Priti Patel
-
బ్రిటన్ విపక్షనేత రేసులో మాజీ మంత్రి ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్ విపక్షనేత పదవి కోసం భారతీయ మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్ పోటీపడుతున్నారు. తన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో రిషి సునాక్ తన విపక్ష నేత పదవి నుంచి నవంబర్ రెండోతేదీన వైదొలగనున్నారు. దీంతో పార్టీని మళ్లీని విజయయంత్రంగా మారుస్తానంటూ 52 ఏళ్ల ప్రీతీపటేల్ ఆదివారం తన అభ్యరి్థత్వాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు జేమ్స్ క్లెవర్లీ, టామ్ టగెన్డాట్, మెల్ స్టైడ్, రాబర్ట్ జెన్రిక్లతో ఆమె పోటీపడనున్నారు. -
‘ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి’.. బోరిస్‌కు పెరుగుతున్న మద్దతు!
లండన్: కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషీ సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీకి సిద్ధమయ్యారు. విహారయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని బ్రిటన్ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత సంతతి వ్యక్తి, బోరిస్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పని చేసిన ప్రీతి పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని పదవి చేపట్టేందుకు బోరిస్ జాన్సన్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఓవైపు.. రిషీ సునాక్‌కు ఎంపీల మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోరిస్ జాన్సన్‌కు మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా వెల్లడించారు ప్రీతి పటేల్.‘ ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగల సత్తా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఉందనటంలో ఆయనకు సరైన ట్రాక్ రికార్డ్ ఉంది. మన మేనిఫెస్టోను అమలు చేయగలరు. ఈ నాయకత్వ పోటీలో నేను ఆయనకు మద్దతు ఇస్తున్నాను.’అనిపేర్కొన్నారు ప్రీతి పటేల్. ప్రధాని రేసులో నిలవాలని భావిస్తున్న బోరిస్ జాన్సన్ హుటాహుటిన బ్రిటన్ తిరిగి వచ్చిన క్రమంలో ప్రీతి పటేల్ ట్వీట్ చేయటం గమనార్హం. బోరిస్ జాన్సన్ ఆరు వారాల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. తన కేబినెట్లోని అసమ్మతి నేతలు రాజీనామాలు చేయటం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే, ఇప్పటికీ ఆయనకు పార్టీలో ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు బోరిస్‌కు మద్దతు ప్రకటించారు. వాణిజ్య శాఖ మంత్రి జాకబ్ రీస్ మోగ్, రక్షణ మంత్రి బెన్ వల్లాస్, సిమోన్ క్లెర్క్‌లు బోరిస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌కు 46 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రిషీ సునాక్‌కు 100 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎవరు పోటీలో ఉండనున్నారని తెలనుంది. అయితే, ఒక్కరే పోటీలో ఉన్నట్లు తెలితే వచ్చే వారమే కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కానీ, ఒకవేళ ఇద్దరు బరిలో ఉంటే 1,70,000 మంది పార్టీ సభ్యులు వచ్చే శుక్రవారం ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకుడిని ఎన్నుకుంటారు. I'm backing @BorisJohnson to return as our Prime Minister, to bring together a united team to deliver our manifesto and lead Britain to a stronger and more prosperous future. pic.twitter.com/6wyGmASLda — Priti Patel MP (@pritipatel) October 22, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
ఊహించని ట్విస్ట్.. ప్రీతి పటేల్ రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్(50) తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్ నమ్మినబంటు అయిన ప్రీతి పటేల్.. లిజ్ ట్రస్ హయాంలోనూ బ్రిటన్ హోం సెక్రటరీగా కొనసాగుతారని భావించారంతా. అయితే.. పదవికి రాజీనామానే చేయాలని నిర్ణయించుకుని ఆమె కన్జర్వేటివ్ పార్టీలో చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు.. లిజ్ ట్రస్ నేతృత్వంలోని కేబినెట్లో తాను పని చేయబోనంటూ పరోక్షంగా ఆమె ప్రకటించారు కూడా. ఈ మేరకు ప్రధాని పీఠం నుంచి దిగిపోతున్న బోరిస్ జాన్సన్‌కు ఆమె ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు సేవ చేయాలనేది నా ఛాయిస్. లిజ్ ట్రస్ అధికారికంగా ప్రధాని పదవి చేపట్టగానే.. కొత్త హోం సెక్రటరీ నియమితులవుతారంటూ లేఖ రాసి ఆసక్తికర చర్చకు దారి తీశారామె. కన్జర్వేటివ్ పార్టీలో లిజ్ ట్రస్, ప్రీతి పటేల్‌కు పోసగదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ సోమవారం సాయంత్రం లిజ్ ట్రస్ బ్రిటన్ అధ్యక ఎన్నికల్లో గెలిచారన్న ప్రకటన తర్వాత.. ప్రీతీ పటేల్, ట్రస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త ప్రధానికి అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. మూడేళ్లుగా హోం సెక్రటరీ బాధ్యతలు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారామె. దీంతో.. తర్వాతి హోం సెక్రటరీగా కూడా ఆమె కొనసాగుతారని అంతా భావించారు. అయితే లిజ్ ట్రస్ హయాంలో పని చేయడం ఇష్టం లేకనే ఆమె రాజీనామా చేసినట్లు.. ఆమె అనుచర వర్గం అంటోంది. భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్.. సుదీర్ఘకాలం బ్రిటన్ రాజకీయాల్లో కొనసాగారు. 1991లో పటేల్ కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. 2010లో ఆమె తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీలో ఆమె సీనియర్ సభ్యురాలిగా ఉన్నారు. 2019 నుంచి యూకేకు హోం సెక్రటరీగా పని చేశారు. బోరిస్ జాన్సన్ రాజీనామా సమయంలో ప్రధాని అభ్యర్థిత్వం రేసులో ఈమె పేరు కూడా బలంగా వినిపించింది. బోరిస్ నమ్మినబంటుగా, బ్రెగ్జిట్ క్యాంపెయిన్‌లోనూ పటేల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే.. ప్రధాని అభ్యర్థి రేసు నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు లిజ్ ట్రస్ చేతిలో ఓడిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు.. కేబినెట్ బెర్త్ దక్కడం అనుమానంగానే మారింది. అయితే రిషి సునాక్ మద్దతుదారులకు మాత్రం కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్- కిమ్ జోంగ్ ఉన్ చేతులు కలిపిన వేళ.. -
ఊహించని మలుపులు.. ప్రీతి పటేల్ అవుట్
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ కీలక, ఊహించని పరిణామాలే చోటుచేసుకున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి విషయంలో మాజీ ఛాన్స్లర్ రిషి సునాక్‌కు అవకాశాలు కొంచెం కొంచెంగా మెరుగు అవుతున్నాయి. అదే సమయంలో.. బ్రిటన్ హోం సెక్రెటరీ ప్రీతి పటేల్(50) కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రధాని రేసులో తాను దిగట్లేదని కాసేపటి కిందట ఆమె స్పష్టం చేశారు. 2016 బ్రెగ్జిట్ రిఫరెండమ్‌లో డేవిడ్ కామెరున్ క్యాబినెట్ నుంచి బోరిస్ జాన్సన్, మైకేల్ గోవ్తో పాటు ప్రీతి పటేల్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో..కన్జర్వేటివ్ పార్టీ తరపున నాయకత్వ రేసులో ఆమె దిగుతారని అంతా భావించారు. అయితే పోటీలో తాను లేనని హోం సెక్రటరీ ప్రీతి సుశీల్ పటేల్ ప్రకటించారు. సహచరుల నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె మద్దతుదారులు.. పోటీ విషయంలో ఆమె ధృడంగా ఉన్నారని, సుదీర్ఘకాలం బ్రెగ్జిటర్గా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రీతి పటేల్‌ను మార్గరేట్థాచర్తో పోల్చారు కొందరు సభ్యులు. అయితే ఆమె మాత్రం పోటీలో ఉండడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిపడా మద్దతు లేనందునే ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.కానీ, పటేల్‌కు విద్యా మంత్రి ఆండ్రియా జెన్కీన్స్, న్యాయశాఖ మంత్రి టామ్ పుర్సుగ్లోవ్తో పాటు పదమూడు మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ మద్దతు కోసం ఇప్పుడు మిగతా సభ్యులు చూస్తున్నారు. మరోవైపు రేసులో ఉన్న రిషి సునాక్(42) భారత సంతతి వ్యక్తికాగా, ప్రతీ కూడా భారత సంతతి వ్యక్తే కావడం గమనార్హం. ఇప్పటికే సువెల్లా బ్రావర్మన్, లిజ్ ట్రుస్స్లు బ్రిటన్ ప్రధాని రేసులో నిలబడ్డారు. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసులో నిల్చునే అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్లో చేర్చాలంటే కనీసం 20 ఎంపీల మద్దతు అయినా అవసరం ఉంటుంది. కన్జర్వేటివ్ పార్టీ తరపున అభ్యర్థి కోసం నిర్వహించిన ఓటింగ్‌లో.. ఊహించని మలుపులు ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉప ప్రధాని డోమినిక్ రాబ్, రవాణా శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్లు.. రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటన చేశారు. అంతేకాదు.. రాబ్ స్వయంగా సునాక్ ప్రచార ఈవెంట్‌ను లాంచ్ చేశారు ఇవాళ. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గ్రాంట్ షాప్స్.. ట్విటర్ ద్వారా సునాక్ అనుభవానికి, అర్హతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే! -
నన్ను అలా చూడకండి.. ప్లీజ్ : ప్రీతి
లండన్: తనను ఒక వెనుకబడిన మైనారీటి వర్గానికి చెందిన మహిళగా గుర్తించడం నచ్చట్లేదని, అది ప్రజలను కించపరిచడమేనని బ్రిటిష్ మాజీ కేంద్ర మంత్రి, భారత సంతతి మహిళ ప్రీతి పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున బ్రిటిష్ కేబినెట్లో చోటుదక్కించుకున్న మొదటి భారతీయ మైనారీటి మహిళగా గుర్తింపు పొందిన ప్రీతి పాటిల్ తనను ఒక వర్గానికి పరిమితం చేసి మాట్లాడటం.. ఆ వర్గాన్ని అవమానించే విధంగా ఉందని, అది ప్రజలను మోసం చేసి లబ్ధి పొందేవిధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను బ్రిటిష్లోనే పుట్టి పెరిగాను, నన్ను మొదట బ్రిటిష్ మహిళగా గుర్తించండి’ అని ఆమె కోరారు. బ్రిటిష్ కేబినెట్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పదవిలో ఆమె సేవలందించారు. గత ఏడారి నవంబర్‌లో తన మీద వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తనను అలా చూడడం ఏంతో ఉద్వేగానికి గురిచేసిందని, సహచర కేబినెట్ మంత్రులకు, పార్టీ ఎంపీలందరికీ తనని మొదట బ్రిటిష్ మహిళగానే చూడాలని, తనను ఒక వర్గానికి పరిమితం చేసి వేరుగా చూడొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
భారత సంతతి మంత్రి ప్రీతి రాజీనామా
లండన్ : భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి, బ్రెగ్జిట్ కోసం పోరాటం చేసిన ప్రీతి పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. థెరిసా మే కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయంటూ కథనాలు ప్రచారం అవుతున్న క్రమంలోనే ప్రీతి పటేల్ రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయం బహిర్గతం చేసింది. ప్రధాని థేరిసా మేకుగానీ, విదేశాంగశాఖ కార్యాలయానికిగానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత ఆగస్టులో మంత్రి ప్రీతి పటేల్ ఇజ్రాయెల్‌లో పర్యటించడమే ఆమె ఉద్వాసనకు దారితీసింది. అయితే వారం రోజుల్లో థెరిసా ప్రభుత్వంలో ఇది రెండో రాజీనామా కావడం గమనార్హం. ఆఫ్రికా దేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లిన మంత్రి ప్రీతి పటేల్ ప్రధాని థెరిసా మే సూచన మేరకు మధ్యలోనే బ్రిటన్‌కు వచ్చేశారు. రాజీనామా చేయాలన్న ఆదేశాల మేరకు ప్రీతి తన మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. రాజీనామాపై ప్రీతి స్పందిస్తూ.. ‘ మంత్రిగా నాపై కొన్ని బాధ్యతలున్నాయి. నేను ఏం చేసినా పారదర్శకతతో వ్యవహరించాను. ప్రధాని థెరిసా మేకు, ప్రభుత్వానికి క్షమాపణ చెబుతున్నాను. ఇజ్రాయెల్ అధికారులతో తాను ఎలాంటి రహస్య మంతనాలు జరపలేదని’ లేఖలో పేర్కొన్నారు. థెరిసా మే ఏమన్నారంటే.. పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి. ప్రీతి పటేల్ రాజీనామా నిర్ణయం తీసుకుని మంచి పని చేసింది. పారదర్శకత, ప్రభుత్వంపై నమ్మకం ప్రజల్లో పెరగాలంటే రహస్య పర్యటనలు చేయకపోవడమే అందరికీ మంచిది. దౌత్యపరమైన అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన ప్రీతి ఇజ్రాయెల్ పర్యటన వివరాలపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని థెరిసా మే అన్నారు. ‘ప్రధాని థెరిసా మే కంటే రాజీనామా చేసిన ప్రీతి పటేల్‌పైనే ప్రజలకు విశ్వాసం ఎక్కువ. ప్రీతికి ఉన్న పరిచయాలు, విదేశాలలో ఆమె ప్రాబల్యం ఎక్కువ. అయితే ప్రీతి స్థానంలో ఎవరికీ బాధ్యతలు అప్పగిస్తారో తెలియడం లేదు. ప్రీతి పటేల్ లాంటి బలమైన నాయకురాలి రాజీనామా థెరిసా మే కేబినెట్‌కు భారీ లోటు అని’ అధికారిక కన్జర్వేటీవ్ పార్టీ ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. -
