
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టపర్చండి
కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని, అందువల్ల ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. తమ పార్టీ బీ ఫారంపై పోటీ చేసి గెలిచిన 21 మంది టీడీపీలోకి ఫిరాయించారని.. వారిలో నలుగురు ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ‘ఈ సభ్యులను రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అనుసరించి అనర్హులుగా ప్రకటించాలని శాసన సభాపతి వద్ద దాఖలు చేసిన అభ్యర్థనలు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి.
అనర్హత వేటు పడేందుకు అర్హత ఉన్న ఈ సభ్యులు ఇప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం దురదృష్టకరం. ఈ చర్య దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలు చేసి ఏడాది దాటుతున్నా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టస్ఫూర్తికి ఈ చర్య విఘాతం కల్పిస్తోంది. రాజ్యాంగ పదవుల్లో కూర్చున్న వారు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిపి పోరాడాలి.
ఈ వ్యవహారంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయింపులు లేకుండా ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టపరచాలి. ఈ దిశగా మీ సహకారం ఉండాలి’ అని వినతిపత్రంలో కోరింది. అవినీతి సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబు.. అదే అవినీతి డబ్బుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వైఎస్సార్‌సీపీ తెలిపింది.ఎన్నికల సంఘం ప్రధాన కమిషన ర్‌తో భేటీ అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదే భేటీలో నియోజకవర్గాల పెంపు విషయం గురించి ప్రస్తావన రాగా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని కమిషనర్ అభిప్రాయపడ్డారని ఎంపీ తెలిపారు.