత్ భయానీ.. ఎన్నికల సమయంలో రెబల్‌గా మారారు. ఆప్‌లో చేరి జునాగఢ్ జిల్లా విసవాదర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ‘‘నరేంద్ర మోదీకి, బీజేపీకి గుజరాత్ ప్రజలు భారీ సీట్లతో అధికార పట్టం కట్టారు. బీజేపీ అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే గతంలో వాళ్లతో నాకు మంచి అనుబంధం ఉండేది కాబట్టి. బహుశా అక్కడి జనాలు బీజేపీ ఎమ్మెల్యేగా నేను చేసిన సేవలు గుర్తించి నాకు ఓట్లేసి ఉంటారేమో అంటూ పార్టీ మారే దిశగా సంకేతాలు ఇచ్చారాయన. పార్టీ మారితే.. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా చర్యలు ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రజల కోసం పని చేయడమే ఉంటుందంటూ వ్యాఖ్యానించారాయన. మొత్తం 182 సీట్లున్న గుజరాత్లో.. 156 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆప్ ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
ఫిరాయింపుల చట్టంలో సవరణలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
బెంగళూరు: పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అవి మూకుమ్మడి ఫిరాయింపులకు దోహదం చేస్తున్నాయన్నారు. చట్టంలో సవరణలు తేవాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పార్టీ మారదలిచిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలన్నారు. ఫిరాయింపుల కేసులపై నిర్ణయాన్ని స్పీకర్లు, చైర్పర్సన్లు, న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం వెలువరించేందుకు కాలపరిమితి ఉండాలన్నారు. స్థానిక సంస్థలను బలో పేతం చేయాల్సిన అవసరముందన్నారు. మీడియా పాత్ర కీలకం దేశంలోని పెనుమార్పుల్లో మీడియా పాత్ర నిర్ణయాత్మకమని వెంకయ్య అన్నారు. కనిపించని వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. తన పదవీకాలం మూడు నెలల్లో ముగుస్తుందని, మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఖాళీగా మాత్రం ఉండనని, ఏదో వ్యాపకాన్ని చేపడతానని తెలిపారు. -
ఫిరాయింపు రోగానికి విరుగుడు
రాజకీయాల్లో నైతికత నానాటికీ క్షీణిస్తూ, ఫిరాయింపులు రివాజుగా మారుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం ధర్మాగ్రహం ప్రకటించింది. ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదులను మూడు నెలల్లో పరిష్కరించాలని నిర్దేశించడంతోపాటు, అసలు ఫిరాయింపుల బెడద పరిష్కారానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం ఉత్తమమని సూచించింది. ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభల సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం చట్టసభల అధ్యక్షులకు ఉన్నా దాన్ని వినియోగించుకోవడానికి ఎవరూ సిద్ధప డటం లేదు. లోక్‌సభ మొదలుకొని అసెంబ్లీల వరకూ ఇదే తంతు. పర్యవసానంగా ప్రజా స్వామ్యం ప్రహసనంగా మారింది. పరిస్థితులు ఇంతగా వికటించిన తీరుపై స్పీకర్లు కూడా మధన పడుతు న్నారు. గత నెలలో డెహ్రాడూన్‌లో జరిగిన రెండురోజుల అఖిల భారత స్థాయి స్పీకర్ల సద స్సులో ఇతర అంశాలతోపాటు ఫిరాయింపులు కూడా చర్చకొచ్చాయి. కొందరైతే తమ నుంచి ఈ అధికారం తీసేసి, స్పీకర్ పదవికుండే గౌరవాన్ని కాపాడాలని కూడా కోరారని వార్తలొచ్చాయి. రాజీవ్‌గాంధీ హయాంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపులను నిరోధించడానికి చేర్చిన పదో షెడ్యూల్ చివరికిలా తయారుకావడం విచారకరం. ఆ చట్టం సమర్ధవంతంగా పనిచేయక పోవడం గమనించి 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి సవరణలు తీసుకొచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. అసలు పదో షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చడం వెనకున్న ఉద్దేశా లేమిటో, దాని లక్ష్యాలేమిటో ఆ షెడ్యూల్లోనే సవివరంగా ప్రస్తావించారు. ఈ రాజకీయ ఫిరాయిం పులు జాతీయ స్థాయిలో అందరినీ కలవరపరుస్తున్నాయని, దీన్ని ఎదుర్కొనకపోతే మన ప్రజా స్వామ్య పునాదులను అది పెకలించే ప్రమాదం వున్నదని తెలిపింది. 1992లో కిహోటో హŸల్లోహన్ కేసులో సుప్రీంకోర్టు ఈ చట్టం ఆవశ్యకతను తెలిపింది. పదవులిస్తామని, ఇతరత్రా పనులు చేస్తా మని ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించే తీరును అరికట్టడానికి ఈ చట్టం అవసరం ఎంతో వుందని అభిప్రాయపడింది. కానీ మూడున్నర దశాబ్దాలు గడిచాక చూస్తే ఆ చట్టం నిరర్ధకంగా మారిన దాఖలా కనబడుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన సూచనల్ని అందరూ స్వాగతిస్తారు.ఈ కేసు నేపథ్యాన్ని ఒకసారి ప్రస్తావించుకోవాలి. 