లండన్ : భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి, బ్రెగ్జిట్ కోసం పోరాటం చేసిన ప్రీతి పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. థెరిసా మే కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయంటూ కథనాలు ప్రచారం అవుతున్న క్రమంలోనే ప్రీతి పటేల్ రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయం బహిర్గతం చేసింది. ప్రధాని థేరిసా మేకుగానీ, విదేశాంగశాఖ కార్యాలయానికిగానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత ఆగస్టులో మంత్రి ప్రీతి పటేల్ ఇజ్రాయెల్‌లో పర్యటించడమే ఆమె ఉద్వాసనకు దారితీసింది. అయితే వారం రోజుల్లో థెరిసా ప్రభుత్వంలో ఇది రెండో రాజీనామా కావడం గమనార్హం.
ఆఫ్రికా దేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లిన మంత్రి ప్రీతి పటేల్ ప్రధాని థెరిసా మే సూచన మేరకు మధ్యలోనే బ్రిటన్‌కు వచ్చేశారు. రాజీనామా చేయాలన్న ఆదేశాల మేరకు ప్రీతి తన మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. రాజీనామాపై ప్రీతి స్పందిస్తూ.. ‘ మంత్రిగా నాపై కొన్ని బాధ్యతలున్నాయి. నేను ఏం చేసినా పారదర్శకతతో వ్యవహరించాను. ప్రధాని థెరిసా మేకు, ప్రభుత్వానికి క్షమాపణ చెబుతున్నాను. ఇజ్రాయెల్ అధికారులతో తాను ఎలాంటి రహస్య మంతనాలు జరపలేదని’ లేఖలో పేర్కొన్నారు.
థెరిసా మే ఏమన్నారంటే..
పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి. ప్రీతి పటేల్ రాజీనామా నిర్ణయం తీసుకుని మంచి పని చేసింది. పారదర్శకత, ప్రభుత్వంపై నమ్మకం ప్రజల్లో పెరగాలంటే రహస్య పర్యటనలు చేయకపోవడమే అందరికీ మంచిది. దౌత్యపరమైన అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన ప్రీతి ఇజ్రాయెల్ పర్యటన వివరాలపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని థెరిసా మే అన్నారు.
‘ప్రధాని థెరిసా మే కంటే రాజీనామా చేసిన ప్రీతి పటేల్‌పైనే ప్రజలకు విశ్వాసం ఎక్కువ. ప్రీతికి ఉన్న పరిచయాలు, విదేశాలలో ఆమె ప్రాబల్యం ఎక్కువ. అయితే ప్రీతి స్థానంలో ఎవరికీ బాధ్యతలు అప్పగిస్తారో తెలియడం లేదు. ప్రీతి పటేల్ లాంటి బలమైన నాయకురాలి రాజీనామా థెరిసా మే కేబినెట్‌కు భారీ లోటు అని’ అధికారిక కన్జర్వేటీవ్ పార్టీ ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment