బ్రిటన్ ఫలితాలు: థెరిసా మే పదవికి ముప్పు
బ్రిటన్ ఫలితాలు: థెరిసా మే పదవికి ముప్పు
Published Fri, Jun 9 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
బ్రిటన్ ఎన్నికల ఫలితాలు కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మేకు షాకిచ్చాయి. మెజార్టి స్థానాలను గెలుపొందడంలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విఫలమైంది. దీంతో థెరిసా మే ప్రధానమంత్రి పదవికి ముప్పు వచ్చిపడింది. ప్రధానమంత్రిగా ఆమె దిగిపోవాలని ఒత్తిడులు వస్తున్నాయి. అయితే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసే ఉద్దేశ్యమేమీ లేదని థెరిసా మే తేల్చిచెప్పినట్టు తెలిసింది. థెరిసా మేపై పోటీ చేసిన లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్, ప్రధానమంత్రిగా థెరిసాను రాజీనామా చేయాలని ఫలితాల ప్రకటన కంటే ముందే పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం దేశానికి స్థిరత్వం అవసరమని థెరిసా చెప్పారు.
రాజీనామా చేసే ఉద్దేశ్యమే లేదని థెరిసా పేర్కొన్నట్టు బీబీసీ రిపోర్టు చేసింది. ప్రస్తుత ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 315 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీని చేరుకోలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి మెజార్టి 326 స్థానాలను దక్కించుకోవాల్సి ఉంది. మెజార్టీ సాధించలేకపోవడంతో కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటికే డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)ని సంప్రదించిందని, ఆ పార్టీని సంకీర్ణ భాగస్వామిగా చేర్చుకునేందుకు చూస్తుందని స్కై న్యూస్ రిపోర్టు చేసింది. ఉత్తర ఐర్లాండ్ లో డీయూపీ 10 స్థానాలను సంపాదించుకుంది.
Advertisement