60మంది సభ్యులున్న మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ కనీస మెజారిటీకి దూరంగా వుండిపోయింది. దానికి మూడు స్థానాలు తక్కువయ్యాయి. ఈలోగా ఇతర పార్టీలను కలుపుకోవడంతోపాటు కాంగ్రెస్ సభ్యుడు శ్యాంకుమార్‌ను కూడా బీజేపీ తన శిబిరంలో చేర్చుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. శ్యాంకుమార్‌పై అనర్హత వేటు వేయాలన్న తమ వినతుల్ని స్పీకర్ ఖాతరు చేయక పోవ డంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారిస్తూ సుప్రీంకోర్టు చేసిన సూచనలు విలువైనవి. స్పీకర్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నందున ఫిరాయింపుల వ్యవహారంలో వచ్చే ఫిర్యా దులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఒక శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పార్లమెంటుకు సూచించింది. అసలు ఒక పార్టీకి చెందిన సభ్యుడిగా వుండే స్పీకర్‌కు ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం ఇవ్వడంలోని ఔచిత్యంపై కూడా పార్లమెంటు పునరా లోచించాలని వ్యాఖ్యానించింది. పరిస్థితి తీవ్రతకు సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యానమే నిదర్శనం. వాస్తవానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే ఫిరాయింపుల విషయంలో ఏం చేయాలో సూచిం చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఫిరాయింపుదార్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రెండేళ్లక్రితం సూచించారు. మొత్తా నికి ఫిరాయింపులు అన్ని వ్యవస్థల్లోనూ ఏవగింపు కలిగించాయని ఈ పరిణామాలను చూస్తే అర్థమ వుతుంది. ఇది సంతోషించదగ్గదే. ఎందుకంటే ఫిరాయింపుల జాడ్యం ఒక మహమ్మారిలా మారింది. ఎవరేమనుకుంటారోనన్న భయం కానీ, తమను ఎన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నా మన్న చింతగానీ ఫిరాయింపుదార్లకు లేకుండా పోతోంది. వారిని చేర్చుకునేవారూ ఈ మాదిరే నదురూ బెదురూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫిరాయింపుల గురించి మాట్లాడవలసి వస్తే ఎవరికైనా ముందుగా చంద్రబాబు గుర్తుకొస్తారు. 2014 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన మెజారిటీ సాధించినా, అనైతికంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఆయన తమ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా పంచారు. అంతకు కొన్ని నెలలముందు తెలంగాణలో తమ సభ్యుడొకరిని చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టిన బాబు... అదేపని అంతకన్నా నిస్సిగ్గుగా చేయడానికి సందేహించలేదు. ఫిరాయింపుల నిరోధానికి సూచించిన ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించాలని లేదా స్వతంత్రంగా వ్యవహరించగల మరేదైనా యంత్రాంగాన్ని నియమించినా మంచిదేనని ధర్మాసనం వివరించింది. చట్టాలను, నిబంధనలను అన్ని వ్యవస్థలూ సక్రమంగా పాటించినప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. వ్యవ స్థలు నిస్సహాయంగా మిగిలిపోతున్నాయని... నీతి నియమాలకు తిలోదకాలిచ్చే వ్యక్తులదే అంతి మంగా పైచేయి అవుతున్నదని అనిపిస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం స్పీకర్లకు తిరుగులేని అధికారం ఇచ్చింది. కానీ వాటిని వినియోగించుకోలేని దుర్బ లత్వం సర్వత్రా వ్యాపించడం, పైగా ఈ అధికారం తమకొద్దంటూ కొందరు మొరపెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు సూచించేంతవరకూ ఆగకుండా ఈ విషయంలో ఇప్పటికే పార్ల మెంటు తనంత తాను చొరవ తీసుకోవాల్సింది. ఫిరాయింపులు సంప్రదాయంగా మారినప్పుడు, ప్రజాస్వామ్యం నవ్వులపాలవుతున్నప్పుడు కూడా పట్టించుకోకపోతే ఎట్లా? కనీసం ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి, ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాలి. -
గీత దాటితే వేటు ఎప్పుడు?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హైడ్రామాలో గీత దాటిన ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపుపై న్యాయనిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరమే ఆ చట్టం వర్తిస్తుందని కొందరు.. ప్రమాణస్వీకారంతో సంబంధం లేకుండా జంపింగ్‌లపై చర్యలు తీసుకోవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ న్యాయ కోవిదుడు రాకేష్ ద్వివేది మాట్లాడుతూ.. ‘కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఈ చట్టం వర్తించదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో ప్రమాణస్వీకారం చేయకముందే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రమాణస్వీకారం అనంతరం పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు’ అని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారా? లేదా? అన్నది సమస్య కాదు. పార్టీ గీత దాటినవారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది’ అని అన్నారు. అజిత్‌ను సమర్థిస్తున్న ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండొంతులుంటే అనర్హత సమస్యే ఉత్పన్నం కాదని మరో లాయర్ చెప్పారు. -
బ్రిటన్‌లోలాగా భారత్‌లో అది సాధ్యమా?
న్యూఢిల్లీ : ప్రపంచంలో బ్రిటీష్ పార్లమెంట్‌తో పోల్చతగ్గ ప్రజాస్వామ్య సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి. 1649లో ఇంగ్లండ్ రాజు చార్లెస్–1 మద్దతుదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రాజుకు ఉరిశిక్ష అమలు చేసిన నాటి నుంచి బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి వ్యవహరిస్తున్నారు. పార్టీ లేదా ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓటర్లు, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగకుండా బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు బుధవారం నాడు తమ ప్రభుత్వాన్ని అడ్డుకున్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రవేశ పెట్టిన బ్రిగ్జిట్ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా పాలకపక్ష కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ఓటు వేశారు. వారు ప్రభుత్వ ప్రయోజనాలకన్నా ఓటర్లు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే వ్యవహరించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో బ్రిటీష్ పార్లమెంట్ వ్యవస్థను కూడా స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకునే భారత దేశం పార్లమెంట్లో ఇలాంటి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎప్పుడైన చూడగలమా? పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం భారత్ పార్లమెంట్లో, రాష్ట్రాల అసెంబ్లీలో చట్ట విరుద్ధం. అలాంటి వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడి శాసన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మూడింట రెండొంతుల మంది పార్టీ విప్‌ను ధిక్కరించినా, మరో పార్టీలో చేరిపోయినా వారి సభ్యత్వానికి లోటు లేదు. మంత్రి పదవులను ఆశించో, ఇతర ప్రలోభాలకు లోబడో కొంత మంది సభ్యులు పార్టీలు ఫిరాయిస్తున్నారని, వారిని అలా చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. భారత రాజకీయాల్లో ఏకపార్టీ ప్రాబల్యం తగ్గిపోయి, వివిధ పార్టీలతో కూడిన సంకీర్ణ రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజీవ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయాల్లో అవినీతిని అరికట్టడం కోసమే తామీ చట్టాన్ని తీసుకొచ్చామని నాడు రాజీవ్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1985 నుంచి రాజకీయాల్లో అవినీతి తగ్గిన దాఖలాలు లేవుగదా, పెరిగిన దాఖలాలు ఎక్కువగానే ఉన్నాయి. పోనీ పార్టీ ఫిరాయింపులు తగ్గాయా అంటే అదీ లేదు. ఇంకా పెరిగాయి. చట్టానికి ముందు ఫిరాయింపులు చిల్లర వ్యాపారంగా సాగితే ఇప్పుడు టోకు వ్యాపారంగా సాగుతున్నాయి. గోవాలో గత జూలై నెలలో 15 మంది కాంగ్రెస్ సభ్యులకుగాను ఏకంగా పది మంది సభ్యులు బీజేపీలో చేరిపోయారు. దాంతో వారిలో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి. ఇక సిక్కింలో గత ఆగస్టులో 13 మంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో పది మంది బీజేపీలో చేరిపోయారు. దాంతో ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మూడింట రెండొంతల మంది పార్టీని ఫిరాయించడం వల్ల వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడలేదు. ఒకప్పుడు చట్టంలో మూడోంతుల మంది ఫిరాయింపును మినహాయిస్తే ఆ తర్వాత సవరణ ద్వారా మూడింట రెండొంతుల మంది ఫిరాయింపునకు మినహాయింపు ఇచ్చారు. చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ! ఒకరిద్దరు పార్టీ ఫిరాయిస్తే తప్పు పది మంది ఫిరాయిస్తే తప్పకాదనడం ఎలా ఒప్పవుతుంది? తప్పొప్పుల సంగతి పక్కన పెడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. జరుగుతోంది. పార్టీ అధిష్టానం చెప్పినట్లు నడుచుకునే పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఉన్నప్పుడు ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం కూడా కష్టమే. ఓటర్లు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించకుండా కేవలం పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నడుచుకోవడం వల్ల పార్లమెంట్లోగానీ, అసెంబ్లీలోగానీ ప్రజస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతుందని అనుకోవడం భ్రమే అవుతుంది. అదీ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు, ఒకరిద్దరు వారసత్వ నాయకులో, నియంతృత్వ నేతల చేతుల్లో పార్టీ నాయకత్వం చిక్కుకున్నప్పుడు ప్రజాస్వామిక విలువలు మరింత మసకబారుతాయి. -
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టపర్చండి
-
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టపర్చండి
కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని, అందువల్ల ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. తమ పార్టీ బీ ఫారంపై పోటీ చేసి గెలిచిన 21 మంది టీడీపీలోకి ఫిరాయించారని.. వారిలో నలుగురు ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘ఈ సభ్యులను రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అనుసరించి అనర్హులుగా ప్రకటించాలని శాసన సభాపతి వద్ద దాఖలు చేసిన అభ్యర్థనలు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. అనర్హత వేటు పడేందుకు అర్హత ఉన్న ఈ సభ్యులు ఇప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం దురదృష్టకరం. ఈ చర్య దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలు చేసి ఏడాది దాటుతున్నా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టస్ఫూర్తికి ఈ చర్య విఘాతం కల్పిస్తోంది. రాజ్యాంగ పదవుల్లో కూర్చున్న వారు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిపి పోరాడాలి. ఈ వ్యవహారంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయింపులు లేకుండా ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టపరచాలి. ఈ దిశగా మీ సహకారం ఉండాలి’ అని వినతిపత్రంలో కోరింది. అవినీతి సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబు.. అదే అవినీతి డబ్బుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వైఎస్సార్సీపీ తెలిపింది.ఎన్నికల సంఘం ప్రధాన కమిషన ర్తో భేటీ అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదే భేటీలో నియోజకవర్గాల పెంపు విషయం గురించి ప్రస్తావన రాగా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని కమిషనర్ అభిప్రాయపడ్డారని ఎంపీ తెలిపారు. -
ప్రజాతీర్పుతో పరిహాసమా?
