
లండన్: జగ్‌జీత్‌సింగ్ అనే బ్రిటన్ సైనికుడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం తమ విచారణలో తేలిందని పంజాబ్ పోలీసులు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. పంజాబ్ పోలీసులు చెప్పిన జగ్‌జీత్‌సింగ్ పేరుతో బ్రిటిష్ ఆర్మీలో ఎవరూ పని చేయడం లేదని తెలిపింది.
‘జగ్‌జీత్‌సింగ్ అనే వ్యక్తి ఫతేసింగ్ బాగీ అనే మారుపేరుతో ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ నడుపుతున్నాడు. జగ్‌జీత్‌సింగ్ ప్రస్తుతం బ్రిటీష్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు’అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు.
పంజాబ్ డీజీపీ వెల్లడించిన ఈ విషయాన్ని యూకే ప్రభుత్వం కొట్టిపారేసింది. కాగా,2021లో అమృత్‌సర్ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు జగ్‌జీత్‌సింగ్ పేరు చెప్పారు. తమకు ఆయుధాలు, డబ్బులు ఇచ్చింది జగ్‌జీత్‌సింగ్ అని వారు విచారణలో చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment