Theresa May
-
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్‌లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
జాన్సన్ దారెటు?
నాలుగేళ్లనాడు జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలన్న ఆత్రుతలో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ ఇచ్చిన ఒక హామీ కన్సర్వేటివ్ పార్టీకి దండిగా సీట్లు సాధించిపెట్టింది. అంతక్రితం తమకున్న 306 స్థానాలనూ 331కి పెంచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకి లభించింది. కానీ ఆ హామీయే తమను క్రమేపీ సంక్షోభం వైపు నెడుతుందని పార్టీ నేతలు అనుకొని ఉండరు. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఏడాదిలో నిర్వహించిన బ్రెగ్జిట్ రెఫరెండం మూడేళ్లకు ముగ్గురు ప్రధానుల్ని మార్చేలా చేసింది. కామెరాన్ తప్పుకున్నాక థెరిసా మే ప్రధాని కాగా, రెండేళ్లు గడిచేసరికి ఆమె కూడా రాజీనామా చేయాల్సివచ్చింది. తాజాగా ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు కన్సర్వేటివ్ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. బ్రిటన్‌కు మేలు చేకూరేవిధంగా ఈయూతో మాట్లాడి మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందానికి కృషి చేస్తాననడా నికి బదులు, అసలు ఏ ఒప్పందమూ అవసరం లేదంటూ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. బ్రెగ్జిట్ వ్యవహారం నిప్పుతో చెలగాటం వంటిది. ఈ సంగతి మొదట కామెరాన్, తర్వాత థెరిసా మే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈయూతో ఒప్పందంలో ఎన్ని సంక్లిష్టతలున్నాయో రెండేళ్లకు మే గ్రహించారు. ఈయూతో ఆమె కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందాన్ని ఈ ఏడాది జనవరిలో బ్రిటన్ పార్లమెంటు తోసిపుచ్చింది. ఆ తర్వాత మార్చిలో ఆమె మరో ముసా యిదా ఒప్పందానికి ఈయూను ఒప్పించారు. కానీ దాన్ని సైతం పార్లమెంటు తోసిపుచ్చింది. ఆమె వ్యవహారశైలిపై సొంత పార్టీలో అసంతృప్తి నానాటికీ తీవ్రమై చివరకు ఆమె రాజీనామా చేశారు. వచ్చే అక్టోబర్ 31నాటికి ఏదో ఒప్పందానికి రాకపోతే బ్రిటన్‌పై దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న సంగతిని జాన్సన్ గ్రహించలేకపోతున్నారో లేక అప్పటివరకూ ఏదో రకంగా నెట్టుకు రావొచ్చునని భావిస్తున్నారో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఒప్పందం కుదుర్చుకుని తప్పుకుంటే బ్రిటన్కొచ్చే లాభం ఒకటుంది. అది కొత్త విధానంలోకి పరివర్తన చెందడానికి 21 నెలల సమ యాన్ని... అంటే దాదాపు రెండేళ్ల గడువు తీసుకోవచ్చు. ఈలోగా ఎదురయ్యే సమస్యలను ఒక్కొ క్కటిగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఒప్పందం లేకుంటే ఒక్కసారిగా బ్రిటన్ అనిశ్చితిలోకి జారు కుంటుంది. బ్రిటన్, ఈయూల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి దేశ పౌరులకు సమస్యలేర్పడతాయి. తమ సభ్య దేశం కాదు గనుక బ్రిటన్‌పై ఈయూ భారీ సుంకాలు విధిస్తుంది. ఫలితంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. కొత్త నిబంధనలు రూపొందించుకునేవరకూ బ్రిటన్ నుంచి వచ్చే ఉత్పత్తులకు ఈయూ అనుమతి నిరాకరిస్తుంది. దేశం వెలుపలి నుంచి రావా ల్సిన విడి భాగాలు, ముడి సరుకు వగైరాల దిగుమతికి సమస్యలేర్పడతాయి గనుక ఉత్పత్తిదారులు బ్రిటన్ వదిలిపోవచ్చు. దానివల్ల లక్షలాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. అటు ఈయూ, ఇటు బ్రిటన్ కొత్త విధానాలు రూపొందించుకునే వరకూ రెండు ప్రాంతాల్లోనూ వలసదారులకు తిప్పలు తప్పవు. బ్రిటన్‌లో 37 లక్షలమంది యూరపియన్లు ఉంటే... ఈయూ దేశాల్లో 13 లక్షలమంది బ్రిటన్ పౌరులున్నారు. వీరంతా కొత్తగా రూపొందబోయే నిబంధనలకు అనుగుణంగా తమ స్థితి గతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈయూ బడ్జెట్ కోసం ఏటా చెల్లించాల్సిన 1,300 కోట్ల పౌండ్ల భారం నుంచి బ్రిటన్ తప్పుకోవచ్చు. కానీ అటు నుంచి వచ్చే సబ్సిడీలన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా ఉమ్మడి వ్యవసాయ విధానం కింద బ్రిటన్ రైతులకిచ్చే 300 కోట్ల పౌండ్లు ఆగిపోతాయి. ఇప్పటికే ఆమోదించిన ఈయూ బడ్జెట్‌కు, దానికింద పరస్పరం చేసుకునే చెల్లింపులకూ ఇరు దేశాలూ కట్టుబడి ఉండాలి. ఈయూ న్యాయస్థానం తీర్పులను బ్రిటన్ పాటించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈయూ దేశాలతో బ్రిటన్ వేర్వేరుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుంది. అందుకు చాన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ ఇకపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం నడుచుకుంటుంది. ఇందువల్ల కొన్ని రంగాల్లో బ్రిటన్ మెరుగైన స్థితిలో ఉండే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో సమస్యలేర్పడతాయి. కన్సర్వేటివ్ ఎంపీల్లో బ్రెగ్జిట్‌పై స్పష్టత లేకపోవడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. ఆ పార్టీలో ఒప్పందం వద్దనే వారితోపాటే, దాన్ని గట్టిగా సమర్థిస్తున్నవారున్నారు. ఆ అస్పష్టతే పార్టీలో ప్రధాని పదవికి పోటీపడిన జెరిమీ హంట్‌కు బదులు జాన్సన్‌ను ఎన్నుకోవడానికి కారణ మైంది. ఈయూతో సమర్థవంతంగా సంప్రదింపులు జరిపి దేశానికి లాభం చేకూర్చే ఒప్పందానికి వారిని ఒప్పిస్తానని హంట్ చెప్పినా అత్యధికులు ఆయన్ను విశ్వసించలేదు. కానీ జాన్సన్లో మరో డోనాల్డ్ ట్రంప్ ఉన్నారని వారు గ్రహించలేకపోయారు. అట్లాంటిక్ మహా సముద్రానికి అటున్న ట్రంప్, ఇటువైపున్న జాన్సన్ చూడటానికి కవలల్లా ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అప్పటికి లండన్ మేయర్‌గా ఉన్న జాన్సన్ న్యూయార్క్ వెళ్లినప్పుడు ఆయన్ను చాలా మంది ట్రంప్‌గా పొరబడ్డారు. అప్పట్లో ఆయన విపరీత వ్యాఖ్యలను తప్పుబట్టిన జాన్సన్ ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నారు. జాత్యహంకార వ్యాఖ్యల్లో, మహిళలను కించేపరిచేలా మాట్లాడటంలో, ఇస్లాంను భూతంగా చూడటంలో ఆయన ట్రంప్కెక్కడా తీసిపోరు. ఈయూతో ఒప్పందం లేకపో యినా మిన్ను విరిగి మీద పడబోదని జాన్సన్ చేసిన వ్యాఖ్య కూడా ఆ కోవలోనిదే. ఈయూతో ఏ ఒప్పందమూ ఉండబోదన్న అనుమానం వస్తే పార్లమెంటులో జాన్సన్‌పై సొంత పార్టీవారే అవి శ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోలేదు. తాననుకున్నది సాధించడానికి పార్లమెంటును ఆయన సస్పెండ్ చేస్తే పార్టీ ఉనికికే ముప్పు ముంచుకొస్తుంది. ఎలా చూసినా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో బ్రిటన్ సంక్షోభం ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీన్నుంచి ఆ దేశం ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. -
పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!
మగవాళ్లు ఆడవాళ్ల మీద వేసుకునే జోకులు ‘బాయిష్’గా ఉంటాయి. కానీ, ఆడవాళ్లు మగవాళ్ల మీద వేసుకునే జోకులు ‘గర్లిష్’గా ఉండవు. మెచ్యూరిటీతో ఉంటాయి. మగవాళ్లకు ప్రకృతి ప్రసాదించిన ఈ ఎదుగుదల లేమి ఆడవాళ్ల పనితీరుపై నెగటివ్‌గా ప్రభావం చూపితే, ఆడవాళ్లకున్న ఈ మెచ్యూరిటీ మగవాళ్ల పనితీరును మెరుగుపరిచేలా ఉంటుంది! బ్రిటన్‌లో బుధవారం ప్రభుత్వం మారింది. పార్టీ అదే. కన్సర్వేటివ్ పార్టీ. థెరెసా మే తప్పుకుని, ఆమె ప్లేస్‌లోకి బోరిస్ జాన్సన్ అనే ఆయన ప్రధానిగా వచ్చారు. ఆయన జుట్టు పాలిపోయిన పసుపు రంగులో (బ్లాండ్) ఉంటుంది. మనిషి పరుగులు తీసే (బాయెంట్) పాదరసంలా ఉంటారు. ఇక ఆయన మూడో ఆనవాలు విదూషకత్వం (బఫూనిష్). ఈ మూడు గుర్తింపులను కలిపి అక్కడవాళ్లకు జాన్స¯Œ తరచూ బ్లాండ్, బాయంట్, బఫూనిష్గా ప్రస్తావనలోకి వస్తుంటారు. థెరెసా మే ప్రధానిగా ఉన్న ఈ మూడేళ్లూ వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో ఆమెను వేపుకు తినేందుకు విఫలయత్నం చేసిన ఐడెంటిటీ కూడా జాన్సన్‌కి ఉంది. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్ ఆ దేశ పార్లమెంటు భవనం. ప్రధాని పదవీకాలం ఐదేళ్లు అయినప్పటికీ థెరిసా మే మూడేళ్లకే మెట్లు దిగేయడానికి పార్టీలో ప్రధాన కారకుడు జాన్సనే! థెరెసా మంత్రివర్గంలో జాన్సన్ విదేశాంగ కార్యదర్శిగా ఉండేవారు. గత ఏడాది జూలైలో ‘నాకు ఈ మంత్రి పదవి వద్దు. థెరెసా ‘బ్రెగ్జిట్’ విధానాలు నచ్చడం లేదు’ అని జాన్సన్ బయటికి వచ్చేశారు. తర్వాత తన వాదనకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని అయ్యారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ను నష్టం, కష్టం లేకుండా థెరెసా బయటికి తీసుకురాలేక పోతున్నారని జాన్సన్ ఆరోపించారు కనుక ఇకపై ఆయనే బ్రిటన్ను సమాఖ్య నుంచి లాభంగా, లాఘవంగా బయటికి తెప్పించాలి. థెరెసా వల్ల కానిది జాన్సన్ వల్ల అవుతుందా! విదేశాంగ కార్యదర్శిగా ఉన్న రెండేళ్లూ జాన్సన్ బఫూనిష్గానే ఉన్నారు. లిబియాలో మారణ హోమం జరుగుతుంటే.. ‘కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాలనన్నింటినీ ఎత్తి పారేస్తే లిబియన్ నగరాలు మంచి టూరిస్ట్ స్పాట్లు అవుతాయి’ అని ఆయన అనడం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు! క్రిటిక్స్ ఆయన్ని ‘బ్రిటన్ ట్రంప్’ అంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవిని వదులుకున్నాక లార్డ్ గ్రౌండ్లో ఉల్లాసంగా క్రికెట్ చూస్తున్న థెరెసా మే థెరెసా తప్పుకుని, జాన్సన్ ఎన్నికను ఎలిజబెత్ మహారాణి ఆమోదించాక గురువారం నాడు జాన్సన్ బ్రిటన్ కొత్త ప్రధానిగా తొలి ప్రసంగం చేస్తున్నప్పుడు థెరెసా పార్లమెంటు భవనంలోనే లేరు! ఆ సమయానికి ఆమె లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఐర్లండ్‌పై ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్న దృశ్యాలను ఎంతో ఇష్టంగా వీక్షిస్తూ కూర్చున్నారు. బ్రిటన్‌లో ఎన్నడూ లేనంతగా కాస్తున్న ఆ ఎండ పూట, నీడ పడుతున్న చోట ప్రత్యేక ఆతిథ్యంతో ఆసీనురాలై, అంచుకు చిన్న నిమ్మ చెక్క గుచ్చి తెచ్చిన గ్లాసులోని నిమ్మరసాన్ని స్ట్రాతో పీలుస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఆటను మొత్తం ఆస్వాదించారు. జాన్సన్ బాయిష్ టాక్‌లో వినేందుకు ఏముంటుందని ఆమె అనుకున్నట్లున్నారు. అంతకన్నా విశేషం ఆ ముందు రోజు జరిగింది. బయటికి వెళుతున్న బ్రిటన్ ప్రధాని ఎవరైనా చివరి ప్రసంగం ఇవ్వవలసి ఉంటుంది. ప్రసంగం తర్వాత ‘ప్రశ్నలు–జవాబుల’ కార్యక్రమం ఉంటుంది. సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. ప్రధాని సమాధానాలు ఇవ్వాలి. ఆ సెషన్లో జో స్విన్సన్ అనే ఒక మహిళా ఎంపీ థెరెసాను అడిగారు.. ‘‘దేశంలోని మహిళలకు మీరేం సలహా ఇస్తారు? పనిలో తమను మించినవారు లేరని ఊరికే చెప్పుకుంటూ తిరిగే మగాళ్లతో కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు మహిళలు ఎలా డీల్ చెయ్యాలి?’’ అని! ఒక్కసారిగా అంతా నవ్వేశారు. జాన్సన్‌ని దృష్టిలో పెట్టుకునే ఆమె ఆ ప్రశ్న అడిగారని అర్థమై థెరెసా నవ్వు ఆపుకున్నారు. సమాధానం చెప్పబోతుంటే నవ్వు అడ్డు పడి కాస్త ఆగారు. తర్వాత చెప్పారు. ‘‘మై అడ్వైజ్.. (మళ్లీ నవ్వు).. మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే. నిజాయతీగా పని చేయండి. పని చేస్తూనే ఉండండి. మీరు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారో ఆ పనిని చేయడమే మీ లక్ష్యంగా చేసుకోండి’’ అన్నారు. ప్రశ్న అడిగిన జో స్విన్సన్ ‘లిబరల్ డెమోక్రాట్’ పార్టీ తొలి మహిళా నాయకురాలు. ఈ వారంలోనే ఆమె తన పార్టీ లీడర్‌గా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్న ‘కన్జర్వేటివ్’, అపోజిషన్‌లో ఉన్న ‘లేబర్’ పార్టీలు కాకుండా బ్రిటన్ పార్లమెంటులో ఉన్న అనేక ఇతర పార్టీలలో లిబరల్ డెమోక్రాట్ కూడా ఒకటి. ఆ పార్టీ లీడర్‌గా ఎన్నికైనందుకు జో స్విన్సన్కు ‘ప్రశ్నలు–సమాధానాలు’ సెషన్లో థెరెసా అభినందనలు తెలిపారు. మిగతా పార్టీలలో కూడా చాలా వాటికి మహిళలు ఫ్లోర్ లీడర్లుగా ఉన్నారు. ఆ సంగతిని కూడా థెరెసా గుర్తు చేశారు. ‘‘పని పట్ల మహిళల్లో ఉండే నిబద్ధతే వాళ్లకు పార్టీ నాయకత్వాన్ని దక్కిస్తుంది’’ అన్నారు. అవన్నీ సున్నితంగా జాన్సన్‌ను ఉద్దేశించి అన్నవే. మరి నిబద్ధత ఉన్న థెరెసా ఎందుకని పార్టీ నాయకత్వం నుంచి, ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది! గత ఏడాది డిసెంబరులో, ఈ ఏడాది జనవరిలో ఆమె రెండుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గినప్పటికీ.. బ్రెగ్జిట్ నిబంధనలు, షరతులపై ఏకాభిప్రాయం సాధించకపోతే కనుక ప్రధానిగా తప్పుకుంటానని గత మార్చిలో ప్రకటించారు కనుక ఆ మాటకు నిబద్ధురాలై ఆమె తన పదవిని వదులుకున్నారు. ఇక ఇప్పుడు ఎంపీగా మాత్రమే థెరెసా వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌కు వెళ్లి వస్తుంటారు. బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుంచి విడిపించడం కన్నా తక్కువ పనేం కాదు బాయిష్ టాక్‌ను కట్టడి చెయ్యడం. ఇక ఇప్పుడు ఎంపీగా మాత్రమే థెరెసా వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌కు వెళ్లి వస్తుంటారు. బ్రిటన్ను ఐరోపా సమాఖ్య నుంచి విడిపించడం కన్నా తక్కువ పనేం కాదు.. పని చేసే చోట బాయిష్ టాక్నుకట్టడి చెయ్యడం. -
బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్ (55) ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ మంగళవారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. కాగా బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో మాజీ ప్రధాని థెరిసా మేకి పలుమార్లు ఎదురుదెబ్బలు తగలడంతో ఆమె పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో నూతన ప్రధానని ఎన్నుకున్నారు. దీని కోసం కేంద్రమంత్రుల నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో రహస్య ఓటింగ్ పద్దతి జరపగా.. దానిలో బోరిస్ జాన్సన్ విజయం సాధించారు. బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు బుధవారం మధ్యాహ్నాం చేపట్టనున్నారు. గతంలో ఆయన విదేశాంగ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. కాగా నూతన ప్రధాని జాన్సన్ కూడా బ్రెగ్జిట్‌కు తొలినుంచి అనుకూలంగా ఉన్నారు. మే కూడా మొదటి నుంచి ఆయనకే మద్దతు ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. జాన్సన్ 2001 నుంచి బ్రిటన్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతూ వస్తున్నారు. -
ప్రధానితో ప్రపంచకప్ విజేత
లండన్ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి టైటిల్ గెలిచిన మోర్గాన్ సేన మంగళవారం దేశ ప్రధాని థెరెసా మే ను మర్యాదపూర్వకంగా కలిశారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధాని అధికారిక కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్ ప్రజలు క్రికెట్‌పై మళ్లీ ప్రేమను పెంచుకునేలా మీరు చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను అత్యుత్తమ క్రీడా ఘట్టాల్లో ఒకటిగా చెప్పగలను. ఇరు జట్ల అద్భుతమైన ఆటతో పాటు కొంత అదృష్టం కూడా కలగలిసి ఒక థ్రిల్లర్‌ను మనకు అందించాయి. ఇంత గొప్ప టోర్నీకి ఇది సరైన ముగింపు. మన దేశాన్ని క్రీడల్లో ప్రముఖంగా నిలిపిన అందరికీ అభినందనలు’ అని ఈ సందర్భంగా ప్రధాని థెరెసా వ్యాఖ్యానించారు. కార్యాలయ గార్డెన్స్‌లో జరిగిన ‘షాంపేన్ రిసెప్షన్’లో క్రికెటర్లు ప్రధానితో సరదాగా కబుర్లు చెబుతూ తమ గెలుపును ఆస్వాదించడం విశేషం. -
తుది దశకు బ్రిటన్ ప్రధాని రేసు
లండన్: బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే స్థానంలో కొత్త కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ గురువారం తుది దశకు చేరుకుంది. పాకిస్తాన్ సంతతికి చెందిన హోం మంత్రి సాజిద్ జావిద్ పోటీ నుంచి నిష్క్రమించగా ఈ పదవికి రేసులో ఉన్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ తిరుగులేని మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. రహస్య బ్యాలెట్ల తుది రౌండ్లో బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి జెరెమై హంట్‌ను పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్ వెనక్కినెట్టడంతో ఈ రేసులో రెండో స్థానం కోసం జరుగుతున్న యుద్ధం మలుపు తిరిగింది. తాజా సమాచారం ప్రకారం జాన్సన్ 157 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా గోవ్ (61) హంట్ (59) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రిటన్ సీనియర్ మోస్ట్ మంత్రి అయిన జావిద్‌కు మూడవ దశలో కేవలం 34 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో జాన్సన్, గోవ్ ప్రధాని పదవికి పోటీ పడనున్నారు. తుది ప్రక్రియలో భాగంగా వారు పలు సమావేశాల్లో ఓటర్లనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. రెండు టీవీ చర్చల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. జూలై 22న విజేతను ప్రకటించే అవకాశం ఉంది. -
బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే కీలక నిర్ణయం
-
బ్రిటన్ చేరుకున్న ట్రంప్
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా సోమవారం లండన్ చేరుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2ను ఆయన సతీసమేతంగా కలుసుకున్నారు.అనంతరం ప్రిన్స్ చార్లెస్‌ను కూడా ట్రంప్ కలిశారు. త్వరలో పదవి నుంచి దిగిపోబోతున్న బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యి, చైనా సంస్థ హువావే వివాదం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, తన పాత శత్రువు, లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ట్రంప్ లండన్‌లో దిగగానే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. -
బ్రిటన్ ప్రధాని రేసులో ఎనిమిది మంది!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ప్రధాని పదవికోసం చాలా మంది ఆశావాహులు పోటీపడుతున్నారు. జూన్ 7న తాను పదవి నుంచి వైదొలగుతానని తేల్చడంతో.. మే నుంచి అధికార పగ్గాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతలు పోటీపడుతున్నారు. బ్రిటన్ ప్రధాని పదవి కోసం దాదాపు ఎనిమిది మంది నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో బ్రెగ్జిట్‌ను సమర్ధించే బోరిస్ జాన్సన్‌తో ముందంజలో ఉన్నారు. గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బోరిస్ జాన్సన్ ఈ బరిలో ముందున్నా మరో ఏడుగురు రంగంలోకి దిగడంతో పోటీ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌లో జరుపనున్న మూడురోజుల అధికార పర్యటన ముగిసిన తర్వాత జూన్ 7న ప్రధాని పదవి నుంచి వైదొలుగుతానని థెరెసా మే ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ నాయకుల్లో బోరిస్ జాన్సన్, బ్రిటన్ పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్, బ్రెగ్జిట్ మాజీ మంత్రి డొమినిక్ రాబ్, బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) మాజీ నేత ఆండ్రియా లీడ్సమ్, విదేశాంగ శాఖ మంత్రి జెరేమీ హంట్, అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి రోరీ స్టీవర్ట్, ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హంకాక్, ప్రజా పనులు, పెన్షన్ల శాఖ మాజీ మంత్రి ఎస్థర్ మెక్వే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా జూన్ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. -
బ్రిటన్ ప్రధాని రాజీనామా
లండన్: కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే శుక్రవారం ప్రకటించారు. జూన్ 7న తాను పదవి నుంచి వైదొలగుతాననీ, తమ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానన్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి తమ సొంత పార్టీ ఎంపీల నుంచే తాను మద్దతు కూడగట్టలేకపోయాననీ, దేశ ప్రయోజనాల కోసం పదవి నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూన్ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. ‘నా జీవితకాలంలో నాకు దక్కిన గొప్ప గౌరవం ఈ పదవి. త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నాను. నేను ప్రేమించే ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో కృతజ్ఞత చూపుతూ పదవికి రాజీనామా చేస్తున్నాను తప్ప ఏ రకమైన దురుద్దేశంతో కాదు’ అని మే వెల్లడించారు. తన రాజీనామా విషయాన్ని రాణి ఎలిజబెత్–2కి ఇప్పటికే తెలియజేశాననీ, జూన్ 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమావేశాలకు తానే అధ్యక్షత వహిస్తానని మే తెలిపారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్ మాట్లాడుతూ మే ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నారనీ, ఆమెతోపాటు ఆమె పార్టీకి కూడా దేశాన్ని పాలించే బలం లేదని అన్నారు. కాగా, తదుపరి ప్రధాని రేసులో మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ముందంజలో ఉన్నారు. -
ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్ ప్రధాని
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగే విషయమై ప్రధాని థెరెసా మే మంగళవారం పార్లమెంటులో నూతన బ్రెగ్జిట్ విధానాన్ని ప్రతిపాదించారు. దీనిపై అవసరమైతే రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలన్న అంశాన్నీ పొందుపరిచారు. ప్రతిపక్షాలు కోరుతున్న డిమాండ్లకు చోటు కల్పించారు. బిల్లులో కార్మికులు, దేశ రక్షణ, పర్యావరణం, వలసలకు సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈయూ నుంచి వైదొలగాలన్న తమ నిర్ణయానికి చివరి అవకాశం ఇవ్వాలని బ్రిటన్ ఎంపీలను థెరిసా కోరారు. ప్రజల నిర్ణయం కొరకు అవసరమైతే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడదామని, దీనికి సంబందించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈయూ నుంచి బయటకు రావాలంటూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు పలుమార్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆమె సొంత పార్టీ సభ్యులే ఓటింగ్‌లో ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది.మరోవైపు ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై పార్లమెంట్లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ నుంచి వైదొలగాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. -
‘విషాదానికి చింతిస్తూ..షో నిలిపివేస్తున్నాం’
లండన్ : పాపులర్ బ్రిటీష్ టాక్ షో ‘ది జెరెమీ కైలే షో’ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ పార్టిసిపెంట్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐటీవీలో ప్రసారమయ్యే జెరెమీ షోలో ప్రతీ ఎపిసోడ్‌కు ఇద్దరు పార్టిసిపెంట్లను ఆహ్వానిస్తారు. జీవిత భాగస్వాములు, ప్రేమికులే నిర్వాహకుల ప్రధాన టార్గెట్. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎదుటి వారిపై తమకున్న అభిప్రాయాలు, తమ బంధం గురించి చెప్పాల్సిందిగా కోరతారు. ఈ క్రమంలో స్టీవ్ డైమండ్(63) అనే వ్యక్తి తన ఫియాన్సితో కలిసి జెరెమీ షోకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా నిర్వహించిన లై డిటెక్టర్ పరీక్షలో అతడు విఫలమయ్యాడు. దీంతో స్టీవ్ తనను మోసం చేశాడని భావించిన ఫియాన్సీ అతడితో తెగదెంపులు చేసుకుంది. ఆమె దూరమవ్వడంతో ఈ కలత చెందిన స్టీవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే సహా వివిధ వర్గాల నుంచి ఈ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందించిన ఐటీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..‘ ఇటీవల చోటుచేసుకున్న విషాదాన్ని దృష్టిలో పెట్టుకుని జెరెమీ షోను నిలిపివేస్తున్నాం. 14 ఏళ్లుగా మిమ్మల్ని అలరించిన షో ఇకపై ప్రసారం కాబోదు. స్టీవ్ డైమండ్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాభ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో టీవీ షోల కారణంగా బ్రిటన్‌లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాపులర్ షో లవ్ ఐలాండ్‌లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై స్పందించిన ప్రధాని అధికార ప్రతినిధి వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బ్రిటన్ ప్రధాని రాజీనామాపై నిర్ణయం..!
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆమె పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేత గ్రాహమ్ బ్రాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యురోపియన్ దేశాల్లో చర్చంతా బ్రెగ్జిట్ చుట్టూనే నడుస్తోన్న విషయం తెలిసిందే. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో థెరిసా మే తీవ్రంగా విఫలమయ్యారని సొంత పార్టీ సభ్యులే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజీనామాపై వచ్చే వారం ఆమె కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్ ప్రధాని నిర్ణయం వీగిపోయిన విషయం తెలిసిందే. వాస్తవానికి రెండేళ్ల బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ మార్చి 29నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్లో ఆమె అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాడే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంచరించుకున్నాయి. ఒకవేళ మే రాజీనామా చేస్తే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. -
బ్రెగ్జిట్‌పై ఓ ఒప్పందానికి వద్దాం: థెరిసా మే
లండన్: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు అధికార కన్జర్వేటివ్ ప్రభుత్వం, విపక్ష లేబర్ పార్టీ ఒక రాజీ బ్రెగ్జిట్ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఆదివారం పార్టీ పత్రిక మెయిల్ ఆన్ సండేలో ఆమె ఈ మేరకు రాశారు. ‘ఓ ఒప్పందానికి వద్దాం’అని లేబర్ పార్టీ నేత జెర్మయి కార్బైన్‌ను ఉద్దేశించి ఆమె పిలుపునిచ్చారు. పార్టీల రాజీ అవకాశంపై అధికార పార్టీ నేతల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. చివరకు మే కూడా తాను కూడా అలా కోరుకోవడం లేదన్నారు. ‘కానీ సంక్షోభాన్ని సడలించే మార్గాన్ని కనుక్కోవాల్సి ఉంది. అంతేకాదు స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా దాని అత్యవసరతను పేర్కొంటున్నాయి..’అని బ్రిటన్ ప్రధాని లేఖ రాశారు. -
‘జలియన్‌వాలాబాగ్ అవమానకరం’
లండన్: 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతం బ్రిటిష్ పాలనలోని భారత చరిత్రలో అవమానకర మరకగా మిగిలిపోతుందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. పలువురు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేసినట్లుగా ఈ ఘటనపై అధికారికంగా క్షమాపణ చెప్పడానికి ఆమె నిరాకరించారు. ఈ నెల 13న జలియన్‌వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్లో చర్చలో ఆమె మాట్లాడారు. ‘ఆనాటి ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నాం. అయినా నేడు భారత్–బ్రిటన్ సంబంధాలు సంతృప్తికరం. బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల కృషి అమోఘం’ అని అన్నారు. స్వాతంత్య్రపోరాటంలో భాగంగా భారతీయులు రహస్యంగా సమావేశమైనప్పుడు జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సేనలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు. -
మూడోసారీ బ్రెగ్జిట్‌కు తిరస్కరణే
లండన్: మూడోసారి కూడా బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్ బిల్లును ఆ దేశ పార్లమెంటు శుక్రవారం తిరస్కరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చే పద్ధతి మరింత సంక్లిష్టమైంది. మే తెచ్చిన తాజా బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా 286 ఓట్లు, వ్యతిరేకంగా 344 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే బ్రెగ్జిట్‌కు సంబంధించిన అన్ని బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు థెరెసాకు మే 22వ తేదీ వరకు సమయం దొరికేది. వాస్తవానికి గత ప్రణాళిక ప్రకారం శుక్రవారం నుంచే (మార్చి 29) బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. బ్రెగ్జిట్ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందక పోవడంతో అది వాయిదా పడింది. -
బ్రెగ్జిట్ అనిశ్చితి.. మే రాజీనామాకు ఒత్తిడి
లండన్: బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై వచ్చే వారం పార్లమెంట్లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దిగిపోవాలంటూ మే ను హెచ్చరించాలని వారు భావిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం. అలా జరిగితే, ఆమె స్థానంలో డిప్యూటీ ప్రధానిగా ఉన్న డేవిడ్ లిడింగ్టన్ ఆపద్ధర్మ ప్రధానిగా అవుతారని పేర్కొన్నాయి. -
బ్రెగ్జిట్‌కు జూన్ 30 దాకా గడువివ్వండి
లండన్: యురోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని బ్రిటన్ ఈయూ నాయకులను కోరింది. ఈ మేరకు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు లేఖ రాసినట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం పార్లమెంట్లో చెప్పారు. జూన్ 30కి మించి గడువు కోరుకోవడం లేదని, అంతకన్నా ఆలస్యమైతే మే నెల చివరన ఈయూ పార్లమెంట్ ఎన్నికలను బ్రిటనే నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, గురువారం, శుక్రవారం బ్రసెల్స్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ సభ్య దేశాలు బ్రిటన్ వినతిపై ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. -
డీల్ లేని ‘బ్రెగ్జిట్’ వద్దు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనుదిరిగే బ్రెగ్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని థెరిసా మే చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో గట్టెక్కలేకపోయింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం 43 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. 321 మంది సభ్యులు అనుకూలంగా, 278 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి మే ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలు రెండుసార్లు వీగిపోయినట్లయింది.షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 29న యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావాల్సి ఉంది. కానీ తాజా పరిణామం నేపథ్యంలో ఆ తేదీన ఒప్పందం లేకుండా నిష్క్రమించడం సాధ్యం కాదని ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పర్యవేక్షణను పార్లమెంట్‌కు అప్పగించాలని విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని చెప్పారు. రెండో రెఫరెండానికి తిరస్కరణ బ్రెగ్జిట్ కోసం రెండో రెఫరెండం నిర్వహించాలన్న ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంట్ గురువారం భారీ మెజారిటీతో తిరస్కరించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 334 మంది, అనుకూలంగా 85 మంది ఓటేశారు. విపక్ష లేబర్ పార్టీ సభ్యులు చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకవేళ ఈ సవరణ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గట్టెక్కినా, ప్రభుత్వం దానిని తప్పకుండా అమలుచేయాల్సిన అవసరం లేదు. -
‘బ్రెగ్జిట్ జరగకుంటే సంక్షోభమే’
గ్రిమ్స్బై: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకేయాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. లేదంటే బ్రెగ్జిట్ ఎన్నటికీ జరగదనీ, సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు తిరస్కరించింది. ‘వచ్చే మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే మిగిలేది సంక్షోభమే. అంతిమంగా బ్రిటన్ ఈయూ నుంచి ఎన్నటికీ విడిపోదు’ అని మే అన్నారు. 2016లో జరిగిన బ్రెగ్టిట్ లో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 51.9 శాతం మంది బ్రిటిషర్లు ఓటేశారు. -
పాక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిందే : బ్రిటన్
లండన్ : పాక్ ఉగ్రవాద సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిదేనంటూ బ్రిటన్ ప్రధాని థెరిసా మే సూచించారు. పుల్వామా ఉగ్ర దాడులు - మెరుపు దాడుల ఫలితంగా భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థెరిసా, ఆదివారం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. ఈ విషయం గురించి బ్రిటన్ ప్రధాని కార్యలయ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రధాని థెరిసా మే పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను చక్కదిద్దేందుకు పాక్ ప్రధాని చూపిన చొరవను థెరిసా స్వాగతించారు. అంతేకాక ఉగ్రవాద సంస్థల పట్ల పాక్ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. పాక్ కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలని థెరిసా, ఇమ్రాన్ ఖాన్‌కు తెలిపారన్నా’రు. పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను యూకే 2001లోనే బ్యాన్ చేసింది. బాలాకోట్ మెరుపు దాడి అనంతరం థెరిసా మే పరిస్థితులను గమనిస్తున్నామని.. తాము ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నామని తెలిపారు. భారత్ - పాక్ దౌత్యపరమైన విధానాలతో ముందుకు వెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని థెరిసా కోరారు. (మసూద్ బతికేఉన్నాడు : పాక్ మీడియా) -
అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిన థెరిస్సామే
-
థెరెసా మేకు ఊరట
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకు స్వల్ప ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 19 ఓట్ల తేడాతో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఈ అవిశ్వాస పరీక్షను నెగ్గింది. అంతకు ముందు మంగళవారం ఈయూతో బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించిన సంగతి తెలిసిందే. వంద మందికి పైగా సొంత పార్టీకి చెందిన ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆమెపై హాజ్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెగ్జిట్ ప్రక్రియ మరో రెండు నెలల గడువే ఉండటంతో.. అవిశ్వాస పరీక్ష నెగ్గిన మే వేగంగా స్పందించారు. మూడు పార్లమెంటు పనిదినాల్లో ప్రత్యామ్నాయ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రతిపక్ష నేతలను థెరెసా మే ఆహ్వానించారు. బ్రిటన్ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. ఒకవేళ ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
తీవ్ర ఒడిదుడుకులు
తీవ్ర హెచ్చుతగ్గుల్లో సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితిల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ట్రేడింగ్ మొత్తంలో 184 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 3 పాయింట్ల లాభంతో 36,321 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 3 పాయింట్లు పెరిగి 10,890 పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ లాభాలు ఆవిరి... చైనా కేంద్ర బ్యాంక్ బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా 8,300 కోట్ల డాలర్ల నిధులను గుమ్మరించనున్నదన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్రెగ్జిట్ బిల్లు వీగిపోవడంతో యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. దీంతో మన మార్కెట్లో ఆటు పోట్లు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 144 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 40 పాయింట్ల వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 184 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్రిటన్‌లో అనిశ్చితి... యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంట్లో భారీ మెజారిటీతో వీగిపోయింది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముందని, ఎన్నికలు కూడా రావచ్చనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. లండన్ ఎఫ్టీఎస్ఈ 0.6 శాతం పతనం కాగా, ఇతర యూరప్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ల లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ విలీనం కారణంగా ఏర్పడిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఎస్ఈలో ఈ షేర్ రూ.47 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2.7 శాతం లాభంతో రూ.48 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.23,071 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్ రుణాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 32 శాతంగా ఉన్నాయి. ► జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుజ్జీవన ప్రణాళికపై అనిశ్చితి నెలకొనడంతో జెట్ ఎయిర్వేస్ షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీ భాగస్వామి ఎతిహాద్ జెట్ ఎయిర్వేస్లో మరింత వాటాను కొనుగోలు చేయనున్నదని, అయితే ఒక్కో షేర్‌ను రూ.150కు మాత్రమే ఆఫర్ ఇచ్చిందన్న వార్తల కారణంగా ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 8 శాతం తగ్గి రూ.271 వద్ద ముగిసింది. ► క్యూ3లో ఆర్థిక ఫలితాలు అదిరిపోవడంతో స్పెషాల్టీ రెస్టారెంట్ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.98 వద్ద ముగిసింది. -
బ్రిటన్‌కు అగ్ని పరీక్ష!
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ నిష్క్రమించాల్సిన గడువు ముంచుకొస్తుండగా ఆ దేశ ప్రధాని థెరిస్సా మే ఈయూతో కుదుర్చుకొచ్చిన ముసాయిదా ఒప్పందం వీగిపోయింది. బ్రిటన్ దిగువ సభ కామన్స్‌లో మంగళవారం దానికి చుక్కెదురైంది. ఆ ప్రతిపాదనకు అనుకూ లంగా కేవలం 202 ఓట్లు మాత్రమే లభించగా, 432మంది వ్యతిరేకించారు. దేశ ప్రధాని ప్రతిపాద నకు ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీనికి కొనసాగిం పుగా ఆమె ప్రభుత్వంపై విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. అందులో సైతం థెరిస్సా ఓడితే ఆమె ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకొనేందుకు గడువు తేదీ మార్చి 29. అంటే... ఇక కేవలం 72 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆలోగా ఈయూతో అది ఒప్పందానికి రాలేకపోతే బ్రిటన్ తెగదెంపులు పూర్తయినట్టే భావిస్తారు. సంస్థనుంచి బయటికొచ్చాక అనుసరించాల్సిన విధి విధానాలపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఈ ప్రక్రియ ముగిసిపోతే బ్రిటన్ను అది తీవ్ర సంక్షోభంలో పడేస్తుంది. దాని పర్యవసానంగా ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు పెను విపత్తుకు దారి తీస్తాయి. ఆహారం, మందులు వగైరాల కొరతతో మొదలుపెట్టి విమాన రాకపోకలు స్తంభించిపోవ డంతోసహా ఎన్నో సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత దేశంలో బద్దలయ్యే అశాంతిని అదుపు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుంది. అయితే ఇదంతా సజావుగా పూర్త వుతుందని, సమస్యలేమీ ఎదురుకావన్న భావనతోనే మార్కెట్లున్నాయి. అందుకే బ్రిటన్‌లోని తాజా పరిణామాల ప్రభావం వాటిపై పెద్దగా పడలేదు. థెరిస్సా మే గత కొన్ని నెలలుగా ఈయూ బాధ్యులతో బ్రెగ్జిట్‌పై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. వాటి పర్యవసానంగా గత నవంబర్‌లో ముసాయిదా ఒప్పందం ఖరారైంది. దీనికి కన్సర్వేటివ్ పార్టీలోనేకాక, తమకు మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్ పార్టీ డీయూపీనుంచి సైతం అసమ్మతి స్వరాలు వినిపించాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అవి పెరిగాయి. అటు విపక్ష లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పీ)లు సరేసరి. ఆ ముసాయిదా ఒప్పందం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి. ఈ స్థితిలో డిసెంబర్లో జరగాల్సిన ఓటింగ్‌ను ఆమె వాయిదా వేశారు. ఆ తర్వాత మరిన్ని రాయితీలివ్వాలని ఈయూను ప్రాధేయపడ్డారు. కానీ ఆ సంస్థను నడిపిస్తున్న జర్మనీ ఏంజెలా మెర్కల్ అందుకు సిద్ధంగా లేరు. అందుకే యూరొపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జుంకర్, యూరొపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌లు అందుకు తిరస్కరించారు. ఇదే బ్రిటన్ పౌరులను కలవరపరిచింది. 2016 జూన్‌లో బ్రెగ్జిట్‌పై రిఫరెండం జరిగినప్పుడు అత్యధి కులు స్వాగతించిన విషయాన్ని గుర్తుంచుకుంటే ప్రస్తుత వ్యతిరేకత తీవ్రతేమిటో అర్థమవుతుంది. అప్పట్లో 51.9 శాతంమంది రిఫరెండానికి అనుకూలత వ్యక్తం చేశారు. 48.1 శాతంమంది ఈయూ లోనే కొనసాగాలని కోరారు. రెండున్నరేళ్లు గడిచేసరికల్లా బ్రెగ్జిట్ అనుకూలురు, దాని వ్యతిరేకులు కూడా ఒకే దోవకొచ్చారు. ఫలితంగా ముసాయిదాకు కేవలం 20 శాతంమంది మాత్రమే అనుకూల మని సర్వేలు తేల్చిచెప్పాయి. ఒప్పందం మరీ కఠినంగా ఉండరాదని అనేకులు ఆశించారు. కానీ దానికి భిన్నంగా జరగడమేకాక ముసాయిదా బ్రిటన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని ఇది శాశ్వతంగా అప్రజాస్వామిక ఈయూకు బానిసను చేస్తుందన్నది వారి విశ్లేషణ. ఈ ముసాయిదా ఒప్పందం ఖరారైతే ఈయూ ఆమోదం లేకుండా అమెరికాతో సహా ఏ దేశంతోనూ భవిష్యత్తులో బ్రిటన్ వాణిజ్య ఒప్పందాలకు రావడం సాధ్యపడ దని వారంటున్నారు. తమనుంచి దూరమైతే ఎలాంటి దుర్గతి పడుతుందో సంస్థలోని ఇతర సభ్య దేశాలకు చూపడమే ఈయూ అధినేతల ఆంతర్యంగా కనబడుతున్నదన్న విమర్శలున్నాయి. అందుకే థెరిస్సా మే తీరును నిరసిస్తూ ఈమధ్యకాలంలో పలువురు మంత్రులు, డిప్యూటీలు ఆమె ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పారు. బ్రెగ్జిట్ చర్చల్లో మొదటినుంచీ కీలకపాత్ర పోషిస్తున్న డొమినిక్ రాబ్ కూడా వారిలో ఉన్నారు. ఒక దేశం సంస్థలో సభ్యత్వం తీసుకున్ననాటికి ఎలా ఉందో, విడిపోయాక కూడా అలా కొనసాగుతామంటే ఈయూ పెద్దలకు అభ్యంతరం ఎందుకుండాలి? సంస్థ ఆలంబనతో అన్నివి ధాలా ఎదిగాక మధ్యలో విడిచిపోతానంటే ఈయూ సంకటస్థితిలో పడుతుందన్నది జర్మన్ కార్పొ రేట్ల వాదన. అయితే యూరప్‌పై తమ ఆర్థిక పెత్తనాన్ని కొనసాగించడానికే జర్మన్లు ఇలాంటి అర్ధర హిత వాదనలు చేస్తున్నారని బ్రిటన్ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం ఖరారు కాకపోతే అటు బ్రిటన్‌కు మాత్రమే కాదు...ఇటు ఈయూ దేశాలకూ బోలెడు సమస్యలు ఎదురవుతాయి. ఈయూ సభ్యదేశాల పౌరులు ఇన్నాళ్లూ యూరప్లోఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఉపాధి వెదుక్కోవచ్చు. కానీ ఏ ఒప్పందమూ లేకుండా బ్రిటన్ విడిపోయే పరిస్థితి ఏర్పడితే వేరే దేశాల్లో ఉండే బ్రిటన్ పౌరులు అక్కడ నివసించేందుకు పర్మిట్లకు దరఖాస్తు చేయాలి. ఫిన్లాండ్లో ఉన్న 5,000మంది బ్రిటన్ పౌరులకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అలాగే బ్రిటన్‌లో ఉండే వేరే దేశాల పౌరులు సైతం ఆ పనే చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు వైన్ ఎగుమతులు... బ్రిటన్నుంచి ఫ్రాన్స్‌కు మద్యం ఎగుమతులు నిలిచిపోతాయి. ఆ రెండు దేశాలూ ఆర్థిక సంక్షో భంలో పడతాయి. ఏదేమైనా బ్రిటన్ పరిస్థితి ‘ముందు నుయ్యి–వెనక గొయ్యి’ అన్నట్టుంది. పాత ముసాయిదాలో మార్పులు కావాలని బ్రిటన్ సంప్రదిస్తే కొత్త ఒప్పందానికి ఆమోదం పొందుతా మన్న ముందస్తు హామీ ఇచ్చే షరతు విధిస్తామని ఈయూ బాధ్యులు అంటున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యానికి’ అధిపతిగా ఉన్న బ్రిటన్‌కు ఈ బ్రెగ్జిట్ వ్యవహారం అగ్నిపరీక్షగా మారింది. దీన్నుంచి అది గౌరవంగా ఎలా బయటపడగలదో మున్ముందు చూడాలి. -
బ్రిటన్ ప్రధానికి గట్టి ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు రావాలని బ్రిటన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై థెరెసా మే ప్రవేశపెట్టన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా 432 మంది సభ్యులు ఓటేయగా, అనుకూలంగా 202 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో 230 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ ఎంపీలు తిరస్కరించారు. ఒప్పందంపై భారత సంతతికి చెందిన ఏడుగురు బ్రిటన్ ఎంపీలు కూడా బ్రిగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. బ్రిగ్జిట్పై థెరెసా మే చేసిన అభ్యర్థనను ఎంపీలెవరూ పట్టించుకోలేదు. బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ థెరెసా ప్రభుత్వంపై అవిస్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ తీర్మానం ఆమోదం పొంది ప్రభుత్వం రాజీనామా చేసినట్లయితే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈయూ నేతలు ఇదివరకే ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే బిల్లుపై బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం లభించడం అంత సులభమైన విషయం కాదు. ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్‌కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడంతో రానున్న కాలంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. పార్లమెంట్ ఆమోదం లేకుండా బయటకు రావల్సి రావచ్చు లేదా, కొత్త ఒప్పందం కోసం థెరెసా మరోసారి చర్చలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలావుండగా మే ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు కూడా జరగొచ్చని ప్రతిపక్ష లేబర్‌పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
థెరెసా మేకి మరో ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మేకి బుధవారం మరో ప్రధాన పార్లమెంటరీ అపజయం ఎదురైంది. ఒప్పందమేదీ లేకుండా బ్రెగ్జిట్ అయ్యేందుకు ఒప్పుకోడానికి నిరాకరిస్తూ, మేకి వ్యతిరేకంగా మంగళవారమే ఎంపీలు ఓటు వేయడం తెలిసిందే. అది జరిగి 24 గంటలు గడవక ముందే పార్లమెంటులో ఆమెకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒకవేళ ప్రస్తుతం మే కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించకపోతే, ఆ తర్వాత మూడు రోజుల్లోపే మరో ప్రత్యామ్నాయ ఒప్పందాన్ని ఆమె తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సవరణను 20 మంది ఎంపీలు బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టగా, 308 మంది అనుకూలంగా, 297 మంది వ్యతిరేకంగా ఓటేశారు. -
అవిశ్వాసాన్ని గట్టెక్కిన థెరెసా
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మేకి అవిశ్వాస గండం తప్పింది. బుధవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో మేకి చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు 317 మంది పాల్గొనగా, 200 మంది ఆమెకు అనుకూలంగా, మరో 117 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 2022 సాధారణ ఎన్నికల్లో తాను పార్టీకి నాయకత్వం వహించనని థెరెసా మే హామీనివ్వడంతో పలువురు అసంతృప్త ఎంపీలు శాంతించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో థెరెసా మే కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమె సొంత పార్టీ ఎంపీలు, మంత్రులే వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే సొంత పార్టీ కన్జర్వేటివ్ ఎంపీలే 48 మంది మేపై అవిశ్వాసం నోటీసులివ్వడంతో ఓటింగ్ జరిగింది. అయితే ఇదంతా కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత వ్యవహారమే తప్ప పార్లమెంటులో జరిగింది కాదు. ఈ అవిశ్వాస పరీక్షలో మే ఓడిపోయుంటే ఆమె ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చేది. అయితే ఓటింగ్‌కు ముందు ఆమె ఎంపీలతో సమావేశమై 2022 సాధారణ ఎన్నికల్లో పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో పలువురు ఎంపీలు ఆమెకు అనుకూలంగా మారారు. ఇప్పటికే ఈయూతో మే కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం ముసాయిదాను బ్రిటన్ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. దీనిపై ఓటింగ్ వచ్చే ఏడాది జనవరి రెండో లేదా మూడో వారంలో జరుగుతుందని తెలుస్తోంది. మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్ ప్రయోజనాలకు భంగకరమనీ, 2016లో బ్రెగ్జిట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో బ్రిటన్ ప్రజలు ఏ ఆశలతో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారో, ఆ ఆశలను ఈ ఒప్పందం నెరవేర్చలేదని పలువురు మే సొంత పార్టీ ఎంపీలే ఆమెతో విభేదిస్తున్నారు. ఒప్పందంలో మార్పులపై ఈయూతో చర్చల కోసం మే త్వరలోనే మరసారి బ్రస్సెల్స్కు వెళ్లనున్నారు. -
బ్రెగ్జిట్ ఓటింగ్ వాయిదా
లండన్: బ్రెగ్జిట్‌పై పార్లమెంట్లో మంగళవా రం చేపట్టే ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెలిపారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశా లపై ఎంపీల్లో విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పార్లమెం ట్లో ప్రకటించారు. బ్రెగ్జిట్ తర్వాత కూడా ఈయూ కస్టమ్స్ యూనియన్లోనే బ్రిటన్ కొనసాగనుండడంపై ఎంపీల్లో ఆందోళన వ్యక్త మవుతోందని ఆమె తెలిపారు. ఈ పరిస్థి తుల్లో ఒప్పందంపై ఓటింగ్ పెడితే భారీ తేడాతో ఓడిపోయే ప్రమాదముందని మే అంగీకరిం చారు. సభ్యుల అభ్యంతరాలపై వచ్చే వారం జరగనున్న ఈయూ నేతల భేటీలో చర్చించి, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా హామీ పొందేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ ఓకే
లండన్/బ్రస్సెల్స్: బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆదివారం ఈయూ నేతలు ఆమోదించారు. బ్రిటన్ మినహా ఈయూలో మిగిలిన మొత్తం 27 దేశాలూ ఈ ఒప్పందానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇక డిసెంబర్లో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అయితే ఇది అంత సులభమైన విషయంలా కనిపించడం లేదు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్‌కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదం అనంతరం ఈ ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా 2019 మార్చి 29కి ముందే పూర్తయ్యి, అప్పటి నుంచి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ మొత్తానికి 21 నెలలు పడుతుంది. ఒకవేళ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించకపోతే పరిస్థితి దిగజారి, అసలు ఒప్పందమే లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాల్సి రావచ్చు, లేదా కొత్త ఒప్పందం కోసం మళ్లీ చర్చలు జరగొచ్చు. మే ప్రభుత్వం కూలిపోయి బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది. -
నన్ను తొలగిస్తే ‘బ్రెగ్జిట్’ సంక్లిష్టం: థెరిసా
లండన్: తనని పదవి నుంచి తొలగిస్తే యూరోపియన్ యూనియన్(ఈయూ)తో బ్రెగ్జిట్ చర్చలు క్లిష్టతరమవుతాయని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన పార్టీ ఎంపీలను హెచ్చరించారు. భవిష్యత్‌లో బ్రిటన్–ఈయూ సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ముసాయిదా విషయంలో ప్రధానితో అధికార కన్జర్వేటివ్ ఎంపీలు పలువురు విభేదించిన సంగతి తెలిసిందే. వచ్చే వారం రోజులు బ్రిటన్‌కు కీలకమని, ఈయూ నాయకులతో సమావేశమై మరిన్ని చర్చలు జరుపుతానని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 48 మంది సభ్యుల మద్దతును రెబెల్ ఎంపీలు కూడగట్టారా? అని ప్రశ్నించగా..ఇప్పటి వరకైతే లేదని బదులిచ్చారు. -
బ్రెగ్జిట్ సుడిగుండంలో థెరిసా మే
బ్రెగ్జిట్ పరిణామాలతో బ్రిటిష్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్) సంబంధించిన విధివిధానాలపై ప్రధానమంత్రి థెరిసా మే ప్రవేశపెట్టిన ఒప్పంద ముసాయిదాకు కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ, సొంత పార్టీలో (కన్సర్వేటివ్) తిరుగుబాటు తలెత్తింది. పలువురు కేబినెట్ సహచరులు ఇప్పటికే రాజీనామా చేశా రు. ప్రతిపక్ష లేబర్ పార్టీ, మిత్రపక్షమైన డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ దీన్ని తీవ్రంగా విభేదిస్తున్నాయి. చీలిపోయిన పార్టీ దేశానికి దిశానిర్దేశకత్వం చేయలేదని బ్రిటిష్ మీడియా విశ్లేషిస్తోంది. క్రిస్మస్‌లోగా థెరిసా పదవి నుంచి తప్పుకోవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. బ్రెగ్జిట్ సాధ్యమా? నవంబరు 25న జరిగే ఈయూ ప్రత్యేక సమావేశంలో ఈ ఒప్పందంపై యూనియన్ నాయకులు సంతకాలు చేసే అవకాశముంది. దాని కంటే ముందు, ఈయూలోని 27 దేశాల్లో 65 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే 20 దేశాలు దీనిపై ఆమోదముద్ర వేయాలి. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇవన్నీ డిసెంబరులోగా పూర్తి కావాల్సి వుంది. డిసెంబరులో బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సివుంది. నేడు అవిశ్వాసం..? నిబంధనల ప్రకారం – పార్లమెంట్లో 15శాతం మంది (48మంది ఎంపీలు) అవిశ్వాస లేఖలు సమర్పిస్తే ప్రధాని సాధ్యమైనంత త్వరగా సభ విశ్వాసం పొంది తీరాలి. ఇప్పటికి 21 మంది ఎంపీలు అవిశ్వాస లేఖలు సమర్పించినట్టు ప్రకటించారు. అయితే, ఈ సంఖ్య 48కి చేరిందని కొందరు కన్జర్వేటివ్ బ్రెగ్జిటీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం థెరిసా విశ్వాస పరీక్ష ముప్పును ఎదుర్కొంటున్నారు. ► నెట్సెన్ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – తాజాగా 59 శాతం మంది బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్నారు. (2016 జూన్ 23న జరిగిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం, వ్యతిరేకంగా 48.1 శాతం ఓట్లు వచ్చాయి). ► ఈయూలో ఉండటం వల్ల బ్రిటన్ నష్టపోతున్నదంటున్నారు బ్రెగ్జిటీర్లు.. రాజకీయ సంకోభాన్ని నివారించాలంటే మరో రెఫరెండానికి వెళ్లాల్సిందేనని, పార్లమెంట్ రెఫరెండానికే ఓటు వేస్తుందని కన్సర్వేటివ్ పార్టీ ‘పీపుల్స్ ఓట్’ క్యాంపెయినర్లు భావిస్తున్నారు. ► బ్రెగ్జిట్ ముసాయిదా ఉభయ పక్షాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందంటున్నారు ఈయూ మధ్యవర్తి మైఖేల్ బెర్నర్. దీనిపై మరోసారి చర్చలు జరిపేది లేదని జర్మనీ చాన్సరల్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ► ఈ ఒప్పందం బెస్ట్ డీల్.. ఒకవేళ బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్ వెనక్కి మళ్లినా అందుకు తాము సిద్ధమేనని అంటున్నారు ఈయూ అధ్యక్షుడు డొనాల్ట్ టస్క్. బ్రెగ్జిట్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ► 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ–యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్ అనుసరించాల్సివుంటుంది. ► ఆర్థిక లావాదేవీల పరిష్కారంలో భాగంగా విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్ 39 బిలియన్ పౌండ్లు (5100 కోట్లు) చెల్లించాలి. ► పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది. ► బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు. -
బ్రెగ్జిట్‌పై ముందుకే థెరెసా మే
లండన్: ప్రస్తుతం కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందంపై స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగేందుకే బ్రిటన్ ప్రధాని థెరెసా మే మొగ్గుచూపుతున్నారు. పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమేనన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రజల భయాలను పోగొట్టేందుకు వారడిగే ప్రశ్నలకు తానే జవాబుచెప్తానన్నారు. యురోపియన్ యూనియన్ (ఈయూ)తో థెరెసా కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం ముసాయిదా బుధవారం విడుదలైనప్పటి నుంచి మంత్రులు సహా కొందరు ఎంపీలు థెరెసాను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం బ్రిటన్ ప్రజలకు మంచిదేననీ, తన దృక్పథంలో ఇది అత్యుత్తమ ఒప్పందమన్నారు. -
బ్రిటన్ ప్రభుత్వంలో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ ఎంపీల నుంచే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ (యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం) వ్యవహారంలో మే వైఖరిని వ్యతిరేకిస్తూ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు థెరెసా మే ప్రభుత్వంపై గురువారం అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఈయూతో మే కుదుర్చుకుంటున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మంత్రివర్గంలోని నలుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఒప్పందం అర్ధరహితంగా, బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందని వారంతా ఆరోపిస్తున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభమై 20 నెలల్లో ముగిసేలా ఓ ఒప్పందాన్ని థెరెసా మే ఈయూ తో కుదుర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు బుధవారం రాత్రే విడుదలైంది. బిల్లులోని నిబంధనలపై తన నిరసన తెలుపుతూ మొదటగా భారత సంతతి వ్యక్తి, ఉత్తర ఐర్లాండ్ శాఖ మంత్రి శైలేశ్ వర తన పదవికి రాజీనామా చేశారు. థెరెసా మేపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టాలంటే మే ప్రత్యర్థులకు ఆమె సొంత పార్టీ నుంచే కనీసం 48 మంది ఎంపీల మద్దతు కావాలి. వారు ఎలాగోలా ఇంత మందిని కూడగట్టినా.. మేను పదవి నుంచి దించడానికి మాత్రం 158 మంది మద్దతు అవసరం. అంతమంది మే ప్రత్యర్థుల వైపు లేరని తెలుస్తోంది. -
చిందేసిన ప్రధాని.. నెటిజన్ల కుళ్లు జోకులు
బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రెగ్జిట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా దక్షిణాఫ్రికాతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పాఠశాల విద్యార్థులతో సమావేశమైన థెరిసా మే... వారితో కలిసి కాసేపు డాన్స్ చేశారు. విద్యార్థులను అనుకరిస్తూ స్టెప్పులు వేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకార శాఖ ట్విటర్లో పోస్ట్ చేసింది. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు... థెరిసా మే డాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. ‘థెరిసా మే డాన్స్ చూస్తుంటే.. ఆమెకు ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లుగా అన్పిస్తోందని’ ఒకరు కామెంట్ చేస్తే.... ‘థెరిసా మే డాన్స్ ఇంత ఘోరంగా ఉంటుందని తెలియదు. అస్సలు చూడలేకపోతున్నానంటూ’ మరొకరు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఓసారి మేబోట్ డాన్స్ చూడండి’ అంటూ థెరిసా మేపై జోకులు పేలుస్తున్నారు. Theresa May dances like she’s had her freedom of movement surgically removedpic.twitter.com/PaiSEtcRE9 — James Felton (@JimMFelton) August 28, 2018 I never knew that seeing Theresa May dance would be so uncomfortable to watch pic.twitter.com/TQmymi6W8q — Ali San (@TheSanPlanet) August 28, 2018 Watching Theresa May dance is one of the cringiest things I’ve ever seen in my life! 😬🤢🤮 pic.twitter.com/3bESRnXZPf — Alex (@AlexKyri_) August 29, 2018 -
ఈయూపై ట్రంప్ కేసు వేయమన్నారు
లండన్: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలకు బదులు దానిపై కేసు వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు సూచించారని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆదివారం వెల్లడించారు. నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ట్రంప్ శుక్రవారం మేతో భేటీ అవ్వడం తెలిసిందే. అంతకు రెండ్రోజుల ముందు కూడా.. మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాలను ట్రంప్ విమర్శించారు. శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ‘ఈయూతో ఎలా వ్యవహరించాలనే దానిపై నేను థెరెసాకు ఓ సలహా ఇచ్చాను. ఆమెకు అది బహుశా క్రూరమైనదిగా, చాలా క్లిష్టమైనదిగా అనిపించవచ్చు’ అని అన్నారు. ఆ సలహా ఏంటో చెప్పాలని ఓ విలేకరి ఆదివారం మేను కోరగా ‘నేను ఈయూతో చర్చలు జరపకుండా దానిపై కేసు వేయాలని ఆయన చెప్పా రు’ అని అన్నారు. అయితే తాను ఈయూతో చర్చలతోనే ముందుకెళ్తాననీ ఆమె చెప్పారు. -
మా బంధం అత్యంత ప్రత్యేకం
లండన్: అమెరికా–బ్రిటన్ల బంధం విడదీయరానిదనీ, చాలా ప్రత్యేకమైనదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాన్ని గతంలో విమర్శించిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. మే బ్రెగ్జిట్ విధానాలు.. అమెరికా, బ్రిటన్ల మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని ‘చంపేసేలా’ ఉన్నాయని ట్రంప్ మూడ్రోజుల క్రితం ‘ద సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ద సన్ ప్రతిక ప్రచురించిందంతా అబద్ధమని, అదో ‘ఫేక్ న్యూస్’ (నకిలీ వార్తలు) పత్రిక అని ట్రంప్ ఆరోపించారు. 4 రోజుల పర్యటన కోసం ట్రంప్ తొలిసారిగా బ్రిటన్ వచ్చారు. చర్చల తర్వాత ట్రంప్, థెరెసా మీడియాతో మాట్లాడారు. ‘బ్రెగ్జిట్ చాలా సంక్లిష్టమైంది. బ్రిటన్ ఏం చేసినా అమెరికాతో వ్యాపారం కొనసాగిస్తే చాలు’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు చోటు చేసుకున్నాయి. -
బ్రిటన్‌లో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరీసామే చిక్కుల్లో పడ్డారు. సోమవారం ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడంతో.. బ్రిటన్ రాజకీయం వేడెక్కింది. బ్రెగ్జిట్ విషయంలో మే అనుసరిస్తున్న వ్యూహాలతో విభేదిస్తూ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ రాజీనామా చేయగా.. కాసేపటికే విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో బ్రెగ్జిట్ అనంతరం యురోపియన్ యూనియన్ దేశాలతో అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాలు తీసుకున్న మూడ్రోజుల్లోపే ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీనికితోడు వీరిద్దరూ బ్రెగ్జిట్ విధానపర నిర్ణయాలనే కారణంగా చూపుతూ రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. థెరీసా మే రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. థెరీసా మే కేబినెట్లో బోరిస్‌కు బ్రెగ్జిట్ అనుకూల మంత్రుల పోస్టర్‌బాయ్‌గా పేరుంది. తిరుగుబాటు యోచన లేదు ప్రధాని థెరీసా మేతో విధానపరమైన అంశాల్లో విభేదాల కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ ప్రకటించారు. ఈయూతో బ్రిటన్ ప్రభుత్వ చర్చల ప్రక్రియలో తనను సంప్రదించడంలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ వెల్లడించారు. అయితే, మేకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తే ఆలోచన లేదని చెప్పారు. -
గాంధీ, నెహ్రూలూ ఈ జైళ్లలోనే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జైళ్ల పరిస్ధితులు దయనీయంగా ఉంటాయని బ్రిటన్ కోర్టులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వాదనను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. విజయ్ మాల్యా అప్పగింత కేసుకు సంబంధించి బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు ప్రధాని మోదీ దీటుగా బదులిచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ వంటి మా నేతలను బ్రిటిష్ వారు ఈ జైళ్లలోనే ఉంచారని థెరిసా మేతో మోదీ చెప్పారన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో లండన్‌లో ఇరువురు నేతల భేటీ సందర్భంగా మోదీ ఈ మేరకు స్పష్టం చేశారన్నారు. భారత్‌లో జైళ్ల దుస్థితిపై బ్రిటన్ కోర్టులో మాల్యా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రుణాల ఎగవేత కేసులో ఎస్బీఐ కన్సార్షియం దాఖలు చేసిన కేసులో బ్యాంకులు విజయం సాధించాయని, రుణ రికవరీ చేపట్టవచ్చని చెప్పారు. రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడైన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. -
‘మాల్యా వ్యవహారం ప్రస్తావించిన మోదీ’
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీల ఉదంతాన్ని ప్రస్తావించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. న్యాయపరమైన అంశాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారని ఆ వర్గాలు తెలిపాయి. యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బుధవారం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో థెరెసా మే అధికారిక నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాల్యా, లలిత్ మోదీలను భారత్‌కు అప్పగించడంలో సహకరించాలని మోదీ బ్రిటన్ ప్రధానిని కోరినట్టు తెలిసింది. కాగా భారత్, బ్రిటన్ ప్రజలకు లబ్ధి చేకూరేలా భారత్, బ్రిటన్లు పనిచేస్తాయని భేటీ అనంతరం థెరిసా మే వ్యాఖ్యానించారు. నేటి భేటీతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నూతనోత్తేజం నెలకొందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక విజయ్ మాల్యా, లలిత్ మోదీల అప్పగింతపై ఇరువురు నేతల మధ్య ప్రస్తావన చోటుచేసుకుందని అధికారులు నిర్ధారించకున్నా న్యాయపరమైన అంశాల్లో సహకారానికి అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు. -
రష్యన్ల అనూహ్య మరణాలు.. పుతిన్ బాధ్యుడా?