⇒ ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్న ఫిరాయింపులు ⇒ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్న అవకాశవాద రాజకీయాలు కోర్టు తీర్పులు, కమిటీల సిఫారసులన్నీ కాగితాలకే పరిమితం అనర్హత పిటిషన్లపై నిర్ణయంలో స్పీకర్ల అంతులేని జాప్యం ఈ పిటిషన్లపై విచారణను ఈసీకి కట్టబెట్టాలంటున్న నిపుణులు సభాకాలం ముగిసిన తర్వాత ఫిరాయింపుదారుడిని ఆరేళ్లదాకా ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా చేయాలని సూచన దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని, సంతల్లో పశువుల్లా ప్రజాప్రతినిధులను కొనే సంస్కృతికి తెరదించాలనే ఉద్దేశంతో 1985లో తెచ్చిందే ఫిరాయింపుల నిరోధక చట్టం. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు. అవకాశవాద రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నాయకులు తెలివిమీరుతూ చట్టం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో సవరణలు తెచ్చినా... చట్టంలో నిర్దిష్టంగా చెప్పని అంశాలను లొసుగులుగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఫిరాయింపులపై ఆధారపడటం, బేరసారాలకు దిగి పదవులు, డబ్బు ఇవ్వజూపడం పాత సంస్కృతి. అవసరం లేకపోయినా ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి నిస్సిగ్గుగా ప్రజాప్రతినిధులను లోబర్చుకొని.. గోడ దూకించడం నయా సంస్కృతి! చట్టం (రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా) చట్టుబండలవుతున్న పరిస్థితుల్లో అసలు ఫిరాయింపు నిరోధక చట్టం నేపథ్యమేమిటి, ఎప్పుడు తెచ్చారు, సవరణలు ఏం జరిగాయి? కోర్టులు దీంట్లో ఏ మేరకు కల్పించుకొన్నాయి? ఏ లొసుగుల ఆధారంగా చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు? చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎలక్షన్ కమిషన్‌తో సహా పలు సంస్థలు, కమిటీలు ఏం సూచించాయి. వీటి అమలులో ఉన్న అనుకూలతలు-ప్రతికూలతలేమిటి? నిపుణుల అభిప్రాయం ఏమిటనే అంశాలపై ‘సాక్షి’ ఫోకస్... - ఎం.కృష్ణకాంత్‌రెడ్డి, సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఆయా రామ్.. గయా రామ్ 1967 తర్వాత దేశ రాజకీయాల్లో కొత్తశకం మొదలైంది. ఏక పార్టీ (కాంగ్రెస్) ఆధిపత్యం క్షీణించడం మొదలైంది. ఆ ఏడాది 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. ఒకే ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలను అస్థిర పరిచే అనైతిక విధానానికి పునాది కూడా పడింది. 1967 నుంచి 83 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 2,700 మంది పార్టీ ఫిరాయించారు. ఇందులో 212 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఫిరాయించి ముఖ్యమంత్రులైన వారు 15 మంది. హరియాణాలో గయాలాల్ అనే ఎమ్మెల్యే ఏకంగా మూడుసార్లు పార్టీ మారడంతో... ఫిరాయింపుదారులకు ‘ఆయా రామ్- గయా రామ్’ అనే పేరు స్థిరపడింది. అడ్డూ అదుపు లేకుండా ఫిరాయింపులు సాగడంతో మేధావివర్గంలో దీనిపై చర్చ మొదలైంది. 1967లోనే అప్పటి హోంమంత్రి వై.బి.చవాన్ నేతృత్వంలో కమిటీ వేశారు. 1973, 1978లలో ఫిరాయింపుల నిరోధక బిల్లును తెచ్చే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 401 సీట్లు గెలిచి భారీ మెజారిటీ సాధించింది. తగినంత సంఖ్యా బలం ఉండటంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది. ఆర్టికల్స్ 102(2) 191 (2)లను చేర్చి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని చట్ట సభ్యత్వానికి అనర్హులుగా చేసే అంశాలను పొందుపర్చి.. దీన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేర్చారు. తద్వారా ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ లేదా చైర్మన్ తీసుకునే చర్యలను న్యాయస్థానాలు ప్రశ్నించడానికి వీల్లేకుండా రక్షణ కల్పించారు. ‘‘రాజకీయ ఫిరాయింపుల భూతం యావత్ దేశానికే ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేయకపోతే... మన ప్రజాస్వామ్య పునాదులనే బలహీనపరుస్తుంది’’ అని 52వ రాజ్యాంగ సవరణ అవసరాన్ని, ఉద్దేశాలను వివరించే పత్రంలో పేర్కొన్నారు. చట్టంలో ఏముంది? ఏయే సందర్భాల్లో అనర్హులవుతారంటే... 2 (1-ఎ): ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, చట్ట సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోతాడు. స్పీకర్ పదవిని చేపట్టే వ్యక్తికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. 2 (1-బి): పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఓటింగ్‌కు గైర్హాజరైనా... చట్టసభ సభ్యత్వానికి అనర్హుడవుతారు. గైర్హాజరైన రోజు నుంచి 15 రోజుల్లో పు... పార్టీ నుంచి సదరు సభ్యుడిని క్షమిస్తూ లేఖ వస్తే మాత్రం అనర్హత వేటు నుంచి మినహాయింపు ఉంటుంది. 2 (2): స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి.. తర్వాత ఏదైనా పార్టీలో చేరితే సభ్యత్వానికి అనర్హుడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి ఏ పార్టీకైనా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చుగాని పార్టీలో చేరకూడదు. 2 (3): చట్టసభలకు నామినేట్ అయిన వారు తమను ఎంపిక చేసిన పార్టీకి విధేయుడై ఉంటారా? లేదా? అనేది ఆర్నెల్లలోపు తేల్చుకోవాలి. ఆర్నెల్ల తర్వాత సదరు నామినేటెడ్ సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే చట్టసభ సభ్యత్వం రద్దవుతుంది. ► ఒక పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుల్లో మూడింట ఒక వంతు మంది పార్టీ మారితే... అది ఫిరాయింపు కిందకు రాదు. మరో పార్టీలో చేరిక అవుతుంది. పార్టీని చీల్చినట్లు కాదు. కాబట్టి అనర్హత వేటు పడదు. ► పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఫిర్యాదులను సదరు సభ స్పీకర్ లేదా చైర్మన్ పరిశీలిస్తారు. ట్రిబ్యునల్‌గా ఆయన విచారణ చేపడతారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ► పదో షెడ్యూల్లో చేర్చినందున స్పీకర్ లేదా చైర్మన్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు సమీక్షించలేవు. సవరణలు ఇవీ.. చిన్న సంఖ్యలో ఉన్న ఫిరాయింపులను ‘హోల్‌సేల్ (మూడింట ఒకవంతు అయితే అనర్హత వేటుపడదు)’గా 1985 ఫిరాయింపుల నిరోధక చట్టం మార్చేసిందని విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంస్కరణలపై వేసిన దినేశ్ గోస్వామి కమిటీ, లా కమిషన్లు చీలికలను ప్రోత్సహిస్తున్న నిబంధనను తొలగించాలని సిఫారసు చేశాయి. దాంతో ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారిలో మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో చేరితే... అనర్హత వేటు పడదని 2003లో తెచ్చిన 91వ రాజ్యాంగ సవరణలో మార్పు చేశారు. ఇలాంటి కలయికను అంగీకరించకుండా... సొంత పార్టీలోనే(గెలిచిన పార్టీలో) ఉండిపోవాలని అనుకున్న వారు తక్కువ సంఖ్యలో ఉన్నా సరే.. వారిపై అనర్హత వేటు పడదు. ఎందుకంటే వీరు మరో పార్టీకి మారడం లేదు కాబట్టి. నిర్భయంగా ఉల్లంఘనలు.. అనర్హత పిటిషన్లపై విచారణకు చేపట్టే విషయంలో పూర్తి అధికారం స్పీకర్‌దే కావడం, కాలపరిమితి అంటూ లేకపోవడం.. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఒక పిటిషన్‌ను పరిష్కరించడానికి ఎన్నేళ్లు తీసుకున్నా... దానికి ఆయన ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. అధికార పార్టీకి చెందిన వారే సాధారణంగా స్పీకర్‌గా ఉంటారు. రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించే ముందు ఆయన తన పార్టీకి రాజీనామా చేసినా.. మాతృపార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నది ఇదే. ► ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రలోభాలతో 21 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం కండువా కప్పారు. వీటిపై వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా స్పీకర్ ఎటూ తేల్చకుండా... నాన్చుతున్నారు. ► తెలంగాణలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి టీఆర్ఎస్ మరో లొసుగును వాడుకుంది. మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో కలిస్తే... అనర్హత వేటు తప్పుతుందనేది 2003లో చేసిన సవరణ. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో 15 సీట్లు గెలిచింది. వీరిలో నుంచి 12 మంది ఒక్కసారిగా వెళ్లి టీఆర్ఎస్లో చేరలేదు. ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు చొప్పున విడతల వారీగా గులాబీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎప్పటికప్పుడు స్పీకర్‌కు అనర్హత పిటిషన్లు ఇస్తూనే ఉంది. ఇలా వెళ్లిన వారు 12 మంది కాగానే.. తాము టీఆర్ఎస్లో చేరుతున్నామని స్పీకర్‌కు వీరొక లేఖ ఇచ్చారు. ముందుగా టీడీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్లను తేల్చకుండా.. తర్వాత 12 మంది టీఆర్ఎస్లో కలుస్తున్నామని ఇచ్చిన లేఖను స్పీకర్ ఆమోదించారు. వారు టీఆర్ఎస్లో విలీనమైనట్లు బులెటిన్‌ను విడుదల చేశారు. ► తెలంగాణలో కేసీఆర్ చేసింది అన్యాయమని ఆక్రోశించిన చంద్రబాబు ఏపీలో తాను అదే చేసినపుడు మాత్రం.. నిజాయితీ... నిప్పు అంటూ పొంతనలేని మాటలతో సమాధానాలను దాటవేస్తారు. ► మూడింట రెండొంతుల నిబంధన కూడా దుర్వినియోగమవుతోందని, దీన్ని కూడా రద్దు చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఒక పార్టీ ద్వారా గెలిచిన సభ్యులు శాసనసభ్యత్వాన్ని వదులుకోకుండా.. మరో పార్టీలోకి వెళ్లేందుకు ఏ రూపంలోనూ ఆస్కారం ఉండకూడదనేది వీరి వాదన. ► గతేడాది జూలైలో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితుడైన పెమా ఖండూ రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి... పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ)లో చేరారు. కాంగ్రెస్‌కు 45 మంది సభ్యులుంటే... 44 మందితో ఖండూ పీపీఏలో చేరారు. మాజీ సీఎం నబోమ్ టుకీ ఒక్కరే కాంగ్రెస్‌లో మిగిలిపోయారు. పీపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షం. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌లో ప్రజలు 2014లో కాంగ్రెస్‌కు మూడింట రెండొంతుల కంటే ఎక్కువే మెజారిటీ ఇచ్చారు. అవకాశవాద రాజకీయాల్లో ఆరితేరిన వారు ఈ విస్పష్ట తీర్పును నిస్సిగ్గుగా అవహేళన చేశారు. కేంద్రాల్లో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాతీర్పును ఎలా అపహాస్యం చేశాయో చెప్పేందుకు ఇవన్నీ ఇటీవలి ఉదాహరణలు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తాం. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలు.. అదే రాజ్యాంగంలోని నిబంధనలను తోసిరాజాలవు. అందువల్ల పదో షెడ్యూల్ ద్వారా స్పీకర్లకు సంక్రమించిన అపరిమిత అధికారాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి.. ఒక పార్టీ టికెట్‌పై గెలిచాడంటే.. ఆ పార్టీ విధానాలకు ప్రజామోదం లభించి విజయం సాధించినట్లే. కాబట్టి సదరు సభ్యుడు పార్టీకి కట్టుబడి ఉండాలి. - వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు అభిప్రాయం కిహోటో హల్లోహన్- జచిల్హు, ఇతరుల కేసు (1992): ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ భావాలను వెల్లడించే అవకాశం లేకుండా, పార్టీల లైన్‌కు కట్టుబడి ఉండేలా ఫిరాయింపుల నిరోధక చట్టం చేస్తోందనేది వాదన. ఈ పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు చట్ట సభ్యులకు ఆర్టికల్ 105, 194ల ద్వారా సంక్రమించే హక్కులు, స్వేచ్ఛకు 52వ రాజ్యాంగ సవరణ ఏమాత్రం భంగకరం కాదని తేల్చి చెప్పింది. అలాగే 52 రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన అన్ని అంశాలనూ సమీక్షించింది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించజాలవన్న పదో షెడ్యూల్లోని 7వ పేరా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్ట సభ్యుల అనర్హత విషయంలో హైకోర్టులకు ఆర్టికల్ 226, 227, సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 136లకు ఉన్న అధికారాలను హరిస్తోందని తెలిపింది. న్యాయస్థానాల పరిధిని చట్టసభలు కుదించడాన్ని రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లను పరిష్కరించే విషయంలోగాని, జరిగే జాప్యం, ఇతరత్రా నియమావళి ఉల్లంఘన జరిగినా... కోర్టులు ప్రశ్నించజాలవు. సభకు సంబంధించినంతవరకు స్పీకరే సుప్రీం. అయితే స్పీకర్ ఒకసారి నిర్ణయం వెలువరించాక మాత్రం... ఆయన తీర్పు రాజ్యాంగానికి లోబడి ఉందా? లేదా? అనేది కోర్టులు సమీక్షించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ‘‘పార్టీకి రాజీనామా చేయకున్నా... సదరు ఎంపీ లేదా ఎమ్మెల్యే ప్రవర్తన ద్వారా (ఇతర పార్టీలతో అంటకాగడం, ఇతర పార్టీల సభల్లో పాల్గొనడం, పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం లాంటివి) కూడా అతను తనకు టికెట్టిచ్చిన పార్టీకి దూరమయ్యాడనే నిర్ణయానికి రావొచ్చు’’ - రవినాయక్-యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు (1994) ‘‘రాజకీయ పార్టీ నుంచి బహిష్కృతుడైనప్పటికీ... సదరు సభ్యుడు పార్టీ జారీ చేసే విప్‌కు కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో అనర్హతకు గురవుతాడు. బహిష్కరణకు గురైతే సభలో అన్ అటాచ్డ్ మెంబర్‌గా పరిగణిస్తారు. కానీ పదో షెడ్యూల్ ప్రకారం అతను ఏ పార్టీ తరఫున గెలిచాడో దాని సభ్యుడిగానే పరిగణిస్తారు. కాబట్టి బహిష్కరణ తర్వాత మరో పార్టీలో చేరితే అనర్హుడవుతారు’’ ‘‘ఎన్నికైన సభ్యుడు తనను నిలబెట్టిన పార్టీకే చెందుతాడని పదో షెడ్యూల్లోని పేరా 2(1) విస్పష్టంగా చెబుతోంది. కాబట్టి బహిష్కరణ వేటు పడినంత మాత్రాన పార్టీకి చెందకుండాపోడు’’ - 1996లో జి.విశ్వనాథన్-తమిళనాడు స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు ‘‘అనర్హత పిటిషన్‌పై స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత పునఃసమీక్షకు ఆస్కారం లేదు. స్వీయ నిర్ణయాన్ని పునఃసమీక్షించే అధికారం పదో షెడ్యూల్ స్పీకర్‌కు కల్పించ లేదు’’ ‘‘ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనా, చీలికలు, కలయికలకు సంబంధించి నిజానిజాలు నిర్ధారించుకోకుండా నిర్ణయం వెలువరించినా... పదో షెడ్యూల్‌కు అనుగుణంగా నడుచుకోవడంలో స్పీకర్ విఫలమైనట్లే. అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పట్టించుకోకపోవడం రాజ్యాంగ విధుల ఉల్లంఘనే’’ - స్వామి ప్రసాద్ మౌర్య-రాజేంద్ర సింగ్ రాణా కేసులో సుప్రీంకోర్టు ఏ కమిటీ ఏం చెప్పిందంటే... ఎన్నికల సంస్కరణలపై వేసిన దినేశ్ గోస్వామి కమిటీ (1990) ► అనర్హత వేటును పరిమిత సందర్భాల్లోనే వేయాలి. 1. తాను ఎన్నికైన పార్టీ సభ్యత్వాన్ని వదులుకొన్నపుడు చట్ట సభ్యత్వానికి అనర్హుడిని చేయాలి. 2. ప్రభుత్వంపై విశ్వాస, అవిశ్వాస పరీక్షల సందర్భంగా మాత్రమే సభ్యుడు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా, గైర్హాజరైనా అనర్హుడిని చేయాలి. ► అనర్హత పిటిషన్లను రాష్ట్రపతి లేదా గవర్నర్ (పార్లమెంటుకైతే రాష్ట్రపతి, రాష్ట్ర శాసనసభ, మండలిలకైతే గవర్నర్) ఎన్నికల సంఘం సలహా మేరకు పరిష్కరించాలి. అంటే స్పీకర్ వద్ద నుంచి ఈ అధికారాన్ని తీసివేయాలని సిఫారసు చేసింది. లా కమిషన్ (170వ నివేదిక- 1999, 255వ నివేదిక 2015) ► రాజకీయ పార్టీల్లో చీలికలు, కలయిలకు ఆస్కారమే ఉండకూడదు. దీనికి వీలు కల్పిస్తున్న నిబంధనలు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తొలగించాలి. ► ఎన్నికలకు ముందు పొత్తుల ద్వారా ఏర్పడే కూటములను రాజకీయ పార్టీలుగా గుర్తించాలి. దీంతో ఎన్నికల తర్వాత కూటమిలో నుంచి విడిపోయి అధికారం కోసం మరో పార్టీతో జట్టుకట్టే ఆస్కారం, లేదా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆస్కారం ఉండదు. ► ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో ఉన్నపుడు మాత్రమే రాజకీయ పార్టీలు విప్‌లను జారీ చేయాలి. ఇతర సందర్భాల్లో విప్‌లు వాడకూడదు. ఎన్నికల కమిషన్ ► అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని రాష్ట్రపతి లేదా గవర్నర్ తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ సలహాను వీరు విధిగా పాటించాలి. రాజ్యాంగ సమీక్ష కమిషన్ (2002) ► ఫిరాయింపుదారులు... ఆ సభా కాలం ముగిసే దాకా మరే ఇతర పదవి, లేదా లాభదాయక రాజకీయ పదవిని చేపట్టకుండా నిషేధించాలి. మంత్రి పదవులపై ఆశతో పార్టీ మారకుండా అడ్డుకోవడానికి ఇది దోహదపడుతుంది. ► ఫిరాయింపునకు పాల్పడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఓటు వేసే సభ్యుల ‘ఓటు’ను చెల్లనిదిగా పరిగణించాలి. ప్రస్తుతం ఇలా ఓటు వేస్తే అది చెల్లుతోంది. తర్వాత సదరు సభ్యుడు అనర్హతకు గురికావొచ్చు కాని... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ప్రభుత్వాలు పడిపోతున్నాయి. అస్థిరతకు తావివ్వకుండా ఇలాంటి ఓటును చెల్లనిదిగా పరిగణించాలని... అప్పుడు ప్రలోభాలకు తెరపడుతుందని రాజ్యాంగ సమీక్ష కమిషన్ అభిప్రాయపడింది. గవర్నర్కిస్తే న్యాయం జరుగుతుందా? దినేశ్ గోస్వామి కమిటీ, ఎన్నికల కమిషన్లు రాష్ట్రాల్లో అనర్హత పిటిషన్లను పరిష్కరించే అధికారాన్ని గవర్నర్‌కు కట్టబెట్టాలని సూచించాయి. అయితే గవర్నర్ ఎవరు? రాష్ట్రాల్లో కేంద్రానికి ప్రతినిధి. గవర్నర్లను నియమించేది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే. కేంద్రంలో ప్రభుత్వాలు మారగానే... పదవీకాలం మిగిలి ఉన్నా సరే గవర్నర్లను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. ఆ స్థానాల్లో తమవారిని నియమిస్తున్నారు. క్రీయాశీల రాజకీయాలకు దూరమైన, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఆయా రాష్ట్రాల రాజ్భవన్లలో రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంటే.. లేదా కూటమిలో భాగస్వామి అయితే, లేదా వారి మిత్రపక్షమో అయితే... గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ లాగే ఎటూ తేల్చకుండా నాన్చరని చెప్పగలమా? స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి లేదా రాష్ట్రపతి పాలన పెట్టడానికి గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దుర్వినియోగం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇదేనా చట్టం స్ఫూర్తి..? అధికార పక్షం వైపు యథేచ్చగా ఎమ్మెల్యేలు వెళ్లిపోతే... దీనికి అడ్డుకట్ట పడేదెలా? అనర్హత పిటిషన్ వచ్చాక ఏళ్లుగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. సదరు సభ్యుడు పార్టీ మారినా... శాసనసభ్యుడిగా వచ్చే వేతనాన్ని, ఇతర సదుపాయాలను నిరంతరాయంగా అందుకుంటాడు. ఎన్నికలకు ఏ రెండు నెలల ముందో అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న సభ్యుడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాడు. దాంతో పిటిషన్ మూలన పడుతుంది. పార్టీ మారిన సదరు సభ్యుడు ఎలాంటి చర్యా లేకుండా.. తన పదవీ కాలాన్ని పూర్తి చేసేస్తాడు. ఇదేనా ఫిరాయింపుల చట్టం స్ఫూర్తి? ఇదేనా మనమిచ్చే భాష్యం? ఫిరాయించి... పదవీకాలం చివర్లో రాజీనామా చేసిన వారిపై.. దాఖలైన పిటిషన్లకు విచారణార్హత ఉండదా? దీనిపై చట్టంలో ఎక్కడా స్పష్టత లేదు. కాబట్టి దీన్ని ఒక లొసుగుగా వాడేసుకుంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను సరిచేసి బలోపేతం చేయాలని పలు కమిటీలు చాలా కాలం కిందటే సూచించాయి. నిపుణుల సూచనలివీ.. మొత్తానికి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాల్సిన సమయం వచ్చిందనేది రాజ్యాంగ నిపుణులు, మేధావుల అభిప్రాయం. ప్రజాస్వామ్య విలువకు పాతరేసేందుకు ఆస్కారమిస్తున్న, అవినీతిని పెంచుతున్న చట్టాన్ని సమీక్షించాలని సూచిస్తున్నారు. ఆ సూచనలివీ.. ► అనర్హత పిటిషన్లను పరిష్కరించే అధికారాన్ని ఈసీకే కట్టబెట్టాలి. జాప్యానికి ఆస్కారం లేకుండా పిటిషన్‌ను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలపరిమితిని పెట్టాలి. ► రాజ్యాంగ సమీక్ష కమిషన్ సూచించినట్లుగా ఫిరాయింపుదారు ఓటు చెల్లకుండా చేయాలి. అప్పుడే కప్పదాట్లు ఆగుతాయి. ► అనర్హత వేటు పడితే... ఆ సభా కాలం ముగిసిన తర్వాత మరో ఆరేళ్ల దాకా (అంటే రాబోయే రెండు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడై... పదేళ్లకు పైగానే రాజకీయాలకు దూరమవ్వాల్సి వస్తుంది) ఏ ఎన్నికల్లోనూ పాల్గొనకుండా నిషేధించాలి. (ప్రస్తుతం క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకు మించి జైలు శిక్ష పడ్డ వారు శిక్షాకాలం తర్వాత ఆరేళ్ల దాకా పోటీకి అనర్హులనే నిబంధన ఉంది. దీన్నే ఫిరాయింపులకు వర్తింపజేయాలనేది సూచన). ► ఫిరాయింపుదారులపైనే కాకుండా వారిని చేర్చుకొంటున్న పార్టీలపైనా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పు తేవాలి. -
ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు
-
ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు
న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపుల నిరోధంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులపై చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి ఆ ప్రయివేట్ బిల్లులో పేర్కొన్నారు. 10వ షెడ్యూల్‌కు సవరణ ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి విజయ సాయిరెడ్డి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నారు. కాగా లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ పట్టుబట్టారు. -
ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలి
-
ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రయివేట్ బిల్లు
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులపై చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి ఆ ప్రయివేట్ బిల్లులో పేర్కొన్నారు. కాగా ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై.. ఆగస్ట్ 13 వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ 17న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.