అమరావతిలో స్మార్ట్‌సిటీకి మా సపోర్ట్: బ్రిటన్
పుణె, ఇండోర్‌లో కూడా.. న్యూఢిల్లీ: పుణె, ఇండోర్, అమరావతి నగరాల్లో స్మార్ట్‌సిటీల అభివృద్ధికి మద్దతునిస్తామని తమ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల సహాయ సెక్రటరీ ప్రీతి పటేల్ తెలిపారు. పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల అభివృద్ధి విషయమై భారత్-బ్రిటన్ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన ఆమె శనివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. మోదీని కలువడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి తాను ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలిపారు. ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణల ఎజెండాకు బ్రిటన్ మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. భారత్‌లోని పెద్ద ప్రాజెక్టులకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లు జారీచేయడం ద్వారా లండన్ నగరం ఆర్థిక సహకారం అందజేస్తున్నదని ప్రీతి పటేల్ చెప్పారు. ఆదివారం బోఫాల్‌లో పర్యటించి మధ్యప్రదేశ్ సీఎంతో భేటీ అవుతానని, ఈ భేటీలో పట్టణాభివృద్ధి గురించి చర్చిస్తామని ఆమె తెలిపారు. ఉగ్రవాద నిరోధం విషయంలో భారత్-బ్రిటన్ భుజంభుజం కలిపి ముందుకుసాగుతున్నాయన్నారు. British Govt has given indication of support for smart cities development in Pune, Indore, Amravati: Priti Patel pic.twitter.com/rbfSF4insW — ANI (@ANI_news) 13 August 2016 -
బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు
లండన్: బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు ప్రీతి పటేల్ నియమితులయ్యారు. ప్రధాని డేవిడ్ కామెరూన్ కేబినెట్లో ప్రీతి ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో కామెరూన్ సారథ్యంలోని కన్సెర్వేటీవ్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామెరూన్ రెండో సారి ప్రధానిగా ప్రమాణం చేశారు. 43 ఏళ్ల ప్రీతి విథమ్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించింది. ఆమె తొలిసారి 2010లో బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికయిన ప్రీతి పలు పదవులు చేపట్టారు. బ్రిటన్, భారత్ మైత్రికి గట్టి మద్దతుదారు. వరుసగా రెండో సారి ఎంపీగా ఎన్నికై కేబినెట్ బెర్తు సంపాదించారు. -
బీబీసీలో మోడీకిచ్చే కవరేజి ఇదేనా?
భారత ప్రధాని నరేంద్రమోడీని బీబీసీ అస్సలు పట్టించుకోలేదా? ఆయన భారీ మెజారిటీ సాధించిన రోజున.. అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు దాదాపు ప్రపంచమంతా మోడీవైపే చూస్తున్నా, బీబీసీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించిందా? సరిగ్గా ఇదే అంశంపై బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ఘాటుగా విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీబీసీ డైరెక్టర్ జనరల్ లార్డ్ టోనీ హాల్‌కు ఆమె లేఖ రాశారు. మే 16వ తేదీన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బీబీసీ సరిగ్గా ఇవ్వలేదని బ్రిటన్‌లో భారత జాతీయులు, ముఖ్యంగా గుజరాతీలు చాలామంది తనకు ఫిర్యాదు చేశారని ఆమె అన్నారు. అంతేకాదు.. ఈ ఫలితాలను టీవీలో ప్రజెంట్ చేసిన యాల్దా హకీమ్ అయితే.. మోడీని వివాదాస్పద వ్యక్తిగా అభివర్ణించారని కూడా ఆమె మండిపడ్డారు. కేవలం ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే మోడీని అలా అంటారని, ఈ మాట ఉపయోగించడం ద్వారా బీబీసీ నిష్పాక్షికతను వదిలేసి ఆయన రాజకీయ ప్రత్యర్థి పాత్రలోకి మారిపోయినట్లయిందని ప్రీతి పటేల్ అన్నారు.