హైదరాబాద్ : రష్యా మాజీ గూఢచారి సెర్జీ స్క్రీపాల్ హత్యకు రసాయన ఆయుధంతో చేసిన ప్రయత్నానికి నిరసనగా అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల్లో గూఢచారులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై 100మందికి పైగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించారు. ఈ నెల 4న దక్షిణ ఇంగ్లండ్‌లోని శాలిస్బరీలో స్క్రీపాల్(66), ఆయన కూతురు యూలియా(33)ను ‘నోవిచోక్’ అనే విషపదార్థంతో చంపడానికి రష్యన్లు ప్రయత్నించగా వారిద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నరాలపై పని చేసే కొన్ని విష పదార్థాల్లో ఒకటైన నోవిచోక్ వంటి రసాయనాలను రష్యా తన శత్రువులను, అసమ్మతి వాదులను తుద ముట్టించడానికి వినియోస్తోందని చాలాకాలంగా పాశ్చాత్య ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. సైనిక గూఢచర్యం నుంచి శత్రు శిబిరంలో చేరిన స్క్రీపాల్ రష్యా సైనిక గూఢచర్య సంస్థ జీఆర్‌యూలో ఉన్నతాధిగారిగా చేరిన స్క్రీపాల్ తన విధుల్లో భాగంగా ఐరోపా దేశాలైన మాల్టా, స్పెయిన్లలో పని చేశారు. అనారోగ్యం కారణంగా 1996లో అక్కడి నుంచి మాస్కోలోని జీఆర్యూ ఆఫీసులో చేరారు. 1999లో ఆరోగ్యం క్షీణించిందనే సాకుతో జీఆర్యూ నుంచి రిటైరయ్యారు. అయితే, 1995 నుంచి స్క్రీపాల్ బ్రిటిష్ గూఢచార సంస్థ ఎస్ఐఎస్(ఎం16)తో సంబంధాలు పెట్టుకుని ఐరోపా దేశాల్లో పనిచేస్తున్న 300 మందికి పైగా రష్యన్ గూఢచారుల వివరాలను ఈ సంస్థకు వెల్లడించారని రష్యా సర్కారు ఆరోపించింది. 2004 డిసెంబర్లో అప్పుడే బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన ఆయనను మాస్కోలోని ఆయన ఇంటి ముందే రష్యా అధికారులు అరెస్ట్ చేశారు. దేశ ద్రోహ నేరంపై ఆయన్ను సైనిక కోర్టులో విచారించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా, 2006 నవంబర్‌లో ఈ శిక్షను సైనిక సుప్రీంకోర్టు ఖరారు చేసింది. అమెరికాలో అరెస్ట్ అయిన పది మంది రష్యన్ గూఢచారుల విడుదలకు బదులుగా మరో ముగ్గురు రష్యన్లతో పాటు స్క్రీపాల్ను 2010 జులై 9న విడుదల చేశారు. అప్పటి రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన ఆయన బ్రిటన్ చేరుకుని 2011లో శాలిస్బరీలో ఇల్లు కొనుగోలు చేసి స్థిరపడ్డారు. ఇటీవల మాస్కో నుంచి వచ్చిన కూతురు యూలియాతో కలిసి శాలిస్బరీ షాపింగ్ మాల్ సమీపంలోని ప్రదేశంలో బెంచీపై కూర్చుని ఉండగా హఠాత్తుగా వారు కుప్పకూలిపోయారు. విష ప్రయోగంతో మృతి చెందిన లిత్వినెంకో రష్యా గూఢచార సంస్థ ఎఫ్ఎస్బీ మాజీ అధికారి అలెగ్జాండర్ లిత్వినెంకో 2006 నవంబర్‌లో విష ప్రయోగం వల్ల మరణించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పుతిన్ ఆదేశాలతో దేశ బహిష్కరణకు గురైన రష్యన్ మాజీ బ్యాంకర్ జర్మన్ గోర్బున్త్సోవ్ 2012లో తూర్పు లండన్‌లో క్యాబ్‌లో వెళుతుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. గోర్బున్త్సోవ్ ఈ ఘటనలో బతికి బయటపడ్డారు. 2012 నవంబర్‌లో లండన్‌లో తాను నివసించే గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్‌లో రష్యన్ వ్యాపారి అలెగ్జాండర్ పెరెపిల్చినీ కుప్పకూలి మరణించారు. ఓ అమెరికన్ వ్యాపారి నియంత్రణలోని హెర్మిటేజ్ అనే ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను రష్యా అధికారులు ఎలా మోసగించారో స్విస్ అధికారులకు పెరెపిల్చినీ సమాచారం అందించారు. ఆయన తిన్న ఓ రష్యా వంటకంలో జెల్సెమియం అనే విషపూరిత పువ్వు నుంచి తీసిన అవశేషాలు ఉన్నాయని శవ పరీక్షలో తేలింది. పుతిన్ మాజీ గురువుగా పరిగణించే బిలియనీర్ బోరిస్ బెరెజోవ్స్కీ కూడా దేశ బహిష్కరణ తర్వాత లండన్‌లో స్థిరపడి పుతిన్‌పై పదేళ్లకు పైగా మీడియా ద్వారా పోరాటం జరిపారు. 2013 మార్చిలో ఆయన తన లండన్ అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు కనుగొన్నారు. ఆయనది హత్యేనని శవపరీక్షలో తేలింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
బేతాళ ప్రశ్నగా మారిన బ్రెగ్జిట్!
ఐరోపా దేశాల సంఘం(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాల్సిన గడువు సమీపిస్తున్నా రెండింటి మధ్య తెగతెంపుల ఒప్పందం కుదిదే అవకాశాలు కనిపించడం లేదు. బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చాక ఇంగ్లండ్‌లో అంతర్భాగమైన ఉత్తర ఐర్లండ్ ఐరోపా సింగల్ మార్కెట్లో కొనసాగేలా ఒప్పంద పత్రం ముసాయిదాను ఈయూ రూపొందిస్తోందనే సమాచారంపై తాజాగా వివాదం తలెత్తింది. ఐరోపా కస్టమ్స్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే విషయం సహా ఇంకా అనేక అంశాలపై తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి బ్రెగ్జిట్ ఒడంబడిక కుదరకపోవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 28 ఐరోపా దేశాల రాజకీయ, ఆర్థిక ఐక్యతకు స్థాపించిన ఈయూ నుంచి 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు ఇంగ్లండ్ నిష్క్రమించాలని దాదాపు రెండేళ్ల క్రితమే నిర్ణయించారు. ఉత్తర ఐర్లండ్ ఈయూలో కొనసాగేలా చేసే ఒప్పందంపై సంతకం పెట్టేది లేదనీ, బ్రిటన్ ‘రాజ్యాంగ సమగ్రత’పై రాజీపడబోనని ఇంగ్లండ్ ప్రధాని థెరిసా మే హెచ్చరించారు. ఐరోపా సంఘం నుంచి వైదొలిగినా బ్రిటన్ను ఐరోపా కస్టమ్స్ యూనియన్‌లో కొనసాగేలా ఒత్తిడి చేయడానికే ఉత్తర ఐర్లండ్ సమస్యను ఈయూ నేతలు ముందుకు తెచ్చారని కొందరు అనుమానిస్తున్నారు. ఐర్లండ్ సరిహద్దు వాణిజ్యంపై ఏర్పడుతున్న చిక్కుముడి వల్ల ఈయూతో ఒప్పందం కుదరకపోవచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన జనం ఆలోచన మారుతోందా? 2016 బ్రెగ్జిట్ జనాభిప్రాయసేకరణలో ఈయూ నుంచి బయటపడాలంటూ ఓటేసిన ప్రజల్లో చాలా మంది తమ అభిప్రాయం మార్చుకున్నారని గత ఆరు నెలలుగా చేసిన సర్వేలు చెబుతున్నాయి. బ్రెగ్జిట్‌పై రెండోసారి రెఫరెండం జరపాలని 47 శాతం పౌరులు కోరుతున్నారని ఇటీవల గార్డియన్ పత్రిక జరిపిన సర్వే వెల్లడించింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత బ్రసెల్స్ కేంద్రంగా పనిచేసే ఈయూ, ఇంగ్లండ్ ప్రధాని మే కుదుర్చుకునే ఒప్పందం బ్రిటన్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్ తుది ఒప్పందంపై కామన్స్సభలో స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఎంపీలకు ఇవ్వాలని పాలకపక్షం కన్సర్వేటివ్ పార్టీ మాజీ ప్రధాని జాన్ మేజర్ సహా పలువురు కోరుతున్నారు. ఈయూ నుంచి వైదొలగే విషయమై రెండో రెఫరెండం జరపడానికి, బ్రెగ్జిట్‌ను పూర్తిగా తిరస్కరించడానికి కూడా దిగువసభకు అవకాశమివ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. తుది వాణిజ్య ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బయటికొస్తే ఇంగ్లండ్ జీడీపీ 8 శాతం తగ్గే ప్రమాదముందని బ్రెగ్జిట్‌పై బ్రిటిష్ సర్కారు అంచనా వేస్తోంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా అత్యధిక మద్దతు పలికిన ఈశాన్య, మిడ్లాండ్స్ వంటి ప్రాంతాలు అంతకు రెండు రెట్లు నష్టపోతాయని కూడా లీకైన ప్రభుత్వ నివేదిక చెబుతోంది. బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే కొత్త పార్టీ ‘రిన్యూ’ ఈయూ నుంచి వైదొలగకుండా బ్రిటన్ను ఆపడానికి ‘రిన్యూ’ అనే కొత్త పార్టీ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టి బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకాభిప్రాయం సాధించాలనే లక్ష్యంతో ‘లిసన్ టూ బ్రిటన్’ అనే ప్రచారోద్యమం ఆరంభించింది. ఇంగ్లండ్ ఈయూలోనే ఉండాలని వాదించే ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ అనే సంస్థకు అమెరికా బిలియనీర్ జార్జి సరోస్ ఐదు లక్షల పౌండ్ల విరాళం ఇచ్చారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రెగ్జిట్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేసేలా ఎంపీలపై ఈ సంస్థ ఒత్తిడితెస్తోంది. విస్తృత లాబీయింగ్ ద్వారా ఎంపీలకు నచ్చచెప్పి దేశంలో బ్రెగ్జిట్‌పై రెండో రిఫరెండం జరిపించడమే ఈ సంస్థ లక్ష్యం. సకాలంలో ఒప్పందం కుదరకపోతే... ఈయూ, బ్రిటన్ మధ్య ఒప్పందం అనుకున్న సమయానికి కుదరకపోతే బ్రిటన్ ఎక్కువ నష్టపోతుంది. ఇంగ్లండ్‌లో నివసిస్తున్న ఇతర ఈయూ దేశాల పౌరులు, ఈయూ దేశాల్లో స్థిరపడిన బ్రిటిష్ జాతీయుల నివాస హక్కులు గందరగోళంలో పడతాయి. ఈయూకు ఇంగ్లండ్ చెల్లుచీటీ ఇచ్చే విషయంపై లేదా ఈయూ సింగల్ మార్కెట్లో కొనసాడంపై ఒప్పందమేదీ కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారమే బ్రిటన్ ఇతర ఐరోపా దేశాలతో వ్యాపారం చేయాల్పివస్తుంది. ఇది ఆ దేశానికి నష్టదాయకంగా మారుతుంది. బ్రెగ్జిట్‌కు అధిక మద్దతు ఇచ్చిన ఇంగ్లండ్ రైతులు తమ ఉత్పత్తులను ఇతర ఈయూ దేశాలకు ఎగుమతి చేస్తే అదనంగా 30-40 శాతం సుంకాలు చెల్లించక తప్పదు. ఈయూ సభ్యత్వం ఉన్నందు వల్ల బ్రిటిష్ బ్యాంకులు, ఆర్థికసంస్థలు లండన్ నుంచి ఇతర సభ్య దేశాలతో అక్కడ ఎలాంటి అనుబంధ కంపెనీలు లేకుండా స్వేచ్ఛగా లావాదేవీలు సాగిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఒప్పందం లేకుంటే ఈ సంస్థలకు ప్రస్తుతమున్న పాస్పోర్టింగ్ హక్కులు కోల్పోతాయి. ఇంకా లండన్ నుంచి పనిచేసే అనేక ఐరోపా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సిబ్బందిని, కార్యకలాపాలను తగ్గించుకుంటే స్థానికులు వేల సంఖ్యలో నిరుద్యోగులవుతారు. ‘చంద్రుడిపై మానవుడు కాలు మోపడమంత’ కష్టమా? ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై జరిగే సంప్రదింపులు చంద్రునిపై మానవుడు కాలు మోపడమంత క్లిష్టంగా ఉందని బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ గతంలో వ్యాఖ్యానించారు. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఏడాది కాలమే ఉన్నా అవి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. కీలకమైన వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు బ్రెగ్జిట్‌కు అనుగుణంగా సర్దుకోవడానికి రెండేళ్లు అవసరమని ఆయన వాదిస్తున్నారు. దీనిపై అంగీకారం కుదిరాక వచ్చే రెండేళ్లలో బ్రిటన్ వాస్తవానికి ఈయూలో కొనసాగుతున్నట్టే పరిస్థితి ఉంటుందని అంచనా. అందుకే మార్చి నాటికి బ్రిటన్-ఈయూ మధ్య ఒప్పందం కుదిరితే మేలని ఆయన భావిస్తున్నారు. వచ్చే అక్టోబర్ నాటికి ఈ ఒప్పందం ముసాయిదా ఒక కొలిక్చి వస్తే, 2019 మార్చి 19 లోగా ఐరోపా పార్లమెంటులో దాన్ని మిగిలిన 27 దేశాలతో ఆమోదింపచేయవచ్చని బ్రిటన్ భావిస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
క్షమాపణలు చెప్పిన ట్రంప్
దావోస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. గత నవంబర్‌లో ముస్లిం వ్యతిరేక వీడియోలను ఓ బ్రిటన్ సంస్థ ట్వీట్ చేయగా.. దానిని ట్రంప్ రీట్వీట్ చేయటం తీవ్ర దుమారాన్ని లేపింది. దీనిపై దావోస్‌లో ఐటీవీ ‘గుడ్ మార్నింగ్ బ్రిటన్ కార్యక్రమం’ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సారీ చెప్పేశాడు. ‘‘గతంలో వారిని నేను భయంకరమైన త్యాంహాకార ప్రజలుగా అభివర్ణించారని(రీట్వీట్ గురించి) మీరు(వ్యాఖ్యాత పైర్స్ మోర్గాను ఉద్దేశించి) నన్ను అడొగచ్చు. కానీ, అలా చేసినందుకు క్షమాపణలు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాలన్నింటితో మైత్రి కొనసాగించాల్సిందే తన అభిమతమని.. అందుకు ఎవరూ వ్యతిరేకులు కాదని.. అయితే కవ్వింపు చర్యలు, ఉగ్రవాదం పెంచి పోషించే దేశాల విషయంలోనే తాను కఠినంగా వ్యవహరిస్తానని ట్రంప్ వివరించారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఆరోపణలు, పుకార్లు, వివాదాలపై ట్రంప్ సమాధానాలిచ్చారు. గురువారం ఈ ఇంటర్వ్యూ జరగ్గా... జనవరి 28న ఇది టెలికాస్ట్ కానుంది. అసలు విషయం... కాగా, బ్రిటిష్ మితవాద సంస్థ 'బ్రిటన్ ఫస్ట్' డిప్యూటీ లీడర్ జేదా ఫ్రాంన్సన్.. మూడు ముస్లిం వ్యతిరేక వీడియోలను ట్వీటర్లో పోస్ట్ చేశారు. వాటిని ట్రంప్ గత నవంబర్ లో రీట్వీట్ చేయగా.. అది పెద్ద ఎత్తున్న దుమారం రేపింది. దీనిపై స్పందించిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే ట్రంప్‌ను విమర్శించారు కూడా. నాలుగు కోట్ల మందికి ట్రంప్ తప్పుడు సంకేతాలు అందిస్తున్నాడని.. ఇది మంచి పని కాదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే వెంటనే ట్రంప్ దానికి కౌంటర్ కూడా ఇచ్చారు. ‘తనను విమర్శించడం మాని బ్రిటన్‌లో 'ఉగ్రవాదం'పై దృష్టి పెట్టాలని’ థెరెసాకు ట్రంప్ సూచించారు. ఆ తర్వాతి పరిణామాలతో అమెరికా-ఇంగ్లాండ్ మధ్య దూరం కాస్త పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యే లండన్‌లో పర్యటించాల్సిన డొనాల్డ్ ట్రంప్ ‘పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల సంకేతాలు అందటంతో’’ తన పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ఈ క్షమాపణలతో వివాదానికి ట్రంప్ ముగింపు పలకాలని భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదముద్ర
లండన్ : యూరపియన్ యూనియన్ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది. బ్రెగ్జిట్ బిల్లుపై దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రధాని థెరిసా మే వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు. ఈ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 324 మంది ఎంపీలు ఓటేయగా, వ్యతిరేకంగా 295 మంది ఓటేశారు. దిగవ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఇక ఎగువ సభలోనూ పాసవ్వాలి. యూరోపియన్ యూనియన్ చట్టాలన్నీ బ్రిటన్ చట్టాలుగా మారడానికి ఉద్దేశించిన 1972 చట్టం ప్రకారమే హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ)లో బ్రెగ్జిట్‌పై చర్చ జరగనుంది. ఇదిలావుండగా దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదమే అత్యంతక కీలక ఘట్టమని నిపుణులు చెబుతన్నారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని బ్రెగ్జిట్ సెక్రెటరీ డేవిడ్ డేవిస్ అన్నారు. బ్రిటన్ ప్రయోజనాలకే ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ సాఫీగా బయటకు రావడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని డేవిడ్ డేవిస్ చెప్సారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం ప్రధాని థెరిసా మే సాధించిన ఘనవిజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
టాప్ టీంలోకి నారాయణమూర్తి అల్లుడు
లండన్ : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు కీలక పదవి దక్కింది. బ్రిటన్ ప్రభుత్వంలోకి ఆయనను మంత్రిగా తీసుకున్నారు. సోమవారం బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే తన కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేపట్టారు. అందులో భాగంగా తన టాప్ కేబినెట్ టీంలోకి నారాయణ మూర్తి అల్లుడు, ఎంపీ అయిన రిషిని తీసుకున్నారు. ఆయనకు బ్రిటన్ హౌజింగ్, కమ్యునిటీస్, లోకల్ గవర్నమెంట్ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో తన విధులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి థెరిసామే కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువరించారు. 'బ్రిటన్ హౌజింగ్, కమ్యునిటీస్, లోకల్ గవర్నమెంట్ వ్యవహారాల మంత్రిగా ఎంపీ రిషి సునక్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కిందిస్థాయి మంత్రిత్వ హోదాలకు పెద్ద మొత్తంలో మహిళలను, మైనారిటీ నాయకులను ఎంపిక చేయడం జరిగింది. దేశ ప్రజలకు చేరువయ్యేలా మరిన్ని సేవలు అందించేందుకు థెరిసామే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. -
బ్రెగ్జిట్: మరో కీలక అడుగు
బ్రసల్స్: యురోపియన్ యూనియన్‌తో బ్రేకప్ చెప్పే ప్రక్రియలో బ్రిటన్ మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా జరిగిన బ్రెగ్జిట్ చర్చలు ఫలప్రదమైనట్లు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకర్ తెలిపారు. ఈ మేరకు చర్చల తొలి దశలో భాగంగా 15పేజీల ఒప్పందంపై జీన్ క్లాడ్, థెరెసా మే సంతకాలు చేశారు. యురోపియన్ యూనియన్ ఒప్పందాలకు బ్రిటన్ అంగీకరించడంతో బ్రెగ్జిట్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. గత వారం రోజులుగా బ్రిటన్ కన్జర్వేటివ్‌లు, యురోపియన్ కమిషన్ నేతల మధ్య చర్చలు జరిగాయి. అధికారికంగా ఆ తెగతెంపుల కోసం ప్రస్తుతం ఈయూతో బ్రిటన్ చర్చలు నిర్వహించింది. దాని కోసం ఈయూ కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులకు బ్రిటన్ తాజాగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్రిటన్ ప్రధాని థెరిసా మే... బ్రసల్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐర్లాండ్‌తో ఉన్న బోర్డర్ సమస్యపై కీలకమైన ఒప్పందం కుదరడం వల్ల బ్రెగ్జిట్ చీలిక మరో దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్‌తో బోర్డర్ సమస్య ఇక ఉండదని బ్రిటన్ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఈయూ పౌరులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.. తద్వారా 2019లో బ్రెక్సిట్‌కు వీలుగా వచ్చే ఏడాది ప్రారంభంలో మరోసారి చర్చలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందు(బ్రెక్సిట్)కు వీలుగా జరుగుతున్న వెల్లడికావడంతో యూరప్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. -
బ్రిటన్ ప్రధాని హత్య కుట్ర భగ్నం
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ గేట్లను పేల్చేసి ఆ గందరగోళంలో లోపలికి చొరబడి థెరిసా మేను కత్తితో పొడిచి హత్య చేయడానికి ఇస్లాం ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారని బ్రిటన్ కౌంటర్ టెర్రరిజం అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలపై నైముర్ జకారియా రహ్మాన్(20), మహమ్మద్ ఆకిబ్ ఇమ్రాన్(21) అనే ఇద్దరు యువకులను నవంబర్ 28నే అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచిన ఈ ఇద్దరిపై ఉగ్రవాద అభియోగాలు మోపారు. డిసెంబర్ 20న లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో హాజరుపరిచేందుకు వీలుగా వారిని పోలీసు రిమాండ్‌కు పంపారు. -
ప్రధానమంత్రిని చంపాలని చూశారు!
లండన్: బ్రిటన్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మేను చంపేందుకు ఇద్దరు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ప్రధాని నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ గేట్లు పేల్చేసి.. ఆ సందర్భంగా తలెత్తిన గందరగోళం నడుమ ప్రధాని మేను హతమార్చాలని భావించారు. ఈ మేరకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలు అరెస్టుచేసినట్టు స్కై న్యూస్ తెలిపింది. ఉత్తర లండన్‌కు చెందిన నాయిముర్ జకారియా రహ్మన్ (20)ను, వాయవ్య బర్మింగ్‌హామ్‌కు చెందిన మహమ్మద్ అకిబ్ ఇమ్రాన్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని బుధవారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ‘డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఇంప్రూవ్డ్ పేలుడు పదార్థాలు (ఐఈడీ) పేల్చి.. గందరగోళం రేపి.. ఆ క్రమంలో థెరిసా మేను చంపాలని వీరు కుట్రపన్నారు’ అని స్కై న్యూస్ ఒక కథనంలో తెలిపింది. -
థెరిస్సాకు గట్టి షాక్ ఇచ్చిన ట్రంప్..
వాషింగ్టన్: బ్రిటన్ అమెరికాకు అత్యంత మిత్రదేశం.. కానీ ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మేను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. తాజాగా ఆయన థెరిస్సా మేను ఘాటుగా మందలించారు. ఆమె తనను విమర్శించడం మాని.. బ్రిటన్ కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇద్దరు హైప్రొఫైల్ అధ్యక్షులు ఇలా పబ్లిగ్గా రచ్చకెక్కడంతో ఇరుదేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ‘థెరిస్సా మే నా మీద ఫోకస్ చేయకు. బ్రిటన్‌లో చోటుచేసుకుంటున్న వినాశకర రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై దృష్టి పెట్టు. మేం బాగానే ఉన్నాం’ అని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. ఇంతకుముందు మే ట్విట్టర్ హ్యాండిల్‌ను తప్పుగా ట్యాగ్ చేసి ఇదే ట్వీట్‌ను ట్రంప్ పెట్టారు. మళ్లీ దానిని సరిచేసి.. మేను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన తీవ్ర అతివాద గ్రూప్ ‘బ్రిటన్ ఫస్ట్’ ట్విట్టర్లో పోస్టుచేసిన ముస్లిం వ్యతిరేక వీడియోను ట్రంప్ రీట్వీట్ చేయడం.. ఇటు బ్రిటన్‌లో, అటు అమెరికాలో తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంలో ట్రంప్ తప్పుగా ప్రవర్తించారని, ఆయన విద్వేష ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని థెరిస్సా మే తీవ్రంగా తప్పుబట్టినట్టు ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా బ్రిటన్ రాజకీయాల్లో ట్రంప్ జోక్యం చేసుకోవడం.. లండన్ ముస్లిం మేయర్ సాదిక్ ఖాన్‌ను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడంతో యూకే-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో థెరిస్సాను తీవ్రంగా తప్పుబడుతూ తాజాగా ట్రంప్ ట్వీట్ చేయడం దౌత్య ఉద్రిక్తతలు రేపుతోంది. -
బ్రిటన్ ప్రధాని థెరెసాపై సొంతపార్టీలోనే అవిశ్వాసం
లండన్: బ్రిటన్‌లో విపక్షాల నుంచి ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ప్రధాన మంత్రి థెరెసా మేకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సొంత పార్టీ ఎంపీలే సిద్ధమవుతున్నారు. థెరెసా మేపై అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఇవ్వాల్సిన లేఖపై సంతకం పెట్టేందుకు ఇప్పటికే 40 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 48 మంది ఎంపీలు సంతకం పెడితే ఆమెపై అవిశ్వాస తీర్మానం ఇవ్వొచ్చు. ఇటీవలే వివిధ ఆరోపణలపై థెరెసా మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం తెలిసిందే. అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిగా ఉన్న ప్రీతీ పటేల్... ఇజ్రాయెల్ అధికారులతో అనధికారికంగా భేటీ అయ్యి, గతవారం రాజీనామా చేశారు. అంతకు కొన్నిరోజుల ముందే మరో మంత్రి మైకేల్ ఫాల్లొన్ చెడు ప్రవర్తన కారణంగా వైదొలిగారు. తాజాగా మరో ఇద్దరు మంత్రుల రాజీనామాకు కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
భారత సంతతి మంత్రి ప్రీతి రాజీనామా
లండన్ : భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి, బ్రెగ్జిట్ కోసం పోరాటం చేసిన ప్రీతి పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. థెరిసా మే కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయంటూ కథనాలు ప్రచారం అవుతున్న క్రమంలోనే ప్రీతి పటేల్ రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయం బహిర్గతం చేసింది. ప్రధాని థేరిసా మేకుగానీ, విదేశాంగశాఖ కార్యాలయానికిగానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత ఆగస్టులో మంత్రి ప్రీతి పటేల్ ఇజ్రాయెల్‌లో పర్యటించడమే ఆమె ఉద్వాసనకు దారితీసింది. అయితే వారం రోజుల్లో థెరిసా ప్రభుత్వంలో ఇది రెండో రాజీనామా కావడం గమనార్హం. ఆఫ్రికా దేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లిన మంత్రి ప్రీతి పటేల్ ప్రధాని థెరిసా మే సూచన మేరకు మధ్యలోనే బ్రిటన్‌కు వచ్చేశారు. రాజీనామా చేయాలన్న ఆదేశాల మేరకు ప్రీతి తన మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. రాజీనామాపై ప్రీతి స్పందిస్తూ.. ‘ మంత్రిగా నాపై కొన్ని బాధ్యతలున్నాయి. నేను ఏం చేసినా పారదర్శకతతో వ్యవహరించాను. ప్రధాని థెరిసా మేకు, ప్రభుత్వానికి క్షమాపణ చెబుతున్నాను. ఇజ్రాయెల్ అధికారులతో తాను ఎలాంటి రహస్య మంతనాలు జరపలేదని’ లేఖలో పేర్కొన్నారు. థెరిసా మే ఏమన్నారంటే.. పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి. ప్రీతి పటేల్ రాజీనామా నిర్ణయం తీసుకుని మంచి పని చేసింది. పారదర్శకత, ప్రభుత్వంపై నమ్మకం ప్రజల్లో పెరగాలంటే రహస్య పర్యటనలు చేయకపోవడమే అందరికీ మంచిది. దౌత్యపరమైన అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన ప్రీతి ఇజ్రాయెల్ పర్యటన వివరాలపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని థెరిసా మే అన్నారు. ‘ప్రధాని థెరిసా మే కంటే రాజీనామా చేసిన ప్రీతి పటేల్‌పైనే ప్రజలకు విశ్వాసం ఎక్కువ. ప్రీతికి ఉన్న పరిచయాలు, విదేశాలలో ఆమె ప్రాబల్యం ఎక్కువ. అయితే ప్రీతి స్థానంలో ఎవరికీ బాధ్యతలు అప్పగిస్తారో తెలియడం లేదు. ప్రీతి పటేల్ లాంటి బలమైన నాయకురాలి రాజీనామా థెరిసా మే కేబినెట్‌కు భారీ లోటు అని’ అధికారిక కన్జర్వేటీవ్ పార్టీ ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. -
లైంగిక వేధింపులు.. ఒప్పుకుని మరీ రాజీనామా
లండన్ : ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపుల పర్వాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలబ్రిటీలు మీడియా ముందుకు వస్తుండటంతో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో యునైటెడ్ కింగ్డమ్(బ్రిటీష్) రక్షణ కార్యదర్శి మైకేల్ ఫాల్లొన్ పేరు కూడా వినిపించటంతో... ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. అయితే గతంలో తాను మహిళలను వేధించిన మాట వాస్తవమేనని ఆయన తప్పు అంగీకరించటం విశేషం. బుధవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి థెరిసా మే కు పంపించారు. ప్రస్తుత ఆరోపణలను ఖండించిన ఆయన.. గతంలో మాత్రం తాను కొన్ని తప్పులు చేశానంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎంపీగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు ప్రకటించారు. కాగా, ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కుని ఉన్నత పదవికి రాజీనామా చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా మైకేల్ ఫాల్లొన్ నిలిచారు. ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రధాని థెరిసా మే ప్రశంసించారు. విచారణలో నిజాలు బయటపడతాయని ప్రధాని పేర్కొన్నారు. కాగా, 2002 లో జులియా హర్ట్లే-బ్రూవర్ అనే మహిళా జర్నలిస్ట్ తొడల మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఫాల్లొన్పై వినిపించాయి. ఈ ఘటనపై గత వారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫాల్లొన్ క్షమాపణలు తెలియజేశారు. అయితే ఈ మధ్య ఆయనపై మళ్లీ లైంగిక ఆరోపణలు వినిపించటం మొదలైంది. ఈ క్రమంలో వాటిని ఖండించిన ఆయన గతంలో మాత్రం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించానని ఆయన చెప్పారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పటంపై జులియా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతని రాజీనామాను ఓ మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. రాజీనామా వెనుక అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె, మరిన్ని ఘటనలు బయటపడే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఆయన ఖాతాలో ఇలాంటి ఘటనలు బోలెడు ఉన్నాయని స్నేహితులే చెబుతుండటం గమనించదగ్గ విషయం. Here is Sir Michael Fallon's resignation letter pic.twitter.com/RyRvAYT23f — Press Association (@PA) 1 November 2017 -
ఆమె ఒంటరైపోయారు..! వైరల్ ఫొటో
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఒంటరిగా కూర్చున్న ఫొటో ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన 'బ్రెగ్జిట్ చర్చల్లో' భాగంగా ఆమె ఓ చాంబర్లో ఒంటరిగా కూర్చుని.. ఇతరుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోను ఉపమానంగా వాడుకొని థెరిసా మేపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకొని ఒంటరైపోతున్న వైనానికి ఈ ఫొటో నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. బ్రెగ్జిట్ చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్చల్లో భాగంగా ఆమె యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌తో చర్చల కోసం గదిలో ఒంటరిగా ఎదురుచూస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది కావడంతో ఈ విషయమై నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మధ్యంతర పార్లమెంటు ఎన్నికలకు వెళ్లి చేజేతులా పార్టీ మెజారిటీ కోల్పోయిన థెరిసా..ఇటు సొంత కన్జర్వెటీవ్ పార్టీలో, అటూ బ్రెగ్జిట్ చర్చల్లోనూ ఒంటరి అయిపోయారు. ఈయూలోని 27 దేశాలు ఒకవైపు మోహరించగా.. బ్రిటన్ మరోపక్షంగా ఆమె బ్రెగ్జిట్ చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీరుపై సెటైర్లు, ఘాటు వ్యాఖ్యలతో ఈ ఫొటోను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. 'పూర్ థెరిసా మే' అని కామెంట్లు చేస్తున్నారు. -
భారతీయులకు కృతజ్ఞతలు!
-
భారతీయులకు కృతజ్ఞతలు!
లండన్: బ్రిటిష్ సమాజానికి నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు భారతీయులకు బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే కృతజ్ఞతలు తెలిపారు. యునైటెడ్ కింగ్డమ్ గొప్ప దేశంగా మన్ననలు అందుకోవడంలో భారతీయులు ఉజ్వలమైన ఉదాహరణ అని ఆమె కొనియాడారు. దీపావళి సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక సందేశాన్ని అందించారు. చెడుపై మంచి, నిరాశపై ఆశ, చీకటిపై వెలుగు విజయం సాధిస్తుందన్న దివ్వెల పండుగ సందేశం.. అన్ని విశ్వాసాల ప్రజల్లో ప్రతిఫలిస్తుందని ఆమె పేర్కొన్నారు. 'ప్రధానమంత్రిగా ఈ సందర్భంలో మొత్తం దేశం తరుఫున మీకు థాంక్స్ చెప్తున్నా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతి జీవనరంగంలోనూ మీరు విశేషమైన సేవలు అందించారు' అని డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన పత్రికాప్రకటనలో ఆమె పేర్కొన్నారు. బ్రిగ్జిట్ చర్చల కోసం థెరిసా మే ప్రస్తుతం బ్రసెల్స్‌లో ఉండటంతో భారత సంతతి తొలి బ్రిటన్ కేబినెట్ మినిస్టర్ ప్రీతి పటేల్ ఆధ్వర్యంలో 0 డౌనింగ్ స్ట్రీట్‌లో గతవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పాల్గొనలేదు. -
బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
లండన్: బ్రెగ్జిట్ (యూరప్ కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం)కు సంబంధించిన ఓ బిల్లుకు బ్రిటిష్ పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరెసా మే ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లైంది. ఈ బిల్లుకు అనుకూలంగా 326 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 290 ఓట్లు పడ్డాయి. బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని థెరెసా మే అన్నారు. తదుపరి దశలో ఈ బిల్లును ఎంపీలు క్షుణ్నంగా పరిశీలిస్తారు. 1972 నాటి యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టాన్ని ఈ బిల్లు ద్వారా రద్దు చేయనున్నారు. అలాగే ఈయూ చట్టాలను ఈ బిల్లు యూకే (యునైటెడ్ కింగ్డమ్) చట్టాలుగా మారుస్తుంది. -
మాల్యా, లలిత్‌లను అప్పగించండి
►బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ ► జీ–20 సదస్సులో భాగంగా థెరిసా మేతో ప్రత్యేక భేటీ ► మలబార్ విన్యాసాలపై జపాన్ ప్రధానితో సమీక్ష ► పలు దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు హాంబర్గ్: భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న వారిని తిరిగి భారత్‌కు రప్పించటంలో సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. జీ–20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో భేటీ సందర్భంగా మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలను భారత్ రప్పించటంలో సహకరించాలని కోరారు. భారత బ్యాంకుల్లో రూ.9వేలకోట్ల రుణాలు తీసుకుని గతేడాది మార్చిలో మాల్యా లండన్ పారిపోయారు. తనపై జారీ అయిన అరెస్టు వారెంటులనుంచీ తప్పించుకుంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీనీ అప్పగించాలని థెరిసా మేను మోదీ కోరారు. ఉగ్రవాదంతోపాటుగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. జీ–20 సదస్సులో భాగంగా పలుదేశాల అధినేతలతో ప్రత్యేకంగా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ‘మలబార్’పై సమీక్ష: భారత్–జపాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న మలబార్ సైనిక విన్యాసాలపై ఇరుదేశాల ప్రధానులు మోదీ, షింజో అబేలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలపైనా వీరిమధ్య చర్చ జరిగింది. జపాన్ సాయం చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు భారత జాతీయ పెట్టుబడులు, మౌలికవసతుల నిధిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని నార్వేను మోదీ కోరారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్తో జరిగిన భేటీలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఇన్, ఇటలీ ప్రధాని పాలో జెంటిలోనీ, అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిషి యోతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ ఫుక్, సెనెగల్ అధ్యక్షుడు మేకీ సాల్తోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ‘ఉగ్ర’ ప్రకటనకు భారీ స్పందన జీ–20 సదస్సులో ఉగ్రవాదంపై మోదీ చేసిన ప్రసంగంపై సభ్యదేశాల్లో సానుకూల స్పందన కనిపించిందని భారత్ వెల్లడించింది. జర్మన్ చాన్సెలర్ మెర్కెల్ సహా యూరోపియన్ నేతలు మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారని భారత్ తెలిపింది. ఉగ్రవాద సంస్థలతోపాటుగా ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సాయం చేస్తున్న వారిపైనా కఠినంగా వ్యవహరించే విషయంలో సంయుక్తంగా ముందుకెళ్లేందుకు మెజారిటీ దేశాలు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. జీ–20 సదస్సు పూర్తవటంతో ప్రధాని మోదీ భారత్ తిరుగుప్రయాణమయ్యారు. ‘మాటల్లో చెప్పలేనిది ఫొటో చెబుతుంది’ మోదీ, జిన్‌పింగ్ చర్చలపై భారత్ హాంబర్గ్: మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శుక్రవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరిపిన అనధికారిక చర్చల వివరాలను వెల్లడించడానికి భారత్ నిరాకరించింది. వారిద్దరూ విస్తృత అంశాలపై చర్చించారని, అంతకుమించి చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. మోదీ, జిన్‌పింగ్ నవ్వుతూ తీయించుకున్న ఫొటో.. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తత తొలగిందనడానికి నిదర్శనమా అని విలేకర్లు అడగ్గా.. ‘మేం చెప్పాల్సింది చెప్పాం. ఫొటో విషయానికి వస్తే.. వెయ్యిమాటల్లో చెప్పలేనిది ఒక ఫొటో చెబుతుంది అన్న నానుడి ఉండనే ఉంది’ అని బదులిచ్చారు. -
విశ్వాస పరీక్షలో మే గెలుపు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన తొలి విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో థెరిసాకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 309 ఓట్లు పడ్డాయి. మైనారిటీ ప్రభుత్వ అధినేతగా ఆమె ఎదుర్కొన్న తొలి పెద్ద పరీక్ష ఇదే. డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) మద్దతుతోనే ఆమె విజయం సాధ్యమైందని భావిస్తున్నారు. రాణి ప్రసంగంలో పొందుపర్చాల్సిన పార్లమెంటరీ ఎజెండాపై ఈ విశ్వాస పరీక్ష జరిగింది. -
ఓటమికి నాదే కారణం, నన్ను క్షమించండి!
లండన్: గతవారం జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవానికి బాధ్యురాలిని తానేనని బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే అంగీకరించారు. ఈ ఓటమికి బాధ్యత తనదేనని, ఇందుకు తనను క్షమించాలని ఆమె పార్టీ ఎంపీలను కోరారు. భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నాయకత్వంపై ఎంపీల విశ్వాసాన్ని కూడగట్టేందుకు ఆమె సోమవారం కన్జర్వేటివ్ ఎంపీలతో వెస్ట్ మినిస్టర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత గందరగోళానికి నేనే కారణం. నా వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చల నేపథ్యంలో అనూహ్యంగా ఎన్నికలకు వెళ్లిన థెరిసా మేకు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు కాగా, గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైంది. 10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ, అభిప్రాయాలు వెల్లువడలేదని ఎంపీలు తెలిపారు. మరోసారి ప్రధానిగా థెరిసా మేను కొనసాగించాలని పార్టీలోని ఎక్కువమంది ఎంపీలు కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమెను మార్చాలంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. థెరిసా మేను తొలగిస్తే.. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. థెరిసా మేను ప్రధానిగా కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించే అవకాశముందా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరముందని భావిస్తున్నారు. చదవండి:‘థెరిసా మే’ను తప్పిస్తారా? -
‘థెరిసా మే’ను తప్పిస్తారా?
భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 650 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు గెలవాలి. కానీ గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. 10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమె నాయకత్వ సామాజిక మాధ్యమాల ద్వారా ఈమేరకు ప్రచారం చేస్తున్నారు. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. బ్రిటన్‌లో అత్యంత ప్రభావంతమైన టాబ్లాయిడ్లలోనూ ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. కొందరు ఎంపీలతో మంతనాలు సాగిస్తూ లాబీయింగ్ సైతం చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద థెరిసా మే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియ సాఫీగా సాగి ఈయూతో ఒప్పందం కుదిరేదాకా... థెరిసా మేను కొనసాగించాలని కన్జర్వేటివ్ పార్టీలోని కొందరు పెద్దలు భావిస్తున్నారు. ఆరునెలలు సమయమిచ్చి... బ్రెగ్జిట్ కొలిక్కి వచ్చాక క్రిస్మస్ అనంతరం కొత్త నాయకుడిని ఎన్నుకోవడం మంచిదనేది వారి అభిప్రాయం. అవతలివైపు లేబర్ పార్టీ బలపడుతుండటం (గత ఎన్నికలతో పోలిస్తే గురువారం లేబర్ పార్టీ 29 స్థానాలు అధికంగా నెగ్గింది. ఆ పార్టీ బలం 261కి చేరింది) కూడా కన్జర్వేటివ్ పార్టీ సీనియర్లకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు థెరిసా మే నాయకత్వాన్ని సవాల్ చేసి... అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వాన్ని నడపలేక చివరకు లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రానివ్వకూడదనేది వీరి వాదన. నాయకులను అనూహ్యంగా సాగనంపుతుందనే పేరు కన్జర్వేటివ్ పార్టీకి ఉంది. కాబట్టి పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి. ప్రధాని పదవికి పోటీపడే వారిని ఎన్నుకోవడానికి మొదట కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రతి రౌండ్లో పోటీదారులందరిలోకి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని రేసు నుంచి తప్పిస్తారు. ఇలా చివరకు ఇద్దరు మిగిలేదాకా ఎంపీలు ఓటింగ్ చేస్తారు. ఈ ఇద్దరిలో ప్రధాని పదవి ఎవరు చేపట్టాలనే దాన్ని దాదాపు లక్షా యాభై వేల మంది పార్టీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. థెరిసా మేను తప్పించే పరిస్థితి వస్తే రేసులో ముందుండేదెవరు? వారి బలాబలాలేమిటో చూద్దాం. బోరిస్ జాన్సన్ 52 ఏళ్ల జాన్సన్ ‘బ్రెగ్జిట్’’కు అనుకూలంగా నిలబడి పూర్తి శక్తియుక్తులు ఒడ్డిన వాడు. ప్రస్తుతం విదేశాంగ మంత్రి. కన్జర్వేటివ్ ఎంపీల్లో జాన్సన్ నాయకత్వంపై అపనమ్మకం. పార్టీ సిద్ధాంతాలను కూడా కాదనే స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా పరిగణిస్తారు. కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారీ లండన్ మాజీ మేయర్. బ్రెగ్జిట్‌లో ఓడిపోయి డేవిడ్ కామెరూన్ రాజీనామా చేశాక... బోరిస్ జాన్సన్యే తదుపరి ప్రధాని అవుతాడని అత్యధికులు విశ్వసించారు. అయితే బ్రెగ్జిట్ సహచరుడు, తనకు గట్టి మద్దతుదారుగా ఉన్న మైకేల్ గోవ్ అనూహ్యంగా ప్రధాని రేసులోకి రావడంతో జాన్సన్ తాను పోటీ నుంచి తప్పుకున్నాడు. ప్రధానిగా థెరిసా మేను తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో... తాను ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు జాన్సన్ ట్వీట్ చేశారు. ఫిల్ హమండ్ కన్జర్వేటివ్ పార్టీలో బలమైన నాయకుడు. ఆర్థికమంత్రిగా ఉన్న ఈయన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తర్వాత మేకు వ్యతిరేకంగా గళమెత్తారు. డిప్యూటీ ప్రధానమంత్రిని నియమించాలని, థెరిసాకు సన్నిహితులైన ఇద్దరు మంత్రులను తప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు శనివారం రాజీనామా చేయడం పార్టీలో పెరుగుతున్న హమండ్ పలుకుబడికి నిదర్శనంగా భావిస్తున్నారు. బ్రెగ్జిట్‌ను పూర్తిచేసేందుకు కావాల్సిన అనుభవం ఈయనకు ఉందని నిపుణుల అభిప్రాయం. అయితే థెరిసా మేను ఎన్నికలకు వెళ్లమని ప్రోత్సహించిన వారిలో ఈయన ముఖ్యుడు. అంబర్ రూడ్ హోంశాఖను చూస్తున్న 53 ఏళ్ల అంబర్ రూడ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అంచనా. ఇటీవలి కాలంలో బ్రిటన్‌లో జరిగిన ఉగ్రదాడుల సందర్భంగా ఈమె తన పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. కామెరూన్ రాజీనామా చేశాక ప్రధాని రేసులో థెరిసా మే పేరు పెద్దగా వినపడలేదు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆమె ప్రధాని పదవి చేపట్టారు. నాడు థెరిసా మే ఉన్న స్థానంలో ఇప్పుడు అంబర్ రూడ్ ఉన్నారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అయితే గురువారం నాటి ఎన్నికల్లో ఆమె అతితక్కువ మెజారిటీ (346 ఓట్లు)తో బయటపడ్డారు. ఇది ఆమెకు ప్రతికూలంగా కావొచ్చు. అలాగే ప్రధాని పదవిని చేపట్టడానికి కావాల్సిన అనుభవం, అర్హత ఆమెకు లేవని కన్జర్వేటివ్ పార్టీలోని ఓ వర్గం వాదన. డేవిడ్ డేవిస్ 2005లో ప్రధాని పదవికి ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా కామెరూన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను చూస్తున్నారు. ప్రధాని పదవికి రేసులో ఉంటానని మద్దతుదారుల ద్వారా ఎంపీలకు సంకేతాలు పంపుతూ లాబీయింగ్ చేస్తున్నారు. -
థెరిసా సలహాదారుల రాజీనామా
లండన్: బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నిరాశజనక ఫలితానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని థెరిసా మే సన్నిహిత సలహాదారులైన నిక్ తిమోతి, ఫియోనా హిల్లు శనివారం రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌గా వీరు పనిచేస్తున్నారు. ముందుస్తు ఎన్నికలకు వెళ్తే కన్జర్వేటివ్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని థెరిసాను ఒప్పించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్‌గా కొనసాగాలంటే నిక్, ఫియోనాను తప్పించాల్సిందేనని సొంత పార్టీ సభ్యులు అల్టిమేటం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయని, ఎన్నికల ప్రచారంలో తన ప్రమేయానికి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నానని ఒక ప్రకటనలో నిక్ పేర్కొన్నారు. -
బ్రిటన్‌లో హంగ్ పార్లమెంట్
ప్రధాని థెరిసా మేకు షాక్.. ► డీయూపీ పార్టీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమన్న థెరిసా లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని థెరిసా మేకు ఊహించని షాక్ తగిలింది. బ్రెగ్జిట్ చర్చల కోసం పార్లమెంట్లో బలం పెంచుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారు. మూడేళ్ల ముందుగానే నిర్వహించిన ఎన్నికల్లో థెరిసా నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ మెజార్టీకి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా..8 స్థానాలు తక్కువగా కన్జర్వేటివ్ పార్టీ 318 చోట్ల గెలిచింది. లేబర్ పార్టీ 261, స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీకి 35, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ 12, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)10 స్థానాల్లో గెలుపొందాయి. పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లోని మొత్తం 650 సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. థెరిసా ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారని, ఆమె తక్షణం రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేయగా.. డీయూపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆమె పావులు కదుపుతున్నారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శుక్రవారం విజ్ఞప్తి చేశారు.బ్రెగ్జిట్ చర్చల్లో పట్టు పెంచుకునేందుకు మూడేళ్ల ముందుగానే ఏప్రిల్‌లో ఎన్నికలకు మే పిలుపునిచ్చారు. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ విజయం ఖాయమని ప్రకటించగా.. ఫలితాలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎంపీగా సిక్కు మహిళ రికార్డు బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిపై 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. లేబర్ పార్టీకే చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్మన్జీత్ సింగ్ దేశి కూడా స్లోగ్ సీటు నుంచి గెలిచారు. ఈ ఫలితాలతో బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీల సంఖ్య 12కి పెరిగింది. -
‘సంకీర్ణం’లోకి బ్రిటన్
పొదుపు చర్యలు, అస్థిరత, జాత్యహంకార ధోరణులు దేశాన్ని చుట్టుముట్టిన వేళ బ్రిటన్ పార్లమెంటుకు గురువారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పినట్టే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీ 218 స్థానాలకు పరిమితమై పది సీట్లు గెల్చుకున్న డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ(డీయూపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 326 స్థానా లుండాలి. డేవిడ్ కామెరాన్ నాయకత్వంలో రెండేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో కన్స ర్వేటివ్లు కనీస మెజారిటీ కంటే అదనంగా అయిదు స్థానాలను గెల్చుకున్నారని గుర్తుంచుకుంటే వారికున్న ప్రజాదరణ ఎలా దిగజారిందో అర్ధమవుతుంది. కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులు, కార్పొరేట్ మీడియా సంస్థలు ఖర్చు రాసేసిన లేబర్ పార్టీ ఎవరూ ఊహించనివిధంగా ఈ ఎన్నికల్లో 261 స్థానాలు కైవసం చేసుకుంది. 1997 తర్వాత ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు లభించడం ఇదే తొలిసారి. కన్సర్వేటివ్‌లకు ఎలాగోలా మళ్లీ అధికారానికి వచ్చి ఉండొచ్చుగానీ ఇది ఏ రకంగా చూసినా గెలుపు కాదు. వారి పాలనపై ప్రజలు ఏమాత్రం సంతృ ప్తికరంగా లేరని ఈ ఫలితాలు రుజువు చేశాయి. మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా మధ్యంతర ఎన్నికల నిర్ణయం వెల్లడించినప్పుడు కన్సర్వేటివ్ పార్టీ అధినేత, ప్రధాని థెరిస్సా మే చేసిన ప్రకటన ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి వెలుపలికొచ్చేందుకు జరిపే చర్చల్లో దృఢంగా వ్యవహరించడానికి తనకు ప్రజల నుంచి ‘నిర్ణయాత్మకమైన మద్దతు’ కావాలని ఆమె కోరారు. ఈయూలో కొనసాగాలా వద్దా అన్న అంశంపై నిరుడు జూన్‌లో నిర్వహించిన రిఫరెండంలో అత్యధికులు వెలుపలికి రావడానికే మద్దతు పలక డంతో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేశాక మే ఆ పదవిలోకి వచ్చారు. పార్టీలో ఆమెకు ఒడిదుడుకులున్నాయి. పైగా ప్రత్యర్థి లేబర్ పార్టీ అంతఃకలహాలతో సతమతమవుతోంది. ఈ అదునులోనే ఎన్నికలకు వెళ్తే తనకు తిరుగుండదని ఆమె విశ్వసించారు. వాస్తవానికి మూడు నెలలక్రితం ఆమె ప్రజాదరణ గ్రాఫ్ దివ్యంగా ఉంది. కన్సర్వేటివ్‌లకు కనీసం 30 నుంచి 70 స్థానాల ఆధిక్యత లభిస్తుందని దాదాపు సర్వేలన్నీ అంచనా వేశాయి. మూడు వారాలక్రితం కూడా ప్రత్యర్థి లేబర్ పార్టీ కన్నా 20 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ఆదరణ కొడిగట్టడం ప్రారంభమైంది. చివరికొచ్చేసరికి ఇరు పార్టీల మధ్యా ఉన్న తేడా సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. ఈయూ నుంచి బ్రిటన్ వెలుపలికి రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువుంది. ఆ ప్రక్రియంతా సజావుగా పూర్తికావడానికి అవసరమైన చర్చలు త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. అత్తెసరు మెజారిటీతో ఇదంతా సరిగా సాగక పోవచ్చునన్న భావనతోనే థెరిస్సా మే మధ్యంతర ఎన్నికల బాట పడితే... ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాధినేతగా బ్రెగ్జిట్ సంభాషణలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్రమేమంటే బ్రెగ్జిట్‌లో దృఢంగా ఉండటానికి అవసరమైన రాజ కీయ బలం కోసమే ఎన్నికలకు సిద్ధపడ్డానన్న థెరిస్సా మే తన ప్రచారంలో దాని జోలికి పెద్దగా పోలేదు. అటు బ్రెగ్జిట్ ఇక తిరగదోడలేని అంశమంటూనే ఈయూ నుంచి బయటికొచ్చినా దేశం ఉమ్మడి మార్కెట్వైపే మొగ్గు చూపాలని ప్రతి పాదించిన లేబర్ పార్టీ నేత కోర్బిన్ కూడా దాన్ని ఎన్నికల అంశంగా మార్చలేదు. బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించడమేకాక, తమకు అధికారం అప్పగిస్తే దానిపై మరో రిఫరెండం నిర్వహించి ఈయూలో కొనసాగేలా చూస్తామన్న లిబరల్ డెమొ క్రాట్లకు ఘోరపరాభవం జరిగింది. ఆ పార్టీకి నాలుగే స్థానాలు లభించాయి. బ్రెగ్జిట్ రిఫరెండంలో కీలకపాత్ర పోషించిన యూకే ఇండిపెండెంట్స్ పార్టీ (యూకే ఐపీ) గత ఎన్నికల్లో సంపాదించుకున్న ఒక్క స్థానాన్నీ ఈసారి కోల్పోయింది. అధికార పీఠం అందుకోలేకపోయినా మళ్లీ గణనీయంగా పుంజుకున్న లేబర్ పార్టీ గురించి ప్రస్తావించుకోవాలి. నయా ఉదారవాద విధానాలను నిశితంగా విమర్శించడంలో, సంపన్నులపై అధిక పన్నులు విధించాలనడంలో దూకుడుగా ఉండే ఆ పార్టీ నేత జరిమీ కోర్బిన్‌ను జనం విశ్వసించారు. అయితే ఆ పార్టీకి జనం అధికారం కట్టబెట్టకపోవడానికి కారణముంది. టోనీ బ్లెయిర్, గోర్డాన్ బ్రౌన్ల పాలనలో ఆ పార్టీ మూటగట్టుకున్న అప్రదిష్ట, దుష్కీర్తి అంతా ఇంతా కాదు. బ్లెయిర్ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికాకు దాసోహమై, దాని ప్రయోజనాలను నెరవేర్చడమే ధ్యేయంగా ఉద్దేశపూర్వకంగా ఇరాక్‌పై కట్టుకథలల్లి దేశాన్ని యుద్ధం లోకి దించారు. పర్యవసానంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిరుద్యోగం పెరిగింది. ధరలు ఆకాశాన్నంటాయి. పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పర మయ్యాయి. వీటన్నిటినీ బ్రిటన్ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేకపోయారు. అయితే అందరికీ చదువు, ఆవాసం, ఆరోగ్య సేవలు, పింఛన్లకు రక్షణ వంటి లేబర్ హామీలు వారిని ఆకట్టుకున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో కీలక విభా గాలను జాతీయం చేస్తామన్న కోర్బిన్ వాగ్దానం ప్రజలకు నచ్చింది. ఉగ్రవాదానికి అణచివేత పరిష్కారం కాదనీ, దానికి దారితీస్తున్న మూల కారణాలను సరిచేయా లని కోర్బిన్ వాదించాడు. అయితే బ్లెయిర్ కాలంనాటి ఉదారవాద విధానాల మత్తులోనే ఉండిపోయిన పార్టీలోని ఇతర నేతలు కోర్బిన్ పార్టీని దివాలా తీయి స్తాడని హడలెత్తారు. ఆయనకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ఇక కార్పొ రేట్ మీడియా సంగతి సరేసరి. ఆయన అధినేత కావడం ఆ పార్టీకి శాపమన్నట్టు ప్రచారం చేశాయి. ఈ ఎన్నికలు ఆయనను ప్రధాని చేయలేకపోవచ్చుగానీ పార్టీలో తిరుగులేని నేతగా మార్చాయి. కోర్బిన్‌కు ఇక ఎదురుండదు. మొత్తంగా చూస్తే బ్రిటన్ రాగల కాలంలో మరిన్ని సంక్షోభాలను ఎదుర్కొనవలసి రావొచ్చు. మరో సారి మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యంలేదు. ప్రపంచం రానురాను జాతీయ వాదంవైపు, సంకుచిత ధోరణులవైపు పయనిస్తున్నదని నిరాశపడేవారికి ఈ ఎన్ని కల ఫలితాలు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు. -
రసకందాయంలో బ్రెగ్జిట్ భవితవ్యం?
లండన్ : భారీ మెజారిటీ ఆశించి మధ్యంతర ఎన్నికలు జరిపించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే వ్యూహం బెడిసికొట్టింది. ఓట్ల శాతం పెరిగినా ఉన్న మెజారిటీ కోల్పోవడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రతిపక్షనేత జెరిమీ కార్బిన్ నాయకత్వాన లేబర్ పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి అనూహ్యంగా బలం పుంజుకుంది. ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ పార్లమెంటుతో ఈ ఎన్నికలకు కారణమైన బ్రెగ్జిట్ సంక్షోభంలో పడింది. తన నేతృత్వంలో కన్సర్వేటివ్ పార్టీ బలం ఏడెనిమిది సీట్లు తగ్గినా థెరిసా పదవికి రాజీనామా చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుకే పట్టుదలతో ఉన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలిగే ప్రక్రియను బ్రిటన్‌కు లాభసాటిగా చేయడానికి తగిన ఒప్పందం చేసుకోవడానికి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలంటూ టోరీ ప్రధాని ప్రజాతీర్పు కోరిన విషయం తెలిసిందే. మరి ఎన్నికల ఫలితాల వల్ల బ్రెగ్జిట్ సంప్రదింపులు అనుకున్నట్టే ఈ నెల 19న మొదలవుతాయా? ఎలా ముందుకు సాగుతాయి? ఒక వేళ కార్బిన్ ప్రధాని అయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఐరోపా, బ్రిటిష్ ప్రజలను వేధిస్తున్నాయి. బ్రిటన్‌కు బ్రెగ్జిట్ గుదిబండేనా? ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావడానికి అవసరమైన ఒప్పందంపై చర్చలు అక్కడి రాజకీయ సంక్షోభం కారణంగా ఆలస్యమైతే ఇంగ్లండ్ బాగా నష్టపోతుంది. ఈ విషయాన్నే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ ‘బ్రెగ్జిట్ చర్చలు ఎప్పుడు ఆరంభమౌతాయో తెలియదు. ఎప్పుడు ముగించాలో తెలుసు. సంప్రదింపులు లేకుండా ఒప్పందమే కుదరని పరిస్థితి రాకుండా చేయాల్సింది చేయండి’ అంటూ అధికారం చేపట్టే కొత్త బ్రిటిస్ సర్కారుకు హెచ్చరికను ట్విట్టర్ ద్వారా జారీచేశారు. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రభుత్వం కిందటి మార్చిలో 50వ అధికరణను అమలులోకి తేవడంతో చర్చలు సకాలంలో ప్రారంభించి ఈయూతో ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ఒప్పందం చేసుకున్నా లేకున్నా ఈ అధికరణ కారణంగా రెండేళ్లలో అంటే 2019 మార్చి ఆఖరుకు బ్రిటన్ ఈయూ నుంచి బయటపడుతుంది. చర్చలు జరిపి ఈలోగా ఒప్పదం చేసుకుంటే లబ్ధిపొందుతుంది. లేకపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే ఈయూ నుంచి తప్పుకోవాలి. థెరిసాకు ఐరిష్ డీయూపీ తోడైతే కొంత మేలే! బ్రెగ్జిట్‌కు అనుకూలమైన ఉత్తర ఐర్లండ్‌కు చెందిన డెమొక్రాటిక్ యూనియనియనిస్ట్ పార్టీ(డీయూపీ-10 సీట్లు)తో కలిసి కన్సర్వేటివ్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈయూతో జరిపే చర్చలు కొంత మెరుగైన ఫలితాలు సాధించే వీలుంది. స్కాట్లండ్ స్వాతంత్ర్యమే లక్ష్యంగా పుట్టిన స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎసెన్పీ) బ్రెగ్జిట్ కు వ్యతిరేకం. హంగ్ పార్లమెంటులో 34 సీట్లున్న ఈ పార్టీ మాటనూ వినక తప్పదు. ఇక లేబర్ నేత కార్బిన్ కూడా బెగ్జిట్కు వ్యతిరేకమే. జనాభిప్రాయం వెల్లడయ్యాక ఆయన బ్రెగ్జిట్‌ను అమలు చేస్తాననే చెబుతున్నారు. అధికారంలోకి వస్తే మొదట బ్రెగ్జిట్ పై జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతానని ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రకటించారు. ఈయూతో చర్చల సమయంలో బ్రిటిష్ కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలనేదే లేబర్ వాదన. బ్రెగ్జిట్ నుంచి ఇతర అంశాలపై దృష్టి మళ్లినందుకే...! ఇంగ్లండ్‌కు లాభదాయకమైన బ్రెగ్జిట్ కోసం అధిక మెజారిటీ ఇవ్వాలంటూ ప్రజాతీర్పు కోరిన థెరిసా మే ఎన్నికల ప్రచారంలో నెమ్మదిగా ఈ ప్రధానాంశానికి దూరమై ఇతర వివదాస్పద విషయాలను ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఇతరత్రా రంగం మీదకు తేవడంతో ఏప్రిల్ 20 నాటి జనాదరణను కోల్పోయారు. వృద్ధులకు మేలు చేసే ఆరోగ్య పరిరక్షణ పథకాలకు ప్రభుత్వ సహాయం తగ్గించడం, పోలీసు శాఖకు నిధులు, నియామకాల్లో కోత విధించడం వంటి అనేక అంశాలు కన్సర్వేటివ్ పార్టీకి తగిన మెజారిటీ రాకుండా చేశాయి. ఏదేమైనా బ్రెగ్జిట్ పేరిట జరిగిన ఎన్నికలు పాలకపక్షం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం విశేషం. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కొనసాగుతున్న ఉత్కంఠ
లండన్: సాధారణ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. 318 ఎంపీ స్థానాలు దక్కించుకున్న కన్జర్వేటివ్ పార్టీతోపాటు 261 స్థానాల్లో గెలుపొందిన లేబర్ పార్టీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. కన్జర్వేటివ్ నాయకురాలు, ప్రస్తుత ప్రధాని థెరిస్సామే ఒక అడుగు ముందుకేసి డీయూపీతో చర్చలు జరిపారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో మ్యాజిక్ ఫిగర్(326)కు చేరుకోవాలంటే కన్జర్వేటివ్ పార్టీకి ఇంకా 8 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ మేరకు 10 మంది ఎంపీలున్న డెమోక్రటిక్ యూనియనిస్త్ పార్టీ(డీయూపీ)తో కన్జర్వేటివ్‌లు జరిపిన చర్చలు ఫలవంతం అయినట్లు తెలిసింది. థెరిస్సా మే.. శుక్రవారమే రాణి ఎలిజబెత్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాల్సిదిగా కోరనున్నారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అపాయింట్మెంట్ కూడా ఖరారయినట్లు తెలిసింది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: జెరెమీ కోర్బిన్ 261స్థానాల్లో విజయం సాధించిన తాము యూకేలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని లేబర్ పార్టీ అధినేత జెరెమీ కొర్బిన్ ప్రకటించారు. దేశ సుస్థిరత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. థెరెసా మే ప్రధాన మంత్రి పదవికి తక్షణమే రాజీనామాచేసి, నిజమైన ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఉత్కంఠగా సాగిన ఫలితాలు యూకే సార్వత్రిక ఎన్నికలు గురువారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిశాయి. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా 318 స్థానాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది. గత(2015) ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి అనూహ్యంగా వెనుకబడిపోయింది. కౌంటింగ్ ప్రారంభంలోనే ప్రతిపక్ష లేబర్ పార్టీ దూసుకుపోవడంతో బంపర్ మెజారిటీ ఖాయమని అంతా భావించారు. కానీ లేబర్లు 261 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. స్కాటిష్ నేషనల్ పార్టీ 35 సీట్లు సాధించి మూడోఅతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాలలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(12 స్థానాలు), డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(10 స్థానాలు), ది గ్రీన్ పార్టీ(1 స్థానం)లు నిలిచాయి. ‘బ్రెగ్జిట్’ పార్టీకి చుక్కెదురు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని ఉద్యమాలు చేసి, విజయం సాధించిన యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) తాజా ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. ఉన్న ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేక సున్నాకు పరిమితమైంది. -
బ్రిటన్ ఫలితాలు: థెరిసా మే పదవికి ముప్పు
బ్రిటన్ ఎన్నికల ఫలితాలు కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మేకు షాకిచ్చాయి. మెజార్టి స్థానాలను గెలుపొందడంలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విఫలమైంది. దీంతో థెరిసా మే ప్రధానమంత్రి పదవికి ముప్పు వచ్చిపడింది. ప్రధానమంత్రిగా ఆమె దిగిపోవాలని ఒత్తిడులు వస్తున్నాయి. అయితే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసే ఉద్దేశ్యమేమీ లేదని థెరిసా మే తేల్చిచెప్పినట్టు తెలిసింది. థెరిసా మేపై పోటీ చేసిన లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్, ప్రధానమంత్రిగా థెరిసాను రాజీనామా చేయాలని ఫలితాల ప్రకటన కంటే ముందే పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం దేశానికి స్థిరత్వం అవసరమని థెరిసా చెప్పారు. రాజీనామా చేసే ఉద్దేశ్యమే లేదని థెరిసా పేర్కొన్నట్టు బీబీసీ రిపోర్టు చేసింది. ప్రస్తుత ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 315 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీని చేరుకోలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి మెజార్టి 326 స్థానాలను దక్కించుకోవాల్సి ఉంది. మెజార్టీ సాధించలేకపోవడంతో కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటికే డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)ని సంప్రదించిందని, ఆ పార్టీని సంకీర్ణ భాగస్వామిగా చేర్చుకునేందుకు చూస్తుందని స్కై న్యూస్ రిపోర్టు చేసింది. ఉత్తర ఐర్లాండ్ లో డీయూపీ 10 స్థానాలను సంపాదించుకుంది. -
థెరిసా మేకు ఉగ్రదాడుల దెబ్బ!
లండన్: బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన రెండు ఉగ్రదాడులు అధికార కన్సర్వేటీవ్ పార్టీపై భారీగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బ్రెగ్జిట్ చర్చల సమర్థత అంశంతో మూడేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లిన ప్రధాని థెరిసా మే.. మెజార్టీ మార్క్ సాధించడంలో విఫలమయ్యారు. ఫలితాల్లో కన్సర్వేటీవ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించడంలో విఫలమైంది. దీంతో బ్రిటన్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పడనుంది. మొత్తం 650 స్థానాలున్న హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మెజారిటీ మార్క్ 326 స్థానాలు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కన్సర్వేటీవ్ పార్టీ 315 స్థానాల్లో విజయం సాధించగా.. జిరొమి కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 261 స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 74 స్థానాల్లో విజయం సాధించారు. ఫలితాల ఆరంభంలో లేబర్‌పార్టీ ఆధిక్యంలో ఉన్నా క్రమంగా వెనుకబడింది. కన్సర్వేటీవ్ పార్టీ 48.5 శాతం ఓట్లు సాధించగా.. లేబర్ పార్టీకి 40.2 శాతం ఓట్లు దక్కాయి. ఫలితాల నేపథ్యంలో మెజారిటీ మార్క్‌ను సాధించలేకపోయిన థెరిసా మే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని జిరొమి కార్బిన్ కోరారు. -
లండన్‌పై ఉగ్రపంజా
► ఏడుగురు మృతి, 48 మందికి గాయాలు ►లండన్ బ్రిడ్జి వద్ద వ్యాన్‌తో ముష్కరుల బీభత్సం ►బోరో మార్కెట్లోకి చొచ్చుకెళ్లి కత్తులతో దాడి ►వారాంతాల్లో రద్దీగా ఉండే మార్కెటే లక్ష్యం ►ఒక యువతిపై ఏకంగా పదిహేనుసార్లు కత్తిపోట్లు ►భయభ్రాంతులతో చెల్లాచెదురై పారిపోయిన జనంl ►8 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు ►ఘటనను ఖండించిన థెరిసా మే, వివిధ దేశాధినేతలు ►మహిళ సహా 12 మంది అనుమానితుల అరెస్టు లండన్: శనివారం.. రాత్రి 10 గంటలు.. వారాంతం కావడంతో లండన్ బ్రిడ్జి ప్రాంతం సందడిగా ఉంది.. చుట్టుపక్కల బార్లు, రెస్టారెంట్లన్నీ జనంతో కిక్కిరిశాయి.. మార్కెట్లు కళకళలాడుతున్నాయి.. ఇంతలో ఘోరం..! థేమ్స్ బ్రిడ్జిపై నుంచి ఓ వాహనం 80 కి.మీ. వేగంతో పాదచారులపైకి దూసుకొచ్చింది.. భయంతో అంతా తలోదిక్కు పారిపోయారు.. ఆ వాహనం నుంచి కత్తులతో దిగిన ముగ్గురు ముష్కరులు సమీపంలోని బోరో మార్కెట్లోకి దూసుకెళ్లారు.. ‘అల్లా కోసం.. ’ అంటూ ఉన్మాదంతో దొరికినవారిని దొరికినట్టు పీకలు కోశారు.. ఏడుగురిని బలి తీసుకున్నారు! 75 రోజుల్లో బ్రిటన్‌లో జరిగిన మూడో ఉగ్రదాడి ఇది!! మొన్నటి మాంచెస్టర్ ఘటన మరవకముందే లండన్‌లో ముష్కర మూకలు రెచ్చిపోయాయి. శనివారం రాత్రి చారిత్రక లండన్ బ్రిడ్జి సమీపంలో, బోరో మార్కెట్‌పై పంజా విసిరాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. 48 మంది గాయాలపాలయ్యారు. జూన్ 8న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు 8 నిమిషాల్లోనే ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంతవరకు ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. ఉగ్రదాడిపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల నీచమైన సిద్ధాంతమే ఈ ఘటనకు కారణమన్నారు. దేశంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసిన మే పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎలా జరిగింది? లండన్ బ్రిడ్జి సమీపంలోని బోరో మార్కెట్లో బార్లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉంటాయి. వారాంతం కావటంతో శనివారం రద్దీ ఎక్కువగా ఉంది. రాత్రి పది గంటల సమయంలో ఓ తెలుపురంగు వ్యాన్ థేమ్స్ నది మీదుగా లండన్ బ్రిడ్జి దాటగానే 80 కిలోమీటర్ల వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. అక్కడున్న వారంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. ఇంతలో వాహనంలో నుంచి కత్తులతో దిగిన ఉగ్రవాదులు పక్కనున్న బోరో మార్కెట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు. కంటబడిన వారందరిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ‘అల్లా కోసం’ అని గట్టిగా అరుస్తూ ఓ ఉగ్రవాది అక్కడున్న ఓ యువతిని 15సార్లు దారుణంగా పొడిచాడు. వీలైనంత ఎక్కువమందిని మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో ముష్కరులు చెలరేగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బోరో మార్కెట్‌కు చేరుకున్నారు. ఉగ్రవాదులను గుర్తించి వెంటనే కాల్చి చంపారు. వారి వద్ద నకిలీ బెల్టుబాంబులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారిలో ఓ బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసు అధికారి, ఓ జర్నలిస్టు ఉన్నారు. కారుతో ఢీకొట్టాలనుకున్నా.. తోటివారి పీకకోస్తున్న ఓ ఉగ్రవాదిని క్రిస్ అనే క్యాబ్ డ్రైవర్ చంపేందుకు యత్నించాడు. ‘‘లండన్ బ్రిడ్జిపైనుంచి ఓ వ్యాన్ వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో చాలామంది భయంతో పారిపోగా కొందరికి గాయాలయ్యాయి. వ్యాన్‌లో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు పొడవైన కత్తులు తీసుకుని బోరో మార్కెట్ వైపు వెళ్తూ.. కనబడినవారిపై దాడి చేస్తున్నారు. అందులో ఒకడిని కారుతో ఢీకొట్టి చంపాలనుకుని వేగంగా అతని వైపు కారు నడిపించాను. కానీ అతను తప్పించుకున్నాడు’’ అని క్రిస్ తెలిపాడు. ఉగ్రదాడిపై అప్రమత్తమైన లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు థేమ్స్ నదిలోనూ బోట్లతో గాలింపులు జరిపారు. నగరమంతా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అటు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉగ్రదాడికి సంతాపసూచకంగా పార్లమెంట్ భవనం వద్ద బ్రిటన్ జాతీయ పతకాన్ని అవనతం చేశారు. నన్ను వేదనకు గురిచేస్తోంది: మోదీ న్యూఢిల్లీ: లండన్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఆయన ఓ ట్వీట్ చేస్తూ ‘లండన్‌లో జరిగిన దాడులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఈ విషయం నన్ను వేదనకు గురిచేస్తోంది. మృతులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా లండన్ ఉగ్రదాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన సోనియా... గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పోలీస్.. భేష్..! శనివారం నాటి లండన్ దాడి ఘటనలో మెట్రోపాలిటన్ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 10.08 గంటలకు ఘటన గురించి తెలియగానే.. పోలీసులు వెంటనే బోరో మార్కెట్ చేరుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టే పని ప్రారంభించారు. ఉగ్రవాదులను కనిపెట్టి వారిపై కాల్పులు జరిపారు. ఇదంతా కేవలం 8 నిమిషాల్లోనే జరిగింది. పోలీసులు రావటం ఆలస్యమై ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని దాడి నుంచి బయటపడిన వారు తెలిపారు. వందల ప్రాణాలు కాపాడిన బౌన్సర్లు మూడు కత్తిపోట్లకు గురైన ఓ బాధితుడు ఉగ్రవాదులపైకి ప్లేట్లు, కుర్చీలు విసిరి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఓ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో భయంతో అరుస్తూ బోరో మార్కెట్లోని పారిస్ బార్లోకి పరిగెత్తుకు వచ్చిం ది. చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ ఫైనల్స్‌ను వీక్షిస్తున్న వారం తా ఆమె అరుపులకు భయపడ్డారు. ఆమె గొంతు కోసినట్లు గుర్తించిన బౌన్సర్లు ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే బార్ తలుపులు మూసి వందల మంది ప్రాణాలు కాపాడారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోకి పోలీసులు ప్రవేశించి అందరినీ బల్లల కింద దాక్కోవాలని సూచించారు. 12 మంది అనుమానితుల అరెస్టు ఉగ్ర ఘటనపై విచారణ వేగవంతం చేసిన పోలీసు లు, కౌంటర్–టెర్రరిస్టు బలగాలు.. బార్కింగ్ ప్రాంతం లో ఓ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశాయి. బార్కింగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఈ అరెస్టు లు జరిగాయని బ్రిటీష్ కౌంటర్ టెర్రరిజం పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన గంటల్లోనే పోలీసులు అనుమానితులను పట్టుకున్నారు. నగరంలో మిగిలిన చోట్ల మరో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్లా గాలింపు జరుగుతోందన్నారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో జూన్ 8న జరగాల్సిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాలని అధికార కన్జర్వేటివ్ పార్టీ, విపక్ష లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీలు నిర్ణయించాయి. ఉగ్రదాడిలో గాయపడిన వారిలో విదేశీయులు ఉన్నట్లు తెలిసింది. బ్రిటన్‌లో రెండేళ్లలో ఉగ్రదాడులు ఇవీ.. 2017 జూన్ 3 లండన్ బ్రిడ్జి దగ్గర, అక్కడికి సమీపంలోని బోరో మార్కెట్ వద్ద జరిగిన దాడిలో ఏడుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు. 2017 మే 22 మాంచెస్టర్‌లో పాప్ సింగర్ అరియానా గ్రాండే సంగీత విభావరి నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, 116 మంది గాయపడ్డారు. 2017 మార్చి 22 బ్రిటిష్ పార్లమెంటు భవనం సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జి వద్ద ఓ దుండగుడు కారును పాదచారులపైకి పోనిచ్చి నలుగురిని పొట్టనబెట్టుకు న్నాడు. 40 మంది క్షతగాత్రులయ్యారు. 2016 జూన్ 16 బిర్ట్సాల్లో లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్‌ను తుపాకీతో కాల్చి, కత్తితో పొడిచి ఉగ్రవాదులు చంపేశారు. 2015 డిసెంబర్ 5 లీయ్టోన్స్టోన్ వద్ద ఓ ఉగ్రవాది ముగ్గురిని కత్తితో పొడిచాడు. ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రపంచ నేతల సంఘీభావం లండన్ ఉగ్ర దాడిని పలు దేశాల అధినేతలు ఖండించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో బ్రిటన్ పక్షాన నిలుస్తామని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బ్రిటన్‌కు సాయంగా అమెరికా ఏం చేయగలదో అదంతా చేస్తాం. మీతో మేం ఉన్నాం’ అని భరోసానిచ్చారు. రష్యా అధ్యక్షడు పుతిన్ దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బ్రిటన్ పక్షాన నిలుస్తామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. నిషేధాన్ని సమర్థించుకున్న ట్రంప్ లండన్ ఉగ్ర దాడి నేపథ్యంలో వలస నిషేధ ఉత్తర్వులను ట్రంప్ సమర్థించుకున్నారు. ‘మనం స్మార్ట్‌గా, అప్రమత్తంగా, కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. కోర్టులు మన హక్కులను మనకు వెనక్కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరు ముస్లిం దేశాల వారిపై విధించిన నిషేధం మనల్ని భద్రతలో మరోమెట్టు పైన ఉంచుతుంది’ అని ట్రంప్ ట్వీటర్లో చెప్పుకొచ్చారు. -
ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే..
లండన్: బ్రిటన్‌లో గురువారం జరగాల్సిన జనరల్ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ప్రధాని థెరిసా మే ప్రకటించారు. లండన్ ఉగ్రదాడి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పాశ్చాత్య విలువలు ఇస్లాంకు సరిపోవనే దుష్ట ఆలోచనా విధానంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. అయితే.. ఇలాంటి దాడులు ఇక మీదట జరగడానికి వీల్లేదని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒకరిని మరొకరు అనుకరిస్తూ ఇలాంటి దాడులకు దిగుతున్నారని థెరిసా మే అన్నారు. లండన్ దాడిలో ఉగ్రవాదులు నకిలీ బాంబులను ధరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని వెల్లడించారు. ఇటీవలి కాలంలో బ్రిటన్ పోలీసులు ఐదు ఉగ్రకుట్రలను భగ్నం చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో నిలిపివేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమౌతాయని థెరిస్సా మే వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున లండన్‌లోని బరౌ మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. -
నేరుగా ప్రధానే మీ ఇంటి తలుపు తడితే..
లండన్: సాక్షాత్తు ప్రధాన మంత్రే మీ ఇంటి తలుపుకొడితే తీయకుండా ఉండగలరా.. అసలు ఆ ఆలోచన వస్తేనే మనసు సంతోషంలో తేలిపోకుండా ఉండటం సాధ్యమేనా.. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా లైట్‌గా తీసుకున్నాడు. ప్రధాని వచ్చి డోర్ కొట్టడమే కాదు.. లోపల ఎవరైనా ఉన్నారా అని పిలిచినా, ప్రధానే పిలిచేదని తెలిసినా అతడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆ ప్రధాని వెనుదిరిగారు. అయితే, ఆ ప్రధాని నరేంద్రమోదీ కాదు.. బ్రిటన్ దేశ ప్రధాని థెరిసా మే. ఇది జరిగింది సౌతాంప్టన్‌లో. అవును త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాని థెరిసా మే స్వయంగా ప్రతి ఇంటికెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డేవిడ్ బ్రియాన్ అనే వ్యక్తి ఇంటికెళ్లి తలుపుతట్టారు. లోపల ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇదంతా కూడా ఇంటి లోపల ఉన్న డేవిడ్ తన సీసీటీవీ కెమెరా ద్వారా ఇంట్లో టీవీలో చూస్తునే ఉన్నాడు. అయితే, ప్రధాని వచ్చారు కదా అనే ఉత్సాహంతో కాకుండా అలాగే టీవీలో చూస్తుండి పోయాడు. కనీసం అడుగు కూడా వేయలేదు. అసలు బిజీషెడ్యూల్తో ఉన్న ఆమె మరో ఇంటికి వెళ్లిపోతుండగా అప్పుడు కదిలి కిటికీలో నుంచి ఆసక్తిగా గమనించాడు. దీనికి సంబంధించిన వీడియోను బ్రియాన్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అదిప్పుడు హల్ చేస్తోంది. -
బ్రిటన్‌లో ‘మధ్యంతర’ పోరు
సాహసమో, దుస్సాహసమో... ప్రధాన ప్రతిపక్షం అంతర్గత పోరులో సతమత మవుతున్నప్పుడే మధ్యంతర ఎన్నికల అస్త్రం ప్రయోగించాలని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే నిర్ణయించారు. 50 రోజుల వ్యవధిలో... అంటే జూన్ 8న ఈ ఎన్నిక లుంటాయని ప్రకటించారు. అయిదేళ్లకోసారి ఎన్నికలు జరిగే బ్రిటన్ పార్లమెం టుకు 2015లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో అప్పటి ప్రధాని డేవిడ్ కామె రాన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ విజయం సాధించి చాన్నాళ్ల తర్వాత సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. యూరప్ యూనియన్(ఈయూ)లో కొనసా గాలా, వద్దా అన్న అంశంపై నిరుడు జూన్‌లో నిర్వహించిన రిఫరెండంలో 51.9 శాతంమంది బయటకు పోవడానికి అనుకూలంగా ఓటేయడంతో డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ థెరిస్సా మే ఒడిదుడుకులు పడుతూనే ఉన్నారు. ఈయూ పేరు పెట్టుకుని నాలుగు దశాబ్దాలే కావొచ్చుగానీ... ఏడు దశాబ్దాలక్రితం యూరోపియన్ ఎకనా మిక్ కమ్యూనిటీ(ఈఈసీ)గా ఉన్నప్పటినుంచీ దానితో బ్రిటన్‌కున్న అనుబంధం బలమైనది. చెప్పాలంటే ఆ సంస్థ ఆవిర్భావంలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర. అంతటి అనుబంధాన్ని తెంచుకుని ఒంటరి ప్రయాణానికి సంసిద్ధం కావడమమంటే మాటలు కాదు. పైగా మొత్తంగా చూస్తే బ్రెగ్జిట్వైపు అధికులు మొగ్గి ఉండొచ్చుగానీ కేవలం ఇంగ్లండ్, వేల్స్ రాష్ట్రాలు రెండు మాత్రమే ఆ వాదనను బలపరిచాయి. అటు స్కాట్లాండ్, ఇటు నార్తర్న్ ఐర్లాండ్ గట్టిగా వ్యతిరేకించాయి. అంతేకాదు... స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోతామని ప్రకటించింది. అందుకు సాధ్యమైనంత త్వరగా రిఫరెండం నిర్వహించమని స్కాట్లాండ్ డిమాండ్ చేస్తోంది. మరోపక్క త్వరగా బయటకు వెళ్లమని ఈయూ నుంచి బ్రిటన్‌కు సందేశాలు అందుతున్నాయి. అధికారంలోకి రావడం కోసం బ్రెగ్జిట్ అంటే ఇష్టం లేకపోయినా 2015 ఎన్నికల్లో దాన్ని కన్సర్వేటివ్‌లు నెత్తినపెట్టుకున్నారు. తమ పార్టీ ఓడిపోతుందని సర్వేలన్నీ చెప్పడంతో వారు ఆందోళనచెందారు. నెగ్గితే ఎటూ అత్తెసరు మెజారిటీయే వస్తుం దని, రిఫరెండం పెట్టడానికి కూటమిలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంగీకరిం చడం లేదని సాకు చెప్పి తప్పించుకోవచ్చునని భావించారు. కానీ అందరి అంచ నాలనూ తలకిందులు చేస్తూ కన్సర్వేటివ్‌లు సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పర్చగల స్థాయికి చేరారు. విధి లేక డేవిడ్ కామెరాన్ రిఫరెండం పెట్టక తప్పలేదు. అందులో అధిక శాతంమంది మొగ్గు చూపడంతో ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన థెరిస్సా సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ప్రారంభించాలో, ఎలా కొనసాగించాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఈయూ నుంచి బయటికొస్తే సమస్యలన్నీ మంత్రించినట్టు మాయమవు తాయని చాలామంది అనుకున్నా పరిస్థితులు అలా లేవు. దాంతో ప్రజల్లో అసం తృప్తి పెరుగుతోంది. కఠిన నిబంధనలతో వలసదారులను కట్టడి చేసే చట్టాన్ని తీసుకొస్తే అంతా చక్కబడుతుందని థెరిస్సా భావించారు. అక్రమ వలసదారులను, గడువుకు మించి ఉంటున్నారని గుర్తించిన వేలాదిమందిని అరెస్టు చేశారు. బ్రిట న్కు రాదల్చుకున్నవారిపై అనేక ఆంక్షలు పెట్టారు. ఇవి పెద్దగా ఫలితాన్నివ్వలేదు. అటు అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఏమంత అనుకూలంగా లేవు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌కు అండగా ఉంటామని గట్టి హామీ ఇవ్వలేక పోయారు. పైగా ఆయనను ఎంతవరకూ విశ్వసించవచ్చునో తెలియదు. రేపన్న రోజున స్వతంత్ర బ్రిటన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో తమకు ఎదురుకాగల పోటీని అంచనా వేసుకున్న ఈయూ దేశాలు.. మరీ ముఖ్యంగా జర్మనీ బ్రెగ్జిట్ లావాదేవీల్లో బ్రిటన్‌తో కఠినంగా ఉండాలని నిర్ణయించాయి. వీటన్నిటి పర్య వసానంగా నానాటికీ సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయని కన్సర్వేటివ్‌లకు అర్థ మైంది. వాస్తవం ఇది కాగా ఈయూ నుంచి ఉపసంహరించుకోవడానికి సంబం ధించిన ప్రక్రియకు విపక్షాలు అడ్డుకోకుండా నిరోధించడానికే మధ్యంతర ఎన్నికలు ప్రకటించానని థెరిస్సా దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. వాస్తవా నికి 2015 పార్లమెంటు ఎన్నికల్లోగానీ, రిఫరెండంలోగానీ బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించిన విపక్ష లేబర్ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. ఈయూ నుంచి బయటకు రావడానికి సంబంధించిన బిల్లుకు ఈమధ్యే అనుకూలంగా ఓటేసింది. పైగా బ్రెగ్జిట్ కార్యాచరణ రూపకల్పనకు మరింత చురుగ్గా కదలాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలిచినా బ్రెగ్జిట్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఒకసారి రిఫరెండంలో ప్రజాభి ప్రాయం వెల్లడైంది గనుక దాన్ని అమలు చేయడం మినహా వేరే మార్గం లేదు. బ్రెగ్జిట్ వద్దనుకున్న పార్టీ తాము అధికారంలోకొస్తే మరో రిఫరెండం నిర్వహి స్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్‌ను గతంలో వ్యతిరేకించిన లేబర్ పార్టీ ఇప్పుడు తన మనసు మార్చుకుంది. అయితే కన్సర్వేటివ్‌ల తరహాలో మొండిగా కాక ఈయూతో సామరస్యంతో మెలగి దేశ ప్రయోజనాలను కాపాడతామని ఆ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ హామీ ఇస్తున్నారు. ఇది కన్సర్వేటివ్ మద్దతుదార్ల లోని ఈయూ అను కూలవాదులను కూడా ఆకట్టుకుంటుందని ఆయన ఆశిస్తు న్నారు. వాస్తవానికి ఇటీవల విడుదలైన సర్వేలు కన్సర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీకన్నా 21 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నదని తేల్చాయి. ఈ సర్వేలు, లేబర్ పార్టీ అంతర్గత పోరు చూసి థెరిస్సా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న కీలక నిర్ణయం తీసుకు న్నారు. అయితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై తలెత్తే ప్రశ్నలకు జవాబివ్వగల నన్న విశ్వాసం ఆమెకు ఉందా? ఎన్నికలకు ముందు సంప్రదాయంగా జరిగే టెలివి జన్ చర్చలకు దూరంగా ఉండాలని థెరిస్సా నిర్ణయించుకోవడాన్ని గమనిస్తే ఆ విష యంలో ఎవరికైనా అనుమానాలు తలెత్తకమానవు. మొత్తానికి బ్రిటన్ పౌరులు ఎవరి విధానాలకు అనుకూలమో మరో 50 రోజుల్లో తేలిపోతుంది. ఎవరు అధికా రంలోకొచ్చినా సమస్యల బెడద తీవ్రంగానే ఉంటుంది. -
బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు!
► ప్రధాని థెరిసా మే అనూహ్య నిర్ణయం ► జూన్ 8న ఎన్నికలు నిర్వహించే యోచన లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే అనూహ్యమైన రీతిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూన్ 8న ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఆమె పిలుపునిచ్చారు. థెరెసా మే నిర్ణయం మిత్రపక్షాలతోపాటు ప్రత్యర్థుల్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని గతంలో పలుమార్లు పేర్కొన్న మే ఒక్కసారిగా ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడం విశేషం. మంగళవారం ప్రధానమంత్రి మే తన డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక దేశంలో కొన్నేళ్లపాటు రాజకీయ సుస్థిరత నెలకొనాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఆటలు ఆడుతున్నాయని ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. బ్రెగ్జిట్‌ను విజయవంతం చేయడానికి అవసరమైన సామర్ధ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని, ఇందుకుగాను అందరి మద్దతును కోరుతున్నానని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని ఆమె సోమవారమే బ్రిటన్ రాణికి తెలిపారు. డౌనింగ్‌స్ట్రీట్‌లో కేబినెట్ సమావేశం అనంతరం మే నుంచి తాజా నిర్ణయం వెలువడింది. బ్రిటన్‌లో తదుపరి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం 2020లో జరగాల్సి ఉంది. అయితే మూడింట రెండువంతుల మెజారిటీతో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం తెలిపితే ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. మొత్తం 650 ఎంపీల్లో 434 మంది దీనికి అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఎన్నికలపై ‘హౌస్ ఆఫ్ కామన్స్’ బుధవారం నిర్ణయించే అవకాశముంది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత జెరెమీ కోర్బిన్ స్వాగతించారు. -
యూరోపియన్ యూనియన్‌కు బై!
-
యూరోపియన్ యూనియన్‌కు బై!
-
యూరోపియన్ యూనియన్‌కు బై!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి అధికారికంగా వైదొలగడానికి (బ్రెగ్జిట్) కౌంట్‌డౌన్ సిద్ధమయింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం బ్రెగ్జిట్ నుంచి వెళ్లిపోయే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 ఈయూ సభ్యదేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈయూ బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌కు అందజేశారు. ఈ రెండేళ్లలో 27 సభ్యదేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. ఈయూ దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులూ ఉంటాయని మే భరోసా ఇచ్చారు. 2016లో నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు బ్రెగ్జిట్‌కు ఓటు వేయడం తెలిసిందే. బ్రెగ్జిట్‌పై ప్రధాని పార్లమెంటులోనూ అధికారికంగా ప్రకటన చేశారు. -
‘దాడి చేసింది బ్రిటన్ జాతియుడే’
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తి బ్రిటీష్ పౌరుడేనని ఆ దేశ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఈ విషయం తనకంటే నిఘా వర్గాలకే ఎక్కువగా తెలుసని అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం దాడికి పాల్పడిన వ్యక్తినే గతంలో ఎంఐ5 ఇంటెలిజెన్స్ విభాగం విచారించిందని, గతంలో కూడా అతడు తీవ్రవాదం తాలుకు చర్యలకు పాల్పడిట్లు గురువారం పార్లమెంటులో చెప్పారు. ‘నేను ఏం స్పష్టం చేయగలనంటే పార్లమెంటుపై దాడికి యత్నించిన వ్యక్తి బ్రిటన్ సంతతివాడే. కొన్నేళ్లకిందట అతడిని ఇంటెలిజెన్స్ విభాగం విచారించింది కూడా. ఈ విషయం వారికే బాగా తెలుసు’ అని గురువారం తెలిపారు. ఉగ్రవాదం ఎట్టిపరిస్థితుల్లో పై చేయి సాధించరాదని అన్నారు. ఇలాంటి సమయంలోనే మొత్త బ్రిటీషు జాతి మనోధైర్యంగా ఉంటూ మన విలువలను సంరక్షించుకోవాలని అన్నారు. ఇలా చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని తేలికగా ఓడించవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
ట్రంప్ విధానాలపై లండన్ 'గరంగరం'
లండన్: ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై ఆంక్షలు కఠినం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాతో పాటు బ్రిటన్‌లోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లో శనివారం వేల సంఖ్యలో పాల్గొన్న నిరసనకారులు.. నిషేధాన్ని ట్రంప్ వెనక్కితీసుకోవాలని నినాదాలు చేశారు. స్టాప్ ద వార్ కోలిషన్, స్టాండ్ అప్ టు రెసిజమ్, ముస్లిం అసోసియేషన్ ఆఫ్ బ్రిటన్‌తో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో.. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని థెరిసా మే.. డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వనించడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సెంట్రల్ లండన్‌లోని యూఎస్ ఎంబసీ నుంచి డౌనింగ్ స్ట్రీట్ వరకు నిర్వహించిన ఈ మార్చ్‌లో.. ట్రంప్ తీసుకున్న బ్యాన్ నిర్ణయం ముమ్మాటికీ 'రేసిస్టు' విధానమే అని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్, థెరిసా మే లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించారు. ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న వెంటనే బ్రిటన్‌లో నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటిస్తే.. అది బ్రిటన్ రాణికి అవమానం అని, ఈ పర్యటనను ఆపాలని ప్రభుత్వాన్ని కోరిన పిటిషన్‌పై 1.8 మిలియన్ల మంది సంతకాలు చేయడం అక్కడ ట్రంప్ విధానాలపై ఉన్న వ్యతిరేకతను సూచిస్తోంది. -
ట్రంప్-థెరిస్సా ఫొటో.. అసలు రహస్యమిదే!
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ చేయి పట్టుకొని సన్నిహితంగా నడువడం పెద్ద దుమారమే రేపింది. వైట్‌హౌస్‌లో ఇద్దరు నేతలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారిపోయింది. వీరి 'ఎక్స్ట్రా స్పెషల్ రిలేషన్షిప్'కు కారణమేంటన్న ఆసక్తి నెలకొంది. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడి చేయిని థెరిసా ఇలా పట్టుకొని నడువడం వెనుక ఉన్న అసలు కారణంపై ఆమె అధికార యంత్రాంగానికి చెందిన అత్యున్నత వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్‌కు బాత్మోఫొబియా ఉందని, దీనివల్ల ఆయనకు మెట్లు, దింపుగా (ఏటవాలుగా) ఉన్న ప్రదేశాలు దిగుతున్నప్పుడు జారిపడిపోతానేమోనన్న భయం ఉందని, అందుకే వైట్‌హౌస్‌లో ఒంపుగా ఉన్న ప్రదేశాన్ని దిగుతున్నప్పుడు ట్రంప్ చేయిని పట్టుకొని థెరిసా మే నడిచారని ఆ వర్గాలు వివరణ ఇచ్చాయి. తనకు ఫొబియా ఉన్న విషయాన్ని థెరిసాకు చెప్పి.. దింపుగా ఉన్న ప్రదేశం వద్ద ఆమె సాయాన్ని ట్రంప్ తీసుకున్నారని, ఆ సందర్భంలోనిదే ఈ ఫొటో అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. -
ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్‌కు ఆహ్వానం!
-
ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్‌కు ఆహ్వానం!
కొత్త అధ్యక్షుడి పాలనలోకి వచ్చిన శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలోనే తమ దేశంలో పర్యటించబోతున్న బ్రిటిష్ ప్రధాని థెరెసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూలులో ప్రచురించింది. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు ఆ పేరును మార్చేసింది. డోనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న అధికారుల్లో ఒకరు ఆ షెడ్యూలుకు సంబంధించిన పత్రంలో థెరెసా మే పేరు రాసేటపుడు అందులోని 'హెచ్' అనే అక్షరాన్ని వదిలేశారు. దాంతో అది కాస్తా టెరెసా మే అయిపోయింది. అదే పేరుతో ఒక పోర్న్ స్టార్ ఉన్నారు. వాసత్వానికి థెరెసా మే తన అధికారిక పర్యటనలో భాగంగా ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడంతో పాటు సంయుక్త విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. వైట్ హౌస్ నుంచి ప్రతిరోజూ వచ్చే కార్యక్రమాల వివరాలలో భాగంగా ప్రెస్ సెక్రటరీ ఈ పర్యటన వివరాలను కూడా వెల్లడించారు. అందులో థెరెసా మే పేరులోని హెచ్ అక్షరాన్ని వదిలేయడంతో ఘోరమైన తప్పు జరిగిపోయింది. అది కూడా మూడుసార్లు జరిగింది. టెరెసా మే గతంలో మోడల్‌గా పనిచేసి, ప్రస్తుతం పోర్న్ సినిమా స్టార్‌గా ఉన్నారు. గత వేసవి కాలంలో బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత నాటి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయడంతో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఎవరు అవుతారన్న చర్చ జరిగినప్పుడు కూడా థెరెసా మే తోపాటు టెరెసా మే పేరు కూడా ట్విట్టర్లో మార్మోగిపోయింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో పర్యటిస్తున్న మొట్టమొదటి విదేశీ నేత థెరెసా మే.