ఐరోపా దేశాల సంఘం(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాల్సిన గడువు సమీపిస్తున్నా రెండింటి మధ్య తెగతెంపుల ఒప్పందం కుదిదే అవకాశాలు కనిపించడం లేదు. బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చాక ఇంగ్లండ్లో అంతర్భాగమైన ఉత్తర ఐర్లండ్ ఐరోపా సింగల్ మార్కెట్లో కొనసాగేలా ఒప్పంద పత్రం ముసాయిదాను ఈయూ రూపొందిస్తోందనే సమాచారంపై తాజాగా వివాదం తలెత్తింది. ఐరోపా కస్టమ్స్ యూనియన్లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే విషయం సహా ఇంకా అనేక అంశాలపై తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి బ్రెగ్జిట్ ఒడంబడిక కుదరకపోవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 28 ఐరోపా దేశాల రాజకీయ, ఆర్థిక ఐక్యతకు స్థాపించిన ఈయూ నుంచి 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు ఇంగ్లండ్ నిష్క్రమించాలని దాదాపు రెండేళ్ల క్రితమే నిర్ణయించారు. ఉత్తర ఐర్లండ్ ఈయూలో కొనసాగేలా చేసే ఒప్పందంపై సంతకం పెట్టేది లేదనీ, బ్రిటన్ ‘రాజ్యాంగ సమగ్రత’పై రాజీపడబోనని ఇంగ్లండ్ ప్రధాని థెరిసా మే హెచ్చరించారు. ఐరోపా సంఘం నుంచి వైదొలిగినా బ్రిటన్‌ను ఐరోపా కస్టమ్స్ యూనియన్లో కొనసాగేలా ఒత్తిడి చేయడానికే ఉత్తర ఐర్లండ్ సమస్యను ఈయూ నేతలు ముందుకు తెచ్చారని కొందరు అనుమానిస్తున్నారు. ఐర్లండ్ సరిహద్దు వాణిజ్యంపై ఏర్పడుతున్న చిక్కుముడి వల్ల ఈయూతో ఒప్పందం కుదరకపోవచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన జనం ఆలోచన మారుతోందా?
2016 బ్రెగ్జిట్ జనాభిప్రాయసేకరణలో ఈయూ నుంచి బయటపడాలంటూ ఓటేసిన ప్రజల్లో చాలా మంది తమ అభిప్రాయం మార్చుకున్నారని గత ఆరు నెలలుగా చేసిన సర్వేలు చెబుతున్నాయి. బ్రెగ్జిట్‌పై రెండోసారి రెఫరెండం జరపాలని 47 శాతం పౌరులు కోరుతున్నారని ఇటీవల గార్డియన్ పత్రిక జరిపిన సర్వే వెల్లడించింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత బ్రసెల్స్ కేంద్రంగా పనిచేసే ఈయూ, ఇంగ్లండ్ ప్రధాని మే కుదుర్చుకునే ఒప్పందం బ్రిటన్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్ తుది ఒప్పందంపై కామన్స్సభలో స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఎంపీలకు ఇవ్వాలని పాలకపక్షం కన్సర్వేటివ్ పార్టీ మాజీ ప్రధాని జాన్ మేజర్ సహా పలువురు కోరుతున్నారు. ఈయూ నుంచి వైదొలగే విషయమై రెండో రెఫరెండం జరపడానికి, బ్రెగ్జిట్ను పూర్తిగా తిరస్కరించడానికి కూడా దిగువసభకు అవకాశమివ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. తుది వాణిజ్య ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బయటికొస్తే ఇంగ్లండ్ జీడీపీ 8 శాతం తగ్గే ప్రమాదముందని బ్రెగ్జిట్‌పై బ్రిటిష్ సర్కారు అంచనా వేస్తోంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా అత్యధిక మద్దతు పలికిన ఈశాన్య, మిడ్లాండ్స్ వంటి ప్రాంతాలు అంతకు రెండు రెట్లు నష్టపోతాయని కూడా లీకైన ప్రభుత్వ నివేదిక చెబుతోంది.
బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే కొత్త పార్టీ ‘రిన్యూ’
ఈయూ నుంచి వైదొలగకుండా బ్రిటన్‌ను ఆపడానికి ‘రిన్యూ’ అనే కొత్త పార్టీ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టి బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకాభిప్రాయం సాధించాలనే లక్ష్యంతో ‘లిసన్ టూ బ్రిటన్’ అనే ప్రచారోద్యమం ఆరంభించింది. ఇంగ్లండ్ ఈయూలోనే ఉండాలని వాదించే ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ అనే సంస్థకు అమెరికా బిలియనీర్ జార్జి సరోస్ ఐదు లక్షల పౌండ్ల విరాళం ఇచ్చారు. హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రెగ్జిట్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేసేలా ఎంపీలపై ఈ సంస్థ ఒత్తిడితెస్తోంది. విస్తృత లాబీయింగ్ ద్వారా ఎంపీలకు నచ్చచెప్పి దేశంలో బ్రెగ్జిట్‌పై రెండో రిఫరెండం జరిపించడమే ఈ సంస్థ లక్ష్యం.
సకాలంలో ఒప్పందం కుదరకపోతే...
ఈయూ, బ్రిటన్ మధ్య ఒప్పందం అనుకున్న సమయానికి కుదరకపోతే బ్రిటన్ ఎక్కువ నష్టపోతుంది. ఇంగ్లండ్లో నివసిస్తున్న ఇతర ఈయూ దేశాల పౌరులు, ఈయూ దేశాల్లో స్థిరపడిన బ్రిటిష్ జాతీయుల నివాస హక్కులు గందరగోళంలో పడతాయి. ఈయూకు ఇంగ్లండ్ చెల్లుచీటీ ఇచ్చే విషయంపై లేదా ఈయూ సింగల్ మార్కెట్లో కొనసాడంపై ఒప్పందమేదీ కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారమే బ్రిటన్ ఇతర ఐరోపా దేశాలతో వ్యాపారం చేయాల్పివస్తుంది. ఇది ఆ దేశానికి నష్టదాయకంగా మారుతుంది. బ్రెగ్జిట్కు అధిక మద్దతు ఇచ్చిన ఇంగ్లండ్ రైతులు తమ ఉత్పత్తులను ఇతర ఈయూ దేశాలకు ఎగుమతి చేస్తే అదనంగా 30-40 శాతం సుంకాలు చెల్లించక తప్పదు. ఈయూ సభ్యత్వం ఉన్నందు వల్ల బ్రిటిష్ బ్యాంకులు, ఆర్థికసంస్థలు లండన్ నుంచి ఇతర సభ్య దేశాలతో అక్కడ ఎలాంటి అనుబంధ కంపెనీలు లేకుండా స్వేచ్ఛగా లావాదేవీలు సాగిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఒప్పందం లేకుంటే ఈ సంస్థలకు ప్రస్తుతమున్న పాస్పోర్టింగ్ హక్కులు కోల్పోతాయి. ఇంకా లండన్ నుంచి పనిచేసే అనేక ఐరోపా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సిబ్బందిని, కార్యకలాపాలను తగ్గించుకుంటే స్థానికులు వేల సంఖ్యలో నిరుద్యోగులవుతారు.
‘చంద్రుడిపై మానవుడు కాలు మోపడమంత’ కష్టమా?
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై జరిగే సంప్రదింపులు చంద్రునిపై మానవుడు కాలు మోపడమంత క్లిష్టంగా ఉందని బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ గతంలో వ్యాఖ్యానించారు. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఏడాది కాలమే ఉన్నా అవి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. కీలకమైన వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు బ్రెగ్జిట్కు అనుగుణంగా సర్దుకోవడానికి రెండేళ్లు అవసరమని ఆయన వాదిస్తున్నారు. దీనిపై అంగీకారం కుదిరాక వచ్చే రెండేళ్లలో బ్రిటన్ వాస్తవానికి ఈయూలో కొనసాగుతున్నట్టే పరిస్థితి ఉంటుందని అంచనా. అందుకే మార్చి నాటికి బ్రిటన్-ఈయూ మధ్య ఒప్పందం కుదిరితే మేలని ఆయన భావిస్తున్నారు. వచ్చే అక్టోబర్ నాటికి ఈ ఒప్పందం ముసాయిదా ఒక కొలిక్చి వస్తే, 2019 మార్చి 19 లోగా ఐరోపా పార్లమెంటులో దాన్ని మిగిలిన 27 దేశాలతో ఆమోదింపచేయవచ్చని బ్రిటన్ భావిస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment