ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే..
ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే..
Published Sun, Jun 4 2017 5:08 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
లండన్: బ్రిటన్‌లో గురువారం జరగాల్సిన జనరల్ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ప్రధాని థెరిసా మే ప్రకటించారు. లండన్ ఉగ్రదాడి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పాశ్చాత్య విలువలు ఇస్లాంకు సరిపోవనే దుష్ట ఆలోచనా విధానంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. అయితే.. ఇలాంటి దాడులు ఇక మీదట జరగడానికి వీల్లేదని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒకరిని మరొకరు అనుకరిస్తూ ఇలాంటి దాడులకు దిగుతున్నారని థెరిసా మే అన్నారు. లండన్ దాడిలో ఉగ్రవాదులు నకిలీ బాంబులను ధరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని వెల్లడించారు. ఇటీవలి కాలంలో బ్రిటన్ పోలీసులు ఐదు ఉగ్రకుట్రలను భగ్నం చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో నిలిపివేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమౌతాయని థెరిస్సా మే వెల్లడించారు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున లండన్‌లోని బరౌ మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు.
Advertisement
Advertisement