లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మేకి అవిశ్వాస గండం తప్పింది. బుధవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో మేకి చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు 317 మంది పాల్గొనగా, 200 మంది ఆమెకు అనుకూలంగా, మరో 117 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 2022 సాధారణ ఎన్నికల్లో తాను పార్టీకి నాయకత్వం వహించనని థెరెసా మే హామీనివ్వడంతో పలువురు అసంతృప్త ఎంపీలు శాంతించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో థెరెసా మే కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమె సొంత పార్టీ ఎంపీలు, మంత్రులే వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే సొంత పార్టీ కన్జర్వేటివ్ ఎంపీలే 48 మంది మేపై అవిశ్వాసం నోటీసులివ్వడంతో ఓటింగ్ జరిగింది. అయితే ఇదంతా కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత వ్యవహారమే తప్ప పార్లమెంటులో జరిగింది కాదు. ఈ అవిశ్వాస పరీక్షలో మే ఓడిపోయుంటే ఆమె ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చేది.
అయితే ఓటింగ్‌కు ముందు ఆమె ఎంపీలతో సమావేశమై 2022 సాధారణ ఎన్నికల్లో పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో పలువురు ఎంపీలు ఆమెకు అనుకూలంగా మారారు. ఇప్పటికే ఈయూతో మే కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం ముసాయిదాను బ్రిటన్ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. దీనిపై ఓటింగ్ వచ్చే ఏడాది జనవరి రెండో లేదా మూడో వారంలో జరుగుతుందని తెలుస్తోంది. మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్ ప్రయోజనాలకు భంగకరమనీ, 2016లో బ్రెగ్జిట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో బ్రిటన్ ప్రజలు ఏ ఆశలతో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారో, ఆ ఆశలను ఈ ఒప్పందం నెరవేర్చలేదని పలువురు మే సొంత పార్టీ ఎంపీలే ఆమెతో విభేదిస్తున్నారు. ఒప్పందంలో మార్పులపై ఈయూతో చర్చల కోసం మే త్వరలోనే మరసారి బ్రస్సెల్స్‌కు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment